ఎం కోటేశ్వరరావు
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఎప్పుడేం మాట్లాడతాడో, ఏం చేస్తాడో తెలియదు. ఈనెల 20వ తేదీ ప్రమాణ స్వీకార ఉత్సవానికి ప్రత్యర్థిగా ప్రకటించిన చైనా అధినేత షీ జింపింగ్‌ను ఆహ్వానించి తన జిగినీదోస్తు, అమెరికా సహ భాగస్వామిగా వ్యవహరిస్తున్న మన ప్రధాని నరేంద్రమోడీని విస్మరించటం రెండూ సంచలనాత్మకమే. ఆ ఉత్సవానికి మన విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరవుతారని విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్‌ద్వారా ఆదివారం నాడు వెల్లడిరచారు.అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు వాన్స్ ప్రమాణ స్వీకార ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ఈ పర్యటన ఉన్నట్లు జైస్వాల్ పేర్కొన్నారు. దీనికి కొద్ది రోజుల ముందు మన విదేశాంగ శాఖ ప్రతినిధి నరేంద్రమోడీకి ఆహ్వానం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ముక్తసరిగా సమాధానమిచ్చారు. ‘‘ ఇటీవల మన విదేశాంగశాఖ మంత్రి మరియు విదేశాంగశాఖ కార్యదర్శి అమెరికాను సందర్శించిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. దాని వివరాలను ఇప్పటికే మీడియా ద్వారా మీతో పంచుకున్నాము.రానున్న రోజుల్లో ఈ సంబంధాన్ని మరింత పటిష్టంగా, మరింత సన్నిహితంగా తీసుకుపోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. మీరు అడిగిన నిర్దిష్ట ప్రశ్నకు ఏవైనా పరిణామాలు ఉంటే తప్పనిసరిగా మీకు తెలియచేస్తాము ’’ అని పేర్కొన్నారు. నరేంద్రమోడీని విస్మరించటం గురించి గోడీ మీడియా కావాలనే విస్మరించింది. ఎందుకంటే విశ్వగురువుగా ఆకాశానికి ఎత్తిన వారు ఇప్పుడు మాట్లాడలేని స్థితిలో పడిపోయారు. కొడదామంటే కడుపుతో ఉంది తిడదామంటే అక్క కూతురు అన్నట్లుగా ఉంది.మోడీకి ఆహ్వానం పలికితే దానికి ప్రతిగా పెద్ద సంఖ్యలో ఎఫ్35 ఫైటర్ జెట్ విమానాలను కొనుగోలు చేస్తామని జై శంకర్ చెప్పవచ్చని కూడా పుకార్లు వచ్చాయి. ఏమైనా మోడీకి ఆహ్వానం రాలేదు.
అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 1874 సంవత్సరం నుంచి ఇతర దేశాల అధినేతలను ఎవరినీ ఆహ్వానించే సాంప్రదాయం లేదు. అక్కడ పని చేస్తున్న దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు మాత్రమే హాజరవుతారు. కానీ ఈ సారి డోనాల్డ్ ట్రంప్ దాన్ని పక్కన పెట్టి కొన్ని దేశాల వారికి ఆహ్వానాలు పంపాడు. ఆ జాబితాలో మన ప్రధాని నరేంద్రమోడీ పేరు లేదు. వెళ్లేందుకు అన్నీ సర్దుకొని విమానం ఎక్కేందుకు తయారైన మోడీకి పిలుపు లేకపోతే పోయింది, వచ్చేందుకు ఇచ్చగించని చైనా అధినేత షీ జింపింగ్‌ను ఆహ్వానించటాన్ని మోడీ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. కావాలంటే ఒక ప్రతినిధి వర్గాన్ని పంపుతాను తప్ప తాను వచ్చేది లేదని చెప్పినట్లు వార్తలు. షీ జింపింగ్‌కు నటించటం రాదని, ముక్కుసూటిగా వ్యవహరిస్తారని, దానికి అనుగుణంగానే స్పందించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా అమెరికాకు సహజభాగస్వామిగా చెప్పుకోవటమే కాదు, ట్రంప్‌కు ఎంతో సన్నిహితంగా ఉంటారని, దానికి నిదర్శనంగా గతంలో అసాధారణ రీతిలో మన గత ప్రధానులే కాదు, ఏ దేశాధినేతా చేయని విధంగా ట్రంప్ రెండవ సారి పోటీ చేసినపుడు అప్‌కి బార్ ట్రంప్ సర్కార్ అని అమెరికా వెళ్లి మరీ భారతీయ సంతతి వారి సభలో నరేంద్రమోడీ ప్రచారం చేసి వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి బంధం ఉన్నప్పటికీ ఆహ్వానం ఎందుకు రాలేదన్నది చర్చగా మారింది. నరేంద్రమోడీకి ఆహ్వానం పంపాలని కోరేందుకు విదేశాంగ మంత్రి జై శంకర్‌ను అమెరికా పంపారని బిజెపి నేత సుబ్రమణ్యస్వామి చేసిన ప్రకటనపై అవునని గానీ కాదని గానీ ప్రభుత్వం లేదా బిజెపి ఇంతవరకు ప్రకటించలేదు. అసలేం జరుగుతోంది, ట్రంప్ మోడీని పట్టించుకోవటం మానేశారా లేక మరింతగా వత్తిడి తెచ్చి లొంగదీసుకొనే ఎత్తుగడలో భాగమా !
డోనాల్డ్ ట్రంప్ రూటే సపరేటు. తన పదవీ స్వీకారోత్సవానికి ఎంత మందిని ఆహ్వానించాడో, ఎవరు వస్తారో ఇది రాసిన జనవరి 12వ తేదీ నాటికి స్పష్టత రాలేదు. అమెరికా మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం అనేక మంది నేతలు రానున్నారు.ఆ మేరకు సమచారాన్ని లీకుల రూపంలో వదిలారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తనకు ఆహ్వానం అందినట్లు ధృవీకరించారు.జనవరి ఐదవ తేదీన అమెరికా వచ్చి ఫ్లోరిడాలోని ట్రంప్ విడిది మార్ ఏ లాగోలో భేటీ అయ్యారు. ప్రమాణ స్వీకారానికి వచ్చేందుకు ప్రయత్నిస్తానని ఆమె చెప్పారు. హంగరీ ప్రధాని విక్టర్ ఓర్బాన్‌కు ట్రంప్ తొలి ఆహ్వానం పంపినట్లు, అతగాడు ఇంకా అంగీకరించలేదని వార్తలు వచ్చాయి. ఎన్నికల ఫలితం వెలువడగానే తొలుత ట్రంప్‌కు అభినందనలు తెలిపిన ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నాయిబ్ బుకీలే ఆహ్వానితులలో ఒకరు. గతేడాది అతగాడి ప్రమాణ స్వీకారానికి ట్రంప్ కుమారుడు హాజరయ్యాడు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ కూడా రానున్నాడు. ఇంత చిన్న దేశాలకు ఆహ్వానం పలికి భారత ప్రధానిని ఎందుకు విస్మరించినట్లు ? ప్రధమంగా ట్రంప్‌కు అభినందనలు తెలిపిన తొలి ముగ్గురిలో మోడీ ఒకరని మన విదేశాంగ మంత్రి జై శంకర్ చెప్పిన అంశాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి.‘‘ మనం నిజాయితీగా చెప్పుకోవాలి, ఈ రోజు అమెరికా అంటే ప్రపంచంలో అనేక దేశాలు పిరికిబారి ఉన్నాయి, వాటిలో ఒకటిగా మనదేశం లేదు ’’ అని కూడా చెప్పారు. ట్రంప్ అధికార స్వీకరణ ఉత్సవానికి హాజరయ్యేందుకు ఆహ్వానాల కోసం విదేశీ నేతలు వేలం వెర్రిగా ప్రయత్నించారంటూ న్యూయార్క్ పోస్టు పత్రిక రాసింది. అనేక మందికి అలాంటి అవకాశం లేదని ఆహ్వానాల కోసం పైరవీలు చేసే ఒక ఏజంట్ చెప్పినట్లు పేర్కొన్నది. ‘‘ మీకు ఆహ్వానం అందే అవకాశం లేదని నా ఖాతాదారులకు వాస్తవం చెప్పాను. మీరు కోస్టారికా నుంచి వచ్చారనుకోండి, మీ వలన చేకూరే లబ్ది ఏమిటి ? మీరు మీ దేశం నుంచి వాణిజ్యం లేదా ప్రధాన కంపెనీలను తీసుకురాలేరు’’ అని చెప్పాడు.ట్రంప్ అంటే వాణిజ్యం, లాభం, ప్రతిదాన్నీ ఆ కోణం నుంచే చూస్తాడు. వాషింగ్టన్ వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించటమేగాక బహిరంగంగా వాంఛను వెల్లడిరచిన నేత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెనెస్కీ. అయినా ఆహ్వానం అందలేదు.అయితే అతను రావాలనుకొని వస్తే మాట్లాడి పంపిస్తా అని ట్రంప్ అమర్యాదకరంగా మాట్లాడాడు. అనేక మంది ఆహ్వానాలు పొందేందుకు వివిధ మార్గాల ద్వారా ట్రంప్ యంత్రాంగం దగ్గరకు వస్తున్నారని ఈ విషయాల గురించి తెలిసిన ట్రంప్ అంతరంగికుడు చెప్పినట్లు ఆ పత్రిక రాసింది.
ట్రంప్ పంపిన ఆహ్వానాన్ని షీ జింపింగ్ తిరస్కరించినట్లు ఫైనాన్సియల్ టైమ్స్ పత్రిక వెల్లడిరచింది. షీ బదులు ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ లేదా విదేశాంగ మంత్రి వాంగ్ ఇ గానీ హాజరుకావచ్చని,ట్రంప్ బృందంతో చర్చలు కూడా జరుపుతారని పేర్కొన్నది.అయితే వారిబదులు కీలకనేత చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాయ్ కీ హాజరుకావాలని ట్రంప్ సలహాదారులు వాంఛించినట్లు కూడా ఆ పత్రిక రాసింది.ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్రమోడీకి ఎంతో సన్నిహిత సంబంధాలున్నప్పటికీ ఆహ్వానం పంపకుండా చైనా నేత షీ జింపింగ్ రాకపోయినా అక్కడి ఇతర ప్రముఖులు రావాలని కోరుకోవటం అమెరికా ప్రాధాన్యతల్లో వచ్చిన మార్పుకు సూచిక అని కొందరి అభిప్రాయం. ఎక్స్ సామాజిక మాధ్యమం అధిపతి ఎలన్‌మస్క్ ట్రంప్ సలహాదారుగా నియామకం అయిన సంగతి తెలిసిందే.ఫేస్‌బుక్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో సొమ్ము తీసుకొని అనుకూల, వ్యతిరేక ప్రచారాలను ప్రోత్సహించటం లేదా నియంత్రించటం బహిరంగ రహస్యం. ఈ పూర్వరంగంలో ఎక్స్‌లో హెచ్ 1 బి వీసాలు, ఇతర అంశాల గురించి భారత వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున సాగింది, దాన్ని అనుమతించటం అంటే కావాలని చేయటం తప్ప మరొకటి కాదు. వాషింగ్టన్ కేంద్రంగా పని చేస్తున్న విద్వేష ప్రచార అధ్యయన సంస్థ సిఎస్‌ఓహెచ్ చేసిన విశ్లేషణ ప్రకారం డిసెంబరు 22 నుంచి జనవరి మూడవ తేదీ వరకు ఎక్స్‌లో 128 పోస్టులను 13.854 కోట్ల మంది చూశారు.36 పోస్టులనైతే ఒక్కొక్కదానిని పదిలక్షల మందికి పైగా చదివారు.ఈ పోస్టులన్నీ 86ఖాతాల నుంచి వెలువడ్డాయి.ఎక్స్ యాజమాన్యం లాభాల కోసం విద్వేష ప్రసంగాలను ప్రోత్సహించిందని కూడా ఆ విశ్లేషణ వెల్లడిరచింది.
అమెరికా అధ్యక్షుడి నుంచి ఆహ్వానం రావటంతో చైనా పొంగిపోవటం లేదు. సైద్ధాంతికంగా, ఆర్థికంగా తమకు శత్రువు అని అమెరికా అనేక సార్లు ప్రకటించింది. నిత్యం తైవాన్ అంశం మీద కాలుదువ్వుతున్నది. ఇదే ట్రంప్ 2018లో ప్రారంభించిన వాణిజ్య యుద్దం ఇంకా కొనసాగుతున్నది.మరోపదిశాతం పన్నులు విధిస్తానని బెదిరించాడు. అందువలన ఆహ్వానం వెనుక ఉన్న ఎత్తుగడ ఏమిటన్నది చైనా పరిశీలించటం అనివార్యం. అసలు చైనా స్పందన ఎలా ఉంటుందో పరిశీలించేందుకు వేసిన ఎత్తుగడ లేదా దానితో సంబంధాలను తెంచుకోవటం అంత సులభం కాదని భావించటంగానీ కావచ్చని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే అమెరికా మరుగుదొడ్లలో తుడుచుకొనే పేపర్ కూడా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. అలాంటిది చైనాతో ప్రత్యక్ష పోరుకు తెరదీసే అవకాశాలు లేవని చెప్పవచ్చు. చైనాను శత్రువుగా పరిగణించటం అపత్కరం అయితే స్నేహితుడిగా చూడటం ప్రాణాంతకం అని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీకిసింజర్ వర్ణించాడు. అందువలన ట్రంప్‌కు కత్తిమీద సామే.
అమెరికా ఎన్నికలకు ముందు అక్కడ జరిగిన క్వాడ్ సమావేశానికి నరేంద్రమోడీ హాజరయ్యారు. ఆ సందర్భంగా మోడీ తనను కలుస్తారంటూ ట్రంప్ బహిరంగంగా ప్రకటించి భంగపడ్డాడు.మన అధికారులు ఇచ్చిన సలహా లేదా ట్రంప్ గెలిచే అవకాశాలు లేవన్న అంచనాల పూర్వరంగంలో కలిస్తే గతంలో మాదిరి తప్పుడు సంకేతాలు వెళతాయన్న జాగ్రత్త కావచ్చుగానీ వారి భేటీ జరగలేదు.దాన్ని మనసులో పెట్టుకొని కూడా మోడీకి ఒక పాఠం చెప్పాలని భావించి ఉండవచ్చు. ట్రంప్ కక్షపూరితంగా వ్యవహరించే మనిషి. సిక్కు తీవ్రవాదులకు మద్దతు ఇచ్చే వ్యక్తిగా పేరున్న ఇండోఅమెరికన్ లాయర్ హర్‌మీత్ థిల్లాన్ను పౌరహక్కుల సహాయ అటార్నీ జనరల్‌గా ట్రంప్ నియమించాడు. సిఐఏ ఏజంటుగా పేరున్న సిక్కు తీవ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నుకు అమెరికా మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే.అతగాడు మహాకుంభమేళా సందర్భంగా దాడులు చేస్తామని బెదిరించాడు. బంగ్లాదేశ్‌లో తిష్టవేసేందుకు పూనుకున్నది అమెరికా. అక్కడ భారత అనుకూల అవామీలీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు వెనుక అమెరికా హస్తం బహిరంగరహస్యం. ఈ పరిణామం మన దేశానికి తలనొప్పులు తెచ్చేదే అని వేరే చెప్పనవసరం లేదు. చైనాతో శతృత్వాన్ని పెంచుకోవాలని మనదేశంపై అమెరికా తెస్తున్న వత్తిడికి మోడీ పూర్తిగా తలొగ్గటం లేదు. పెద్ద ఎత్తున వస్తువుల దిగుమతి, చైనా పెట్టుబడులకు అనుమతి, సరిహద్దులో పూర్తి స్థాయి సాధారణ సంబంధాల పునరుద్దరణకు ఒప్పందం చేసుకోవటాన్ని అమెరికా ఊహించ, సహించలేకపోయింది. దీనికి తోడు దాని ఆంక్షలను ధిక్కరించి రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయటం తెలిసిందే. అధ్యక్షుడు పుతిన్ను మనదేశ పర్యటనకు నరేంద్రమోడీ ఆహ్వానించారు. అది జనవరిలో ఉండవచ్చనే వార్తలు వచ్చాయి. పుతిన్‌కు ఆహ్వానం పలికిన మోడీని కలవటాన్ని ట్రంప్ సహించడని వేరే చెప్పనవసరం లేదు.అయితే ఉన్న సంబంధాల గురించి అనుమానాలు తలెత్తకుండా ఉండేందుకు విదేశాంగ మంత్రికి ఆహ్వానం పంపారు. వివిధ దేశాల నేతలకు తన పదవీ స్వీకార ఉత్పవ ఆహ్వానం అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకోవటంలో కీలకమని అమెరికా మీడియా సంస్థ సిబిఎస్ వ్యాఖ్యానించింది. అలాంటి ఆహ్వానితుల్లో మోడీ పేరు లేకపోవటం మనదేశానికి మంచిది కాదని కొందరు చెబుతున్నారు. గతంలో ట్రంప్‌తో సఖ్యంగా ఉన్నపుడు మనదేశానికి ఒరిగిందేమిటన్నది ప్రశ్న !
