ఎం కోటేశ్వరరావు
ఫిబ్రవరి 13న ప్రారంభమైన రైతు ఉద్యమంలో బుధవారం నాడు 24ఏండ్ల సుభకరణ్ సింగ్ ప్రాణాలర్పించాడు. హర్యానా పోలీసులు రైతుల మీద జరిపిన దమనకాండలో అనేక మంది గాయపడ్డారు.కనౌరీ ప్రాంతం నుంచి తమ ఆసుపత్రికి వచ్చిన ముగ్గురిలో ఒకరు మరణించినట్లు పాటియాలలోని రాజీంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ హెచ్‌ఎస్ రేఖీ విలేకర్లతో చెప్పారు. తమ దగ్గర అలాంటి సమాచారం లేదని పోలీసులు బుకాయించారు. పోలీసుల దమనకాండ నేపధ్యంలో రెండు రోజుల పాటు ఢిల్లీ చలో ప్రదర్శన నిలిపివేసినట్లు రైతు సంఘాల ప్రతినిధి సర్వన్ సింగ్ పాంధెర్ ప్రకటించారు. తదుపరి కార్యాచరణను శుక్రవారం నాడు వెల్లడిస్తామని తెలిపారు. బుధవారం నాడు పంజాబ్-హర్యాన సరిహద్దులోని రెండు ప్రాంతాలలో ప్రదర్శకుల మీద పోలీసులు విరుచుకుపడ్డారు. ఆ సందర్భంగా జరిగిన ఘర్షణలో కొందరు గాయపడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మిర్చి కలిపిన ఎండుగడ్డిని తగులబెట్టి దానితో రైతులు తమ మీద దాడి చేసినట్లు పోలీసులు ఆరోపించారు. ఉత్తరాఖండ్‌లో కొన్ని చోట్ల ట్రాక్టర్లతో ప్రదర్శనలు జరిపారు.
అంతకు ముందు జరిగిన పరిణామాలలో మూడు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ఐదేండ్ల పాటు కొనుగోలు చేస్తామని, మిగతా వాటి కనీస మద్దతు ధర గురించి ఎలాంటి హామీ ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రతిపాదన తమకు ఆమోదం కాదని ఉద్యమాన్ని కొనసాగిస్తామని, ఢిల్లీకి ప్రదర్శనగా వెళతామని ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా( రాజకీయ రహితం-ఎస్‌కెఎం-ఎన్‌పి) నేతలు ప్రకటించారు. పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో దాదాపు పద్నాలుగువేల మంది రైతులు గత కొద్ది రోజులుగా తిష్టవేశారు.పన్నెండు వందల ట్రాక్టర్లు-ట్రాలీలు, పది మినీ బస్సులు, ఇతర వాహనాలతో రైతులు పదమూడవ తేదీ నుంచి అక్కడే ఉన్నారు వారిని 200కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీ చేరుకునేందుకు ముందుకు సాగనివ్వకుండా హర్యానా బిజెపి ప్రభుత్వ పోలీసులు అడ్డుకుంటున్నారు. చర్చలు విఫలమైనందున బుధవారం నుంచి ఢిల్లీ చలో పిలుపుతో ముందుకు సాగుతామని ఎస్‌కెఎం-ఎన్‌పి నేతలు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులను రాజధానిలోకి రానివ్వకూడదని కేంద్ర హౌం మంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసులకు గట్టి ఆదేశాలను జారీ చేశారు. మరోవైపున ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న బిజెపి సర్కార్ కూడా రోడ్లను మూసివేసి అన్నదాతలను అడ్డుకొనేందుకు పూనుకుంది. తాము ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు రైతులు భారీ యంత్రాలతో వస్తున్నట్లు, ఇది నేరపూరితమని హర్యానా పోలీసులు ఆరోపించారు.ఢిల్లీ వైపు వచ్చేందుకు పూనుకున్న రైతుల మీద హర్యానా పోలీసులు డ్రోన్లతో బాష్పవాయు గోళాలను విసిరారు. దీంతో షంభు సరిహద్దు ఉద్రిక్తంగా మారింది. జెసిబిలు, క్రేన్లు, పొక్లెయిన్లను రైతులకు సరఫరా చేయవద్దని యజమానులను హెచ్చరించారు. ఈ నేపధ్యంలో రైతుల ఉద్యమం ఏమౌతుంది, రానున్న ఎన్నికలలో బిజెపి, దాని మిత్ర పక్షాల మీద ఆందోళన ప్రభావం ఎలా ఉంటుంది అన్న చర్చ మొదలైంది.
గతంలో ఏడాది పాటు ఆందోళన నిర్వహించిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కెఎం) ప్రభుత్వ తాజా చర్చలలో భాగస్వామి కాదు. అయినప్పటికీ ప్రభుత్వ ప్రతిపాదనలను తాము వ్యతిరేకిస్తున్నామని, రైతులు కొనసాగిస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్లు, ఎన్‌డిఏ ఎంపీల ఇండ్ల ముందు నిరసన తెలపాలన్న తమ పిలుపుతో ముందుకు పోతామని ప్రకటించింది. గతంలో అనేక రాష్ట్రాలలో రాజకీయాలతో నిమిత్తం లేని రైతు సంఘాల పేరుతో అనేక మంది సంస్థలను ఏర్పాటు చేసి రైతులను సమీకరించేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు కూడా ఉన్నారు. దాని కొనసాగింపుగానే 2020-21లో ఆందోళనలో భాగస్వాములుగా ఉన్న కొందరు ఎస్‌కెం నుంచి విడగొట్టుకొని తాజా ఆందోళనకు పిలుపు ఇచ్చారు. గత ఆందోళనకు దూరంగా ఉన్న కొన్ని సంస్థలు కూడా ఇప్పుడు వారితో కలిశాయి. కేంద్ర ప్రభుత్వం ఒక వైపు దేశ శత్రువులను ఎదుర్కొనే పద్దతిలో రైతులను అడ్డుకొనేందుకు సన్నద్దం అవుతున్నది, మరోవైపు చర్చల పేరుతో లోక్‌సభ ఎన్నికల ప్రకటన జరిగే వరకు కాలయాపన ఎత్తుగడలకు పూనుకుంది. రైతుల మీద తప్పుడు ప్రచారం సరేసరి.
మూడు రకాల పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని రానున్న ఐదు సంవత్సరాల పాటు కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది.దీనిని రైతు సంఘాలు తిరస్కరించాయి.ఢిల్లీ చలో కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ప్రకటించాయి.ఎస్‌కెఎం-ఎన్‌పి నేత జగజిత్ సింగ్ దలేవాల్ సోమవారం నాడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రు.1.75లక్షల కోట్లతో పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నదని, ఈ మొత్తాన్ని చమురు గింజల సాగుదార్లకు ఇస్తే వారికి ప్రయోజనం ఉంటుందన్నారు.ప్రభుత్వం చేసిన ప్రతిపాదన పంటల మార్పిడి చేసే రైతులకు మాత్రమే లబ్ది చేకూర్చుతుందన్నారు. తమ డిమాండ్లను ఆమోదించటం లేదా ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అంగీకరించాలని డిమాండ్ చేశారు. పోలీసుల దమనకాండలో పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో 400 మంది రైతులు గాయపడ్డారని దలేవాల్ చెప్పారు. సుప్రీం కోర్టు దీని మీద స్వయంగా చర్య తీసుకోవాలని కోరారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారు ఝామువరకు జరిగిన చర్చలలో రైతులు అంగీకారం తెలిపిన అంశాల మీద మరుసటి రోజు మాట మార్చినట్లు చర్చలలో భాగస్వాములైన వర్గాలు చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక సమీక్షలో పేర్కొన్నది.ఇప్పుడు ఆందోళనకు పిలుపుఇచ్చిన వారు నిజంగా అంగీకరించారా లేక వారి మీద చేస్తున్న తప్పుడు ప్రచారంలో భాగంగా ఇలాంటి వార్తలను వ్యాపింపచేస్తున్నారా అన్నది చూడాల్సి ఉంది.
ప్రభుత్వం జరుపుతున్న చర్చల తీరు గురించి గతంలో ఆందోళనకు నాయకత్వం వహించిన వారిలో ఒకరైన హన్నన్ మొల్లా ఆదివారం నాడు మాట్లాడుతూ ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దులో జరుపుతున్న ఆందోళన తమ పిలుపు మేరకు జరుగుతున్నది కాదని గతంలో తమ నుంచి వేరుపడిన కొన్ని సంస్థలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వారు కూడా తమ పేరునే ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఆదివారం రాత్రి జరిగిన నాలుగవ విడత చర్చల గురించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత ఆందోళన సందర్భంగా పదకొండుసార్లు చర్చలు జరిపినప్పటికీ పరిష్కారం లేదన్నారు.ఈ పదకొండు దఫాల చర్చలకు 42 మందిని కేంద్రం పిలిచిందని, వారిలో ఇద్దరిని విడదీసిందని, ఇప్పుడు ఆ ఇద్దరితో మాట్లాడుతూ 40 మందిని విస్మరించిందని చెప్పారు. దీన్ని బట్టి ప్రభుత్వం ఏదో ఒక లక్ష్యంతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నదని అన్నారు. అయితే దీని అర్ధం ఇప్పుడు రైతు సంఘాలు ముందుకు తెచ్చిన డిమాండ్లను తాము వ్యతిరేకించటం లేదని, వాటిని వెంటనే అమలు జరపాలని హన్నన్ మొల్లా చెప్పారు. కనీస మద్దతు ధరలు, వరి, గోధుమ గడ్డి తగులబెట్టటం గురించి చర్చించేందుకు కేంద్రం సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి అర్జున్ ముండా బుధవారం నాడు చెప్పారు. రైతులను అణచేందుకు చూడవద్దని రైతు నేత సర్వన్ సింగ్ పాంధెర్ బుధవారం నాడు ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు. రైతులే మోడీని ప్రధానిని చేశారని, వారిని విస్మరిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని రైతులు క్షమించరని అన్నారు. మీరు మమ్మల్ని చంపవచ్చు కానీ రైతులను అణచవద్దని ప్రభుత్వానికి చెప్పామని, కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తూ ప్రధాని ఒక ప్రకటన చేసి ఆందోళనకు తెరదించాలని అన్నారు.హర్యానా గ్రామాలలో పారా మిలిటరీని దించారని, తామేం నేరం చేశామని ప్రశ్నించారు. భద్రతా దళాలు తమను ఇలా అణచివేస్తాయని కలలో కూడా ఊహించలేదన్నారు. రాజ్యాంగాన్ని రక్షించి శాంతియుతంగా ఢిల్లీ చేరేందుకు తమను అనుమతించాలన్నారు. ఇది తమహక్కు అని స్పష్టం చేశారు. తమ ఉద్దేశ్యం గొడవలు సృష్టించటం కాదని, నవంబరు ఏడవ తేదీ నుంచి ఢిల్లీ వచ్చేందుకు కార్యక్రమాన్ని రూపొందించామని ప్రభుత్వానికి తగిన సమయం లేదని అనటం నిర్లక్ష్యం చేసేందుకు చూడటమే అని జగజిత్ సింగ్ దలేవాల్ అన్నారు. బారికేడ్లతో తమను ఆపటం సరైంది కాదన్నారు.
ఎవరైనా డిమాండ్లను నీరుగార్చినా, ఏదో ఒకసాకుతో వెనక్కు తగ్గినా రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఈ అంశంపై చర్చ జరగటం అనివార్యం.రైతులకు రాజకీయాలు వద్దనటం, ఆందోళన వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయని ప్రచారం చేయటమే ఒక రాజకీయం, వారిని తప్పుదారి పట్టించే ఎత్తుగడతప్ప మరొకటి కాదు. ఏ రైతు సంఘం ముందుకు తెస్తున్న డిమాండ్లైనా వ్యవసాయానికి సంబంధించినవే తప్ప వేరు కాదు. వ్యవసాయంతో సహా అన్ని అంశాల మీద విధానాలను రూపొందించేది పార్టీల తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడిన చట్టసభలే. ప్రతి పార్టీకి చెందిన వారు ఏదో ఒక రైతు సంఘంలో పని చేయటం తెలిసిందే. అందువలన తమకు మేలు చేసే వారెవరో కీడు చేసే వారెవరూ రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా ?
