Tags
Anil Ambani, BJP, Epstein Files, Hardeep Singh Puri, Jeffrey Epstein, Leftist Zohran Mamdani, Mira Nair
ఎం కోటేశ్వరరావు
ఎప్‌స్టెయిన్ ఫైల్స్ ఈ మాట వినగానే వివాదాస్పద కాశ్మీరీ ఫైల్స్ సినిమా గుర్తుకు వస్తుంది. అమెరికాలో జెఫ్రీ ఎప్‌స్టెయిన్ స్వంత విమానాల్లో తిరిగేంత ధనవంతుడు, ఫైనాన్సర్, ఘరానా పైరవీ, తార్పుడుగాడు. వాడి దగ్గర ఉన్న ఫైల్స్ ఓ బూతుసినిమా అనుకుంటే దానిలో మన దేశానికి చెందిన ప్రముఖులు ప్రధాని నరేంద్రమోడీ నుంచి ప్రభుత్వ ప్రాపకం ఉన్న పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ వరకు కొందరు నటించినట్లు ప్రస్తావనలు ఉన్నాయి.నీలి చిత్రాల్లో నటించటం అంటే ‘ఏ’ దృశ్యాల్లోనే పాల్గొనాల్సిన అవసరం లేదు. అసలేం జరిగింది ? ట్రంప్ సర్కార్ విధిలేక బయటపెట్టిన లక్షలాది ఆ ఫైళ్లలో ప్రముఖ దర్శకురాలు, న్యూయార్క్ నగర వామపక్ష మేయర్ జోహ్రాన్ మమదానీ తల్లి మీరా నాయర్ పేరు కూడా ఉంది. ట్రంప్‌ను సవాల్ చేసి ప్రపంచ పెట్టుబడిదారీ కుంభస్థలంగా భావించే నగరానికి 34ఏండ్ల మమదానీ ఎన్నికయ్యాడు. అవకాశం కోసం చూస్తున్న అమెరికాలో వామపక్ష వ్యతిరేకులు, వారి అడుగుజాడల్లో నడిచే హిందూత్వ శక్తులు రెచ్చిపోయాయి.
కృత్రిమ మేథతో రూపొందించిన చిత్రాల్లో ఒకదానిలో బాలుడిగా ఉన్న జోహ్రాన్ మమ్‌దానీ, మీరానాయర్, బిల్‌క్లింటన్,జెఫ్రీ ఎప్‌స్టెయిన్ ఉన్నారు. ఆ ఫొటోలను ఎక్స్‌లో పెట్టటంతో లక్షలాది మంది చూశారు.ఇద్దరు పెద్ద ఉగ్రవాదులతో ఒక చిన్న ఉగ్రవాది అన్నారు. మమదానీకి శిక్షణ ఇచ్చింది ఎప్‌స్టెయిన్ అన్న అర్ధం వచ్చేలా ఫొటోల కింద వ్యాఖ్య రాశారు. మన దేశంలో హిందూత్వ ప్రచారం చేస్తున్న ఖాతాలలో జైపూర్ డైలాగ్స్ ఒకటి. అలెక్స్ జోన్స్ పోస్టు చేసిన ఫేక్ ఫొటో వీడియోను అది షేర్ చేసింది. మమదానీ అసలు తండ్రి ఎప్‌స్టెయిన్ అని వర్గాలు తెలిపాయి అంటూ వ్యాఖ్య చేశారు. ఇదే విధంగా వాయిస్ ఆఫ్ హిందూస్ పేరుతో ఉన్నవారు కూడా దాన్ని ప్రచారంలో పెట్టారు. నిజమేమిటో తల్లి చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా అనేక మంది వాటిని వైరల్ చేశారు. దీని వెనుక ముస్లిం, వామపక్ష భావజాల వ్యతిరేక ఉన్మాదం స్పష్టంగా కనిపిస్తోంది. మీరా నాయర్ అమెరికాలో చదువుకున్న రోజుల్లో ఆమెకు టీచర్‌గా ఉన్న మిచెల్ ఎపిస్టెయిన్‌తో 1970దశకం చివరిలో వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల తరువాత విడిపోయారు.ఈ ఎపిస్టెయిన్‌కు, తార్పుడు ఎపిస్టెయిన్‌కు కుటుంబం, ఇతరత్రా ఎలాంటి సంబంధాలు లేవు. ఒకరు ఆర్టిస్టు కాగా మరొకడు నేరగాడు. మీరా నాయర్ ఎలాంటి తప్పూ చేయనప్పటికీ ఆ పార్టీలో పాల్గొనటాన్ని అవకాశంగా తీసుకొని మమదానీ వ్యతిరేకులు, వారితో గొంతుకలిపిన హిందూత్వశక్తులు పెద్ద ఎత్తున కృత్రిమ ఫొటోలు సృష్టించి అక్రమ సంబంధాలను అంటగట్టారు.జోహ్రాన్ తండ్రి ఎప్‌స్టెయిన్ అని ప్రచారం చేశారు. ఎన్నికల్లో నిజాలను దాచి తమను మోసం చేశారంటూ మమదానీ అభిమానుల ముసుగులో కొందరు న్యూయార్క్‌లో ప్రదర్శన చేశారు. అయితే నిజనిర్ధారణ చేసిన వారు అవన్నీ తప్పుడు ప్రచారాలని, ఎలాంటి వాస్తవం లేదని తేల్చారు.
ఎప్‌స్టెయిన్ ఫైళ్లలో మాన్‌సూన్ వెడ్డింగ్, నేమ్‌సేక్, సలాంబాంబే వంటి చిత్రాలు నిర్మించినప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ ప్రస్తావన ఉంది. ఆమె న్యూయార్క్‌లో ” సామాజిక సేవకురాలు ” గా ఉన్న ఘిస్‌లేయిన్ మాక్స్‌వెల్ ఇంట్లో జరిగిన ఒక విందులో పాల్గ్గొన్నారు. తన సినిమా అమేలియా తొలి ప్రదర్శన తరువాత 2009లో ఈ ఉదంతం జరిగింది. ప్రచార రంగంలో ఉన్న పెగీ సిగల్ ఆ పార్టీలో పాల్గ్గొన్నవారి గురించి ఎప్‌స్టెయిన్‌కు పంపిన ఈ మెయిల్‌లో ” సినిమా కోసం ఏర్పాటు చేసిన పార్టీ తరువాత ఘిస్‌లెయిన్ టౌన్‌హౌస్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను. బిల్‌క్లింటన్(అమెరికా మాజీ అధ్యక్షుడు),జెఫ్ బెజోస్(అమెజాన్ అధినేత) అక్కడ ఉన్నారు.జీన్ పిగోజీ (పెట్టుబడిదారు), డైరెక్టర్ మీరా నాయర్ తదితరులు కూడా ఉన్నారు ” అని ఉంది. సినిమా పార్టీ గనుక అనేక మంది హాలీవుడ్ ప్రముఖులు కూడా వచ్చారు. న్యూయార్క్‌లో ఇలాంటి పార్టీలు మామూలు. మీరా నాయర్-ఎపిస్టెయిన్ మధ్య నేరుగా సంబంధాలు ఉన్నట్లు ఎక్కడా ప్రస్తావన లేదు. మాక్స్‌వెల్ కార్యకలాపాల గురించి తెలియని అనేక మంది అలాంటి పార్టీలకు సినిమా రంగానికి చెందిన వారు వచ్చేవారు. నిజానికి ఆమె సామాజిక సేవకురాలి ముసుగులో ఎప్‌స్టెయిన్‌తో కలసి తరుణ వయస్సులో ఉన్న బాలికలను ఆకర్షించి ప్రముఖులకు తార్చటంలో ప్రముఖురాలు.ఆ కేసులో 20 ఏండ్ల శిక్షపడి ఇప్పుడు జైల్లో ఉంది. చిత్రం ఏమిటంటే ఆమె తండ్రే ఎప్‌స్టెయిన్‌కు పరిచయం చేశాడు. ఇద్దరూ కలసి తిరగటమేగాక బాలికలను సరఫరా చేశారు.
ఎప్‌స్టెయిన్ ఫైల్స్‌లో పేర్లున్న మన ప్రముఖుల గురించి చూద్దాం.వారికి ఆ తార్పుడు గాడు అమ్మాయిలను సరఫరా చేసినట్లు గానీ, వాడి నేరాలలో భాగస్వామ్యం ఉన్నట్లు గానీ ఇప్పటి వరకు వెలువడిన పత్రాల్లో లేదు.ఇప్పటికి ఆరులక్షల పేజీలు వెల్లడి కాగా ఇంకా బయటకు రావాల్సినవి ఉన్నాయి. ఇక్కడ అసలు సమస్య అలాంటి అవాంఛనీయ వ్యక్తితో విలువలు వలువల గురించి కబుర్లు చెప్పేవారు సంబంధాలు ఎందుకు పెట్టుకున్నారన్నదే బయటకు రావాల్సిన అంశం. తెరవెనుక ఇవన్నీ సాధారణమే అంటారా అదైనా చెప్పండి. మోడీ ఆన్ బోర్డ్ అనే ఇమెయిల్లో ప్రధాని పేరు ప్రస్తావన ఉంది. ఆ తార్పుడుగాడితో 2014-17 సంవత్సరాలలో కేంద్ర మంత్రి హరదీప్ సింగ్ పూరీ ఐదుసార్లు కలిసినట్లు వెల్లడైంది. ఐఎఫ్‌ఎస్ అధికారి అయిన పూరీ 2014 జనవరిలో బిజెపిలో చేరారు. అంతకు ముందు 1974 నుంచి 2013వరకు విదేశాంగశాఖ అధికారిగా వివిధ హౌదాల్లో పని చేశారు.ప్రస్తుతం పెట్రోలియం శాఖ మంత్రిగా పని చేస్తున్నారు.ప్రధాని నరేంద్రమోడీ గురించి జెఫ్రీ ఎప్‌స్టెయిన్ మరియు డోనాల్డ్ ట్రంప్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బనాన్ మధ్య నడిచిన ఇమెయిల్స్‌లో ప్రస్తావన ఉంది.తాను ట్రంప్ అధికార యంత్రాంగం-భారత ప్రధాని కార్యాలయ అధికారులకు మధ్యవర్తిగా ఉన్నట్లు ఎప్‌స్టెయిన్ పేర్కొన్నాడు. 2017 జూలై ఆరున మోడీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన తరువాత కతార్‌కు చెందిన జబోర్ వై అనే వ్యక్తి(కతార్ రాచకుటుంబానికి చెందిన వ్యక్తి అని వార్తలు)కి మెయిలు పంపాడు.దానిలో ” భారత ప్రధాని మోడీ సలహా తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడికి మేలు చేకూర్చేందుకు ఇజ్రాయెల్‌లో నృత్యం చేశారు, పాట పాడారు.వారు కొద్ది వారాల ముందు కలుసుకున్నారు, అది పని చేసింది ” ( ఇక్కడ నృత్యం, పాట అంటే అవసరానికి అనుగుణంగా వ్యవహరించారని అనుకోవాలేమో) మోడీ ఇజ్రాయెల్ పర్యటన ఖ్యాతి తనదే అని కూడా పేర్కొన్నాడు. ఒక భారత ప్రధాని తొలిసారిగా ఇజ్రాయెల్‌ను సందర్శించటమే గాక తరువాత విదేశాంగ విధానంలో నిర్ణయాత్మక మార్పులు చేసిన ఖ్యాతి మోడీకి దక్కిందన్నది స్పష్టం. ఈ ఫైళ్లలో ఉన్న అంశం మీద మన విదేశాంగశాఖ స్పందించింది.ప్రధాని పర్యటన నిజమే గానీ శిక్షపడిన ఒక నేరగాడు పేర్కొన్న అంశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఎప్‌స్టెయిన్ లేదా ఇతర విదేశీ సలహాల ప్రభావంగానీ పర్యటన మీద లేదని వ్యాఖ్యానించింది. ఆ సమయంలో ఎప్‌స్టెయిన్ ట్రంప్ యంత్రాంగంతో సంబంధాలలో ఉన్నాడన్నది, భారత వ్యవహారాల్లో వేలుపెట్టాడన్నది వాస్తవమే అన్నది కొందరి అభిప్రాయం. ఇప్పుడున్న పరిస్థితిలో నిజానిజాలను ఎవరూ బయటపెట్టరన్నది వేరే చెప్పనవసరం లేదు.
నరేంద్రమోడీ నేరుగా కలిసినట్లు ఎప్‌స్టెయిన్ కూడా చెప్పలేదు. అతగాడి హవా నడిచిన సమయంలో కేంద్ర మంత్రి హరదేవ్ సింగ్ పూరీ 2014-17 సంవత్సరాలలో ఐదుసార్లు పూరీ కలిసినట్లు ఎప్‌స్టెయిన్ దినచర్య డైరీలో పూరీ పేరు ఉంది. మూడు సార్లు న్యూయార్క్ నివాసంలో భేటీ అయినట్లు స్పష్టంగా ఉంది.నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2014 నవంబరులో భారత డిజిటల్ ఎకానమీ, పెట్టుబడులకు ఉన్న మంచి అవకాశాల గురించి పూరీ ఒక మెయిల్ పంపారు.సిలికాన్ వాలీలోని,టెక్ కంపెనీల ఉన్నతాధికారులు, పెట్టుబడిదారులతో పూరీని కలిపేందుకు చురుకుగా ఎప్‌స్టెయిన్ పని చేసినట్లు ఒక మెయిల్లో ఉంది. లింక్‌డ్ ఇన్ కంపెనీ స్థాపకుడితో భారత్‌లో పెట్టుబడి అవకాశాల గురించి పూరీ చర్చించినట్లు కూడా వెల్లడైంది.తాను ఎనిమిదేండ్లు న్యూయార్క్‌లో ఉన్నానని, మూడు సార్లు కలిసింది నిజమే అని అంతర్జాతీయ పీస్ ఇనిస్టిట్యూట్‌లో పని చేస్తుండగా మూడుసార్లు కలిసింది నిజమే అని, అది పని సంబంధంగా, చాలా పరిమితమైన కలయిక అని, తనకు అతగాడి నేరజీవితం గురించి తెలియదని వైర్ పోర్టల్ అడిగిన ప్రశ్నకు పూరీ సమాధానంగా చెప్పారు.తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి ఎక్కడ దొరుకుతుందో చూద్దామని చెప్పినట్లుగా కేంద్ర మంత్రి సమాధానం ఉంది.అంతర్జాతీయ శాంతి వ్యవహారాల్లో ఎప్‌స్టెయిన్‌కు ఉన్న సంబంధం ఏమిటో ఒక రాయబారిగా పూరీ ఏమి చర్చించారో అంతుబట్టదు. ఆ భేటీల తరువాతే గురుదీప్ సింగ్ పూరీ కేంద్ర మంత్రివర్గంలో 2017లో చేరారు. చిత్రం ఏమిటంటే ఈ ఫైళ్ల గురించి తొలి సమాచారం 2025 నవంబరులోనే వెల్లడైంది. ఇదంతా వట్టిదే అని అప్పుడు బిజెపి ప్రతినిధి ప్రదీప్ భండారీ కొట్టి పడేశారు. ఇప్పుడు ఆ పెద్దమనిషి తలెక్కడ పెట్టుకున్నారో తెలియదు.
రిలయన్స్ కమ్యూనికేషన్స్ పేరుతో మందిని ముంచిన అనిల్ అంబానీ నడిపిన వ్యవహారాలు ఎప్‌స్టెయిన్ ఫైల్స్‌లో స్పష్టంగా ఉన్నాయి. 2017మార్చినెల 16న అంబానీ పంపిన ఒక వర్తమానం ఇలా ఉంది.” హలో నేను ఢిల్లీలో ఉన్నాను.జారెడ్(ట్రంప్ అల్లుడు జారెడ్ కుషనర్) మరియు బానన్ (స్టీవ్ బానన్ ట్రంప్ ప్రధాన వ్యూహకర్త)లను నేను కలుసుకొనేందుకు మీ సాయం కావాలని ”నాయకత్వం ” ( ప్రధాని కార్యాలయం) వాంఛిస్తున్నది. దయచేసి సలహా ఇవ్వండి.ప్రధాని వాషింగ్టన్ పర్యటన జరపబోతున్నారు. అని అనిల్ అంబానీ పేర్కొన్నాడు. ఇదంతా ఆ తరువాత 2017 జూన్‌లో జరిపే అమెరికా పర్యటనకు ముందు జరిగింది.2017 నుంచి 2019వరకు అనిల్ అంబానీ -ఎప్‌స్టెయిన్ మధ్య నిరంతర సంబంధాలు ఉన్నట్లు ఫైళ్లలో బయటపడింది.వారేమి చర్చించుకున్నారంటే అమెరికా, భారత్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పెట్టుబడి వ్యూహాలు, ట్రంప్ యంత్రాంగంతో అప్పాయింట్‌మెంట్లు,మోడీ అమెరికా, ఇజ్రాయెల్ యాత్రల గురించి.ప్రధాని ఇజ్రాయెల్ పర్యటనకు ముందు, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ బరాక్‌ను ఎలా కలుసుకోవాల్సిందీ ఒక మెయిల్‌లో ఎప్‌స్టెయిన్ అంబానీకి సూచించాడు. ఇద్దరి మధ్య సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పాడు. మోడీ పర్యటనపై ఇజ్రాయెల్ వ్యూహం గురించి చర్చించారు. ఆ సమయంలో అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ కంపెనీ ఇజ్రాయెల్ ప్రభుత్వ రంగ సంస్థ రాఫేల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీతో సంయుక్త ప్రాజెక్టు నడుస్తున్నది. మోడీ సర్కార్ రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో అనిల్ అంబానీ పాత్ర, అతగాడికి ఆ విమానాలను తయారు చేసే ఫ్రెంచి కంపెనీ దసాల్ట్‌తో విమానాల విడిభాగాల తయారీపేరుతో కుదిరిన ఒప్పందం గురించి తెలిసిందే. అంతకు ముందు అంబానీలు ఎన్నడూ ఆ రంగంలో లేరు. అనిల్ అంబానీ దివాలా ప్రకటించినపుడు 2019లో తనకు 75 కోట్ల డాలర్ల రుణ సేకరణకు సలహా ఇవ్వాలని ఎప్‌స్టెయిన్ను కోరినట్లు వెల్లడైంది. వీటి గురించి వివరణ కోరగా అంబానీ కంపెనీ నుంచి స్పందన లేదని మీడియాలో వార్తలు వచ్చాయి. రాజకీయ నేతలు, వాణిజ్య కంపెనీల యజమానుల సంబంధాలు గురించి ఈ ఉదంతం వెల్లడిస్తున్నది.ఎపస్టెయిన్ వంటి బాపతును దేనికైనా వినియోగించుకోవచ్చని కూడా తెలిసిందే.
భారతీయ-అమెరికన్ రచయిత,నీతి బోధలు చేస్తూ, ప్రత్యామ్నాయ వైద్యం గురిచి ప్రచారం చేస్తున్న దీపక్ చోప్రా కూడా ఎప్‌స్టెయిన్‌తో సంబంధాలు నెరిపినట్లు బయటపడింది. అతనితో సంబంధాలు నిజమే గానీ తానెలాంటి నేరాలకు పాల్పడలేదని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. వారి మధ్య 2016-2019 మధ్య ఇమెయిల్స్ నడిచాయి.పన్నెండుసార్లు వారు కలుసుకున్నట్లు తేలింది.డోనాల్డ్ ట్రంప్ రెండవ భార్య మర్లా మాపుల్స్ సమాచారం చెప్పమని, అది మన మధ్యే ఉంటుంది తప్ప ఇతరులెవరితో చెప్పనని దీపక్ మిశ్రా 2016 జూలైలో ఎప్‌స్టెయిన్‌కు మెయిలు చేశారు.అమె వివరాలు తెలియచేస్తూ ఆమె గర్భవతా కాదా అన్నదాని గురించిన పందెంలో తాను ఓడిపోయినట్లు కూడా ఎప్‌స్టెయిన్ పేర్కొన్నాడు. ఈ వ్యవహారాలు బయటపడిన తరువాత నెలకు పదిడాలర్లు చెల్లిస్తే ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తానంటూ దీపక్ మిశ్రా జనాలను ఆకట్టుకొనేందుకు పూనుకున్నట్లు వార్తలు వచ్చాయి. మనదేశానికి చెందిన వారు ఎప్‌స్టెయిన్‌తో నిర్వహించిన లావాదేవీలు, సంబంధాల గురించి మన ప్రధాన స్రవంతి మీడియా మౌనం దాల్చింది.నిజానిజాలను చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం, బిజెపి వాటిని కొట్టిపారవేయటం, మౌనం దాల్చి మూసిపెట్టేందుకు చూస్తున్నది.
