ఎం కోటేశ్వరరావు
చండీఘర్ విమానాశ్రయంలో 2024 జూన్ ఆరవ తేదీన ఒక అనూహ్య ఉదంతం జరిగింది.హిమచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున గెలుపొందిన సినీనటి కంగన రనౌత్ ఢిల్లీ వెళ్లేందుకు విమానం ఎక్కాల్సి ఉంది. ఆ సమయంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఒక సిఐఎస్‌ఎఫ్ (కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం) మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. రోజుకు వంద, రెండు వందల రూపాయలు తీసుకొని మహిళలు ఢిల్లీ రైతు ఉద్యమంలో పాల్గొన్నారని గతంలో కంగన నిందించారని, ఆ మహిళల్లో తన తల్లి కూడా ఉన్నందున ఆమెను అవమానించినందుకు గాను తాను కొట్టానని కుల్విందర్ కౌర్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆమె మీద కేసు నమోదు చేయటమే గాక విధి నిర్వహణ నుంచి తాత్కాలికంగా పక్కన పెట్టారు. అరెస్టు చేశారు. చట్టాల ప్రకారం ఆమెకు ఎంత శిక్ష వేస్తారు, ఏం చేస్తారు అనేది చూద్దాం. పంజాబ్ సుల్తాన్‌పూర్ లోధీ ప్రాంతంలో ఉన్న ఆమె తలిదండ్రుల ఇంటికి పెద్ద సంఖ్యలో రైతులు, ఇతరులు వచ్చి మద్దతు తెలుపుతున్నారు.కుటుంబ సభ్యులందరికీ సిక్కు మత గౌరవ చిహ్నాలలో ఒకటైన కాషాయ రంగు సిరోప్స్(శాలువ వంటి వస్త్రం) కప్పి గౌరవిస్తున్నారు.కుల్విందర్ కౌర్ సోదరుడు షేర్ సింగ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష కమిటీ స్థానిక నేత. కుటుంబం మొత్తం రైతుల ఉద్యమంలో పాల్గొన్నది. కుల్విందర్ భర్త కూడా సిఐఎస్‌ఎఫ్‌లోనే పని చేస్తున్నారు.ఆమెకు మద్దతుగా రైతు సంఘాలు ప్రకటనలు చేశాయి.
కంగన వ్యాఖ్యానించినట్లుగా నేను పనికిమాలినదాన్నా అంటూ కుల్విందర్ కౌర్ తల్లి వీర్ కౌర్ ప్రశ్నించారు. కంగన తొలిసారిగా తప్పు మాట్లాడి ఉండవచ్చు, కానీ అంతకు ముందు ఆమె ప్రవర్తన బాగానే ఉంది. ఏం జరిగిందో తెలియాల్సి ఉంది. నేను రైతు ఉద్యమంలో భాగస్వామిగా ఉన్నాను. కొంత మంది మా సన్నిహిత బంధువులు మిలిటరీలో పనిచేశారు, ఇప్పటికీ కొనసాగుతున్నారు. నా భర్త ఇద్దరు అన్నలు కూడా మిలిటరీలో ఉన్నారు, 1965యుద్ధంలో పాల్గొన్నారని ఆమె మీడియాతో చెప్పారు. కుటుంబమంతా రైతు ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ దాని గురించి తన సోదరితో ఎప్పుడూ పెద్దగా చర్చించలేదని షేర్ సింగ్ చెప్పారు. ఘటన తరువాత ఆమెతో మాట్లాడటం కుదరలేదని, భర్తతో మాట్లాడి ఇద్దరు పిల్లలను తమ ఇంటికి తీసుకువచ్చామని, మీడియా, సామాజిక మాధ్యమం ద్వారానే విషయాలు తెలుసుకుంటున్నామని, అందువలన ఉదంతానికి సంబంధించి వీడియో మొత్తాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలని షేర్ సింగ్ కోరారు.
కుల్విందర్ కౌర్‌కు మద్దతు తెలపటం మీద కంగన రౌనత్ తనదైన శైలిలో విరుచుకు పడ్డారు.సినిమా పరిశ్రమ మౌనంగా ఉందని ఆరోపించారు. అఫ్‌కోర్సు అది ఆమె ఇష్టం. తన అనుమతి లేకుండా తన శరీరాన్ని తాకారంటూ చెంపదెబ్బ కొట్టటాన్ని సమర్ధించేవారి గురించి ఆమె మండి పడ్డారు. ” ఏ కారణం లేకుండా ఏ నేరమూ ఎప్పుడూ జరగదు.నేరం చేసిన వారి మానసిక ధోరణులేమిటో కుల్విందర్ కౌర్‌ను సమర్ధిస్తున్నవారు చూడాలి. అత్యాచారం, హత్య చేసిన వారికి లేదా దొంగలకు కూడా బలమైన భావోద్వేగ, భౌతిక, మానసిక లేదా ఆర్థికపరమైన కారణాలు ఎల్లవేళలా ఉంటాయి.అయినప్పటికీ వారికి శిక్ష విధించి జైలుకు పంపుతారు. బలమైన భావోద్వేగాలతో నేరాలకు పాల్పడిన నేరగాండ్లతో మీరు చేతులు కలుపుతున్నారంటే దేశంలో ఉన్న చట్టాలన్నింటినీ ఉల్లంఘించటమే. అనుమతి లేకుండా కొంతమంది శరీర భాగాలను తాకి వారి అంతరంగిక పరిధిలోకి చొరబడటాన్ని అంగీకరిస్తున్నారంటే, గుర్తుపెట్టుకోండి మీరు అత్యాచారం, హత్యలను కూడా సమర్ధించినట్లే. వాటిలో మాత్రం పెద్ద ఏముంది కేవలం దూర్చటం,పొడవటమేగా అని ఇతరులు చెప్పుకోలేని, చూడకూడని చోట్లకు వెళ్లటమే. మీరు మీ మానసిక, నేరపూరిత ధోరణుల్లోకి లోతుగా చూడండి, దయచేసి యోగా, ధ్యానం చేయండని మనవి చేస్తున్నా లేకపోతే జీవితం మీకు దుర్భరమౌతుంది, మరీ అంత పగ,ద్వేషం, అసూయలను పెంచుకోకండి, వాటి నుంచి దూరం కండి ” అంటూ ఎక్స్‌ల మీద ఎక్స్‌లు(ట్వీట్లు) చేశారు.అంతేకాదు ఆమె పోస్టు చేసిన ఒక వీడియోలో పంజాబ్‌లో ఉగ్రవాదం, తీవ్రవాదం పెరుగుతున్నదని అంటూ మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలని ప్రశ్నించారు.
తనను చెంపదెబ్బ, అదీ ఒక మహిళ కొట్టినందుకు, ఆ చర్యను కొందరు తప్పేముంది అన్నందుకు ఇంతలా దిగ(భాష) జారి నోరుపారవేసుకోవటం పద్మ అవార్డు గ్రహీత కంగనకే చెల్లింది. అత్యాచారం అంటే లైంగిక దాడి తప్ప దూర్చటమేగా అని ఏ నాగరికజీవీ ఇంతవరకు ఎక్కడా అన్నట్లు వినలేదు, అలా అంటారేమో అని కంగన చెప్పారు.బహుశా తన పరివారంలో అలాంటి దిగజారుడు భాష వాడతారేమో ! కంగనను మహిళా కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టింది తప్ప అంతకు మించి జరిగిన ఇతర పరాభవమేమీ లేదు.(దీని అర్ధం చెంపదెబ్బను సమర్ధిస్తున్నానని కాదు, అనేక ఉదంతాల్లో మహిళలే మహిళల మీద దాడి చేసి కొట్టటంతో పాటు వివస్త్రలను చేసిన ఉదంతాలు తెలిసిందే.) చెంపదెబ్బను సమర్ధించినందుకే ఇంతగా మండిపడుతున్న సాధ్వీమణి గుజరాత్‌లో బిలికిస్ బానూ సామూహిక అత్యాచారం కేసులో శిక్షపడి బిజెపి పెద్దల ఆశ్వీరచనాలతో జైలు శిక్ష నుంచి మినహాయింపు పొందిన నేరగాండ్లకు అదే బిజెపి ప్రజాప్రతినిధులు మిఠాయిలు పంచి మంచి ప్రవర్తన కలిగిన బ్రాహ్మలని కితాబులిచ్చినపుడు కంగనకు ఎలాంటి తప్పూ కనిపించలేదు. మణిపూర్‌లో గిరిజన మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించినపుడూ కంగనకు ఎలాంటి అవమానమూ కనిపించలేదు, నోటికి తాళం వేసుకున్నారు.చివరకు ఎంత దిగజారుడు అంటే బిలికిస్ బానూ ఉదంతం మీద సినిమా తీసి సొమ్ము చేసుకోవాలని చూస్తే ఏ ఓటిటి సంస్థా, టీవీ కూడా అంగీకరించలేదు.తను చెంపదెబ్బ కొట్టిన మహిళలో ఉగ్రవాదం, తీవ్రవాదం కనిపించింది గానీ, పార్లమెంటు మీద పొగబాంబులతో దాడి చేసిన వారి ప్రవేశానికి పాసులిచ్చిన బిజెపి మైసూరు ఎంపీలో మాత్రం దేశభక్తి కనిపించింది గనుక మౌనంగా ఉన్నారు.
తనకు కంగన మీద ప్రేమ దోమా వంటివేమీ లేవు గానీ, ఆమెను చెంపదెబ్బ కొట్టినందుకు ఉత్సవంలో పాల్గొనటం లేదని ప్రముఖ సినీనటి షబనా ఆజ్మీ స్పందించారు. హింస, గూండాయిజం అంటూ రవీనా టాండన్ వర్ణించారు.తాను హింసాకాండను ఎప్పుడూ సమర్ధించనని అయితే కుల్విందర్ కౌర్‌ను ఉద్యోగం నుంచి తీసివేస్తే ఆమెకు ఉపాధి కల్పిస్తానని సంగీత దర్శకుడు, గాయకుడు విశాల్ దద్లానీ ప్రకటించాడు. ఒక మహిళ తన ఉద్యోగ స్థానాన్ని వినియోగించుకొని మరొక మహిళ మీద దాడి చేయటం విచారకరమని, చట్టపరంగా దర్యాప్తు జరపాలని అనుపమ ఖేర్,శేఖర్ సుమన్, అతని కుమారుడు అధ్యాయన్ సుమన్ కూడా ఖండించారు. తనను చెంపదెబ్బ కొట్టటంపై సినిమా పరిశ్రమ మౌనంగా ఉందంటూ కంగన తప్పు పట్టారు.ఇలాంటిదే రేపు మీకు, మీ పిల్లలకూ జరగవచ్చు, ఒకరి మీద జరిగిన ఉగ్రదాడిని మీరు ఉత్సవంగా జరుపుకుంటే అలాంటి రోజే మీకూ ఎదురౌతుంది సిద్దంగా ఉండండి అని శాపనార్ధాలు పెట్టారు. రైతులను వంద, రెండు వందలు తీసుకొని వచ్చిన కిరాయిబాపతు అని ఆమె నిందించినపుడు కూడా సినిమా పరిశ్రమ మౌనంగానే ఉంది మరి.అప్పుడు మోదం-ఇప్పుడు ఖేదం !
కంగన రనౌత్ 2020 డిసెంబరు మొదటి వారంలో రైతులను నిందిస్తూ ట్వీట్ చేశారు. అప్పుడే పెద్ద రచ్చ జరిగింది. మూడున్నర సంవత్సరాల తరువాత దానికి ప్రతిగా కంగన చెంపదెబ్బ తిన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 2019లో ఢిల్లీలో జరిగిన షాహిన్ బాగ్ నిరసనల్లో ప్రముఖంగా పాల్గొన్న 82 సంవత్సరాల బిలికిస్ అనే మహిళ రైతు ఉద్యమంలో కూడా పాల్గొంటున్నదను కొని వంద రెండు వందలకు దొరికే ఆమె తిరిగి వచ్చిందంటూ కంగన్ నోరు పారవేసుకున్నారు. తరువాత తన తప్పు తెలుసుకొని ఆ ట్వీట్‌ను తొలగించారు. అయితే అప్పటికే దాని మీద పెద్ద రచ్చ జరిగింది. ఉడతా పంజాబ్ సినిమా నటుడు-గాయకుడు అయిన దిల్జిత్ దోసాంజ్ కంగన మీద తీవ్రంగా విరుచుకు పడ్డాడు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు.దిల్జిత్‌ను ఒక జంతువు అని ఆమె నిందించారు. సిక్కు మహిళ మహిందర్ కౌర్‌ను ఉద్దేశించి కంగన నోరుపారవేసుకున్నారని ఒక వీడియో రుజువు చూపాడు. దాంతో కంగన వెనక్కు తగ్గింది.తనను కరణ్ జోహార్ పెంపుడు జంతువు అన్న కంగన్ బాలీవుడ్‌లో అనేక మందితో కలసి పనిచేశారని ఆమెకూడా ఆమె వారందరికీ పెంపుడు జంతువుగా ఉన్నట్లా అంటూ ఇది బాలీవుడ్ కాదు, పంజాబ్, పౌరుల మనోభావాలతో ఆడుకోవద్దని దిల్జిత్ హెచ్చరించాడు. సరిగ్గా అదే పంజాబీ మనోభావం ఇంకా ఉన్నందున కుల్విందర్ కౌర్‌తో చెంపదెబ్బ కొట్టించింది.
ఇన్ని సంవత్సరాల తరువాత ఆమె ఎందుకు స్పందించిందన్న ప్రశ్న అనేక మందిలో తలెత్తింది. గతంలో ఢిల్లీలో నిరసన తెలిపేందుకు వచ్చిన రైతులను అడ్డుకొని నెలల తరబడి అడ్డుకున్న బిజెపి సర్కార్ తీరుతో పంజాబీ రైతులు ఎంత ఆగ్రహంతో ఉన్నారో లోక్‌సభ ఎన్నికల్లో వెల్లడైంది. 2019లోక్‌సభ ఎన్నికలలో అకాలీదళ్, బిజెపి ఉమ్మడిగా పది, మూడు సీట్ల చొప్పున పోటీ చేసి 27.76-9.63శాతాల చొప్పు ఓట్లు రెండేసి సీట్లు తెచ్చుకున్నాయి. కాంగ్రెస్‌కు ఎనిమిది, ఆమ్‌ఆద్మీకి ఒకటి వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఏడు, ఆమ్ ఆద్మీకి మూడు, అకాలీదళ్‌కు ఒకటి, స్వతంత్రులు ఇద్దరు గెలిచారు. బిజెపికి ఒక్కసీటూ రాలేదు.ఓట్ల రీత్యా కాంగ్రెస్, ఆప్ తరువాత మూడవ పార్టీగా వచ్చింది. ఎన్నికలకు ముందు కూడా రైతులు ఆందోళనకు దిగటం దాన్ని ఎదుర్కొనేందుకు ఢిల్లీకి వచ్చే రోడ్ల మీద కందకాలు తవ్వటం, బండరాళ్లతో కూడిన ట్రక్కులను ఏర్పాటు చేయటం వంటి పనులకు మోడీ సర్కార్ పాల్పడింది.హర్యానా బిజెపి ప్రభుత్వ పోలీసులు ఒక పంజాబీరైతు ప్రాణాన్ని బలిగొన్నారు, అణచివేసేందుకు చూశారు.నిజానికి రైతు ఉద్యమాన్ని కించపరుస్తూ మాట్లాడిన బిజెపి, దాన్ని గుడ్డిగా సమర్దించిన పెద్దలందరికీ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పంజాబ్‌లో ప్రచారానికి వెళ్లగా అనేక గ్రామాల్లో ప్రవేశం కష్టమైంది, తీవ్ర నిరసన తెలిపారు. అలాంటి నేతలందరూ గత మూడు సంవత్సరాలుగా అనేక బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతూనే ఉన్నారు. ఆకస్మికంగా ఎవరైనా వెళ్లి చెంపదెబ్బ కొట్టటమో, మరో రూపంలో నిరసన తెలపటానికి అనేక అవకాశాలు ఉంటాయి. కానీ ఆ పని చేయలేదు. ఈ ఎన్నికల్లో బిజెపికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగినన్ని సీట్లు రాకపోవటం, నరేంద్రమోడీ గ్యారంటీలను జనం నమ్మకపోవటం, చివరికి అయోధ్యలోనే బిజెపి ఓడటం, మోడీ గెలుపు మెజారిటీ గణనీయంగా తగ్గటం, ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీల మీద ఆధారపడాల్సి వచ్చిన బలహీనత వెల్లడైంది. అంతకు ముందు బిజెపిని చూసి భయపడిన వారంతూ ఇప్పుడు దాన్ని కూడా జనం ఓడించగలరని రుజువు కావటంతో అనేక మందిలో ఉత్సాహం కట్టలు తెంచుకున్నది. దానికి ప్రతిస్పందనే కంగనా రనౌత్‌కు చెంపదెబ్బ. ప్రజా ఉద్యమాలను కించపరుస్తూ అధికారగర్వంతో విర్రవీగిన వారందరికీ ఈ ఉదంతం ఒక హెచ్చరిక కావాలి. అయితే ప్రజా ఉద్యమాలను అణచేందుకు చూసిన వారికి, తూలనాడిన వారికి చేయాల్సింది చెంపదెబ్బల శాస్తి కాదు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడకుండా తమ చేతులతో ఎన్నికల యంత్రాల మీట నొక్కి అలాంటి పార్టీలు, శక్తులకు రాజకీయంగా పీకనొక్కాలి.
