Tags

, ,

Image result for donald trump india tour : who are patriots and who are not

ఎం కోటేశ్వరరావు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈనెల 24,25 తేదీలలో మన దేశ పర్యటన జరపనున్నారు. ఆ పెద్ద మనిషి రాకను నిరసిస్తూ తాము ప్రదర్శనలు జరుపుతామని వామపక్షాలు ప్రకటించాయి. ట్రంప్‌ రాక సందర్భంగా గుజరాత్‌ బిజెపి ప్రభుత్వం(కేంద్ర పెద్దల ఆదేశాలతోనే అన్నది స్పష్టం) చేస్తున్న హడావుడి చూస్తుంటే మన దేశం బ్రిటీష్‌ రాజరికంలో మాదిరి ఇప్పుడు అమెరికా బానిసత్వంలోకి పోయిందా అనిపిస్తోంది. అంతర్జాతీయంగా మీడియాలో ఇప్పటికే అపహాస్యం ప్రారంభమైంది. ఇంత చేసి సాధించేదేమిటి అన్నది అపూర్వచింతామణి ప్రశ్న. సమాధానం చెప్పకపోతే తలలు తెగవు గానీ, గత ఆరు సంవత్సరాలలో మోడీ గారు ఖరీదైన కోట్లు తొడుక్కొని విదేశాలు తిరటం తప్ప సాధించిందేమీ లేదు కనుక, ట్రంప్‌ రాకతో అటు సూర్యుడు ఇటు పొడుస్తాడు అని ఎవరైనా అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు.
డోనాల్డ్‌ ట్రంప్‌ రాకను సిపిఎంతో సహా వామపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ప్రధాని నరేంద్రమోడీ ట్రంప్‌ రాకకోసం ఎందుకు తహతహలాడుతున్నారు అన్నది ప్రశ్న. ట్రంప్‌ను ఆహ్వానించే వారు ఇప్పుడు అసలు సిసలు దేశభక్తులుగా ప్రచారం చేసుకుంటున్నారు లేదా చలామణి అవుతున్నారు. వ్యతిరేకించే వారిని దేశ ప్రయోజనాలను వ్యతిరేకించే వారిగా, దేశద్రోహులుగా సామాజిక మాధ్యమంలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఎవరు దేశద్రోహులు, ఎవరు దేశ భక్తులో తటస్దులు ఆలోచించాలి.
తన భారత పర్యటన గురించి డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికన్‌ విలేకర్లతో చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోడీతో పాటు మన దేశ గౌరవాన్ని గంగలో కలిపాయి. ట్రంప్‌ నోటి వెంట వెలువడిన ఆణిముత్యాల సారాంశం ఇలా ఉంది. ” వాణిజ్యం విషయంలో అమెరికా పట్ల భారత్‌ సరిగా వ్యవహరించలేదు. నరేంద్రమోడీ ఎంతో మంచి వ్యక్తి గనుక పర్యటన పట్ల ఆసక్తితో ఉన్నా. భవిష్యత్‌ కోసం భారత్‌తో ఒక పెద్ద ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటాం. అది అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందా అన్నది తెలియదు. ఈ పర్యటనలో ఒప్పందం ఉండకపోవచ్చు.నేను మోడీని ఎంతగానో ఇష్టపడుతున్నా. విమానాశ్రయం నుంచి కార్యక్రమాలు జరిగే ప్రాంతం, స్టేడియంలో 70లక్షల మంది పాల్గొంటారని నరేంద్రమోడీ నాతో చెప్పారు. ప్రపంచంలోనే పెద్దదైన స్టేడియం నిర్మాణం జరుగుతున్నదని అనుకుంటున్నాను. అందువలన అది ఎంతో ఉత్సుకత కలిగిస్తోంది. కాబట్టి మనమంతా ఖుషీగా గడపవచ్చు”.
మన దేశంలో పర్యటించే ఒక విదేశీ నేత ఇలా మాట్లాడటం అహంకారానికి సూచిక. మన దేశంలో స్ధానికంగా ఒక నేత పర్యటిస్తుంటే మద్దతుదారులు ఎంతెంత మంది జనాన్ని సమీకరిస్తారో ముందుగానే సదరు నేతకు చెప్పినట్లుగా మన ప్రధాని స్వయంగా ట్రంప్‌తో మీ కార్యక్రమానికి 70లక్షల మందిని సమీకరిస్తా, బ్రహ్మాండంగా చేస్తా అని చెప్పటం సిగ్గుగా లేదూ ! అందుకే ట్రంప్‌ మన దేశం వస్తే కమ్యూనిస్టులకు పోయేదేమిటి ? ఎందుకు వ్యతిరేకించాలి అని సామాజిక మాధ్యమంలో లేవనెత్తుతున్న ప్రశ్నలను నిజమే కదా అని భావిస్తున్న తటస్దులు కమ్యూనిస్టుల వ్యతిరేకతకంటే బిజెపి పాలకుల బానిసబుద్ది మన దేశానికి గౌరవాన్ని తెచ్చిపెడుతుందా అని ఆలోచించాలి. అంతర్జాతీయంగా అనేక ప్రాంతాలలో అమెరికన్లు శాంతికి విఘాతం కలిగిస్తున్నారు. ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారు, ఎప్పుడు ఎక్కడ దాడులు చేస్తారో, ఎందరిని బలిచేస్తారో తెలియదు. అందువలన అలాంటి వాటిని వ్యతిరేకించే కమ్యూనిస్టులు అంతర్జాతీయ వాదులు కనుక సహజంగానే వ్యతిరేకిస్తారు? మన దేశానికి, మన రైతాంగం, కార్మికుల ప్రయోజనాలకు అమెరికన్లు ముప్పు తేవటం లేదా ? లేక వాటిని చూసేందుకు మనం తిరస్కరిస్తున్నామా ? అసలవి సమస్యలుగా కనిపించటం లేదా ? వాటిని వివరంగా చర్చించబోయే ముందు క్లుప్తంగా ట్రంప్‌ పర్యటన వివరాలను చూద్దాం.

Image result for donald trump india tour : who are patriots and who are not
గతేడాది అమెరికాలో హౌడీ మోడీ సభ సందర్భంగా నరేంద్రమోడీ డోనాల్డ్‌ ట్రంప్‌ను మన దేశానికి ఆహ్వానించారు. ఈ మేరకు ఈనెల 24న వస్తున్న ట్రంప్‌ దంపతులకు అహమ్మదాబాద్‌ విమానాశ్రయంలో మోడీ స్వాగతం పలుకుతారు. విమానాశ్రయం నుంచి 22 కిలోమీటర్ల దూరం రోడ్‌ షో నిర్వహిస్తారు. సబర్మతి ఆశ్రమం దగ్గర మహాత్మాగాంధీకి నివాళి అర్పిస్తారు. తరువాత వల్లభారు పటేల్‌ స్టేడియంలో నమస్తే ట్రంప్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు మూడున్నరకు అహమ్మదాబాద్‌ నుంచి బయలు దేరి ఆగ్రాలోని తాజ్‌ మహల్‌ సందర్శన, తరువాత ఢిల్లీ వెళతారు. రెండవ రోజు రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌ దంపతులకు రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ దంపతులు స్వాగతం పలుకుతారు. తరువాత రాజఘాట్‌లో మహాత్మాగాంధీకి మరోసారి నివాళి అర్పిస్తారు. తరువాత హైదరాబాద్‌ హౌస్‌లో అధికారిక చర్చలు జరుగుతాయి.ఆ సమయంలో ట్రంప్‌ సతీమణి మెలానియా ఢిల్లీలోని ఒక పాఠశాలను సందర్శిస్తారు. మూడు గంటలకు అమెరికా రాయబార కార్యాలయంలో ముఖ్య వాణిజ్యవేత్తలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ట్రంప్‌ పాల్గొంటారు. రాత్రి ఎనిమిది గంటలకు రాష్ట్రపతి భవన్‌లో విందు, తరువాత పది గంటలకు అమెరికాకు తిరుగు ప్రయాణమౌతారు.
గుజరాత్‌లో కొద్ది గంటలు మాత్రమే గడిపే ట్రంప్‌ దంపతుల కోసం సర్కార్‌ పదివేల మంది పోలీసులను, వందల మంది అధికారులను దింపుతోంది. నిన్నటి వరకు బిజెపి మిత్రపక్షంగా ఉన్న శివసేన పత్రిక సామ్నా మోడీ చేస్తున్న హడావుడిని బానిస మనస్తత్వంగా వర్ణించింది. రోడ్ల మీద ఉండే పాన్‌ దుకాణాల మూత మొదలు, వీధి కుక్కల పట్టివేత, పేదరికం, పేదలు కనపడకుండా అహమ్మదాబాదులో కొన్ని చోట్ల గోడల నిర్మాణం, కొన్ని చోట్ల కుటుంబాల తొలగింపు వంటిచర్యలకు ప్రభుత్వం పాల్పడింది. కొద్ది గంటల పాటు ట్రంప్‌ దంపతులకు మురికివాడలు కనపడకుండా చేసేందుకు అహమ్మదాబాదులో దాదాపు వందకోట్ల రూపాయలు తగలేసి గోడ కట్టిన మన నిర్వాకాన్ని చూసి ఎవరైనా ఏమనుకుంటారు? అహమ్మదాబాద్‌ విమానాశ్రయానికి అరవైకి పైగా అంతర్జాతీయ, దేశీయ విమానాల రాకపోకలు రోజూ ఉంటాయి. కేవలం పది విమానాలను మాత్రమే అనుమతిస్తూ మిగతా వాటిని ఇతర ప్రాంతాలకు మరల్చేందుకు నిర్ణయించారు. స్టేడియంకు జనాలను తరలించేందుకు 2,200 బస్సులు ఏర్పాటు చేశారు. రోడ్డు పొడవునా దోమలు లేకుండా చేసేందుకు ఫాగింగ్‌ యంత్రాలను అమర్చారు. రోడ్ల మీద లక్ష మొక్కలను తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు.ట్రంప్‌కు జయజయ ధ్వానాలు పలికేందుకు రోడ్ల మీద ఇరవై ఎనిమిది వేదికలను ఏర్పాటు చేశారు.
గతేడాది సెప్టెంబరులో నరేంద్రమోడీ అమెరికా పర్యటన జరిపి హౌడీ మోడీ పేరుతో భారత సంతతి వారిని సమీకరించి మన దేశం ఎంతో బాగుందని ఎనిమిది సార్లు ఎనిమిది భాషల్లో చెప్పి, ట్రంప్‌ను తాను పొగిడి, ప్రతిగా దేశ పిత అని ట్రంప్‌ చేత పొగిడించుకొని కౌగిలింతలతో తిరిగి వచ్చారు తప్ప సాధించిందేమిటి? మన ఎగుమతుల పెంపుదలకు ఎలాంటి ఒప్పందం నాడు లేదు, ఇది రాసిన సమయానికి వచ్చిన వార్తలను బట్టి ఇప్పడూ లేదు. అసలు కీలకమైన అమెరికా వాణిజ్య ప్రతినిధే ట్రంప్‌తో రావటం లేదు. ఇప్పుడు పరస్పరం ఎలా పొగుడు కుంటారో దేశం చూడనుంది. అసలు ట్రంప్‌ పర్యటనను ఎందుకు వ్యతిరేకించాలి ?
అలీన దేశంగా ఉన్న భారత్‌ను తమ చంకనెక్కించుకొని తన ప్రయోజనాలను నెరవేర్చుకొనేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఇది మన దేశానికి భద్రతా రీత్యా, ఆర్ధికంగా మోయలేని భారాలను మోపుతుంది. ఇరుగుపొరుగుదేశాలతో శతృత్వాలను పెంచుతుంది. ఈ రోజు మన ప్రాధాన్యత యావత్‌ దేశ జనాభా అవసరాలు తీరే విధంగా ఆర్ధిక వ్యవస్దను అభివృద్ధి చేయటానికి ఉండాలి తప్ప ఇరుగుపొరుగుదేశాలతో మిలిటరీ ఉద్రిక్తతల నడుమ మన సంపదలన్నీ అమెరికా లేదా మరొక దేశ ఆయుధాలకొనుగోలుకు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఇరుగు పొరుగుదేశాలతో ఉన్న సరిహద్దు సమస్యలను పరిష్కరించేందుకు అమెరికాతో చెలిమి ఏ విధంగానూ మనకు ఉపయోగపడదు.పసిఫిక్‌ సముద్ర ప్రాంతంలో తన ప్రయోజనాలకోసం మన దేశాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం పేరుతో తన మిలిటరీ వ్యూహంలోకి అమెరికా లాగుతోంది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో తన భారాన్ని మన మీద మోపేందుకు మన భుజం మీద తుపాకిని పెట్టి చైనాను కాల్చేందుకు ప్రయత్నిస్తోంది. తనకు అవసరం లేని, ఇతర దేశాలకు కూడా విక్రయిస్తున్న ఆయుధాలను మనకు కట్టబెట్టటం తద్వారా మన మిలిటరీ భవిష్యత్‌ను తన చేతుల్లోకి తీసుకొనే ప్రయత్నం చేస్తున్నది. అమెరికాకే అగ్రస్ధానం అనే పద్దతుల్లో ముందుకు పోతున్న అమెరికా మనలను ఎలా ముందుకుపోనిస్తోందో అందరూ ఆలోచించాలి.
మన దేశం చైనాతో అయినా మరొక దేశంతో అయినా మన జాగ్రత్తలు మనం తీసుకుంటూనే అభివృద్ధి మీద కేంద్రీకరించాలి. అమెరికన్లు చైనాను శత్రుదేశంగా పరిగణించటం వేరు, వారు వారు చూసుకుంటారు, వారి తరఫున మనలను కూడా అదే విధంగా వ్యవహరించాలని చూడటం మనకు ఏమాత్రం మంచిది కాదు. అనేక ప్రాంతాలలో గతంలో అమెరికా తన సైన్యాలను దించి ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొనేది, ఇప్పుడు తన చేతికి మట్టి అంటకుండా ఇతర దేశాలు ఆ పని చేయాలని వత్తిడి చేస్తోంది. అమెరికా ఆయుధాలకు మార్కెట్‌గా మారేందుకు, ఇరుగుపొరుగుదేశాలను శత్రువులుగా చేసుకోవటం మనకు అవసరమా ?
2018 నుంచి అమెరికన్లు చైనా మీద వత్తిడి తెచ్చి తమ ప్రయోజనాలను కాపాడుకోవాలని చూస్తున్నారు తప్ప మన దేశం నుంచి దిగుమతులకు పూనుకోవటం లేదు. మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే కొన్ని వస్తువులకు ఇచ్చిన రాయితీలను కూడా రద్దు చేశారు, దానికి ప్రతిగా మనం కూడా అమెరికా వస్తువులపై పన్నులు పెంచాల్సి వచ్చింది. మనమేదో పత్తి రైతులకు కనీస మద్దతు ధరల రూపంలో సబ్సిడీలు ఇస్తున్నామనే పేరుతో ప్రపంచ వాణిజ్య సంస్దలో మన మీద దావా వేసింది అమెరికా. 2019 జనవరి-సెప్టెంబరు మాసాల మధ్య ఉభయ దేశాల వాణిజ్య వృద్ధి రేటు 8.4 నుంచి 4.5శాతానికి పడిపోయింది. రెండు దేశాల మధ్య సేవలు, వస్తువుల వాణిజ్య నిష్పత్తి 62:38శాతం ఉండగా చైనాతో వస్తువుల శాతమే ఎక్కువగా ఉంది.
అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించాలంటే తలసరి ఆదాయం 12,375 డాలర్లు ఉండాలి, మన దేశంలో రెండువేల డాలర్లకు అటూ ఇటూగా ఉన్నప్పటికీ మనలను అభివృద్ధి చెందిన తరగతి దేశాలతో జమకట్టిన ట్రంప్‌ సర్కార్‌ కొద్ధి రోజుల క్రితమే మనకు ఆరు రకాల సబ్సిడీలు దక్కకుండా చేసింది. ఆర్ధికంగా కొన్ని వందల కోట్ల రూపాయలు మనకు నష్టం కలిగించింది. ఒక వైపు మన పరిస్ధితి ఇంట్లో ఈగల మోతగా ఉంటే అమెరికా ఈ పల్లకీ మోత కారణంగా అనేక దేశాలు మనలను సతాయించుకు తింటాయి. అలాంటి ట్రంప్‌ మనకు మిత్రుడా ?
ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనావళిలో సాధారణ ప్రాధాన్యత వ్యవస్ధ(జిఎస్‌పి) ప్రకారం రాయితీలు పొందుతున్న మనకు అభివృద్ది చెందుతున్న దేశ లబ్దిదారు(డిబిసి) హౌదాను అమెరికా రద్దు చేసింది. పర్యవసానంగా మన ఎగుమతులకు ఇస్తున్న వందలాది కోట్ల రూపాయల సబ్సిడీలు పోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో మన వస్తువుల ధరలు పెరుగుతాయి. ధరల నియంత్రణ వంటి అంశాలపై అమెరికా పాల ఉత్పత్తిదారులు, ఆధునిక వైద్య సాంకేతిక అసోసియేషన్‌ వంటి సంస్ధల వత్తిడి మేరకు ఇలా జరిగింది. జిఎస్‌పి రద్దు వలన ప్రధానంగా ప్రభావితులవుతున్నది చిన్న, మధ్యతరహా పరిశ్రమలే. దీనివలన మన ఎగుమతులతో పాటు కార్మికుల వేతనాలు కూడా పడిపోతాయి. నిరుద్యోగమూ పెరుగుతుంది. మనకు జిఎస్‌పి రద్దు చేసిన ట్రంప్‌ బంగ్లాదేశ్‌, బ్రెజిల్‌, ఈజిప్టు, కాంబోడియా, దక్షిణాఫ్రికాలకు కొనసాగిస్తున్నాడు. అంటే ఈ దేశాల నుంచి మనకు పోటీ పెరిగినట్లే, దాన్ని తట్టుకొనేందుకు ఆయా సంస్ధలకు సబ్సిడీలు ఇవ్వాల్సి ఉంది. ఇలాంటి పరిస్ధితికి నెట్టిన వ్యక్తిని మనం ఆహ్వానించటమా ?
ప్రపంచ వాణిజ్య సంస్దలో వివాదాల తీర్పులపై అప్పీలు చేసుకొనేందుకు ఒక సంస్ధ ఉంది. దానిలో ఉన్న ముగ్గురు న్యాయమూర్తులలో ఇద్దరు ఉద్యోగ విరమణ చేశారు. కొత్త వారిని నియమించకుండా ట్రంప్‌ సర్కార్‌ అడ్డుకుంటున్న కారణంగా అది పని చేయటం లేదు.గతేడాది డిసెంబరు నుంచి అప్పీళ్లను చేపట్టలేదు. వాటిలో మనదేశానికి చెందినవి కూడా ఉన్నాయి. మన దేశం ఎంఇఐఎస్‌ పధకం ద్వారా, ఎగుమతి ఆధారిత యూనిట్లు, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ టెక్నాలజీ పార్కులు, ఎస్‌ఇజెడ్‌లు, సెజ్‌, ఎక్స్‌పోర్ట్‌ ప్రమోట్‌ కాపిటల్‌ గూడ్స్‌ వంటి వాటి ద్వారా చేసే ఎగుమతులు, వాటికి రాయితీలు ఇవ్వటాన్ని అమెరికా సవాలు చేసింది, వాటి కారణంగా తమ కంపెనీలకు నష్టం వాటిల్లుతోందని డబ్ల్యుటిఓకు ఫిర్యాదు చేసింది. దానిపై విచారణ జరిపిన కమిటీ అవన్నీ నిబంధనలకు విరుద్దమని ఎగుమతి సబ్సిడీలు ఇవ్వరాదని తేల్చింది.2017లోనే తమ సబ్సిడీలు పరిమితిని దాటాయని అప్పటి నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు అభివృద్ధి చెందుతున్న దేశంగా తాము సబ్సిడీలు ఇవ్వవచ్చని మన దేశం ఆ నివేదికను సవాలు చేసింది. మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఇప్పుడు అమెరికా పరిగణించటం వెనుక ఇలాంటి రాయితీలను రద్దు చేయించే ఎత్తుగడ స్పష్టంగా ఉంది.ఇలాంటి సర్కార్‌ నేత ట్రంప్‌ మన భాగస్వామి ఎలా అవుతాడు ?

Image result for donald trump india tour : who are patriots and who are not
మన దేశం నిబంధనల మేరకు ఇస్తున్న సబ్సిడీలను అభ్యంతర పెడుతున్న అమెరికా మరోవైపు మన ఉత్పత్తులపై విధిస్తున్న పన్నులు అక్రమం అని ప్రపంచ వాణిజ్య సంస్ద పదే పదే చెబుతున్నా, తీర్పులు ఇచ్చినా వాటిని ఖాతరు చేయటం లేదు. భారతీయ స్టీలు పైపుల తయారీదార్లకు భారీగా సబ్సిడీలు ఇస్తున్నారనే పేరుతో కొన్ని రకాల పైపుల దిగుమతులపై 2012లో అమెరికా 300శాతం పన్ను విధించింది. అది అక్రమం అని 2014లో డబ్ల్యుటిఓ తీర్పు చెప్పింది. అయినా అమెరికా ఖాతరు చేయలేదు. గతేడాది కొన్ని మార్పులు చేసినప్పటికీ అమెరికా వైఖరిని తప్పుపట్టినా అదే పరిస్ధితి కొనసాగుతోంది. తమ 28వస్తువులపై భారత్‌ దిగుమతి పన్నులు పెంచిందంటూ అమెరికా ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం డబ్ల్యుటిఓలో మన దేశానికి సంబంధించి 14వివాదాలు ఉన్నాయి. పప్పుధాన్యాల దిగుమతులపై మన దేశం విధించిన నిషేధాన్ని అమెరికాతో సహా అనేక దేశాలు వివాదాస్పదం కావిస్తున్నాయి. ఇలాంటి దేశాల నేతలను నమ్మటం, వారిని కౌగలించుకోవటం ఏమిటి ? ఇలాంటి ట్రంప్‌ను వ్యతిరేకించటం దేశ ద్రోహమా లేక ఆహ్వానించి ఎర్రతివాచీ పరచటం దేశద్రోహమా ? ఎవరు దేశ ద్రోహులు, ఎవరు దేశ భక్తులు ?