Tags
#China biological weapons, Biological weapons, China a victim of Biological weapons, japan bacteria bombs
:max_bytes(150000):strip_icc()/anthrax_bacteria-57d9d8783df78c9cced90229.jpg)
– ఎం. కోటేశ్వరరావు
చైనాలోని హుబెయ్ రాష్ట్రంలో కోవిద్-19(కరోనా) వైరస్ ప్రబలి వందల మందిని బలిగొనటం వెనుక ఉన్నది వికటించిన చైనా జీవ ఆయుధ ప్రయోగాలే అని పశ్చిమ దేశాల మీడియా కథలను అల్లింది. వాటిని పొల్లుపోకుండా దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమన్నట్టు తెలుగు మీడియా పునశ్చరణ కావించింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని ఈనెల 15న ఆసియా టైమ్స్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. గతంలో కొన్ని దేశాల చరిత్రను చూసినప్పుడు అప్పటికే గుర్తించిన వైరస్లు, బాక్టీరియాలతో జీవ ఆయుధాలను తయారు చేసి జనం మీద ప్రయోగించాయి. కోవిద్-19 వైరస్ కొత్తది. గతంలో గుర్తించిన 2019 నోవల్ కరోనా వైరస్కూ దీనికీ సంబంధం లేదు. అందువలన కోవిద్-19తో జీవాయుధాలు తయారు చేస్తున్నారనటానికి ఎలాంటి ఆధారాల్లేవని, ప్రధాన వైద్య నిపుణులెవరూ వివాదాస్పద కథనాలను అంగీకరించటం లేదని ఆసియా టైమ్స్ కథన రచయిత పేర్కొన్నారు.
చరిత్రలో ఇంతవరకు ఏ దేశంలోనూ జరగని విధంగా కోట్లాది మందిని ఇండ్లకే పరిమితం కావాలని వ్యాధినిరోధక చర్యల్లో భాగంగా చైనా సర్కార్ జనానికి సలహాయిచ్చింది. అది కూడా కొందరు ప్రబుద్దులకు జనాన్ని బందీలు చేయటంగా కనిపించిందంటే వారి చైనా వ్యతిరేక పిచ్చి తారాస్ధాయికి చేరిందనుకోవాలి. ప్రపంచ దేశాలన్నీ వైరస్ తగ్గుముఖం పట్టేవరకు చైనా ప్రయాణాలు మానుకోవాలని సలహా ఇచ్చాయి, అంటే దీని అర్ధం సేచ్చగా తిరగటాన్ని కట్టడి చేయటంగానూ, నిరంకుశ చర్యలుగా భావించాలా ? కోవిడ్-19 వైరస్ చైనాలో ఉహాన్ పరిశోధనశాలల నుంచే వెలువడిందనటానికి ఆధారాలు ఇంకా దొరకలేదని చెబుతూనే రుజువు చేసుకోవాల్సిన బాధ్యత చైనా కమ్యూనిస్టు పార్టీ మీద ఉందని అమెరికా రిపబ్లికన్ పార్టీ సెనెటర్ టామ్ కాటన్ చేసిన బాధ్యతారహిత ప్రకటనను ఆధారం చేసుకొని మీడియా రచ్చ చేస్తోంది. ఇండ్ల నుంచి బయటకు వచ్చిన వారిని చైనా కమ్యూనిస్టు పార్టీ పోలీసులు కొడుతున్నారని కాటన్ ప్రబుద్దుడు ఆరోపించాడు. ఇలాంటి వారి ప్రకటనలను ఆధారం చేసుకొని మీడియా సంచలనాత్మక కథనాలను వండుతోంది.
జీవ ఆయుధాలు ప్రపంచంలో తయారు కావటం లేదా, ఏ ఏదేశాలకు సామర్థ్యం ఉంది, అసలు ఎప్పటి నుంచి వీటిని వినియోగిస్తున్నారు, ఎవరు వినియోగిస్తున్నారో చూద్దాం. యుద్ధోన్మాదులు, ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలని చూసిన వారు మాత్రమే వీటిని ఉపయోగించినట్టు చరిత్ర చెబుతోంది. కమ్యూనిస్టులు అలాంటి వారు కాదు కాబట్టి, సోషలిస్టు చైనాకు అలాంటి ఆయుధాలను తయారు చేయాల్సిన అవసరం లేదు. వైరస్, బాక్టీరియా, ఫంగస్, ఇతర కొన్ని రసాయనాలను జీవ ఆయుధాలుగా పరిగణిస్తున్నారు. వీటివలన మానవులు, పశువులే కాదు, మొక్కలు కూడా నాశనం అవుతాయి, అనారోగ్యపాలవుతాయి. అయితే వాటిని తయారు చేసే సత్తా చైనాకు లేదా అంటే లేదని ఎవరూ చెప్పజాలరు. మానవ కల్యాణం కోసం ఒక ప్రమాదకర వైరస్‌ను హతమార్చేందుకు మరొక వైరస్‌ను రూపొందించేందుకు ప్రతి దేశానికీ అవకాశం ఉంది. అయితే ఆ ముసుగులో ఆయుధాలు తయారు చేస్తున్నాయన్నదే అసలు సమస్య.
చరిత్రను తిరగేస్తే క్రీస్తు పూర్వం ఆరువందల సంవత్సరంలో క్రిసాను ముట్టడి సమయంలో రాజు సోలోన్ కటుక రోహిణీ అనే పుష్పాల నుంచి తీసిన రసాన్ని ప్రయోగించి విరేచనాలు, ఇతర వ్యాధులు కలిగించినట్టు చరిత్రలో ఉంది. 1155లో రాజు బార్బోసా ఇటలీలోని టోరోంటానాలోని మంచి నీటి బావుల్లో శవాలను పడవేసి కలుషితం కావించాడు. 1495లో ఫ్రెంచి సైనికులను హతమార్చేందుకు స్పెయిన్ రాజులు ఇటలీలోని నేపుల్స్లో కుష్టువ్యాధి గ్రస్తుల రక్తం కలిపిన వైన్ సరఫరా అయ్యేట్టు చూశారు.1675లో విషంతో కూడిన బుల్లెట్లను వినియోగించరాదని జర్మనీ-ఫ్రెంచి సైన్యం అంగీకారానికి వచ్చాయి. 1710లో రష్యన్ చక్రవర్తి స్వీడన్ పట్టణాలలో ప్లేగుతో మరణించిన శవాలను ఫిరంగులకు కట్టి పడవేయించాడు. 1763లో అమెరికాలోని గిరిజనులను దెబ్బతీసేందుకు బ్రిటిష్ పాలకులు అమ్మోరు పోసిన వ్యాధిగ్రస్తులు వాడిన దుప్పట్లు పంపిణీ చేశారు. నెపోలియన్ చక్రవర్తి 1797లో ఇటలీలోని మంటువాలో మలేరియా వ్యాధి వ్యాపింప చేసేందుకు మైదానాలను వరదలతో నింపించాడు. అంతర్యుద్ధ సమయంలో1863లో అమెరికాలోని బానిస వ్యవస్థను కోరుకొన్న తిరుగుబాటు రాష్ట్రాలు యూనియన్ సైనికులకు ఎల్లోఫీవర్, అమ్మోరు సోకిన రోగులు వాడిన వస్త్రాలను విక్రయించేట్టు చూశాయి.
1346లో జెనోయీస్-తార్తార్ల మధ్య నేటి ఉక్రెయిన్‌లో ఆధిపత్య పోరు సమయంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఓటమి దశలో ఉన్న తార్తార్లు ప్లేగువ్యాధి సోకిన, మరణించిన తమ వారిని ఫిరంగులకు కట్టి శత్రు ప్రాంతాల మీద పడేశారు. దాంతో జెనోయీస్ దళాలు వెనక్కు తగ్గాయి. ఈ పరిణామం గురించి గాబ్రియల్ డే ముసిస్ నమోదు చేశాడు. వెనక్కు తగ్గిన జెనోయీస్(ఇటాలియన్లు)లు తమతో పాటు ప్లేగు వ్యాధి కూడా తీసుకు వెళ్లారు. ప్లేగు వ్యాధిగ్రస్తులు, బహుశా దానిని వ్యాపింప చేసే ఎలుకలను కూడా తమ నౌకల్లో తీసుకుపోయి ఉంటారని పేర్కొన్నాడు. ఆ తరువాత అది ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలో మన దేశంతో సహా అనేక దేశాలకు వ్యాపించింది. రెండున్నర కోట్ల మంది ఐరోపాలో దానికి బలయ్యారు. హైదరాబాదు సంస్థానంలో ప్లేగు వ్యాధి పదే పదే వస్తుండటంతో దాన్ని నివారించేందుకు 1591లో చార్మినార్‌ను నాటి నిజాం రాజు కట్టించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ తరువాత కూడా వస్తుండటంతో పాలకులు అనేక నివారణ చర్యలను తీసుకోవటం వేరే విషయం.
మొదటి ప్రపంచ యుద్ధంలో గుర్రాలకు సెంబరోగం (చీమిడి కారటం) వచ్చే ఆంత్రాక్స్ పౌడర్‌ను జర్మనీ, ఫ్రెంచి గూఢచారులు ప్రయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సైన్యాలు రష్యా, ఇతర అనేక దేశాలలో ప్లేగ్, అంతరాక్స్ వంటి వ్యాధులను వ్యాపింపచేసేందుకు ప్రయత్నించారు. జీవ ఆయుధాల తయారీ, ప్రయోగాలు నిర్వహించారు. 1980-88 మధ్య ఇరాక్-ఇరాన్ యుద్ధంలో అమెరికా అందచేసిన శరీన్, ఇతర గ్యాస్‌లను ప్రయోగించినట్టు ఇరాక్‌పై విమర్శలు వచ్చాయి. తరువాత కాలంలో వాటి నిల్వలు ఇంకా ఇరాక్ వద్ద ఉన్నట్టు అనుమానించిన అమెరికా సద్దామ్ హుసేన్ మానవవినాశక ఆయుధాలను గుట్టలుగా నిల్వచేసినట్టు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరాక్‌లో అమెరికన్లకు అలాంటివేమీ దొరకలేదని తరువాత వెల్లడైంది.
అమెరికాను ఆక్రమించుకొనే క్రమంలో గిరిజనుల నుంచి ఎదురైన ప్రతిఘటనను అణచివేసేందుకు బ్రిటిష్ పాలకులు పైన చెప్పుకున్నట్టు మసూచి(అమ్మోరు)వ్యాప్తిని ఒక ఆయుధంగా వాడుకున్న దుర్మార్గం గురించి చరిత్రలో నమోదైంది. అవి ఎలా పనిచేశాయో వివరిస్తూ సమాచారాన్ని బ్రిటిష్ సైనిక అధికారులు నమోదు చేశారు. పర్యవసానంగా దాదాపు రెండువందల సంవత్సరాల పాటు అమెరికాలో మసూచి వ్యాప్తి చెందింది. ఇలాంటి వాటిని పని గట్టుకొని వ్యాపింప చేశారా లేక సహజంగానే తలెత్తాయా అనేది నిర్ధారించటం ఇప్పటికీ అంతసులభంగా అంతుబట్టటం లేదని నిపుణులు చెబుతున్నారు.
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 22సంవత్సరాలకు 179 దేశాలు జీవ ఆయుధాల నియంత్రణకు ఒప్పందంపై సంతకం చేశాయి. ఎట్టి పరిస్ధితుల్లోనూ వాటి తయారీ, సేకరణ, నిల్వ, వినియోగించబోమని ఆ దేశాలు అంగీకారం తెలిపాయి. అయితే వైద్య అవసరాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఉదాహరణకు ఒక ప్రాణాంతక వైరస్‌ను హతమార్చేందుకు మరొక వైరస్ తయారీకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు జీవ ఆయుధాలు తయారు చేస్తున్నవారు కూడా ఆ ముసుగుతోనే చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. అనేక దేశాలు రసాయనిక ఆయుధాలు తయారు చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. వాటికీ జీవ ఆయుధాలకు పెద్ద తేడా ఉండదు. ఉదాహరణకు వియత్నాంను ఆక్రమించుకొనేందుకు అమెరికా జరిపిన దాడుల సమయంలో కలుపు మొక్కలను నాశనం చేసే పేరుతో ఆరెంజ్ ఏజంట్ అనే రసాయనాన్ని పెద్ద ఎత్తున వియత్నాంలో చల్లారు. యాభై సంవత్సరాలు గడిచిన తరువాత కూడా అనేక చోట్ల కలుపు మొక్కలే కాదు అసలు ఏ మొక్కా బతకని పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతాలలో పుట్టుకతో పిల్లల్లో లోపాలు, కాన్సర్, మధుమేహం వంటి వ్యాధులకు అమెరికా చిమ్మిన విషం కారణమని తేలింది. అణ్వాయుధాలను అత్యాధునికంగా ఎలా తయారు చేస్తున్నారో వైరస్‌లను కూడా ఏదో ఒక ముసుగులో అలాగే తయారు చేస్తున్నట్టు అనేక మంది అనుమానిస్తున్నారు.
మొదటి ప్రపంచ యుద్దంలో రష్యా, రుమేనియాల్లో కలరా, ప్లేగు, అంత్రాక్స్‌ను వ్యాపింప చేసేందుకు నౌకల్లో అవి సోకిన గుర్రాలు, ఇతర పశువులను ఎగుమతి చేసేందుకు జర్మనీ పధకం వేసిందని వార్తలు వచ్చాయి. అయితే దాని మీద విచారణ జరిపిన నానాజాతి సమితి కమిటీ జీవ ఆయుధాలను ఉపయోగించలేదు గానీ జర్మన్లు రసాయనిక ఆయుధాలు వాడినట్లు పేర్కొన్నది. తరువాత రసాయనిక ఆయుధాలను రూపొందించకూడదని కోరుతూ 1925లో జెనీవా ఒప్పందం చేసుకున్నారు. అనేక దేశాలు సంతకాలు చేసినా 1975వరకు అమెరికా భాగస్వామి అయ్యేందుకు మొరాయించింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కొరియాపై దాడి సమయంలో అమెరికా జీవ ఆయుధాలను ఉపయోగించిందనే విమర్శలు వచ్చాయి. అయితే తమ దగ్గర జీవ ఆయుధాలు ఉన్నాయి తప్ప వాటిని ఉపయోగించలేదని అమెరికన్లు బుకాయించారు.
జపాన్ జీవ ఆయుధాల తయారీ బృందం నేత షిరోషి
రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సామ్రాజ్యవాదులు ఆపరేషన్ చెర్రీ బ్లూసమ్స్ పేరుతో జీవ ఆయుధాలతో అమెరికా సహా అనేక దేశాల మీద దాడి చేయాలనే పథక రచన చేశారు. అందుకు ప్రత్యేక దళాన్నే ఏర్పాటు చేశారు. 1932 నుంచి 1942వరకు పరిశోధనలు చేసి రూపొందించారు. తొలుత ప్రయోగాల్లో భాగంగా తన ఆక్రమణలోని చైనాలోని హార్బిన్, కొరియా, మంచూరియా ప్రాంతంలో దాడి చేశారు. దానిలో కలరా, ప్లేగు, అంతరాక్స్, మసూచి వంటి ప్రమాదకర క్రిముల్ని వాడారు. 2002లో ఒక అంతర్జాతీయ సమావేశంలో జపాన్ మిలిటరీ జరిపిన బాక్టీరియా బాంబు దాడుల్లో మరణించిన వారు ఐదు లక్షల ఎనభైవేల మంది ఉన్నట్టు వక్తలు వెల్లడించారు. ఒక్క చైనాలోనే ప్లేగు, కలరా, ఆంత్రాక్స్ వంటి వాటితో నాలుగు లక్షలమంది మరణించారని అంచనా. అమెరికన్లు జపాన్ పెరల్ హార్బరు మీద దాడి చేసిన తరువాత పదిహేను కోట్ల ప్లేగు బాక్టీరియాను మోసుకుపోయే ఈగలు, ఎలుకలతో అమెరికా మీద దాడి చేయాలని జపాన్ ఏర్పాట్లు చేసుకుంది. అయితే కారణాలు ఏమైనా వాటిని మోసుకుపోయే బెలూన్ నిర్ణీత స్థలాన్ని చేరలేదు. తరువాత దాడి చేయాలనుకున్న తేదీకి కొద్ది వారాల ముందే జపాన్ లొంగిపోయింది. దాంతో పన్నాగం నెరవేరలేదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత జరిపిన విచారణలో జీవ ఆయుధాల తయారీ బృందం నేత షిరోషిని జపాన్ విడిచినా సోవియట్ విచారణలో 12మంది జపనీయులకు శిక్షలు తప్పలేదు.
జపాన్ జీవ ఆయుధాల తయారీకి 150 భవనాలను, ఐదు శివారు ప్రాంతాలను ఉపయోగించి మూడువేల మంది శాస్త్రవేత్తలతో పని చేయించారు. వాటి తయారీ సమయంలో కనీసం పదివేల మంది ఖైదీలపై వాటిని ప్రయోగించగా మరణించినట్టు తేలింది. వారిలో మూడువేల మంది కొరియా, చైనా, సోవియట్, మంగోలియా, అమెరికన్, బ్రిటిష్, ఆస్ట్రేలియన్ యుద్ద ఖైదీలు ఉన్నట్టు బయట పడింది. జపాన్ జీవ ఆయుధాల విషయం బయటపడిన తరువాత అమెరికా పెద్ద ఎత్తున 1942నుంచి వాటిని రూపొందించేందుకు పూనుకుంది. తాను పెద్ద ఎత్తున జీవ ఆయుధాలను తయారు చేసినట్టుగానే ఇతరులు కూడా తయారు చేసి తమ మీద ప్రయోగిస్తారని అమెరికా భయపడుతోంది.
ఇరాక్‌పై దాడి, దురాకక్రమణ సమయంలో 1990-91లో తన సైనికులను రసాయన ఆయుధాల నుంచి రక్షించుకొనేందుకు అవసరమైన ముఖతొడుగులు(మాస్క్) అందచేసింది. వాటిని ఎలా కనుగొనాలో శిక్షణ ఇచ్చింది. లక్షా 50వేల మంది సైనికులకు ఆంత్రాక్స్ నివారణ వాక్సిన్లు, వేసింది. ఆంత్రాక్స్ సోకినపుడు నివారణకు ఐదులక్షల మంది సైనికులకు ఒక నెలకు అవసరమైన ఔషధాల నిల్వల్ని అందుబాటులో ఉంచింది.
చరిత్రలో మానవాళి పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన సామ్రాజ్యవాదుల దుష్ట చరిత్రను మూసిపెడుతూ సోషలిజం, కమ్యూనిజం మీద ఉన్న వ్యతిరేకతను మరోసారి రెచ్చగొట్టేందుకు కార్పొరేట్ మీడియా చైనా జీవ ఆయుధాల తయారీ కథలను చెబుతున్నది.రెండవ ప్రపంచ యుద్దంలో జీవ ఆయుధాల దాడికి గురైన బాధిత దేశం చైనా అన్నది గుర్తు పెట్టుకోవాలి.