Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ గురించి కంత్రీగాళ్లు జనాన్ని ఎంతగా బురిడీ కొట్టిస్తున్నారంటే కాస్త హేతుబద్దంగా ఆలోచిస్తారు అనుకొనే వారిని కూడా సందేహంలో పడవేస్తున్నారు. అలాంటి వాటిలో ఒకటి అమెరికన్‌ నవలా రచయిత డీన్‌ కూన్జ్‌ నాలుగు దశాబ్దాల క్రితమే కోవిద్‌-19 (కరోనా వైరస్‌) గురించి ఊహాన్‌-400పేరుతో ఊహించినట్లు వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది.దీనిలో వాస్తవాలేమిటి అన్నది చూడబోయే ముందు మరికొన్ని అంశాల గురించి చూద్దాం.
కలరా, మసూచి, ప్లేగు మహామారి మాదిరి కరోనా వైరస్‌ పేరుతో సమాచార మహామారి (మహమ్మారి అని కూడా కొందరు పిలుస్తారు) వ్యాపిస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్ధ వ్యాఖ్యానించాల్సి వచ్చింది. దీనికి బలికాని వారు చాలా అరుదుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ మహామారిని ఎదుర్కొనేందుకు ఒక వాక్సిన్‌ అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఆరోగ్య అత్యవసర కార్యక్రమ అధిపతి డాక్టర్‌ మైక్‌ రియాన్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌ గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న పూర్వరంగంలో దాన్ని ఎదుర్కొనేచర్యల్లో భాగంగా వాస్తవాలను వెల్లడించేందుకు ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఒక కార్యక్రమాన్నే చేపట్టాల్సి వచ్చింది. దానికి ‘ఎపివిన్‌’ అని పేరు పెట్టారు. దాన్ని తెలుగులో చెప్పుకోవాలంటే ‘మహామారుల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్ధ సమాచార వ్యవస్ధ’ అని అర్ధం.
కరోనా వైరస్‌ ప్రధానంగా చైనాలోని హుబెరు ప్రాంతంలో కొన్ని చోట్లనే ఎక్కువగా వ్యాప్తి చెందింది. కానీ తప్పుడు సమచార మహామారి చైనాతో పాటు ప్రపంచమంతటా వేగంగా వ్యాపిస్తోంది. వాస్తవం ఒక కిలోమీటరు ప్రయాణించే సమయానికి అవాస్తవం వందకిలోమీటర్ల ముందు ఉంటోంది.ప్రపంచంలో 380 కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారులు ఉన్నట్లు అంచనా కాగా వారిలో 21శాతం చైనాలో ఉన్నారు. అందువలన వారికోసం కూడా వాస్తవాలను అందించాల్సి ఉంది. నువ్వుల నూనె రాసుకుంటే, మంట నుంచి వెలువడే పొగను పీల్చినా కరోనా వైరస్‌ అంటదు అనేది ఒక పెద్ద తప్పుడు ప్రచారం. ఇలా మరికొన్నింటి గురించి తెలిసిందే. ఆయా సంస్దలలో పని చేసే సిబ్బంది ఇతర వనరుల నుంచి వెలువడే దాని కంటే తమ యజమానులు చెప్పేదానిని ఎక్కువగా విశ్వసిస్తారన్నది ఒక తాజా అధ్యయనంలో తేలిన అంశం. అందువలన ప్రపంచ ఆరోగ్య సంస్ధ బడా కంపెనీల యజమానులతో సమావేశాలు జరిపి తమ సిబ్బందికి వాస్తవాలను వివరించాలని కోరుతోంది. కోవిద్‌-19కు సహజ లక్షణాలు లేవని, కృత్రిమంగా ఉహాన్‌ పరిశోధనాశాలలో తయారు చేశారనే కుట్ర సిద్ధాంతాలు, ప్రచారాన్ని తాము విశ్వసించటం లేదని 27 మంది ప్రముఖ ప్రజారోగ్య శాస్త్రవేత్తలు ఖండించినట్లు ఇటీవల లాన్‌సెట్‌ ప్రచురించింది.
ఇక అమెరికన్‌ రచయిత డీన్‌ కూన్జ్‌ జోశ్యం కథ చూద్దాం. అనేక మారు పేర్లతో రకరకాల ఇతివృత్తాలతో నవలలు రాసే డీన్‌ 1981లో రాసిన ది ఐస్‌ ఆఫ్‌ది డార్క్‌నెస్‌ అనే నవలలో పాత్రధారులతో ఊహాన్‌ -400 అనే జీవ ఆయుధం, అది పనిచేసే తీరు, జనాలను ఎలా హతమారుస్తుందో, దాన్ని ఎలా తయారు చేస్తారో చెప్పించాడు చూడండి అంటూ ఆయన అభిమానులు లేదా ఆ నవలను విక్రయించే అమెజాన్‌ కంపెనీకి చెందిన వారు గానీ 2008నాటి నవలా సమీక్ష చిత్రాన్ని వారం రోజుల క్రితం సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఒక పేజీలో జీవ ఆయుధం గురించి మరొక పేజీలో నవల ముఖచిత్రం ఉంది. ఇంకేముంది పుస్తకం మన ముందు ఉంది కనుక వాస్తవమే అని చాలా మంది నమ్మారు. ఆ పేజీలో పేర్కొన్నదాని ప్రకారం సదరు జీవ ఆయుధం కరోనా వైరస్‌ అనో మరొకటనో చెప్పలేదు. దానికీ కరోనా వైరస్‌కు అసలు పోలికే లేదు. అనేక డిటెక్టివ్‌, సైన్స్‌ ఫిక్షన్‌ కధలు, సినిమాల్లో ఇలాంటివి మనకు కోకొల్లలుగా కనిపిస్తాయి.

Image result for dean koontz

ది ఐస్‌ ఆఫ్‌ ది డార్క్‌నెస్‌ నవలా రచయిత డీన్‌ కూన్జ్‌
ఈ నవల పేజీ ప్రచారంలోకి వచ్చిన తరువాత ఈ కథ ఊహించని మలుపు తిరిగింది. గూగుల్‌లో వెతికిన కొందరికి కొత్త అంశం కనిపించింది. అదే నవలలో అదే పాత్ర ధారులు రష్యన్‌లు గోర్కీ పట్టణంలో తయారు చేసిన గోర్కీ-400 జీవ ఆయుధం గురించి చర్చిస్తారు. ఆ పేజీ నవల 1981నాటి ముద్రణలో ఉంది. కానీ తరువాత గోర్కీ కాస్తా 2008 నాటికి ఊహాన్‌గా మారిపోయింది. రెండు ముద్రణల్లోని రెండు రకాల పేజీలను దీనితో పాటు ఇచ్చిన చిత్రాలలో చూడవచ్చు. ఇదెలా జరిగింది? ఊహించటం కష్టమేమీ కాదు. అమెరికా, ఐరోపాలోని అనేక మంది రచయితలు, సినిమా దర్శకులు, కథకులు 1991 ముందు వరకు సోవియట్‌ యూనియన్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలలోని సోషలిస్టు వ్యవస్దలను దుష్టమైనవిగా చిత్రించి సొమ్ము చేసుకోవటం పరిపాటి.అమెరికన్లు, సిఐఏ ఏజంట్లు అసాధారణ తెలివి తేటలు గలవారిగా, సోవియట్‌ ఏజంట్లను పిచ్చిపుల్లయ్యలుగా చిత్రించిన సినిమాలు అనేకం ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. సోవియట్‌, ఇతర సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత అలాంటి వారు సొమ్ము చేసుకొనేందుకు కొత్త కథలను అల్లటం ప్రారంభించారు. అమెరికా ప్రధాన ప్రత్యర్ధిగా అనూహ్యంగా చైనా ముందుకు వచ్చింది.1991 తరువాత వచ్చిన సినిమాల్లో, రష్యన్ల బదులు చైనీయులు విలన్లుగా, అపహాస్యపు పాత్రధారులుగా మారిపోవటాన్ని చూడవచ్చు. దానిలో భాగంగానే కొత్త నవల రాయటం దండగ పేర్లు, స్ధలాలను మారిస్తే చాలని రచయిత, ప్రచురణకర్తలు భావించి ఆ మేరకు మార్చి ప్రచురించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వివాదం గురించి నవలా రచయిత డీన్‌ కూన్జ్‌ వైపు నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన వెలువడలేదు. జనాలకు జ్ఞాపకశక్తి తక్కువ కనుక తాము ఏమి రాసినా, ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుంది అనుకొనే వారు ఆ జనాల్లో కూడా తెలివిగల వారు ఉంటారని తమ బండారాన్ని బయటపెడతారని గ్రహించటం మంచిది.

Image

1981నాటి ప్రచురణలో గోర్కీ -400 గురించి రాసిన పేజీ