Tags
BJP, China, Donald trump, Donald Trump Tariffs, Narendra Modi Failures, Tariff War, Trade agreement with US, Xi Jinping
ఎం కోటేశ్వరరావు
నాటకీయ పరిణామాలు జరగకపోతే అమెరికాతో వాణిజ్య ఒప్పందాల కోసం వెంపర్లాడిన నరేంద్రమోడీ బృందానికి ప్రస్తుతానికి డోనాల్డ్ ట్రంప్ తగిన పాఠమే చెప్పాడు. మనదేశం నుంచి తాము దిగుమతి చేసుకొనే వస్తువులపై 25శాతం పన్నులు, రష్యా నుంచి మనం ముడిచమురు, ఆయుధాలు, ఇతర వస్తువులను దిగుమతి చేసుకొంటున్న కారణంగా అదనంగా జరిమానా విధిస్తున్నట్లు బుధవారం నాడు ప్రకటించాడు. మనసార్వభౌమత్వాన్నే కించపరిచాడు. పుండు మీద కారం చల్లినట్లుగా పాకిస్తాన్‌తో ఒప్పందం కుదుర్చుకొని అక్కడ నిల్వచేసే చమురును భారత్‌కు అమ్మిస్తానని కూడా చెప్పాడు. ఇది మరీ అవమానం. రష్యా, భారత్ రెండూ మృత ఆర్థిక వ్యవస్థలు, కలసి ఏం చేస్తాయో చేసుకోండి అంటూ ఎద్దేవా చేశాడు.ట్రంప్ ప్రకటించిన మేరకు ఆగస్టు ఒకటి నుంచి మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న వివిధ సరకులపై కనిష్టంగా 25 గరిష్టంగా 193శాతం పన్నులు విధిస్తారు. వీటికి జరిమానా అదనం. ఇవి ఇలానే ఉండేట్లయితే ఏ రంగం ఎలా ప్రభావితం అవుతుందో ఆచరణలో తెలుస్తుంది.ఔషధాలు, సెల్‌ఫోన్లు వంటి వాటిని ప్రస్తుతానికి మినహాయించారు. అవి పేకాటలో తురుపు ముక్కల వంటివి, మనదేశాన్ని బ్లాక్‌మెయిల్ చేసే ఎత్తుగడలో భాగం తప్ప మరొకటి కాదు. జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వం ఒక సాదాసీదా ప్రకటన విడుదల చేసింది. మహా వ్యూహవేత్త అంటున్నారు గనుక మామూలుగానే ప్రధాని నరేంద్రమోడీ, ఇతర మంత్రులు నోరు విప్పలేదు, సమాచార శాఖ(పిఐబి) ద్వారా మొక్కుబడిగా ఒక ప్రకటన విడుదల చేశారు.పరిస్థితిని అన్ని విధాలుగా మదింపు చేయనున్నట్లు పేర్కొన్నారు.
అమెరికా చర్యలకు ప్రతిగా చైనా మాదిరి మన ప్రభుత్వం కూడా ప్రతి సుంకాలు విధిస్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. అమెరికాతో ఇప్పుడున్న 130 బిలియన్ డాలర్ల లావాదేవీలను మరో ఐదు సంవత్సరాల్లో 500 బిలియన్ డాలర్ల స్థాయికి పెంచుతామని రంగుల కలను జనం ముందించిన నేతలు ఇప్పుడేం చేస్తారో చూడాల్సి ఉంది. ఈ నెల 25వరకు భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగుతాయని, తమ ప్రతినిధి వర్గం ఢల్లీి సందర్శించనున్నదని అమెరికా అధికారులు చెప్పినదాన్ని బట్టి ఇప్పటికీ మన మీద వత్తిడి తెచ్చే యత్నాలను ట్రంప్ మానుకోలేదని, సుంకాల ప్రకటన బెదిరింపుల్లో భాగమే అని చెప్పవచ్చు. మోడీ లొంగుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తయితే అసలు అగ్ని పరీక్ష ముందుంది. ఫిబ్రవరి నుంచి జరుగుతున్న చర్చల గురించి రకరకాల లీకుల కథనాలు, ట్రంప్ ప్రకటనల నేపధ్యంలో ఎలక్ట్రానిక్ రంగంలో పెద్ద మొత్తంలో చైనా పెట్టుబడులను ఆకర్షించేందుకు మనదేశం సానుకూల సంకేతాలను పంపిందంటూ తాజాగా ఒక వార్త. ఇలాంటి పరోక్ష సందేశాలతో చైనాను చూపి అమెరికా నుంచి రాయితీలు రాబట్టుకొనే ఎత్తుగడగా కూడా దీన్ని చెప్పవచ్చు. గతంలో అమెరికాను చూపి సోవియట్, దాన్ని చూపి వాషింగ్టన్‌తో బేరసారాలాడిన మన పాలకవర్గం ఇలాంటి వాటిలో ఆరితేరింది. ఇప్పటి వరకు ఈ ఎత్తుగడ ఫలించినట్లు లేదు. నిజంగానే మనదేశం చైనా ఎలక్ట్రానిక్ కంపెనీలు, వాటి పెట్టుబడులను అనుమతిస్తే అమెరికా మరింత శత్రుపూరితంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. జిగినీ దోస్తుతో సంబంధాలను నరేంద్రమోడీ అంత తేలికగా వదులు కుంటారా అన్నది చూడాల్సి ఉంది.
మన జిడిపి పదిలక్షల కోట్ల డాలర్లకు చేరాలంటే చైనాతో సయోధ్య తప్పనిసరని కొందరి సూచన, డ్రాగన్‌తో పెట్టుకుంటే మృత్యుఘంటికలే అని కొందరి హెచ్చరిక. ఏది సత్యం ! ఏదసత్యం ఓ మహాత్మా, ఓ మహర్షీ !! గాల్వన్ లోయ ఘర్షణ సందర్భంగా ఇంక చైనాతో మాటల్లేవ్, మాట్లాడుకోవటం లేదు, పోరేశరణ్యం అంటూ ఊగిపోయిన దృశ్యాలు మన కళ్ల ముందే ఉన్నాయి.చైనా కమ్యూనిస్టు పార్టీతో ఒప్పందం, రాయబారి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు రాహుల్ గాంధీని ఎద్దేవా చేసిన వారు తమ కింది నలుపు చూసుకుంటున్నలేదు. రాహుల్ ఒప్పందానికి ముందే 2001లోనే జాన కృష్ణమూర్తి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బిజెపి చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు పెట్టుకుంది. గాల్వన్ ఉదంతాలు జరిగి ఐదేండ్లు గడచిన తరువాత చూస్తే మూసిన తలుపులను మనమే తెరుస్తున్నాం. చైనా తలపులతో మునిగిపోతున్నాం. ఆశ్చర్యంగా ఉంది కదూ ! అప్పుడెందుకు మూశారు, ఇప్పుడెందుకు తెరిచారు, ఇన్నేండ్లు ఎందుకు ఆలశ్యం చేశారు అని ఎవరైనా అడిగారో దేశద్రోహ ముద్రవేస్తారు జాగ్రత్త. బిజెపి నందంటే నంది పందంటే పంది అంతే ! త్వరలో షాంఘై సహకార సంస్థ సమావేశాలకు గాను ప్రధాని నరేంద్రమోడీ బీజింగ్ సందర్శనకు వెళతారని అంటున్నారు.అన్నీ సక్రమంగా ఉంటే షీ జింపింగ్ కూడా ఢల్లీి రావచ్చు. ఏదీ అసాధ్యం కాదు, షీ జింపింగ్ రమ్మనాలే గానీ వెళ్లటానికి అన్నీ సర్దుకొని ఉన్నా అన్నట్లుగా ట్రంప్ ఉన్నాడు.ఎవరి ఎత్తుగడలు వారివి, ఎవరి ప్రయోజనాలు వారికి ముఖ్యం.
త్వరలో చైనాను అధిగమించేందుకు ముందుకు పోతున్నామని కొందరు చెబుతుంటారు. ఆ చైనీయులేమో అమెరికాను దాటేస్తాం చూడండి అన్నట్లుగా సందడి లేకుండా తమపని తాము చేసుకుపోతున్నారు.మన సంకల్పం మంచిదే, ఆరోగ్యకరమైన పోటీ ప్రతిదేశంతోనూ ఉండాల్సిందే. మధ్యలో చైనా ఎందుకు ఏకంగా అమెరికాతోనే పోటీ పడాలి.ఆశ, ఆకాంక్షల్లో కూడా పిసిరానితనం అవసరమా ! అయితే పేచీ ఎక్కడ అంటే ఎవరికి వారు మేమే ముందుండాలి, అగ్రస్థానం మాకే దక్కాలి అనుకుంటే ఫలితం, పర్యవసానాలు ప్రతికూలంగానే ఉంటాయి.ఎవరి సంగతివారే చూసుకోవాలి అనుకున్నపుడు మన అభివృద్ధిని మరొకరు ఓర్వలేకుండా ఉన్నారని ఏడిస్తే ప్రయోజనం లేదు.1970 దశకం వరకు కమ్యూనిస్టు చైనాకు ఐరాసలో, 2001వరకు ప్రపంచ వాణిజ్యసంస్థలో సభ్యత్వమే లేదు.అడ్డుకున్నది ఎవరంటే అమెరికా, దాని కనుసన్నలలో నడిచే దేశాలే అన్నది తెలిసిందే. చిత్రం ఏమిటంటే అదే అమెరికా తరువాత కాలంలో తన కంపెనీల పెట్టుబడులను చైనాలో అనుమతించింది, తన అవసరం కోసం పరిమితంగా, ఫరవాలేదు పాతబడిరదే కదా అనుకున్న సాంకేతిక పరిజ్ఞాన బదిలీని అనుమతించింది. లాటిన్ అమెరికా దేశాల మాదిరి వస్తు ఎగుమతి ఆధారిత దేశంగా ఉంటూ తనకు లాభాలను అందిస్తుంది అనుకున్న ఆశలను చైనా వమ్ము చేసింది. లాటిన్ అమెరికా దేశాలు పెట్టుబడిదారీ, చైనా కమ్యూనిస్టుల నాయకత్వంలో ఉందనే వాస్తవాన్ని పశ్చిమదేశాల వారు అర్ధం చేసుకోలేకపోయారు. చేయి అందిస్తే ఏకంగా అల్లుకు పోతుందని అమెరికా కార్పొరేట్ మేథావులు నాలుగుదశాబ్దాల క్రితం గుర్తించలేకపోయారు. చైనా నేడు అనేక రంగాలలో సవాలు చేస్తున్నది. అడ్డుకొనేందుకు అడుగడుగునా అమెరికా కూటమి చూస్తున్నది.ఆధునిక చిప్స్ అందుబాటులో లేకుండా చేయాలని ఆంక్షలు పెట్టిన సంగతి తెలిసిందే.తన కోడి కూయకపోతే చైనాలో తెల్లవారదని అది భావిస్తున్నది.
ఇలాంటి ఆటంకాలు మనకు లేవు. నిజంగానే ‘‘ కమ్యూనిస్టు నియంతృత్వ’’ చైనా మనకు అడ్డుపడుతున్నది అనుకుంటే మనవారు కీర్తించే ‘‘ ప్రజాస్వామ్య ’’ అమెరికా, ఇతర పశ్చిమదేశాలు మిత్రులు, భాగస్వాములే, అయినా సాయం చేసేందుకు ఎందుకు ముందుకు రావటం లేదు. బీజింగ్‌కు పోటీగా మనలను ఎందుకు నిలపటం లేదు ? మనదేశంలోని కొందరు మేథావులు చైనా మాత్రమే మనలను అడ్డుకుంటున్నదని తమ దాడిని ఎందుకు ఎక్కుపెడుతున్నట్లు ? జనం ఆలోచించాలి ! అమెరికాతో మనదేశ వాణిజ్య ఒప్పంద గడువు జూలై తొమ్మిది, ఆగస్టు ఒకటి రెండూ మురిగిపోయాయి. చైనాతో వాణిజ్యం మీద లేని ఒప్పందం అమెరికాతో ఎందుకు అన్నది సామాన్యులకు అర్ధం కావటం లేదు. చైనాతో1954లో కుదిరిన ఒక సాధారణ ఒప్పందం మాత్రమే అమల్లో ఉంది.పరిస్థితులకు అనుగుణ్యంగా దాన్ని నవీకరించటం లేదా నూతన ఒప్పందాన్ని కుదుర్చుకోవటానికి ఎలాంటి చొరవా రెండువైపుల నుంచి లేదు. కానీ భారీ మొత్తంలో వాణిజ్య లావాదేవీలు జరుగుతున్నాయి.
అసలు వాణిజ్య ఒప్పందాలు ఎందుకు ? వివాదాలు లేకుండా ఒక పద్దతిగా నడుద్దామని రెండవ ప్రపంచ యుద్ధం తరువాత 23దేశాల మధ్య (భారత్, చైనాలతో సహా) వాణిజ్యం, పన్నులపై సాధారణ ఒప్పందం( జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్‌గాట్) 1947లో కుదిరింది, దీన్నే జెనీవా ఒప్పందం అని కూడా అంటారు.తరువాత అది 1995 జనవరి ఒకటి నుంచి ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ)గా మారింది. గాట్ దేశాల్లో చైనా ఉన్నప్పటికీ అది కమ్యూనిస్టుల ఏలుబడిలోకి వచ్చిన తరువాత తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్ పేరుతో ఉన్న చైనానే గుర్తించారు తప్ప మిగతా దేశాల మాదిరి సభ్యత్వం ఇవ్వలేదు. అనివార్యమైన స్థితిలో 2001లో చైనాను చేర్చుకున్నారు. ప్రపంచీకరణను ముందుకు తెచ్చిన దేశాలే నేడు దానికి భిన్నంగా డబ్ల్యుటివోను పక్కన పెట్టి విడివిడిగా ఒప్పందాలు చేసుకోవటం తెలిసిందే.
మన ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉన్న దేశాలలో అమెరికా, చైనా ఒకటి రెండు స్థానాలలో ఉంటున్నాయి. ప్రతిదేశం తన దగ్గర మిగులుగా ఉన్న సరకులను అమ్ముకొనేందుకు గతంలో ఏకంగా బలహీన దేశాలను ఆక్రమించుకోవటం, అందుకోసం యుద్ధాలకు దిగటం తెలిసిందే. ఆ రోజులు గతించాయి గనుక వాటి స్థానంలో మార్కెట్ల ఆక్రమణకు ఒప్పందాలు వచ్చాయి. పన్నులు ఎలా వేయాలో, ఎగుమతి, దిగుమతులు ఎలా జరగాలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఒక విధానాన్ని రూపొందించింది. అది ఉండగా విడివిడిగా ఒప్పందాల కోసం ప్రయత్నించటం చూస్తున్నాం. ఐక్యరాజ్య సమితి(ఐరాస) మాదిరి డబ్ల్యుటిఓ కూడా విఫలమైందా ? అలాగే కనిపిస్తున్నది, దాని నిబంధనలను పక్కన పెట్టి కొన్ని దేశాలు కొన్ని వస్తువుల మీద ఎక్కువ పన్నులు విధిస్తున్నాయి. ప్రతి చర్యలతో వివాదాలు. వాటిని పరిష్కరించే ట్రిబ్యునల్‌కు న్యాయమూర్తుల నియామకం జరగకుండా అమెరికా అడ్డుకుంటున్నది, పోటీ పడలేక వాణిజ్య దందాకు దిగి చైనా మీద కత్తి గట్టింది. దాని వైఖరిని మిగతా దేశాలు అప్పుడే ప్రతిఘటించి ఉంటే ఇప్పుడు అన్నిదేశాల మీద దాడికి దిగేది కాదు.నష్టపోయేది చైనాయే గదా అని భావించిన దేశాలకు ఇప్పుడు తెలిసి వస్తోంది.
వాణిజ్య మిగులు ఉన్న దేశాలతో లోటు ఉన్నవి సమానం చేసేందుకు చూస్తాయి. మనదేశ లావాదేవీలను చూసినపుడు 151దేశాలతో వాణిజ్య మిగులుతో ఉన్నాం, 75దేశాలతో లోటులో ఉన్నాం. మన ఎగుమతుల గురించి ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ మొత్తం మీద ఏటేటా లోటు పెరగటం తప్ప తగ్గటం లేదు. పదేండ్ల మన్మోహన్ సింగ్ ఏలుబడిలో మనదేశ మొత్తం వాణిజ్య లోటు (వికీపీడియా సమాచారం) 942.23 బిలియన్ డాలర్లు. ఇదే 2014 నుంచి 2024వరకు నరేంద్రమోడీ పాలనలో 1,506.22 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ కాలంలో మన ఎగుమతులు 201314లో 466.22 బిలియన్ డాలర్లు కాగా 20232024లో 778.21 బి.డాలర్లకు పెరిగాయి. మేకిన్, మేడిన్ ఇండియా పథకాలు జయప్రదమై ఉంటే మనకీ దుస్థితి ఉండేది కాదు. పదేండ్లలో మోడీ సర్కార్ నిర్వాకం కారణంగా మన విలువైన విదేశీమారకద్రవ్యం 614 బిలియన్ డాలర్లను చైనాకు పువ్వుల్లో పెట్టి ఇచ్చాం.అయినప్పటికీ మనం దిగుమతులు నిలిపివేసి డ్రాగన్‌కు చుక్కలు చూపించాలని కాషాయ దళాలు నిత్యం చెబుతూనే ఉంటాయి. నిజమే కామోసని గుడ్డిగా నమ్మేవారు ఉన్నారు. ఇంత తేడా ఉన్నప్పటికీ ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం పడుతున్న ఆరాటం చైనాతో జరగటం లేదన్నది తెలిసిందే. ఇదే సమయంలో అమెరికాతో ఉన్న వాణిజ్య మిగులును తగ్గించి తమ వస్తువులను మనమీద రుద్దేందుకు పూనుకున్న ట్రంప్‌తో మాత్రం ఒప్పందం కోసం ఇప్పటికీ అర్రులు చాస్తున్నది.
ప్రపంచ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో 60శాతం చైనాలోనే జరుగుతోంది. మనదేశంలో కూడా ఉత్పత్తిని పెంచాలంటే చైనా పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం అవసరం అని ఈ పూర్వరంగంలో చైనాను విస్మరించలేమని మన విధాన నిర్ణేతలకు అవగతమైనట్లు కనిపిస్తోంది.జిడిపిలో పదిలక్షల కోట్ల మైలురాయిని దాటాలంటే చైనాతో ఎంతో అవసరం ఉందని అబ్జర్వర్ రీసర్చ్ ఫౌండేషన్(ఓఆర్‌ఎఫ్) అధ్యక్షుడు సమీర్ శరణ్ అభిప్రాయపడ్డారు. చాలా సంవత్సరాల తరువాత చైనాతో ఆర్థిక సంబంధాల పునరుద్దరణకు ఎంతో అవకాశం ఉందని, అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలనే చెప్పారు. చైనా తనసరకులను అమ్ముకొనేందుకు మనదేశాన్ని పెద్ద మార్కెట్‌గా చూస్తోందని, అందునా శత్రుదేశంగా ఉందంటూ కొందరు వ్యతిరేకిస్తున్నారు. చైనా పర్యాటకులకు వీసాలు ఇవ్వాలని మనదేశం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. భద్రతాపరమైన తనిఖీలతో నిమిత్తం లేకుండా చైనా కంపెనీలను 24శాతం వాటాలతో భారత కంపెనీల్లో పెట్టుబడులను అనుమతించవచ్చని నీతి ఆయోగ్ ఇటీవల ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం, అధికార బిజెపిలో ఒక వర్గం చైనా పెట్టుబడులను వ్యతిరేకిస్తుండగా మరొకటి సానుకూలంగా ఉంది. నీతి ఆయోగ్ చెప్పటం అంటే మన బడాకొర్పొరేట్ల ప్రయోజనాలు, వాటి పరిరక్షణకు మోడీ మనసెరిగి నివేదించటం తప్ప మరొకటి కాదు. నిజంగా అదే జరిగితే ముందే చెప్పుకున్నట్లు డోనాల్డ్ ట్రంప్ మరింత రెచ్చిపోతాడు, వియోగమే అనివార్యమైతే మన నరేంద్రమోడీ, కాషాయ దళాలు తట్టుకుంటాయా ! దేశ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతుందా ? గతంలో అంటే సోవియట్ యూనియన్‌తో ఉన్న మిత్ర సంబంధాలు వేరు, ఇప్పుడు చైనాతో అవసరమైతప్ప సంబంధాల్లో మిత్రత్వం ఎంత అన్నది అనుమానమే, అటువంటి చైనా కోసం అమెరికాను దూరంగా పెడతారా, ఏమో భారత పాలకవర్గం తనకు ఏది లాభం అనుకుంటే దానికే పెద్ద పీటవేస్తుందని సోవియట్ నాటి చరిత్ర చెబుతోంది ! పిల్లి నల్లదా తెల్లదా అని కాదు అది ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం అన్నట్లుగా కమ్యూనిస్టు చైనా లేదా పెట్టుబడిదారీ అమెరికా అన్నది ముఖ్యం కాదు, తమకు లాభాలు దేనితో ఉంటాయన్నదే మన కార్పొరేట్లకు గీటురాయి !
