Tags
BJP, China, edible oil import tax, farm crisis, Farmers, Fuel prices freezing, Narendra Modi Failures
ఎం కోటేశ్వరరావు
ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన సైనికచర్య, ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వ కూల్చివేత వంటి పరిణామాలు ,కుట్రలు సంభవిస్తాయంటూ నరేంద్రమోడీని బలపరిచే శక్తులు కొన్ని సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే వాటి నేపధ్యం వేరే కావచ్చుగానీ జనంపై మోపుతున్న భారాలు అన్ని రంగాలలో వెల్లడౌతున్న వైఫల్యాన్ని చూస్తే మన దేశంలో కూడా శ్రీలంక, బంగ్లాదేశ్‌లో జరిగిన పరిణామాలు పునరావృతం అవుతాయా అని ఆలోచించాల్సి వస్తోంది. దానికి వేరే దేశాలు కుట్రలే చేయనవసరం లేదు. హసీనా స్వయంకృతాన్ని ఆమెను వ్యతిరేకించే అమెరికా, బంగ్లా ప్రతిపక్షాలు ఉపయోగించుకున్నాయి. అయితే చరిత్ర పునరావృతం కావచ్చుగానీ ఒకే విధంగా ఉండదు. ఎవరూ ఊహించలేరు.
తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకు, ఓట్ల కోసం ఎంతకైనా కొన్ని రాజకీయ పార్టీలు తెగిస్తున్న రోజులివి.2024 సెప్టెంబరు 14 నుంచి అమల్లోకి వచ్చేలా మనం దిగుమతి చేసుకుంటున్న ఖాద్య తైలాలపై కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున దిగుమతి సుంకాలను విధించింది.ముడి(శుద్ధి చేయని) పామ్, సోయా,సన్‌ఫ్లవర్ దిగుమతి ధరలపై ఇప్పుడున్న 5.5శాతం పన్ను మొత్తాన్ని 27.5శాతానికి పెంచింది. వీటికి ఇప్పటికే ఉన్న సెస్‌లు అదనంగా పెరుగుతాయి. ఇది సగటు ధర, అదే శుద్ధి చేసిన పొద్దుతిరుగుడు పువ్వు ఆయిల్ దిగుమతి చేసుకుంటే ఇప్పుడున్న 13.75 నుంచి 35.75కు పెరుగుతుంది. ఉదాహరణకు ఒక లీటరు వంద రూపాయలకు దిగుమతి చేసుకుంటే ఇప్పుడు రు.113.75 చెల్లిస్తున్నాము. పెంచిన పన్నుతో అది రు.135.75కు అవుతుంది. ఇది మొత్తంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుందని వేరే చెప్పనవరం లేదు. మనదేశం ఖాద్యతైలాల దిగుమతిలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఏటా వంద కిలోలు దిగుమతి చేసుకుంటే మన వాటా 20కిలోలకు పైగా ఉంది. ఈ కారణంగానే మన ప్రభుత్వం అనుసరించే వైఖరి ఒక విధంగా ప్రపంచ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నది. దిగుమతి సుంకం పెంచగానే చికాగో మార్కెట్‌లో సోయా ధర రెండుశాతం పతనమైంది.లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం వినియోగదారులను ఉద్దరించేందుకు దిగుమతి సుంకాలు తగ్గించినట్లు చెప్పిన మోడీ సర్కార్ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో రైతుల ఓట్ల కోసం అవే సుంకాలను పెంచుతూ నిర్ణయించింది.ఏది చేసినా ఓట్లకోసమే అంటే కొందరు తమ మనోభావాలను గాయపరుచుకోవచ్చుగానీ వాస్తవం.
హర్యానాలో బాస్మతి రకం వరిని సాగు చేస్తారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పతనం అక్కడి రైతుల మీద కూడా పడిరది. బాస్మతి బియ్యాన్ని టన్నుకు 1200 డాలర్లకు తగ్గకుండా ఎగుమతి చేయాలని నిర్ణయించారు. తరువాత దాన్ని 950డాలర్లకు తగ్గించారు. పక్కనే ఉన్న పాకిస్తాన్ అంతకంటే తక్కువ ధరకే ఎగుమతి చేస్తున్నందున మన బియ్యాన్ని కొనేవారు లేకుండా పోవటంతో మార్కెట్‌లో ధరలు పతనమయ్యాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలోని పది స్థానాల్లో బిజెపి ఐదింటిని పోగొట్టుకుంది. రైతులు ఆగ్రహంతో ఉన్నట్లు తేలటంతో ఇప్పుడు కనీస ఎగుమతి ధరల విధానాన్ని ఎత్తివేసింది. పోయిన ఖాతాదారులు తిరిగి వస్తారా, ఇది రైతులకు మేలు చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.అదే విధంగా మహారాష్ట్రలో కూడా బిజెపి చావుదెబ్బతిన్నది, దానికి ఉల్లిరైతుల ఆగ్రహం అని తేలింది.లోక్‌సభ ఎన్నికలకు ముందు వినియోగదారులకు కన్నీరు తెప్పించిన ఉల్లిధరలను తగ్గించేందుకు ఎగుమతులపై ఆంక్షలు, కనీస ఎగుమతి ధర టన్నుకు 550 డాలర్లు ఉండాలని నిర్ణయించింది. ఇప్పుడు వాటిని రద్దు చేసింది. దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. మహారాష్ట్రలో సోయా సాగు కూడా ఎక్కువే. దానికి కేంద్రం నిర్ణయించిన క్వింటాలు కనీస మద్దతు ధర రు.4,892 కంటే మార్కెట్‌లో రు.4,500 నుంచి 600 వరకు మాత్రమే పలుకుతోంది.దీంతో రైతుల్లో తలెత్తిన అసంతృప్తి అసెంబ్లీ ఎన్నికల మీద పడకుండా మోడీ సర్కార్ సోయా మీద దిగుమతి పన్ను పెంచి కొంతమేరకైనా మార్కెట్లో ధరలు పెరుగుతాయనే ఆశతో ఈ చర్య తీసుకుంది.
ఇటు రైతులుఅటు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాలనటంలో మరోమాట లేదు. అందుకు తీసుకొనే చర్యలను సమర్దించవచ్చు. కానీ గత పది సంవత్సరాల్లో ఇలాంటి జిమ్మిక్కులు ఎన్ని చేసినా ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు.మధ్యలో మార్కెటింగ్ రంగంలో ఉన్న వాణిజ్యవేత్తలకే లబ్ది చేకూరింది.మన దేశ అవసరాలలో మూడిరట రెండువంతుల ఖాద్యతైలాలను దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటున్నాం. నూనెగింజలను ఉత్పత్తి చేసే రైతాంగానికి అవసరమైన గిట్టుబాటు ధర ఉండటం లేదు. అనేక దేశాల్లో కూడా ఈ సమస్య ఉన్నప్పటికీ అధికదిగుబడి వంగడాలను రూపొందించి ఉత్పత్తిని గణనీయంగా పెంచారు. అది అటు రైతాంగానికి ఇటు వినియోగదారులకూ మేలు. నరేంద్రమోడీ 2001 నుంచి 2014వరకు గుజరాత్ సిఎంగా ఉన్నపుడు అక్కడ గణనీయంగా సాగుచేసే వేరుశనగ దిగుబడి పెంచేందుకు అవసరమైన వంగడాలను రూపొందించలేదు, పదేండ్లు ప్రధానిగా ఉన్నా చేసిందేమీ లేదు. 2022 గణాకాల(అవర్ వరల్డ్ ఇన్ డాటా వెబ్‌సైట్ ) మేరకు అమెరికాలో హెక్టారుకు వేరుశనగ నాలుగున్నరటన్నుల దిగుబడి ఉండగా, చైనాలో 4.13టన్నులు, అదే మనదేశంలో 1.78 టన్నులు మాత్రమే. మొత్తంగా నూనె గింజల దిగుబడి కూడా ఇదే మాదిరి ఉంది గడచిన పదకొండు సంవత్సరాల సగటు 1.22 టన్నులు మాత్రమే. ఎందుకీ దుస్థితి, దీనికి బాధ్యులెవరు ? జవహర్‌లాల్ నెహ్రూయే కారణం అంటారా ? నూనె గింజల సాగు గిట్టుబాటు కాని కారణంగానే రైతులు అటువైపు మొగ్గు చూపటం లేదు. పదేండ్లలో మన కరెన్సీ రూపాయి విలువ పతనం కారణంగా అధిక మొత్తాలను చెల్లించి దిగుమతి చేసుకోవటంతో వినియోగదారులకు ధరలు మండుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ సమాచారం ప్రకారం 201314లో దేశ అవసరాల్లో 48.1శాతంగా ఉన్న దేశీయ ఉత్పత్తి 202223 నాటికి 42.92శాతానికి పడిపోయినట్లు అంచనా. దీనికి కారకులెవరు ? మెజారిటీ రాష్ట్రాలలో అధికారం మాదే, అభివృద్ధికి రెండిరజన్ల పాలన కావాలని చెబుతున్న బిజెపి ఏం చెబుతుంది? ఎంతకాలమీ పరిస్థితి, ఈ వైఫల్యాన్ని సహించాల్సిందేనా ? 2047నాటికి వికసిత భారత్ అనే కబుర్లతో కడుపు నిండుతుందా ? మన దేశంలో కొంత మంది వైద్యులు, వైద్యుల కంటే తమకే ఎక్కువ తెలుసు అన్నట్లుగా కబుర్లు చెప్పేవారు తయారై వంటల్లో నూనెలను తగ్గించండి వీలైతే పూర్తిగా మానుకోండి అని చెప్పటం తెలిసిందే. ఇటీవల యూట్యూబర్లు ఇలాంటి సలహాలు ఇవ్వటంలో అందరినీ మించిపోయారు. ఆరోగ్యపరంగా సమస్యలున్నవారికి అలాంటి సలహాలు ఇవ్వటాన్ని అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచంలో కొన్ని దేశాల్లో తలసరి వంటనూనెల కిలోల వాడకాన్ని చూద్దాం. జనాభా రీత్యా మొత్తం వాడకంలో మనదేశం చైనా తరువాత రెండవ స్ధానంలో ఉండవచ్చుగానీ తలసరిలో ఎక్కడో ఉన్నాం.
దేశం——–2010-2012–2022-22---2032 ప్రపంచం- --14.36 ---16.00 --16.60 పేదదేశాలు---07.13---06.97---07.79 భారత్----- 09.85---09.87---10.95 ఇండోనేషియా-05.55---10.32---12.24 లాటిన్‌అమెరికా06.95---17.61---18.18 ఐరోపా----- 18.55---24.10---21.73 చైనా------ 20.37---26.02---27.24 అమెరికా----36.63---40.26---36.76
మన దేశంలో కరోనాకు ముందు ఉన్న స్థాయికి వంట నూనెల డిమాండ్ పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.అనేక దేశాలతో పోల్చితే మన వినియోగం తక్కువగా ఉన్నపుడే పరిస్థితి కొనబోతే కొరివి అమ్మబోతే అడవిగా ఉంది. అన్నింటికీ పోల్చుతున్న చైనా స్థాయికి చేరితే దిగుమతి చేసుకొనేందుకు మన దగ్గర అవసరమైన డాలర్లు ఉంటాయా ? మూడు దశాబ్దాల కాలంలో వినియోగంలో పెద్ద మార్పు ఉండదనేది గత,వర్తమాన, భవిష్యత్ అంచనాలు తెలుపుతున్నాయి. ఇండోనేషియా తన అవసరాలను గమనంలో ఉంచుకొని పామ్ ఆయిల్ ఎగుమతులపై గతంలోనే కొన్ని ఆంక్షలు విధించింది. రానున్న సంవత్సరాల్లో దాని వినియోగం పెరగనుందనే అంచనాలు వాస్తవ రూపం దాల్చితే మన దిగుమతులు మరింత భారంగా మారే అవకాశం కనిపిస్తోంది. పోటీతో పాటు మన దిగుమతి అవకాశాలు తగ్గితే సోయా ఆయిల్ ఎగుమతి దేశాలు కూడా ధరలు పెంచే అవకాశాలు లేకపోలేదు. మన మొత్తం దిగుమతుల్లో పామాయిల్ వాటా 60శాతం.
దిగుమతి చేసుకొనే ఖాద్య తైలాల మీద పన్నులు పెంచితే రైతాంగాన్ని ఆదుకోవచ్చని చెప్పటం వంచన తప్ప మరొకటి కాదు. ఇప్పటి వరకు అది వాస్తవ రూపం దాల్చలేదు, సాగు పెద్దగా పెరగలేదు. నిజంగా మేలు చేయాలంటే ఇతర మార్గాలను ఆలోచించాలి. మార్చినెలతో ముగిసిన 2024 ఆర్థిక సంవత్సరంలో రు.2.37లక్షల కోట్ల మేర జిఎస్‌టిని ఎగవేసినట్లు అధికార యంత్రాంగం తేల్చింది.అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే ఇది రెట్టింపు. మొత్తమే కాదు కేసులు కూడా పెరిగాయి.ముంబై, పూనే, గురుగ్రామ్, ఢల్లీి, హైదరాబాద్ కేంద్రాలుగా ఈ ఎగవేతను కనుగొన్నారు. మూడోవంతు రు.71వేల కోట్లు ఒక్క ముంబైలోనే ఉంది. అక్కడ రెండిరజన్ల పాలనే సాగుతోంది.లావాదేవీలేమీ లేకుండానే ఇన్‌పుట్ టాక్సు క్రెడిట్ పేరుతో కొట్టేసిన మొత్తం 20శాతం ఉంది. పన్ను ఎగవేతలను అరికట్టే పేరుతో 2017లో జిఎస్‌టిని తీసుకువచ్చారు.అంతకు ముందు ఎగవేత రు.7,879 కోట్లు కాగా తరువాత ఇంతింతై వటుడిరతై అన్నట్లుగా తాజాగా రు.2.37లక్షల కోట్లకు చేరుకుంది. ప్రతిపక్ష పార్టీల నేతలు, తమను వ్యతిరేకించేవారి మీద సిబిఐ,ఐటి,ఇడి దాడులను సాగిస్తున్న ప్రభుత్వం ఇంత మొత్తం ఎగవేస్తుంటే ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నట్లు ? దీన్ని అరికడితే రైతాంగానికి అదనంగా చెల్లించవచ్చు, ఖాద్య తైలాల మీద దిగుమతి సుంకం విధించకపోతే వినియోగదారులనూ ఆదుకున్నట్లు అవుతుందా లేదా ? ఖాద్య తైలాల సంవత్సరం నవంబరు నుంచి అక్టోబరు వరకు ఉంటుంది.భారత సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ సమాచారం ప్రకారం 201314 నుంచి 202223తో పోల్చితే పదేండ్లలో నూనెల దిగుమతులు 116 లక్షల టన్నుల నుంచి 165లక్షల టన్నులకు పెరిగితే మోడీ ప్రభుత్వ నిర్వాకంతో రూపాయి విలువ తగ్గి, అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల కారణంగా ఖర్చు రు.60,750 కోట్ల నుంచి రు.1,38,424 కోట్లకు పెరిగింది. దీనికి తగ్గట్లుగా వినియోగదారుల రాబడి పెరిగిందా ? పోనీ సాగు విస్తీర్ణం పెరిగిందా అంటే లేదు.201112లో 263లక్షల హెక్టార్లలో సాగు చేయగా 202223లో 301లక్షలకు మాత్రమే చేరింది.మన అవసరాలకు ఇదేమాత్రం చాలదు.
గత రెండు సంవత్సరాలుగా పెట్రోలు, డీజిలు ధరలు పెంచలేదు చూడండి అంటూ బిజెపి నేతలు గొప్పలు చెప్పుకుంటారు. కానీ అసలు సంగతేమిటి ? గతంలో ప్రకటించి అమలు జరిపిన విధానం ప్రకారం గణనీయంగా ధరలను తగ్గించాల్సి ఉండగా పాతవాటినే కొనసాగించి మన జేబులను కొల్లగొడుతున్నారు. 202223 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూసినపుడు మనదేశం దిగుమతి చేసుకున్న ముడిచమురు పీపా ధర 93.15 డాలర్లు కాగా 202324లో అది 82.58కి తగ్గింది. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబరు 15వరకు సగటు ధర81.92 డాలర్లు ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన మేరకు ఎందుకు ధరలు తగ్గించటం లేదంటే అన్నింటికీ జవాబుదారీ అని చెప్పుకుంటున్న నరేంద్రమోడీ ఎన్నడైనా దేశ పౌరులకు తన మన్‌కీ బాత్‌లో చెప్పారా ? ఎందుకు నోరు విప్పటం లేదో ఎవరైనా చెబుతారా ? వంటనూనెల వ్యాపారంలో అదానీ, పెట్రోలియం ఉత్పత్తులలో అంబానీ వంటి కంపెనీలు ఉండగా వాటికి లబ్ది చేకూరేవిధంగా మన ఎగుమతిదిగుమతి విధానాలు ఉన్నాయి తప్ప రైతులు, వినియోగదారులు పట్టలేదు. 1970దశకం ప్రారంభంలో ముంబైలో చిన్నగా ప్రారంభమైన ధరల పెరుగుదల వ్యతిరేక ఆందోళన క్రమంగా గుజరాత్, బీహార్ తదితర ప్రాంతాలకు విస్తరించటం, జయప్రకాష్ నారాయణ్ రంగ ప్రవేశం, ఇందిరాగాంధీ ఎన్నికల కేసులో ఓటమి, అత్యవసరపరిస్థితి విధింపు, ఆ సమయంలోనే జనతా పార్టీ ఏర్పాటు, ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి వంటి పరిణామాలు తెలిసినవే.గతంలో లాటిన్ అమెరికా, ఇటీవల శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి చోట్ల ఏండ్ల తరబడి హృదయ సామ్రాట్టులుగా అభిమానం చూరగొన్న నాయకులనే జనం చివరికి తరిమికొట్టటాన్ని చూశాము. భారాలు పెరిగి జీవనం దుర్భరమైతే ఎక్కడైనా అలాంటి పరిణామాలు జరగవచ్చు. దానికి మనదేశం అతీతమేమీ కాదు. అయితే చరిత్ర ఏ రూపంలో ఎలా పునరావృతం అవుతుందో ఎవరూ ఊహించి చెప్పలేరు. అన్నీ అనూహ్యంగా జరిగినవే.
