Tags
anti china, Anti communist, Anti-Communism Education Bill, communism, Failure of Capitalism, Socialism
ఎం కోటేశ్వరరావు
ఒక భూతం ఐరోపాను వెంటాడుతున్నది. అదే కమ్యూనిస్టు భూతం అంటూ ప్రపంచ సామాజిక గతినే మార్చివేసిన కమ్యూనిస్టు ప్రణాళిక ప్రారంభం అవుతుంది.బ్రిటన్‌లో కారల్ మార్క్స్‌ఫెడరిక్ ఎంగెల్స్ 1848 ఫిబ్రవరి 21న ఆ గ్రంధాన్ని వెలువరించారు.నాటి నుంచి నేటి వరకు 176 సంవత్సరాల తరువాత కూడా ప్రపంచంలోని దోపిడీ వర్గాలు, వాటిని కాపాడేవారిని అది భయపెడుతూనే ఉంది. సోషలిజం, కమ్యూనిజాలను ఏడు నిలువుల లోతున పాతిపెట్టాం, విజయం మాదే అని ప్రకటించుకున్న అమెరికా గడ్డ మీదే పాలకవర్గం ఇప్పుడు ఎందుకు వణికి పోతున్నది. 2024 డిసెంబరు మొదటి వారంలో అమెరికా ప్రజాప్రతినిధుల సభ (కాంగ్రెస్)లో కమ్యూనిస్టు వ్యతిరేక బిల్లును 32762 ఓట్ల మెజారిటీతో ఆమోదించింది. సోషలిజం, కమ్యూనిస్టు ఉద్యమాలు ప్రపంచంలో ఉధృతంగా ఉన్న రోజుల్లో అలాంటి బిల్లు పెట్టారంటే అదొక దారి, ఆ ఉద్యమాలు అంత ఆకర్షణీయంగా లేని వర్తమానంలో ఎందుకు ఇలాంటి చట్టాలు తీసుకువస్తున్నట్లు ? అధికార రిపబ్లికన్ పార్టీ, ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీలోని కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా చేతులు కలపటంతో ఇంత మెజారిటీ వచ్చింది. ఈ బిల్లుకు పెట్టిన పేరు ఎడ్యుకేటింగ్ ఫర్ డెమోక్రసీ యాక్ట్( ప్రజాస్వామ్యం కోసం చైతన్య చట్టం). ప్రజాస్వామ్య పరిరక్షణకు అవసరమైన అడుగు అని కొందరు వర్ణిస్తే సైద్దాంతిక పరమైన విభజన జరుగుతుందని మరికొందరు పేర్కొన్నారు. ఒక భావజాలాన్ని అణగదొక్కటం చరిత్రలో ఇంతవరకు ఎవరి వల్లా కాలేదు. ఎవరైనా ఫలానా సిద్దాంతాన్ని రూపుమాపాం అని చెబితే ఎలా అనే ఉత్సుకత ఏ ఒక్కరిలో చిగురించినా అది మొక్కై మానుగా మారుతుంది. ఇప్పుడు అమెరికాలో ఇతర పెట్టుబడిదారీ దేశాలలో జరుగుతున్నది అదే. ఓడిరచామన్న సోషలిజం, కమ్యూనిజాల గురించి యువతరంలో ఆసక్తి, అనురక్తి పెరుగుతున్నదనే సర్వేల సమాచారం అక్కడి దోపిడీ శక్తులకు కునుకు పట్టకుండా చేస్తున్నది.
1997-2012 మధ్య జన్మించిన వారిని జెడ్ తరం అని పిలుస్తున్నారు. వారిలో గణనీయంగా కమ్యూనిజం పట్ల సానుకూలంగా ఉన్నారు. అంతకు ముందు 1946-64 మధ్యకాలంలో జన్మించిన వారిలో కేవలం మూడు నుంచి ఆరుశాతం మంది మాత్రమే సుముఖంగా ఉన్నారు. అమెరికాలో పెట్టుబడిదారీ విధానం కంటే కమ్యూనిజం మెరుగని 28శాతం మంది జడ్ తరం భావిస్తున్నది. ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలే పురాతన కాలం నుంచి నేటి ఆధునిక సమాజానికి బాటలు వేశాయి. ఇంతకాలం సోషలిజం విఫలమైందని ప్రచారం చేసిన వారి ఏలుబడిలో సోషలిస్టు చైనా నుంచి దిగుమతులు లేకపోతే రోజు గడవటం లేదు. ఈ పరిస్థితి ఎందుకు అనే ఆలోచన అమెరికా యువతలో ఉదయించదా ? ‘‘ పెట్టుబడిదారీ విధాన ఒక వైఫల్యం ’’ అనే పేరుతో అమెరికా న్యాయమూర్తిగా పనిచేసిన రిచర్డ్ ఫోసనర్ 2009లో ఒక గ్రంధం రాశాడు. ఈ పెద్దమనిషి కమ్యూనిస్టు కాదు. అప్పటి నుంచి సోషలిజం వైఫల్యం కంటే పెట్టుబడిదారీ వైఫల్యం గురించి చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఈ కాలంలోనే అమెరికా, ఇతర పెట్టుబడిదారీ దేశాలలో సోషలిజం, కమ్యూనిజం పట్ల సానుకూల వైఖరి పెరుగుతోంది.ఈ ధోరణి అమెరికా పాలకవర్గం, అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఆందోళన కలిగిస్తోంది. దిక్కుతోచని స్థితిలో అమెరికా పాలకవర్గం ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ఎంత ఎక్కువ చేస్తే అంతగా యువతలో ఆసక్తి పెరటం అనివార్యం. ఉన్మాదంలో ఉంచటం ద్వారా యువతను సైద్దాంతిక మధనానికి దూరం చేయాలని విఫలయత్నం చేస్తోంది.
సోవియట్ యూనియన్, తూర్పు ఐరోపా దేశాలు, చైనా తదితర సోషలిస్టు దేశాలు, వాటికి నాయకులుగా ఉన్నవారి గురించి ఇప్పటికే పేలిన అవాకులు చవాకులను అమెరికా పిల్లలకు పాఠాలుగా బోధించేందుకు తాజా బిల్లును తెచ్చారు. కమ్యూనిజం లోపాల గురించి చెబితే విద్యార్థులు స్వేచ్చ, ప్రజాస్వామ్య విలువ గురించి తెలుసుకుంటారని రిపబ్లికన్ పార్టీ ఎంపీ మైక్ జాన్సన్ చెప్పాడు. ఈ చట్టం ప్రకారం బోధించాల్సిన పాఠ్యాంశాలను ‘‘ కమ్యూనిజం బాధితుల స్మారక ఫౌండేషన్(విఓసిఎంఎఫ్) రూపొందిస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో కోట్లాది మంది మరణాలకు కారకులైన నాజీలు ఎర్ర సైన్యం చేతిలో చచ్చారు. వారిని కూడా కమ్యూనిజం బాధితులుగానే ఈ సంస్థ చిత్రిస్తున్నది.చైనాలోని యుఘిర్స్ పట్ల, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనల పట్ల చైనా అనుసరించిన వైఖరిని కూడా కమ్యూనిస్టు వ్యతిరేక అంశాలతో పాటు బోధించాలని ఈ చట్టం నిర్దేశించింది. ఒక భావజాలాన్ని వక్రీకరించి చూపుతున్నారని, రాజకీయ భావజాలం కోసం తరగతి గదులు యుద్ధ క్షేత్రాలుగా మారతాయని కొందరు హెచ్చరించారు. ప్రపంచ చరిత్రను సమగ్రదృష్టితో చూడకుండా నిస్సిగ్గుగా పాక్షిక వైఖరితో ఈ బిల్లు చూసిందని వ్యతిరేకించిన డెమోక్రాట్లు పేర్కొన్నారు.‘‘ చరిత్రను బోధించటం అంటే ఒక దానికి వ్యతిరేకంగా మరొక భావజాలాన్ని ప్రోత్సహించటం కాదు. మన రాజకీయం కోసం అవసరమైన దాన్ని మాత్రమే కాదు మొత్తం కథను చెప్పాలి ’’ అని డెమోక్రటిక్ సోషలిస్టు 35 ఏండ్ల అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్ చెప్పారు. ఈమె డెమోక్రటిక్ పార్టీ తరఫున 2019 నుంచి న్యూయార్క్ నుంచి ప్రజాప్రతినిధుల సభకు ఎన్నికై పని చేస్తున్నారు. ఇప్పటికే రాజకీయ ప్రేరేపితమైన సిలబస్‌తో వత్తిడికి గురవుతున్న టీచర్లు కమ్యూనిజం ముప్పు అంటే స్పష్టత లేని ఈ బిల్లు వలన మరింతగా ఇబ్బంది పడతారని నిపుణులు చెప్పారు. కమ్యూనిజం గురించి చెప్పాలంటున్నారు సరే అడ్డూ అదుపులేని పెట్టుబడిదారీ విధానం సంగతేమిటి ? కథను సంపూర్ణంగా చెప్పరా లేక కేవలం స్వంత సిద్దాంతాలను చెప్పుకోవటమేనా అన్న విమర్శలు కూడా సామాజిక మాధ్యమంలో వెలువడ్డాయి.
ఇటీవలి కాలంలో నిర్వహిస్తున్న అనేక సర్వేల ప్రకారం గత తరాలతో పోల్చితే సోషలిజం, కమ్యూనిజాల గురించి యువ అమెరికన్లు సానుకూల వైఖరితో చూడటం పెరిగిపోతోందని, ప్రజాస్వామ్య సూత్రాల గురించి అవగాహన తగ్గుతున్నదని రిపబ్లికన్ సెనెటర్లు వాపోయారు. బిల్లును రూపొందించిన వారిలో ఒకరైన మరియా సాలాజార్ మాట్లాడుతూ పాఠశాలల్లో అమెరికా విలువల బోధన అన్నది ఒక విప్లవాత్మక ఆలోచనేమీ కాదు. యువతరంలో మూడోవంతు మంది కమ్యూనిజానికి అనుకూలంగా ఉన్న సమయం, అయితే ఆ సిద్దాంత ప్రమాదం, దాని చరిత్రను యువతకు చెప్పటంలో విఫలం అవుతున్నామన్నది స్పష్టం, అందుకే ఈ బిల్లు అవసరమైంది అన్నారు. పెట్టుబడిదారీ విధానాన్ని రక్షించుకొనేందుకు ఇది అవసరమని మరికొందరు సమర్దించారు. స్పీకర్ మైక్ జాన్సన్ బిల్లును ఆమోదించినందుకు అభినందించాడు. విద్యావ్యవస్థలో కమ్యూనిజం వాస్తవాలను గమనించకపోవటం లేదా తక్కువ చేసి చూస్తున్నారని ఆరోపించాడు. చైనా వంటి శత్రుదేశాలు అమెరికా వ్యవస్థలో తమ అజెండాను చొప్పిస్తున్నాయన్నాడు. అమెరికా చట్టాలు అనుమతించిన మేరకు కన్ఫ్యూసియస్ తరగతి గదుల పేరుతో చైనా ఐదువందల చోట్ల ఏర్పాటు చేసింది.అవి అమెరికా మిలిటరీ కేంద్రాలకు దగ్గరగా ఉన్నాయని, వాటిలో కమ్యూనిస్టు సిద్దాంతాలను బోధిస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది.
పురోగామి భావాలను వెల్లడిరచే ప్రతి ఒక్కరిని కమ్యూనిస్టుగా భావిస్తూ అమెరికన్లలో అనేక మంది మానసికవ్యాధితో బాధపడుతున్నారు. కొందరు కావాలని అలాంటి తప్పుడు ప్రచారం చేస్తూ సామాన్యజనాల బుర్రలను చెడగొడుతున్నారు. అలాంటి వాటిలో హెరిటేజ్ ఫౌండేషన్ ఒకటి. దాని ట్రస్టీ కెవిన్ రాబర్డ్‌తో జెసీ కెలీ అనే రేడియో వ్యాఖ్యాత గతేడాది ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేశాడు.‘‘ 1991లో సోవియట్ యూనియన్ పతనమైంది. దాంతో పాటే ప్రపంచ కమ్యూనిజపు నీడ జాడలేకుండా పోయింది. కమ్యూనిజం అంతరించిందని అమెరికన్లందరూ ఊపిరి పీల్చుకున్నారు, కానీ మనింట్లో కొత్త కుట్ర ప్రారంభమైంది.పురోగామివాద ముసుగులో నేడు కమ్యూనిస్టులు అనేక సంస్థలలో చొరబడ్డారు. అమెరికన్ల రోజువారీ కార్యకలాపాలను వారి నూతన శక్తితో అదుపు చేస్తున్నారు ’’ అని వ్యాఖ్యాత చెప్పాడు. అతగాడు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రణాళిక పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. దాన్లో కమ్యూనిస్టుల పని తీరు పేరుతో అనేక వక్రీకరణలకు పాల్పడ్డాడు.
మితవాదుల నాయకత్వంలో నడిచే ఫ్రాసర్ ఇనిస్టిట్యూట్ అనే మేథోమధన సంస్థ జరిపిన సర్వేలో 1834 ఏండ్ల మధ్య ఉన్న కెనడా యువతలో 54శాతం మంది సోషలిజం దేశ ఆర్థిక వ్యవస్థ, పౌరుల మంచి చెడ్డలను ప మెరుగుపరుస్తుందని భావిస్తున్నట్లు తేలింది. అంతవరకే కాదు, ఆ సర్వే ప్రకారం పదిలక్షల మంది యువత సోషలిజం కంటే కమ్యూనిజం మంచి ఆర్థికవ్యవస్థను కలిగి ఉంటుందని చెప్పటంతో సర్వే నిర్వాహకులు నిర్ఘాంతపోయారట. అంతేనా ఇప్పుడున్న పెట్టుబడిదారీ వ్యవస్థ పనిచేయటం లేదని యువత భావించటం వారికి ఆందోళన కలిగించింది. ఆ సర్వేను మరింత లోతుగా చూసినపుడు 1834 ఏండ్ల వారిలో సోషలిజం అనువైనదని చెప్పినవారు 46శాతమైతే, 1824 ఏండ్ల వయస్సు వారిలో 50శాతానికి పెరిగారు. పెట్టుబడిదారీ విధానం మంచిదని చెప్పిన వారు 1834లో 39శాతమే ఉండగా కాదన్నవారు 41శాతం. సోషలిజానికి మారాలని చెప్పిన వారు 1834లో 54శాతం ఉండగా 1824లో 58శాతం ఉన్నారు, కాదని చెప్పిన వారు 17శాతం మాత్రమే. ఎందుకు యువత ఇలా భావిస్తున్నదంటే 2008లో ధనిక దేశాల్లో వచ్చిన సంక్షోభం అనుభవించారు గనుక, అది ఇంకా ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంది. దానికంటే మరింత పెద్ద సంక్షోభం రానున్నదని పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలే హెచ్చరిస్తున్నందున ఎక్కడైనా యువత ప్రత్యామ్నాయం గురించి ఆలోచించకుండా ఉంటుందా ? వారికి సోషలిజం, కమ్యూనిజం తప్ప మరొకటి కనిపించటం లేదు. పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహించే వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక సరైన సమాధానం చెప్పలేక ధరలు పెరిగి ఆహారవస్తువులను కొనుగోలు చేయలేకపోతే ఉదయపు అల్పాహారాన్ని మానుకోండని ఉచిత సలహా చెప్పింది. పరిస్థితి ఇంకా దిగజారితే రోజుకు ఒక పూటే తినండని కూడా చెప్పగలదు.యువత కమ్యూనిజం పట్ల ఇంత ఆసక్తిని ఎందుకు పెంచుకుంటున్నదన్న ప్రశ్నకు ఫ్రాసర్ సంస్థ ఉపాధ్యక్షుడు జేసన్ క్లెమెన్స్ సమాధానమిస్తూ ఇంతటి దురవస్థను వారి మీద ఎన్నడూ రుద్దలేదు అన్నాడు. భూతల స్వర్గం అనుకుంటున్నవారికి లాభాలు పిండుకొనే కార్పొరేట్ భూతాలు కళ్ల ముందు కనిపిస్తుంటే చూస్తూ ఊరుకోవటం మానవనైజం కాదు. తగ్గేదే లేదు, దాని అంతమే తమ పంతం అంటారు, కాదంటారా ! దానికి సోషలిజం తప్ప మరొక మార్గం కనుచూపు మేరలో కనిపించటం లేదు, అందుకే మూలనపెట్టిన సిద్దాంత పుస్తకాలు దుమ్ముదులుపుతున్నారు.నడిచే సమయం రాగానే, తపన కలగ్గానే ఏం చేయాలో పసివాళ్లకు ఎవరూ చెప్పనవసరం లేదు. వారంతటవారే లేచి అడుగులు వేసినట్లుగా మార్గం వెతుక్కుంటారు. సమాజమార్పూ అంతే !
కమ్యూనిస్టు మానిఫెస్టో రాసిన నాటికీ నేటికీ ప్రపంచంలో అనేక మార్పులు జరిగిన మాట నిజం. అది ఆ నాటికి సరిపోయిందిగానీ నేటికి పనికి రాదు అని కొందరు వ్యతిరేకులు దాడి చేస్తున్నారు.దాన్లో చెప్పింది ఒక శాస్త్రీయ సిద్దాంతం. కూడినా హెచ్చవేసినా రెండురెళ్లు నాలుగే. అది మారదు. అలాగే శ్రమదోపిడీ ఉన్నంత కాలం దాన్నుంచి జనావళిని విముక్తం చేసేందుకు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి దేశంలో విప్లవం ఒకే విధంగా జరగదని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంకా వెనుకబడిన, పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదం ప్రభావితం చేస్తున్న దేశాలలో విప్లవాన్ని ఎలా తీసుకురావాలనేది అక్కడి కార్మికవర్గం నిర్ణయించుకోవాల్సిందే.
