Tags
#Failed Narendra Modi, #Farmers matter, AIKS, BJP, Minimum Support Prices, MSP demand, Narendra Modi Failures, PM Kisan Nidhi, Samyukta Kisan Morcha, SKM
ఎం కోటేశ్వరరావు
ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించిన కిసాన్ సమ్మాన్ యోజన పదిహేడవ విడత నిధులను మూడోసారి అధికారానికి వచ్చిన తరువాత పెద్ద ఆర్భాటంతో ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేశారు.(ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం వైఎస్ జగన్ మీట నొక్కుడును గుర్తుకు తెచ్చింది) అంతకు ముందు తొలిసంతకం దాని మీదే చేసినట్లు కూడా ప్రచారం జరిగింది.వెంటనే తాను ఎన్నికైన లోక్‌సభ స్థానం వారణాసి వెళ్లి రైతులతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఎగుమతుల ద్వారా భారత ఆహార వస్తువులను ప్రపంచంలో ప్రతి ఒక్కరి కంచంలో చూడాలని ఉందన్నారు. గతంలో ఎన్నడూ పిఎం కిసాన్ యోజన నిధుల విడుదలకు ఇంత హంగామా చేయలేదు. నిజానికి ఈ సొమ్ము ఏ కార్పొరేట్ల నుంచో ధనికుల నుంచో వసూలు చేసి ఇవ్వటం లేదు. మనం కొనుగోలు చేసే పెట్రోలు మీద లీటరుకు రు.2.50, డీజిలు మీద రు.4.00 సెస్‌ల పేరుతో కేంద్రం వసూలు చేసి దాన్నుంచి ఇస్తున్నది. ఇదే కాదు మొత్తం 29 వస్తువులపై ఈ పేరుతో పన్ను మీద 15శాతం సెస్‌ల రూపంలో వినియోగదారుల జేబుల నుంచి కొట్టివేసి దాన్నుంచే కొన్ని పథకాలను అమలు చేస్తున్నది. ఎప్పుడూ లేనిది కిసాన్ సమ్మాన్ నిధి విడుదలను ప్రచారానికి ఎందుకు వినియోగించుకున్నట్లు ? అదేమీ అర్ధంగాని తత్వం లేదా బ్రహ్మ పదార్ధం కాదు.తాజా లోక్‌సభ ఎన్నికల్లో రైతుల నుంచి వెల్లడైన వ్యతిరేకత అనేక ప్రాంతాల్లో ఓటమిలో వారి పాత్రను చూశారు. తత్వం తలకెక్కి రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ముఖ్యంగా హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో దగ్గరయ్యే ఎత్తుగడతో వారికోసం తాను తపిస్తున్నట్లు కనిపించేందుకు చేసిన యత్నం తప్ప మరొకటి కాదు.కొందరి విశ్లేషణ ప్రకారం గత లోక్‌సభలో 543 స్థానాలకు గాను బిజెపి 201గ్రామీణ నియోజకవర్గాలలో విజయం సాధించగా తాజా ఎన్నికల్లో 126 చోట్ల మాత్రమే గెలిచింది.వ్యవసాయదారులను నిర్లక్ష్యం చేసిన కారణంగా 159 చోట్ల బిజెపి ఓడిపోయిందని, రైతుల ప్రతినిధులను బడ్జెట్ చర్చల ప్రక్రియలో భాగస్వాములను చేయకుండా అహంకారాన్ని ప్రదర్శిస్తే, రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తే దేశవ్యాపితంగా ఆందోళన తప్ప మరొక మార్గం లేదని ఆలిండియా కిసాన్ సభ (ఏఐకెఎస్) స్పష్టం చేసింది.
నిజంగా వ్యవసాయం, దాని మీద ఆధారపడిన రైతులు, కూలీల గురించి కేంద్ర ప్రభుత్వానికి అంతశ్రద్ద ఉందా ? పదేండ్ల ఆచరణ చూస్తే అలా కనిపించదు. ఉమ్మడి జాబితాలో ఉన్న వ్యవసాయ రంగంలో రాష్ట్రాలలో చర్చ, ఆమోదంతో నిమిత్తం లేకుండా కరోనా సమయంలో అమల్లోకి తెచ్చిన మూడు రైతు వ్యతిరేక సాగు చట్టాలు, వాటికి వ్యతిరేకంగా ఏడాది పాటు సాగిన రైతు ఉద్యమం తెలిసిందే.విధి లేని స్థితిలో క్షమాపణలు చెప్పిమరీ మోడీ వాటిని వెనక్కు తీసుకున్నారు. ఆ మహత్తర ఉద్యమానికి నాయకత్వం వహించింది అనేక రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కెఎం). ఆ వేదికలో కీలక పాత్రపోషించిన ఆలిండియా కిసాన్ సభ(ఎఐకెఎస్) దేశంలో అతి పెద్ద రైతు ఉద్యమ సంస్థ, తొలి వరుసలో ఉంది. మూడు సాగు చట్టాల రద్దు కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు, ఇతర అంశాల గురించి 2022 జూలైలో ఒక కమిటీని వేసింది. అది ఏం చేస్తున్నదో నివేదిక ఎప్పుడు సమర్పిస్తుందో తెలియదు. బడ్జెట్ రూపకల్పన సందర్భంగా వివిధ తరగతులు ఏ కోరుకుంటున్నారో తెలుసుకొనేందుకు ప్రభుత్వం సంస్థలు, వ్యక్తులను కూడా పిలిచి ప్రతి ఏడాది సంప్రదింపులు జరుపుతుంది. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఆమోదం పొందిన తాత్కాలిక(ఓట్ ఆన్ ఎకౌంట్) స్థానంలో పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఇప్పుడు ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ చర్చలకు ఎస్‌కెఎం, ఏఐకెఎస్‌లను దూరంగా పెట్టింది. ఇది రైతులను అవమానించటం, కక్ష సాధింపు అనేందుకు పక్కానిదర్శనం.ఈ వైఖరిని ఆలిండియా కిసాన్ సభ ఒక ప్రకటనలో తీవ్రంగా నిరసించింది. కనీస మద్దతు ధరలను సిఫార్సు చేసే వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్(సిఏసిపి) ప్రతి ఏటా ఎఐకెఎస్‌ను ఆహ్వానించి అభిప్రాయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎస్‌కెఎం నాయకులను కూడా చర్చల నుంచి మినహాయించటాన్ని కూడా ఎఐకెఎస్ ఖండించింది.
మూడవసారి అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ వ్యవసాయం గురించి సరికొత్తగా ఆలోచించి కార్యాచరణ చేపట్టాలని అనేక మంది చెబుతున్నారు. మోడీ సర్కార్ పారిశ్రామిక వస్తు ఎగుమతుల్లో విఫలమైంది. సముద్ర ఉత్పత్తులను వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులకు జతచేసిి మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిగా చూపుతున్నారు.2014-15 సంవత్సరంలో మొత్తం ఎగుమతులు 36.18బిలియన్ డాలర్లుండగా 2020-21నాటికి 38.32 బి.డాలర్లకు పెరిగినట్లు ఏటా పెరుగుదల శాతం 0.96శాతంగా ఉన్నట్లు ఆహార తయారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపినట్లు బిజినెస్ టుడే పత్రిక 2021 డిసెంబరు 10న ప్రచురించిన వార్తలో పేర్కొన్నది.సముద్ర, తోటల ఉత్పత్తులను మినహాయించి కేవలం వ్యవసాయ ఉత్పత్తుల విలువ 2020-21లో 29.81 బిలియన్ డాలర్లు ఉన్నట్లు మంత్రిత్వశాఖ పేర్కొన్నది. చిత్రం ఏమిటంటే మోడీ అధికారానికి రాకముందు 2013-14 సంవత్సరంలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 37.292బి.డాలర్లు. ఈ అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించినట్లు పిఐబి 2014జూలై తొమ్మిదిన తెలిపింది.దీంతో పోల్చుకున్నా, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ విలువ తిరోగమనంలోనే ఉంటుంది. జనాన్ని మభ్యపరిచేందుకు పాలకుల కనుసన్నలలో పనిచేసే అధికార యంత్రాంగం ఎన్నితిప్పలు పడుతుందో పిఐబి 2024 ఫిబ్రవరి 17న వెల్లడించిన మరో సమాచారాన్ని చూస్తే తెలుస్తుంది. మోడీ అధికారానికి వచ్చిన పదేండ్లలో సాధించిన విజయాల గురించి కీర్తించటం తెలిసిందే. దానిలో భాగంగానే 1987-88లో అపెడా( వ్యవసాయ మరియు ఆహార ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ) ఎగుమతులు కేవలం 0.6బిలియన్ డాలర్లేనని అలాంటిది 2022-23నాటికి 26.7బి.డాలర్లకు పెరిగినట్లు , ఇది మోడీ గొప్పతనం అన్నట్లు చిత్రించింది. ఈ ఏడాదిలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 53.1బి.డాలర్లని కూడా తెలిపింది. ఈ లెక్కన చూసుకున్నా పదేండ్లలో పెరిగింది 53.1-37.29=15.81 బి.డాలర్లు మాత్రమే. తాను వచ్చిన తరువాత భారత ప్రతిష్టను, విదేశాల్లో తిరిగి మార్కెట్లను పెంచానని, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు చేశామని చెప్పుకున్న నరేంద్రమోడీ ప్రచారానికి ధీటుగా ఈ పెరుగుదల లేదు. యాహూ న్యూస్ 2024 మార్చి 21వ తేదీ విశ్లేషణ ప్రకారం 2022లో వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే 20 అగ్రదేశాలలో మనది 11వ స్థానం, చైనా ఆరవదిగా ఉంది.
మన రైతులు నేరుగా ఏ దేశానికైనా ఎగుమతులు చేసుకొనేందుకు, దేశంలో ఎక్కడైనా అమ్ముకొనేందుకు వీలుగా మూడు సాగు చట్టాలను తీసుకొచ్చినట్లు నరేంద్రమోడీ సర్కార్ చెప్పుకున్న సంగతి తెలిసిందే.కానీ అదే ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలకు ముందు గోధుమలు, బియ్యం, పంచదార, ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలు, నిషేధం ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి పండే ప్రాంతాలలో ఎక్కువ చోట్ల బిజెపి లోక్‌సభ ఎన్నికల్లో చావుదెబ్బతిన్నది. ఆంక్షల వలన 2023 ఏప్రిల్-అక్టోబరు మాసాల మధ్య బాస్మతి బియ్యం ఎగుమతులు 16శాతం పెరిగినా ఇతర ఉత్పత్తుల్లో నాలుగు బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు జరగలేదు. తొమ్మిదిశాతం ఎగుమతులు తన పరిధిలో తగ్గినట్లు అపెడా పేర్కొన్నది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు అన్నట్లుగా బిజెపి రైతుల ఆగ్రహాన్ని చూడాల్సి వచ్చింది. ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా నేపాల్, ఇతర దేశాలు మన బదులు పాకిస్తాన్, చైనాల నుంచి కొనుగోలుకు పూనుకున్నాయి. అంటే ఎగుమతి అవకాశాన్ని తన ఎన్నికల లబ్దికోసం మోడీ అనిశ్చితిలో పడేశారు. పోనీ మనదేశంలో ఉల్లి దిగుబడిని పెంచేందుకు ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే అదీ కనపడదు. చైనాలో హెక్టారుకు 21.85 టన్నుల దిగుబడి ఉండగా మనదేశంలో 16.12 టన్నులు మాత్రమే ఉంది. ప్రపంచ ఉత్పత్తిలో రెండు దేశాలూ ఒకటి రెండు స్థానాల్లో ఉంటున్నాయి.
వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలకు బదులు రైతాంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు మూడు సాగు చట్టాల పేరుతో చేసిన యత్నం బెడిసి కొట్టింది. తరువాత కూడా అదే వైఖరి. కనీస మద్దతు ధరల(ఎంఎస్‌పి) విధానాన్ని ఎత్తివేయాలన్న ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ఆదేశాల అమలుకు చూస్తున్నారు. ఆ కారణంగానే ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించేందుకు మొరాయిస్తున్నారు. మరో ఐదు సంవత్సరాల వరకు పార్లమెంటు ఎన్నికలు లేవు గనుక ఎగుమతి వ్యాపారంలో ఉన్న బడా సంస్థల కోసం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలను త్వరలో ఎత్తివేసి అవి రైతులకోసమే అని చెప్పినా ఆశ్చర్యం లేదు. మూడు సాగు చట్టాల తరువాత వేసిన కమిటీతో మరో రూపంలో ఆ చట్టాల్లోని అంశాలనే చెప్పించి కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించటానికి సాకుల కోసం చూస్తున్నారు. ఆ పేరుతో ప్రపంచవాణిజ్య సంస్థ, ఐఎంఎఫ్, ప్రపంచ బాంకులను సంతుష్టీకరించేందుకు పూనుకోవచ్చు.మన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన నరేంద్రమోడీ మరోవైపు పప్పుధాన్యాలు, ఖాద్యతైలాల దిగుమతులపై పన్నులు తగ్గించారు. దీంతో మనదేశంలో వీటిని సాగుచేసే రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. ద్రవ్యోల్బణ అదుపు చర్యలంటూ ఎగుమతులపై ఆంక్షలు, దిగుమతులపై పన్నుల తగ్గింపు కారణంగా అంతిమంగా నష్టపోయింది రైతులు మాత్రమే. ఎన్నికలు జరుగుతున్నపుడు కిలో ఇరవై రూపాయలున్న ఉల్లి ఫలితాలు వచ్చిన వెంటనే యాభై రూపాయలకు పెరిగింది. దీంతో రైతులెంత లబ్దిపొందుతారో తెలియదు గానీ వినియోగదారుల జేబులకు చిల్లి పడింది.
తొలిసారి నరేంద్రమోడీ అధికారానికి రావటానికి, కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవటానికి కారణాల్లో ద్రవ్యోల్బణం-ధరల పెరుగుదల కూడా ఒకటి.అందుకే తాజా ఎన్నికలకు ముందు దాన్ని కృత్రిమంగా అదుపులో ఉంచేందుకు పైన పేర్కొన్న చర్యలను తీసుకున్నారు.అయినప్పటికీ ఆహార ద్రవ్యోల్బణం 2023 నవంబరు నుంచి ఎనిమిదిశాతానికి అటూ ఇటూగా ఉంది. ఆ మేరకు పప్పులు, నూనెలు, ఇతర ఆహార వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. బిజెపిని దెబ్బతీసిన అంశాలలో ఇది కూడా ఒకటి. ఈ నేపధ్యంలో బడ్జెట్‌లో రైతులు ఏం కోరుతున్నారో తెలుసుకోవాలంటే వారి సమస్యలపట్ల నిత్యం పని చేస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా, ఆలిండియా కిసాన్ సభ వంటి సంస్థలను, రైతాంగ సమస్యలపై అధ్యయనం చేస్తున్న మేధావులను సంప్రదించకుండా కుదిరేది కాదు. ఆ దిశగా కేంద్ర తీరు లేదంటే దాని అర్ధం ఏమిటి ? చర్చలకు పిలిస్తే ఎవరేం కోరుతున్నారో రైతులకు స్పష్టత వస్తుంది, వాటిని అమలు జరపకపోతే పాలకుల మీద వత్తిడి పెరుగుతుంది. అందుకే దూరంగా పెట్టారు.తన కోడి కూయకపోతే ఎలా తెల్లవారుతుందో చూస్తానని ఒక ముసలమ్మ అనుకుందట.అలాగే ప్రభుత్వం అవకాశం కల్పించనంత మాత్రాన ఉద్యమ సంస్థల వాణి రైతులకు చేరకుండా ఉంటుందా ?
