ఎం కోటేశ్వరరావు
వ్యవసాయ ఉగ్రవాదం ప్రపంచమంతటా పురాతన కాలం నుంచి ఉన్నదే. క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలోనే అస్సీరియన్లు తమ శత్రువుల ప్రాంతాలలోని బావులలో విషాన్ని కలిపేవారు. మొదటి ప్రపంచ యుద్ద కాలంలో ఫ్రాన్సుకు రవాణా అయ్యే గుర్రాలు, పశువులకు అమెరికాలో జర్మన్ ఏజంట్లు విషం ఇచ్చేవారు. కత్తి, బాకు, బల్లెం వంటి వాటిని కనుగొన్న తొలి మానవుడు వాటిని ప్రమాదకర జంతువుల నుంచి రక్షణకు, ఆహారం కోసం ఉపయోగించాడు. తరువాత అవే యుద్దాల్లో ఆయుధాలుగా మారాయి. శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ 1880దశకంలో చేసిన పరిశోధనలు పంటల్లో కలుపు మొక్కల నివారణకోసం రసాయనాలను కనిపెట్టేందుకు దారితీశాయి. తరువాత కాలంలో బ్రిటన్, అమెరికా, తదితర సామ్రాజ్యవాదులు, నియంతలు ఏకంగా పంటలు, అడవులనే నాశనం చేసేందుకు, లక్షలాది మంది మానవులు, జంతుజాలాన్ని అంతమొందించేందుకు వినియోగించిన చరిత్ర తెలుసా ? శాస్త్రవిజ్ఞానాన్ని మానవ, ప్రకృతి వినాశనానికి వినియోగించింది మానవ కల్యాణానికి బదులు వినాశనాన్ని కోరుకున్న దుర్మార్గులే అన్నది చరిత్ర చెప్పిన సత్యం. ప్రమాదకరమైన ఫంగస్‌ను అమెరికా వ్యవసాయక్షేత్రాల్లో ప్రవేశపెట్టి దాని ఆహార వనరును దెబ్బతీయాలని చైనా కుట్రపన్నింది, దానిలో భాగంగా ఇద్దరు చైనా జాతీయులు ఆ ఫంగస్‌ను అక్రమంగా తెస్తూ ఎఫ్‌బిఐకి దొరికి పోయారు. ఇదీ వార్త, ఒక ఆరోపణ, సదరు ఫంగస్‌ను ఎక్కడా ప్రయోగించలేదు. పరిశోధనల కోసం తెచ్చారన్నది ఒక అభిప్రాయం. అమెరికా మనదేశంలోకి వయ్యారి భామ అనే వినాశకారి అయిన కలుపు మొక్కను ఎలా ప్రవేశ పెట్టిందీ వేరే విశ్లేషణలో చూశాము. గుండెలు బాదుకుంటున్న అమెరికా కొన్ని దశాబ్దాల నాడే ఆ దుర్మార్గానికి పాల్పడిరది అనే అంశం ఎక్కడా మీడియాలో చర్చకు రావటం లేదు.పురాతన, ఆధునిక యుద్ధాలలో ఆహార ఉత్పత్తి వ్యవస్థలను దెబ్బతీయటం ఒక ఆయుధం. అందుకే చరిత్రను చదివినపుడు శత్రుదేశాలు కోటలను చుట్టుముట్టినపుడు నెలల తరబడి తట్టుకొనేందుకు ఆహారం, నీటిని నిల్వచేసుకొనే ఏర్పాట్లు చేసుకున్నట్లు అనేక దుర్గాలు, కోటల చరిత్రలు వెల్లడిరచాయి. ఆధునిక కాలంలో అందుకు జీవ, రసాయనాలను అమెరికా అస్త్రంగా వాడుకున్నది. అదెలా జరిగిందో చూద్దాం !
1953లో కొరియా యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే నెల రోజుల ముందు ఉత్తర కొరియా ప్రాంతంలో అమెరికా వైమానిక దళం చేసిన దాడుల్లో 75శాతం వరి ఉత్పత్తికి నీటిని అందించే ప్రాజెక్టులను నాశనం చేసింది. ఇది తరువాత కాలంలో అక్కడ కరవుకు దారి తీసింది. కమ్యూనిస్టుల పాలనలో జనాన్ని ఆకలితో మాడ్చి చంపారని ప్రచారం చేసే మానవతావాదులకు ఈ విషయం పట్టలేదు. వియత్నాంపై దాడిచేసిన అమెరికా మొక్కలను నాశనం చేసే ఏజంట్ ఆరెంజ్ అనే రసాయనాన్ని ఆపరేషన్ రాంచ్ హాండ్ పేరుతో 1962 నుంచి 1971వరకు వెదజల్లింది. దీనికి ఆదర్శం ఎవరు అంటే మలయా యుద్ధంలో ప్రయోగించిన బ్రిటీష్ దుర్మార్గులు. అమెరికాలో రైలు మార్గాలు, విద్యుత్ లైన్లు వేసే ప్రాంతాలలో పిచ్చి మొక్కలు పెరగకుండా చూసేందుకు 1940దశకంలో దీన్ని తయారు చేశారు. మనందరికీ తెలిసిన మానశాంటో సహా తొమ్మిది కంపెనీల నుంచి వియత్నాంలో చల్లేందుకు అమెరికన్ మిలిటరీ 7.6 కోట్ల లీటర్లు కొనుగోలు చేసింది. దాన్ని చల్లిన చోట 40లక్షల మంది మీద ప్రతికూల ప్రభావాలను చూపింది,30లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. రెడ్ క్రాస్ సంస్థ అంచనా ప్రకారం పది లక్షల మంది వికలాంగులయ్యారు. ఈ దుర్మార్గ ప్రక్రియలో భాగస్వాములైన అమెరికా మిలిటరీలో అనేక మందికూడా దీని ప్రభావంతో కాన్సర్, లింఫోమా వంటి వ్యాధులకు గురైనట్లు తేలింది. వారికి పుట్టిన పిల్లలకు జన్యు సంబంధమైన వ్యాధులు వచ్చాయి, వారి దుర్మార్గానికి పిల్లలు బలయ్యారు. వియత్నాంలో పర్యావరణానికి కలిగిన హాని గురించి చెప్పనవసరం లేదు, 77లక్షల ఎకరాల్లో పంటలు పండలేదు, అడవుల్లో మొక్కలు పెరగలేదు. అనేక జంతువులకు హాని కలిగింది.మానవ మారణకాండను జనోసైడ్ అని వర్ణిస్తే పర్యావరణానికి చేసిన హానిని ఎకోసైడ్ అని వర్ణించారు. అమెరికా దురాక్రమణను వ్యతిరేకించిన వియత్నాం వీరులు అడవుల్లో ఉండటంతో వియత్నాం సరిహద్దుల్లో ఉన్న లావోస్, కంపూచియా అడవులను కూడా అమెరికా దుర్మార్గులు వదల్లేదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్, అమెరికా, జర్మనీ వంటి దేశాలు రసాయన, జీవ ఆయుధాలను తయారు చేశాయి. ఆ సమయంలో అనేక ప్రాంతాల్లో వాటిని పరీక్షించి చూశారు. జపాన్‌పై అణుబాంబును వేసిన అమెరికా యుద్దం గనుక కొనసాగితే 1946లో జపాన్‌పై ఏజంట్ ఆరెంజ్‌ను ప్రయోగించాలని పథకం వేసింది. బ్రిటీష్ పాలనలో ఉన్న మనదేశం, ఆస్ట్రేలియాలతో సహా మొత్తం 1,100 కేంద్రాల్లో దాని పనితీరును పరీక్షించారు. అమెరికాను కూడా వదల్లేదు. ఉష్ణప్రదేశాల్లో ఎలా పని చేస్తుందో చూసేందుకు కెన్యాలో కూడా చల్లారు. మలయా ప్రాంత దేశాల్లో రబ్బరు తోటల్లో పెరిగే కలుపు మొక్కలను నివారించేందుకు తయారు చేసిన రసాయనాన్ని తమ మీద తిరుగుబాటు చేసిన మలయన్లు ఉన్న అడవుల్లో 1960వరకు బ్రిటీష్ మిలిటరీ ప్రయోగించింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని అమెరికా తరువాత ఇండోచైనా ప్రాంతంలో అమలు చేసింది.ముఖ్యంగా దక్షిణ వియత్నాం బలైంది. అనేక మంది గొప్పగా పొగిడే నాటి అమెరికా అధ్యక్షుడు కెనడీ ఈ దుర్మార్గానికి అనుమతి ఇచ్చాడు. ఈ దుర్మార్గం గురించి తెలుసుకున్న తరువాత అమెరికాలో వియత్నాం యుద్ధవ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది.తప్పుడు వాదనలతో ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాలను అమెరికా, బ్రిటన్ వ్యతిరేకించాయి.
అమెరికా ముందుగా ఎవరి మీద జీవ, రసాయన ఆయుధాలను ప్రయోగించదని, అయితే శత్రుదేశం ఏదైనా వినియోగిస్తే మాత్రం రసాయన ఆయుధాలను వదులుతామని అధ్యక్షుడు రూజ్‌వెల్ట్ గొప్పగా చెప్పాడు, ఏ దేశమూ వినియోగించకుండానే అణుబాంబుతో సహా ఆ దుండగాలకు అమెరికా పాల్పడిరది. జపాన్‌లో వరి పొలాలను నాశనం చేసేందుకు అమెరికా వినియోగించింది.వియత్నాంలో ఏజంట్ ఆరంజ్ చల్లిన ప్రాంతాల్లో గత ఐదు దశాబ్దాలుగా చెట్లలో సాధారణ పెరుగుదల లేదు, మామూలు స్థితికి రావాలంటే చాలాకాలం పడుతుందని చెబుతున్నారు.వియత్నాం దురాక్రమణ, దాడుల్లో పాల్గొన్న అమెరికా సైనికులు ఏజంట్ ఆరంజ్ తదితర విషపూరిత రసాయనాలను వెదజల్లుతున్నపుడు వారికి కూడా వాటి ప్రభావం సోకిన కారణంగా 1984లో కోర్టు వెలుపల రసాయన కంపెనీలు 18 కోట్ల డాలర్లు పరిహారంగా చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఇజ్రాయెల్ ఆక్రమించిన పాలస్తీనా ప్రాంతాల్లోకి సముద్రపు నీరు, తమ నివాసాల నుంచి వెలువడే మురుగునీటిని పాలస్తీనియన్ల నివాసాలు, వ్యవసాయ భూముల్లోకి వదలి పనికి రాకుండా చేయటం నిత్యకృత్యం. ఇది కూడా ఒక రకంగా వ్యవసాయ ఉగ్రవాదమే. పంటలు పండకుండా అరబ్బులను మాడ్చే ఎత్తుగడ.
నీవు నేర్పియే నీరజాక్షా అని తమ వ్యవసాయం మీద చైనా దాడి చేయనుందని అమెరికా గగ్గోలు పెడుతోంది. దానికి ఇదేమీ కొత్త కాదు. ప్రతి దేశం మీద కుట్ర సిద్దాంతాలను ప్రచారంలో పెట్టటం తెలిసిందే. తద్వారా తాను చేసే దుర్మార్గాలను స్వంత జనం ప్రశ్నించకుండా సమర్ధించేందుకు అది ఎంచుకున్న ఎత్తుగడ.తాను పెంచి పోషించిన ఉగ్రవాదానికి అదే బలికావటం కూడా వాస్తవం న్యూయార్క్ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై వైమానికదాడి అదే. తాను పెంచిన తాలిబన్లే దానికి పాల్పడ్డారు.అమెరికా జిడిపిలో వ్యవసాయం తక్కువే అయినప్పటికీ గణనీయ మొత్తం ఎగుమతులకు ఉపయోగపడుతున్నది. ఆల్‌ఖైదాతో చెడిన తరువాత తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని అనేక కేంద్రాలపై దాడులు చేసినపుడు దొరికిన పత్రాలలో అమెరికా వ్యవసాయ వివరాలున్న పత్రాలు దొరికాయి. వ్యవసాయాన్ని ఎలా దెబ్బతీయాలా అన్నది ఆల్‌ఖైదా శిక్షణలో భాగంగా బయటపడిరది.అమెరికాకు నాలుగు తరగతుల నుంచి వ్యవసాయ ఉగ్రవాద ప్రమాదం ఉందని 2012లో ఎఫ్‌బిఐ వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఒక విశ్లేషణలో పేర్కొన్నారు. ఒకటి ఆల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు, రెండవది మార్కెట్లను తిమ్మినిబమ్మిని చేసి లబ్దిపొందాలని చూసే ఆర్థిక నేరగాండ్లు లేదా అవకాశవాదుల నుంచి ప్రధానంగా ముప్పు ఉన్నట్లుపేర్కొన్నారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి(ఎఫ్‌ఎండి అంటే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్)ని వ్యాపింప చేస్తే మార్కెట్ల మీద తీవ్ర ప్రభావం పడుతుందన్నది తెలిసిందే. మూడవ తరగతి అసంతృప్తి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులు తమ కసి తీర్చుకొనేందుకు చేసే ఉగ్రవాద చర్యలు, నాలుగవ తరగతిగా జంతుహక్కుల రక్షకులు, పర్యావరణ ప్రేమికులు అని పేర్కొన్నారు. న్యూయార్క్ ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని పేల్చివేసిన తరువాత అమెరికాలో ఆగ్రో టెర్రరిజం ఆకర్షణీయంగ ఉన్నట్లు కనిపించిందట.
అమెరికా ప్రపంచ మిలిటరీ శక్తిగా ప్రపంచానికి కనిపించకుండా చేయాలంటే దాని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని ఒసామా బిన్‌లాడెన్ పదే పదే వాదించేవాడట.2004 అమెరికా ఎన్నికల సమయంలో ఒక వీడియోలో పదేండ్ల పాటు రష్యా రక్తమోడిరది, అమెరికా కూడా దివాలా తీసేంతవరకు అదే విధానాన్ని అనుసరించాలని చెప్పాడట. 2011 సెప్టెంబరులో అమెరికా ప్రపంచ వాణిజ్య కేంద్రంపై దాడికి ఆల్‌ఖైదాకు అయిన ఖర్చు కేవలం ఐదు లక్షల డాలర్లేనని , అమెరికాకు కలిగిన నష్టం 500బిలియన్ డాలర్లని ఒసామా చెప్పాడు. ఉగ్రవాద సంస్థలు నిజంగా అలా ఆలోచిస్తున్నాయో, పథకాలు వేస్తున్నాయో తెలియదు గానీ అమెరికా విశ్లేషకులు మాత్రం ఏం చేస్తే ఎలా,ఎంతటి నష్టం జరుగుతుందో వారికి విడమరచి చెబుతున్నారు. ఆహార ధాన్యాలు విషపూరితం అయితే వాటి ఎగుమతులు ఆగిపోతాయి లేదా నిల్వలు పేరుకు పోతాయి. పశువుల్లో వ్యాధులను వ్యాపింప చేస్తే వాటిని హతమార్చాల్సి ఉంటుంది. పరోక్షంగా రైతాంగానికి భారీ మొత్తాలను పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది.పరిశ్రమలకూ పరిహారంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయి, ఖర్చులూ పెరుగుతాయి. పశువుల్లో గాలికుంటు వ్యాధిని అమెరికాలో 1929లోనే నిర్మూలించారు. ఇతర ప్రాంతాల్లో ఉంది. ఇది మసూచి కంటే 20 రెట్లు వేగంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ కేవలం నలభై ఎనిమిది గంటల్లో వంద కిలోమీటర్ల వరకు వ్యాప్తి చెందగలదు. ఏదైనా వస్త్రానికి అంటుకుంటే నెల రోజుల పాటు బతికి ఉంటుంది. దీని గురించి తెలుసుకొనే లోపే అమెరికాలోని 25 రాష్ట్రాలకు కేవలం ఐదు రోజుల్లో వ్యాపింపగలదని అంచనా. అమెరికాకు పక్కనే దక్షిణ అమెరికాలో ఈ వ్యాధి ఉంది. అమెరికాలో ఒక్కో రైతు 1,500 నుంచి పదివేల వరకు ఆవులను పెంచుతాడు. ఒక దగ్గర ఈ వైరస్‌ను ప్రవేశపెడితే జరిగే నష్టాన్ని ఊహించుకోవచ్చు.2001లో బ్రిటన్‌లో ఈ వ్యాధి వ్యాపించటంతో 40లక్షల పశువులను వధించాల్సి వచ్చింది. అదే అమెరికాలో సంభవిస్తే 60 బిలియన్ డాలర్ల నష్టం(2012అంచనా) అని పరిశోధకులు పేర్కొన్నారు.ఇలాంటి దుర్మార్గాలకు తాము పాల్పడిన ఉదంతాలు అమెరికా అధికార యంత్రాంగానికి తెలుసుగనుక వారు నిరంతరం భయపడుతూనే ఉంటారు, ఎందుకు అంటే అమెరికాను ప్రతి ఒక్కరూ ద్వేషిస్తున్నారు గనుక. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, అది అమెరికా నుంచి కూడా కావచ్చు !

:max_bytes(150000):strip_icc()/anthrax_bacteria-57d9d8783df78c9cced90229.jpg)
