Tags
సత్య
చెప్పేవాడికి వినేవాడు లోకువ. బీహార్ ఎన్నికల తరువాత మీడియా, రాజకీయ వర్గాలను ఒక వ్యక్తి ఆకర్షించారు. అతనే ప్రశాంత కిషోర్. ప్రజారోగ్య నిపుణుడిగా గుజరాత్‌లో అడుగుపెట్టి ముఖ్యమంత్రి నరేంద్రమోడీ దృష్టిని ఆకర్షించి గతేడాది లోక్‌సభ ఎన్నికలలో మోడీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిన మేధావి అన్నారు. ఆలాంటి వ్యక్తి ఏమైందో ఏమిటో ఏడాదిలోనే మోడీ ఇంటి నుంచి బయటకు వచ్చి బీహార్ నితీష్ కుమార్ ఇంట్లో చేరారు. కిషోర్‌కు ఎవరిదగ్గరైనా పని చేస్తే ఆయన వారిండ్లలోనే వుంటారట. అంతటి మోడీని బీహార్ ఎన్నికలలో మట్టి కరిపించిన అపర చాణక్యుడిగా మీడియాలో నీరాజనాలందుకున్నాడు. విజయం సాధించిన తరువాత నితీష్ కుమార్ బహింరంగా మీడియా ముందు సంతోషం పట్టలేక ఆలింగనం చేసుకున్న తరువాత అదింకా పెరిగి పోయింది. మా ఇంటికి రమ్మంటే మాయింటికి రమ్మని అనేక కాంగ్రెస్‌తో సహా అనేక రాజకీయ పార్టీలు, పదవుల కోసం అర్రులు చాస్తున్న నాయకులు ఆహ్వానాలు పంపుతున్నారట. ఎంత కావాలంటే అంత డబ్బు తీసుకోమని సందేశాలిస్తున్నారు.
నరేంద్రమోడీని అందలమెక్కించిన వ్యక్తి అదే మోడీకి బీహార్‌లో పరాభవంపొందే వ్యూహం రచించాడంటే తమ కంటే ఎంతో తెలివిగల వాడు కాకపోతే ఎలా సాధ్యం అని మీడియా పండితులు తలలు పట్టుకొని వుండవచ్చు. ఎందుకంటే ప్రజల నాడి తమకు తప్ప ఇతరులకు తెలియదన్నట్లు ఫోజు పెడుతూ బీహార్‌లో ఎన్‌డిఏకు అధికారం వచ్చేసినట్లే ఎక్జిట్ పోల్స్ ప్రకటించటమే కాదు, ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తరువాత కూడా మొదటి గంటలో బల్లగుద్ది బిజెపి నేతలతో సీట్లు పంపిణీ చేయించి కొన్ని చోట్ల పటాసులు కూడా కాల్పించిన ఘనులు కదా ! అలాంటి వారు ఇప్పుడు ప్రశాత కిషోర్ ఎవరికి ప్రశాంతత లేకుండా చేస్తాడా అని ఊహాగానాలు చేస్తున్నారు.
అందమైన వారికి బుర్ర వుండదంటారు.మనకు రంగుల లోకం చూపించే మీడియా కూడా అందమైనదే కదా, అందుకే జనం దాసోహం అవుతున్నారు. దానికి బుర్రేకాదు, జ్ఞాపకశక్తి కూడా తక్కువే వున్నట్లుగా మనకు అది అందించే సమాచార తీరుతెన్నులు వెల్లడిస్తాయి.లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మనకు చెప్పిందేమిటి? మోడీలోని సగభాగం వంటి అమిత్ షా అనే ఒక గుజరాత్ స్ధానిక నాయకుడు పెద్ద జాతీయ వ్యూహం పన్నాడని, రాజకీయాలతో సంబంధం లేదని, తమది కేవలం సాంస్కృతిక సంస్ధ మాత్రమే అని చెప్పుకొనే ఆర్‌ఎస్‌ఎస్ వ్యూహకర్తలు మోడీని ప్రధాని గద్దెపై కూర్చుండపెట్టేందుకు తమ సేవకులందరినీ ఎన్నడూ లేని విధంగా ఇంటింటికీ తిప్పారని, ఓట్లు పోగేసి మోడీకి తిరుగులేని మెజారిటీ చేకూర్చి పెట్టారని అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చెబితే ఎంతశాతం అనేది పక్కన పెడితే నోట్లో వేలేసుకొని మనం విన్నామా లేదా ?
ఇప్పుడు అదే మీడియాలో వస్తున్నదేమిటి ? బుర్ర, కష్టం తనది అయితే పేరు మాత్రం అమిత్‌షాకు దక్కిందని ప్రశాంత కిషోర్ ప్రశాంతత కోల్పోయాడట. ఇప్పటికే ఇది ఎక్కువ నీ స్ధానంలో నవ్వుండు, అంతకు మించి ఎక్కువ ఆశించవద్దు అన్నట్లుగా నరేంద్రమోడీ తన సగభాగం షాతో సమంగా చూసేందుకు తిరస్కరించారని వినికిడి. దాంతో నంద సామ్రాజ్యాన్ని నాశనం చేయకపోతే నా జడను ముడవను అన్న చాణక్యుడి మాదిరి శపధం పట్టి నితీష్ కుమార్ ఇంట్లో చేరాడని, సోషల్ మీడియా అంటే సదభిప్రాయం లేని నితీష్ కుమార్‌ను ఒప్పించాడని చివరకు తన అపరచాణక్యంతో మోడీని దెబ్బతీశారని, దీంతో రానున్న రోజుల్లో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల నేతలందరూ ప్రశాంత కిషోర్ చాణక్య వ్యూహాల కోసం క్యూలు కడుతున్నారని మీడియా చెబుతోంది.
ఇక్కడ ప్రశాంత కిషోర్ గురించి మరికొన్ని విషయాలు చెప్పకుండా కధ సంపూర్ణం కాదు. ముందే చెప్పుకున్నట్లు ప్రజారోగ్యరంగంలో ప్రవేశం వున్న కిషోర్ జన్మస్ధలం బీహార్. తొలుత స్వంత రాష్ట్రం తరువాత తెలంగాణాలో పని చేస్తుండగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ దృష్టిని ఆకర్షించాడు. యూనిసెఫ్‌లో పనిచేయమని అది కోరింది. ఆ మేరకు ఆఫ్రికాలో పని చేశారు. ఆ సమయంలో మన దేశంలో ఆరోగ్య పరిస్ధితి గురించి మన ప్రణాళికా సంఘ నివేదికలు చదివి నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఒక లేఖ రాశారు. దానిలో గుజరాత్ పారిశ్రామికంగా ముందున్నప్పటికీ ఆరోగ్య విషయంలో వెనుక బడి వుందని వ్యాఖ్యానించారు. ఆ లేఖను ప్రధాని కార్యాలయం గుజరాత్ ముఖ్యమంత్రికి పంపింది. అప్పుడు మోడీ నివేదికను తెప్పించుకొని వివరాలు తెలుసుకొని కిషోర్ ఎక్కడ వున్నారో తెలుసుకోవలసిందిగా తన యంత్రాంగాన్ని ఆ దేశించి తన వద్దకు రప్పించుకొని ప్రజారోగ్యాన్ని మెరుగు పరచేందుకు తోడ్పడాలని కోరారు. ఆ విధంగా 2011లో గుజరాత్ వెళ్లిన కిషోర్ క్రమంగా మోడీ దృష్టిని ఆకర్షించారు. ఆ మోడీ ఆశ్రయం పొంది చివరికి ఎన్ని కల వ్యూహకర్తగా మారారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ మేధావి సలహాలను అమలు జరిపిన గుజరాత్ అరోగ్య రంగంలో దేశంలోని 29 రాష్ట్రాలకు గాను 21 స్దానంలో వుంది. తమిళనాడు,కర్ణాటక,కేరళ మొదటి మూడు స్ధానాలలో వున్నట్లు యూనిసెఫ్ సర్వే వెల్లడించింది.పిల్లలకు టీకాలు వేయించటంలో దేశ సగటు 65.2శాతం వుంటే గుజరాత్ 56.2శాతం మాత్రమేనని డిఎన్‌ఏ పత్రిక ఈ ఏడాది జూలై ఎనిమిదిన ప్రచురించింది. అంటే మన మేధావి ఈ విషయంలో ఫెయిలయ్యాడని అనుకోవాలా ?
లోక్‌సభలో నరేంద్రమోడీ నాయకత్వంలో ఎన్‌డిఏ విజయం సాధించటానికి ప్రశాంత కిషోర్ ఇచ్చిన సలహాలే కారణమని చెబుతున్నారు. ఈ ఎన్నికలలో బిజెపికి వచ్చిన ఓట్లెన్ని ? కొన్ని చోట్ల మాత్రమే సీట్లు రావటానికి కారణం ఏమిటి ? మిగతా చోట్ల ఆ సలహాలు, వ్యూహం ఎందుకు పని చేయలేదు? దేశంలోని మొత్తం ఓటర్లు 83,41,01,479 ఓట్లకు గాను బిజెపికి వచ్చింది 17,16,57,549 ఓట్లు మాత్రమే అంటే కేవలం 20శాతం. అదే పోలైన ఓట్లలో చూసుకున్నా వచ్చింది 31శాతమే. కానీ సీట్ల పరంగా చూస్తే 52శాతం తెచ్చుకుంది. భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతాన్ని చూస్తే వరుసగా పన్నెండవ లోక్‌సభ నుంచి తాజా 16వ లోక్‌సభ వరకు 25.59,23.75,22.16,18.80,31శాతాలుగా వున్నాయి. అంటే గతంలో ప్రశాంత కిషోర్ వంటి వారు లేకుండానే బిజెపి గరిష్టంగా 25.59శాతం ఓట్లను తెచ్చుకుంది. ఇప్పుడు అదనంగా మరో ఐదున్నర శాతం పెంచుకుంది. ఈ పెరుగుదలకు కాంగ్రెస్ అవినీతి అక్రమాలు, దాని వైఫల్యం కారణాలకు తోడు గుజరాత్‌లో నరేంద్రమోడీ అద్బుతాలు చేశాడనే మీడియా ప్రచారం తోడైంది. అదనంగా బెంగాల్లో ఆరు నుంచి 17శాతానికి కేరళలో ఆరు నుంచి పదిశాతానికి అసోంలో 17 నుంచి 36.5శాతానికి కాశ్మీర్‌లో 18.6 నుంచి 32.4శాతానికి ఓట్లు పెరగటం కూడా తోడ్పడింది.
నిత్యం స్వదేశీ గురించి జపం చేసే బిజెపి ఎన్నికలలో ప్రచార వ్యూహ నిపుణులను పెట్టుకోవటం విదేశాల నుంచి అరువు ఆయిడియా. గతంలో అలాంటి ఐడియాలో భాగంగానే తమ పాలనలో భారత్ వెలిగిపోతోందంటూ బిజెపి, తేళ్లు,జర్రుల వంటి బొమ్మలతో కాంగ్రెస్ ప్రచారాలు చేసి బొక్కబోర్లా పడ్డాయి. ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత కుక్కిన పేనులయ్యాయి. నినాదాలు, ఆకర్షణీయమైన కబుర్లు, వుపన్యాసాలను చూసి గతంలో కడుపు నిండిన పశ్చిమదేశాల ఓటర్లు ప్రభావితులైన వుదంతాలు వుండి వుండవచ్చు. ఇటీవలి సంవత్సరాలలో కూడా పాలకవర్గ పార్టీలు అలాంటి నిపుణులు ఇచ్చిన సలహాలు , వ్యూహాల మేరకు అలాగే చేస్తున్నారు, ఓటర్ల ముందు అభాసు పాలౌతున్నారు. వారు అమలు జరిపిన విధానాలు, వాటి పర్యవసానాలు ఏమిటి అని ముఖ్యంగా 2008లో ప్రారంభమైన ధనిక దే శాల ఆర్ధిక సంక్షోభం ప్రారంభం తరువాత జనం చూస్తున్నారు. ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా అధికారంలో వున్న పార్టీలన్నీ దెబ్బతింటున్నాయి. నిపుణుల వ్యూహాలు ఎదురుతన్నుతున్నాయి.
ఈ పూర్వరంగంలో చూస్తే బీహార్‌లో నిపుణుల వ్యూహాలు ఏమిటన్నది ప్రశ్న. గత లోక్‌సభ ఎన్నికలలో బీహార్‌లో ఎన్‌డిఏ పక్షాలకు వచ్చిన ఓట్ల మొత్తం 39.5 శాతం. జెడియు, ఆర్‌జెడి, కాంగ్రెస్‌కు 39.1శాతం వచ్చాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలలో 34.1 బిజెపి కూటమికి , మహాసంఘటనకు 44.1శాతం ఓట్లు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికలలో మహాసంఘటన పక్షాలు విడిగా పోటీ చేసి ఓట్లు చీలటంతో బిజెపికి గణనీయంగా సీట్లు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికలలో పరాభవం తరువాత కలసి వుంటే కలదు సుఖం అని నితీష్ కుమార్, లాలూ ప్రసాద్, కాంగ్రెస్‌లకు తెలియంది కాదు, ఆ మేరకు గతాన్ని మరిచి పోయి అసెంబ్లీలో కలసి పోటీ చే శాయి. ఈ పార్టీల ఓట్లు గుండుగుత్తగా కూటమి అభ్యర్ధులకు పడతాయని తాము అంచనా వేయలేకపోయామని ఫలితాలు వచ్చిన తరువాత బిజెపి నాయకులు వాపోయిన విషయం తెలిసిందే. ఇరవై స్ధానాలలో ఇతర చిన్న పార్టీలు చీల్చిన ఓట్లతోనే బిజెపి గెలిచింది. అది కూడా లేనట్లయితే బిజెపికి ఇంకా సీట్లు తగ్గేవి. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్‌పై అసంతృప్తితో ఓటు వేసినట్లే ఈ సారి నరేంద్రమోడీ ఏడాదిన్నర కాలంలో వట్టిస్తరి మంచినీళ్లు తప్ప సాధించిందేమీ లేకపోవటాన్ని జనం గమనించారు. రెండవది దాద్రి సంఘటన,కులుబుర్గి హత్యతో అసహన ధోరణులకు వ్యతిరేకంగా రచయితలు తమ అవార్డులను వెనక్కి ఇచ్చి నిరసన తెలపటం, ఇతర మేధావులు కూడా వారికి తోడు కావటం వంటి పరిణామాలన్నీ ఎన్నికల సమయంలోనే జరిగాయి. వీటిపై మోడీ, సంఘపరివార్ నేతల రిజర్వేషన్ల వ్యతిరేక వ్యాఖ్యలు తోడ్పడ్డాయి. అందువలన వీటన్నింటినీ విస్మరించి ప్ర శాంత కిషోర్ చాణక్యం అని చెప్పటమంటే జనం వివేచన జ్ఞానాన్ని తక్కువ చేసి చూడటమే. అలాంటి నిపుణుల నినాదాలు, ఎత్తుగడల కోసం అర్రులు చాచటమంటే పార్టీలు జనాన్ని మోసం చేసేందుకు మరింతగా ప్రయత్నిస్తున్నాయని అర్ధం చేసుకోవాలి.
