Tags
Ajit Pawar, BJP, Chief Election Commissioner Rajiv Kumar, Congress-NCP alliance, Eknath Shinde, Maha Vikas Aghadi, Maharashtra assembly politics 2024, Narendra Modi Failures, NCP, Sarad pawar, shiva sena, Uddhav Thackeray
ఎం కోటేశ్వరరావు
హర్యానా, ఎట్టకేలకు జమూాకాశ్మీరు అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పోయిన సారి హర్యానాతో పాటు మహారాష్ట్ర ఎన్నికలు జరిగినా ఈ సారి జరగటం లేదు. శుక్రవారం నాడు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రకటన ఎందుకు చేయలేదన్న ప్రశ్నకు తరువాత వెల్లడిస్తామన్నారు. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి ఎక్కడ దొరుకుతుందో చూద్దామని అని కుంటి సాకు చెప్పి వెనకటి కెవడో కల్లు దొంగతనాన్ని తప్పించుకోచూశాడట.కొన్ని దేశాల్లో జరుగుతున్న మాదిరి పార్లమెంటు, అసెంబ్లీ, ఇతర ఎన్నికలన్నింటినీ ఒకే రోజు జరపాలంటూ బిజెపి చెబుతున్న కబుర్లకు మద్దతు ఇస్తున్న ఎన్నికల కమిషన్ తనదాకా వచ్చే సరికి కుంటి సాకులు చెబుతున్నది. వర్షాలు, భద్రతా సమస్యలంటూ మహారాష్ట్ర ఎన్నికలను తరువాత జరుపుతామంటున్నది. ఈ సమస్యలు హర్యానాలో ఉండవా ? మహారాష్ట్రలో వినాయకచవితి, పిత్ర పక్షం, దసరా, దీపావళి పండుగలు వరుసగా వస్తాయన్న కారణం కూడా ఎన్నికల కమిషన్ చూపింది. 2019లో కూడా ఇవన్నీ ఉన్నాయిగా అప్పుడెలా సాధ్యమైంది. ఉదాహరణకు వినాయకచవితి 2019లో సెప్టెంబరు రెండున వస్తే ఈ ఏడాది ఏడవ తేదీ వస్తున్నది. మిగతా పండగలు కూడా అదే మాదిరి కొద్ది రోజుల తేడాతో ఉంటాయి. ఈ పండగలు హర్యానాలో, జమ్మూ ప్రాంతంలో కూడా జరుగుతాయి కదా ? అక్కడ లేని ఆటంకాలు మహారాష్ట్రలోనే ఎలా ఉంటాయి ? ఇలాంటి కారణాలు బిజెపి కూటమిని ఓటమి నుంచి గట్టెక్కిస్తాయా !
అధికారదాహం, రాజకీయ అవకాశవాదానికి మహారాష్ట్రలో మారుపేరుగా తయారైన అజిత్ పవార్ ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి తనకు లేదని, ఇప్పటికే ఏడెనిమిది ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పాడు. ఇదొక ఎత్తుగడని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తన భార్య సునేత్రను సోదరి సుప్రీయా (శరద్ పవార్ కుమార్తె) మీద పోటీకి నిలిపి తప్పుచేశానని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన స్థానంలో(బారామతి) తన కుమారుడు జరు పవార్ పోటీ చేసేదీ లేనిదీ పార్టీయే నిర్ణయిస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో జనం, మద్దతుదార్లు కోరితే జరును పోటీకి నిలుపుతారు, పార్టీ పార్లమెంటరీ బోర్డు దాన్ని చర్చిస్తుంది అన్నారు. లోక్‌సభ ఎన్నికలలో బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో సుప్రియకు 47వేల మెజారిటీ వచ్చింది. అందువలన అజిత్ పవార్ పోటీ చేసినా గెలిచే అవకాశం అనుమానమే గనుక మర్యాద నిలుపుకొనేందుకు గాను తనకు ఆసక్తి లేదని ప్రకటించినట్లు స్పష్టం అవుతోంది.ఒకవేళ శరద్ పవార్‌తో సయోధ్య కుదిరితే కుమారుడికి అక్కడ మద్దతు కోసం బేరమాడవచ్చు. అసలా నియోజకవర్గంలో శరద్ పవార్ కుటుంబ సభ్యులెవరూ పోటీచేయకుండా ఉంటే మంచిదనే సంకేతాలు పంపుతున్నట్లు కూడా చెబుతున్నారు.రాజకీయాల్లో ఒకసారి అడుగుజారితే ఎంత గొప్పవారికైనా పట్టువుండదు, ఇప్పుడు అజిత్ పవార్ కూడా అదే స్థితిలో ఉన్నారు. ఎన్నికల ప్రకటన వెలువడక ముందే రాజకీయ పార్టీలు తమ తురుపు ముక్కలను ప్రయోగిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో శివసేన నేత ఉద్దావ్‌థాకరే ఎంతో కష్టపడ్డారని కానీ ఫలితం కాంగ్రెస్, ఎన్‌సిపికి ఎక్కువ దక్కిందని బిజెపి వ్యాఖ్యానించింది. ఎన్‌పిసి ఓట్లను చీల్చేందుకు అజిత్ పవార్ పార్టీని విడిగా పోటీచేయించే అవకాశం ఉందని శరద్ పవార్ ఎన్‌సిపి భావిస్తోంది. ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో, అనూహ్య పరిణామాలు ఏం జరుగుతాయో చూడాల్సి ఉంది. అసెంబ్లీలోని 288 స్థానాలకు గాను తమ కూటమికి 225 వస్తాయని నెల రోజుల క్రితమే శరద్ పవార్ జోశ్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ప్రాతిపదికన ఈ అంచనాకు వచ్చి ఉండవచ్చు.
2019లో ఒకే సారి ఫలితాలు వెలువడినా బిజెపి కూటమిలో సిఎం పదవి ఎవరికి అనే కుమ్ములాటల కారణంగా ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన బిజెపి-శివసేన విడిపోయాయి. ఎవరూ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోవటంతో అదే ఏడాది నవంబరు 23న రాష్ట్రపతి పాలన విధించారు. యుపిఏ కూటమిలోని ఎన్‌సిపిలో చీలిక తెచ్చి బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవిస్ సిఎం, అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అవసరమైన మెజారిటీ లేకపోవటంతో బలనిరూపణ గడువుకు ముందే నవంబరు 26న ఆ ప్రభుత్వం రాజీనామా చేసింది. రెండు రోజుల తరువాత శివసేన, కాంగ్రెస్, మిగిలిన ఎన్‌సిపి నేతలు ఉద్దావ్ థాకరే సిఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీ గడువు ఈ ఏడాది నవంబరు 26వరకు ఉంది.మరోవైపున హర్యానాలో 2019లో నూతన ప్రభుత్వం వెంటనే ఏర్పడిన కారణంగా 2024 నవంబరు మూడవ తేదీతో రాష్ట్ర అసెంబ్లీ గడువు పూర్తి కానుంది. ఈ వివరాలను చూసినపుడు మహారాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికి హర్యానా, కాశ్మీరు ఎన్నికల ఫలితాలు వస్తాయి. అఫ్‌కోర్స్ అక్కడ బిజెపి గెలిస్తే వాటిని చూపి బరిలోకి దిగేందుకు తప్ప మరొకటి దీని వెనుక కనిపించటం లేదు. ఒకవేళ ఓడితే…. తరువాత వెంటనే ఢిల్లీ, ఝార్కండ్ రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. పోగాలము దాపురించినపుడు అంటారు కదా అదే జరుగుతుంది. సాధ్యమైన మేరకు బిజెపి ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని వ్యవస్థలను వినియోగించుకొనేందుకు చూస్తున్నది. అఫ్ కోర్స్ ఇలాంటి పనులలో గతంలో కాంగ్రెస్ కూడా తక్కువ తినలేదు. అందుకే తగిన శాస్తి పొందింది. బిజెపి కూడా అదే బాటలో నడుస్తున్నది.
మధ్యలో రెండున్నర సంవత్సరాలు తప్ప మహారాష్ట్రలో రెండింజన్ల పాలనే సాగింది. గడచిన పది సంవత్సరాలలో జరిగిన ఎన్నికలను చూసినపుడు బిజెపి-శివసేన కూటమి ఓట్లు, సీట్లు తగ్గిపోవటం తప్ప పెరిగిన తీరు కనిపించదు.లోక్‌సభ ఎన్నికలు జరిగిన తరువాతే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ బిజెపి విజయ ప్రభావం అసెంబ్లీ మీద కనిపించలేదు.అవిభక్త శివసేన-బిజెపి కలసి ఉన్న 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఏకు 57.86శాతం ఓట్లు రాగా తరువాత 51.34శాతానికి, 2024లో ఒక ముక్కతో కలసి 43.55శాతం తెచ్చుకుంది. సీట్ల రీత్యా 42 నుంచి 17కు పడిపోయాయి.ఎన్‌సిపి అజిత్ పావర్ వర్గానికి 3.60శాతం ఓట్లు వచ్చాయి. బిజెపితో విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు అజిత్ పవార్ గురించి వార్తలు వస్తున్నాయి. అతగాడి బలం, బలహీనతలేమిటో వెల్లడైనందున అతను బిజెపితో ఉన్నా ఆ ఓటింగ్ ఈసారి రాదు. ఇండియా కూటమి సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకోగా ఓట్ల రీత్యా 43.71శాతంతో స్వల్పంగా ఆధిక్యతలో ఉంది.ఈ ఓటింగ్‌ను చూసే బిజెపి భయపడుతోంది. రైతులు, ఇతర తరగతులు కూడా ఆ పార్టీకి దూరమైన తీరు వెల్లడైంది. అందుకే అసెంబ్లీ ఎన్నికలను కుంటి సాకులతో విడిగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ద్వారా పావులు కదిపింది. ఒకేసారి మూడు రాష్ట్రాల్లో ఎన్నికలను సజావుగా నిర్వహించలేనంత బలహీనంగా ఉన్నపుడు దేశమంతటా ఒకేసారి జమిలి ఎన్నికలు పెట్టాలని ఎలా చెబుతున్నట్లు ? రాష్ట్రంలో ఇండియా కూటమి పటిష్టంగా ఉండటం, దేశమంతటా బిజెపి పూర్తి మెజారిటీని తెచ్చుకోవటంలో విఫలం కావటం, కాంగ్రెస్ పుంజుకున్న స్థితి, శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ విచ్చిన్నాలను ఎదుర్కొని తమ స్థానం పదిలమే అని నిరూపించుకోవటాన్ని చూశాము.ఈ పూర్వరంగంలో మరింత ఉత్సాహంతో ఇండియా కూటమి బరిలోకి దిగనుంది. సీట్ల సర్దుబాటు ఇంకా పూర్తి కాలేదు.లోక్‌సభ ఎన్నికలలో పోటీలో లేని వామపక్షాలు, ఇతర పార్టీలను కూడా అసెంబ్లీ ఎన్నికల్లో సర్దుబాటు చేసుకోవాల్సి ఉంది.
హర్యానాతో పాటు జరిగే జమ్మూాకాశ్మీరు ఎన్నికలు బిజెపికి ఇష్టం లేకపోయినా సెప్టెంబరు 30వ తేదీలోగా జరపాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తప్పలేదు.లోక్‌సభ ఎన్నికల్లో విచిత్రమైన స్థితి ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న మహబూబా మప్తి నాయకత్వంలోని పిడిపి పార్టీ మరో భాగస్వామి నేషనల్ కాన్ఫరెన్సు పోటీ చేసిన మూడు స్థానాల్లో పోటీకి దిగింది.జమ్మూలోని రెండు స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. నేషనల్ కాన్ఫరెన్సు రెండు చోట్ల గెలుపొందగా రెండు చోట్ల బిజెపి, మరోస్థానంలో స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందాడు. నేషనల్ కాన్ఫరెన్స్‌కు 22.3శాతం, పిడిపికి 8.48, కాంగ్రెస్‌కు 19.38, బిజెపికి 24.36శాతం చొప్పున వచ్చాయి. వాస్తవాలను అర్ధం చేసుకొని అసెంబ్లీ ఎన్నికల్లో పిడిపి సర్దుబాటుకు వస్తుందా రాదా అన్నది చూడాల్సి ఉంది. కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకుంటే ఇండియా కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్యానా విషయానికి వస్తే గడచిన 2014 లోక్‌సభ ఎన్నికలలో త్రిముఖ పోటీ కారణంగా బిజెపి 34.7శాతం ఓట్లతో పదికి గాను ఏడు సీట్లు తెచ్చుకుంది.2019లో 58.21శాతం ఓట్లతో పదికి పది స్థానాలను గెలుచుకుంది.2024లో 46.11శాతంతో ఐదు స్థానాలతో సరిపెట్టుకుంది.లోక్‌సభ తరువాత జరిగిన గత రెండు అసెంబ్లీ ఎన్నికలలో త్రిముఖ పోటీలో బిజెపి 33.2శాతం, 2019లో 36.49 ఓట్లు తెచ్చుకుంది. మరోవైపున కాంగ్రెస్ 2024లోక్‌సభ ఎన్నికలలో తొమ్మిది సీట్లకు పోటీ చేసి 43.67 శాతం ఓట్లు ఐదు సీట్లు, మిత్రపక్షం ఆమ్ ఆద్మీ ఒక చోట 3.68ఓట్లు, కూటమిగా 47.61శాతం తెచ్చుకుంది. బిజెపి 2014లో 90కి గాను 47, తదుపరి ఎన్నికల్లో 40 సీట్లు మాత్రమే తెచ్చుకుంది. జననాయక్ జనతా పార్టీ పది సీట్లు తెచ్చుకోవటంతో ఫలితాల తరువాత దానితో కలసి సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజా లోక్‌సభ ఎన్నికల నాటికి బిజెపితో విడిపోయి పదిసీట్లకు పోటీ చేసి నామమాత్రంగా ఓట్లు తెచ్చుకుంది.అసెంబ్లీ ఎన్నికలలో ఎలా ఉండేది చూడాల్సి ఉంది. బిజెపి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది.
