Tags
'In the land of the blind the one-eyed man is king', Modi Sarkar, Narendra Modi Failures, Raghu ram rajan, RBI, Rbi governer
ఎం కోటేశ్వరరావు
నిజం చెబితే నిష్ఠూరమాడతారు. నిష్టూర మంటే నిజానికి మీరు మాట్లాడింది చాలా బాగో లేదు అని మర్యాదగా కోపగించుకోవటమే. మన రిజర్వుబ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలపై మన తెలుగింటి ఆడపడుచు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అదే చేశారు. ఇంతకీ రిజర్వుబ్యాంకు రాముడు అన్నదేమిటి ? గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్ను వాడే మహారాజు అన్న సామెతను వుపయోగించి మన ఆర్ధిక వ్యవస్ధ గురించి గొప్పలు చెప్పుకుంటున్నవారి గాలి తీశారని కొందరు అంటుంటే, కాదు మన స్ధితి గురించి వినమ్రంగా తనదైన శైలిలో చెప్పారు తప్ప అది ప్రభుత్వానికో , మోడీకో వ్యతిరేకం కాదని మరికొందరు భాష్యం చెబుతున్నారు. వరుస వైఫల్యాలు సంభవిస్తున్న పూర్వరంగంలో రాజన్ వ్యాఖ్య సహజంగానే మోడీ భక్తులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ‘2019లో బిజెపి తిరిగి అధికారాన్ని పొందాలంటే అదృష్టం పట్ల వ్యామోహాన్ని వదులు కోవాలి’ అనే శీర్షికతో ‘మేం మితవాదులం ‘ అని సగర్వంగా చెప్పుకొనే మోడీ భక్తుడైన ఎస్ మురళీధరన్ అనే వ్యాసకర్త ‘స్వరాజ్య’ పత్రికలో ఈనెల 19న రాశారు. రఘురామ్ రాజన్ వ్యాఖ్యలకు మురళీనాదానికి సంబంధం వుందా ?
‘మోడీ ప్రభుత్వం పతాక పధకాలుగా ప్రారంభించిన పంటల బీమా పధకం, ఇ మండి(ఎలక్ట్రానిక్ మార్కెట్ యార్డులు), మేక్ ఇన్ ఇండియా వంటి ఇతర పధకాలకు దాదాపు ఎలాంటి సన్నాహాలు లేకుండా మొదలు పెట్టారు. చివరకు అవి విఫలం కావటానికే ఎక్కువ అవకాశాలున్నాయంటే ఆశ్చర్యపడనవసరం లేదు. మన ఎన్నికల అవనికలో పునశ్చరణగా జరుగుతున్నట్లుగా చంద్రుడు, చుక్కలను తీసుకు వచ్చి చేతుల్లో పెడతామని చెప్పటం ద్వారా 2019 ఎన్నికలలో బిజెపి ప్రభుత్వ వ్యతిరేకతను తెచ్చుకోవచ్చు’. ఇవి ఏ ప్రతిపక్ష పార్టీనో మరొకరో కాదు స్వయంగా మురళీధరన్ రాసిన మాటలు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చి ఇంకా రెండు సంవత్సరాలు పూర్తి కాక ముందే మరో మూడు సంవత్సరాల తరువాత జరిగే ఎన్నికలలో సంభవించబోయే పరిణామాల గురించి ఆయన భక్తులు హెచ్చరికలు జారీ చేస్తున్నారంటే రఘరామ్ రాజన్ మాట్లాడినదానిలో తప్పేమన్నా వుందా ? నిర్మలా సీతారామన్ వంటి మోడీ సైనికులకు మండ కుండా వుంటుందా ?
మామ తిట్టినందుకు కాక తోడల్లుడు తొంగి చూసినందుకు కోపం వచ్చిందన్న కొత్త సామెతను ప్రచారంలో పెడదాం. మురళీధరన్ మోడీ ప్రభుత్వానికి మామ అనుకుందాం. సదరు మామ చెప్పిన అంశాల సారం ఇలా వుంది. ‘ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం త్వరలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. రాజకీయాలలో ఒక వారమే దీర్ఘకాలం అనుకుంటే ప్రభుత్వం ఎటు వైపు పయనిస్తోందో చెప్పటానికి రెండు సంవత్సరాలు చాలు. గాలిలో గడ్డి పరకలు దిశను తెలియచేసినట్లే తన విధానాలు, కార్యక్రమాల గురించి సమర్ధనీయం కాని ఆశాభావం, అదృష్టాన్ని నమ్ముకొనే విపరీత వ్యామోహంతో వున్నట్లు కనిపిస్తోంది.
ఎలక్ట్రానిక్ వ్యవసాయ మార్కెట్లనే చూద్దాం. అది మంచి ఆలోచనే కానీ మనం దానికి అనువుగా వున్నామా ? ఒక వస్తువును దుకాణానికి చేర్చాలంటే మార్కెటింగ్ వ్యక్తులకు తొడతొక్కిడిగా వుంటుంది, అంతకంటే ముందు అదే పరిస్ధితి వుత్పాదక కేంద్రాలలో వుంటుంది.అలాగే మౌలిక సదుపాయాలు లేకుండా ఏ ప్రభుత్వమూ పధకాలను ప్రారంభించకూడదు. మన దేశంలో 15శాతానికే ఇంటర్నెట్ అందుబాటులో వుంది. వంద కోట్ల సెల్‌ఫోన్లు వున్నాయనుకుంటే ఇరవై కోట్ల మందే స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు. ఇది సానూకూల చిత్రం.
వ్యవసాయ వుత్పత్తులకు ఒక సమీకృత మార్కెట్ అంటే వుత్పత్తి జరిగే చోట శీతల గిడ్డంగులతో పాటు వాటిని అవసరమైన చోటికి చేరవేయటానికి శీతల సదుపాయం వున్న రవాణా వాహనాలు కావాలి. ఇవేమీ లేకుండానే మరొక ప్రారంభానికి నాంది పలికారా ? పంటల బీమా పధకం కూడా ఇలాగే ప్రారంభించారు. వ్యవసాయ రంగంలోని అన్ని అనర్ధాలకు సబ్సిడీతో కూడిన పంటల బీమా పధకం సర్వరోగనివారిణి కాదనే వైపు మోడీ ప్రభుత్వం ఆలోచించలేదు. మాయలాడిని చూసి మోసపోయిన ప్రేమికుడి మాదిరి బీమా సొమ్మును నిరాకరిస్తే రైతు ఆగ్రహోదగ్రుడు అవుతాడు.
తాను అధికారానికి వచ్చిన వందరోజుల్లో విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షల వంతున వేస్తానని బాధ్యతా రహితంగా 2014 ఎన్నికలలో మోడీ వాగ్దానం చేయటంతో ఈ ధోరణి ప్రారంభమైంది. అది ఎన్నికలలో ఓటర్లను ఆకర్షించేందుకు చెప్పిన మాట అని తెలిసినప్పటికీ రంధ్రాన్షేషణ చేసే టీవీ యాంకర్ల మొదలు వాక్చాతుర్యం గల ప్రతిపక్షాల వరకు మోడీ ప్రభుత్వం వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని నానాయాగీ చేస్తున్నారు. మేకిన్ ఇండియా నినాదం కూడా ఇలాంటిదే. గత రెండు సంవత్సరాలలో వచ్చిన ఎఫ్‌డిఐలో ఎక్కువ భాగం వుత్పాదకేతర ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వాణిజ్యరంగంలోకే వచ్చింది. విదేశాంగ విధానంలో కూడా అదృష్టాన్ని నమ్ముకొనే వ్యామోహంతో వున్నారు. వాజ్‌పేయి ఎన్నో కలలతో లాహోర్‌కు బస్సులో వెళితే మోడీ దాన్ని అధిగమించి దిగజారి పాకిస్థాన్ ప్రధాని కుటుంబ కార్యక్రమానికి ఎలాంటి ఆహ్వానం లేకుండానే ఆకస్మికంగా వెళ్లారు.’ ఇదే విమర్శను ఏ సిపిమ్మో, కాంగ్రెసో చేసి వుంటే స హించలేక ఈ పాటికి సంఘపరివార్ మీడియా సైన్యం రెచ్చిపోయి నానా యాగీ చేసి వుండేది.
నరేంద్రమోడీ సర్కార్ సాధించిన విజయాలలో వాణిజ్య లోటు తగ్గింపు గురించి చెప్పుకొంటోంది. లోటు తగ్గిన మాట నిజం. మోడీ అధికారానికి వచ్చిన వెంటనే మేకిన్ ఇండియా నినాదమిచ్చారు. కానీ అప్పటి నుంచి మన దేశంలో తయారైన సరకులు ఎగుమతులు తగ్గిపోయాయి. వరుసగా గత పదహారు నెలలుగా తగ్గుతున్నట్లు తాజాగా ప్రభుత్వమే ప్రకటించింది.మరో ఏడాది పాటు ఇలాగే వుండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.ఈ వివరాలు వెల్లడి అయిన సమయంలోనే గత తొమ్మిది నెలల్లో తొలిసారిగా మార్చినెలలో చైనా ఎగుమతులు పెరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో మన దిగుమతుల ఖర్చు కూడా తగ్గింది. దీనిలో మోడీ ఘనత వుందా? ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు గణనీయంగా తగ్గిన కారణంగా మన బిల్లుతగ్గింది తప్ప మరొకటి కాదు. ప్రపంచ మార్కెట్లో తగ్గిన మేరకు వినియోగదారులకు తగ్గించారా అంటే లేదు పన్నులు పెంచి జనాన్ని బాదుతున్నారు. చైనా ఈ రోజు ప్రపంచంలో అమెరికా తరువాత రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధ. మన దేశంలోని కొందరు త్వరలో దానిని అధిగమించబోతున్నట్లు చెబుతున్నారు. ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా 12శాతం కాగా మనది 1.7 మాత్రమే. దీనిని 2020 నాటికి ఐదుశాతానికి పెంచాలని అనుకుంటున్నట్లు నరేంద్రమోడీ చెబుతున్నారు.అంటే మరో నాలుగు సంవత్సరాలలో మన ఎగుమతులు మూడు రెట్లు పెరగాలి. అందుకే మురళీధరన్ చెప్పినట్లు వాస్తవాలకు దూరంగా నరేంద్రమోడీ సర్కార్ అదృష్టంపై వ్యామోహం పెంచుకొని ఎదురు చూస్తున్నది.
రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ గతవారంలో వాషింగ్టన్ నగర పర్యటన సందర్భగా మార్కెట్ వాచ్ సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో భారత్ ఆశాజనక కేంద్రంగా వుందని ఐఎంఎఫ్‌తో సహా అనేక సంస్ధలు వర్ణించిన విషయాన్ని విలేకరి ప్రస్తావించి దాని రహస్యం ఏమిటని అడిగారు. దానిపై రాజన్ స్పందిస్తూ ‘ మేము సంతృప్తి చెందాల్సిన కేంద్రానికి చేరాలంటే మేము ఇంకా ప్రయాణించాల్సి వుంది.గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్నువాడే మహారాజు అని మేము చెబుతూ వుంటాం, మేము దానికి అతి దగ్గరలో వున్నాం’ అన్నారు. చైనాతో పోలిక గురించి అడగ్గా సంస్కరణల ప్రారంభంలో చైనా కంటే భారత్ పదేళ్లు వెనుక వుంది. రెండు ఆర్ధిక వ్యవస్థలలోనూ ఆ తేడా కనిపిస్తుంది.మేము వారితో పోలిస్తే నాలుగు నుంచి ఐదోవంతు మధ్య వున్నాం, మేం కొన్ని సరైన చర్యలు తీసుకుంటే కొంత కాలానికి వారిని మేము చేరుకోగలం అన్నారు. వారు ఇప్పుడున్న స్ధాయికి చేరుకోవటానికి వారు అనుసరించిన మంచి విధానాలు అసాధారణమైనవి, కాబట్టి మేం కూడా మంచి విధానాలను రూపొందించి వారి మాదిరే అమలు జరపాల్సి వుంది. ఇతరులు నడిచిన బాటను మేం అనుసరించాలని లేదు, దాని అర్ధం బాగా కష్టపడాల్సి వుంది’ అన్నారు.
రాజన్ చేసిన వ్యాఖ్యలను అన్వయించటాన్ని బట్టి ఏ విధంగా అయినా వుపయోగించవచ్చు. రిజర్వుబ్యాంకు గవర్నర్‌గా వున్న వ్యక్తి మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఆలా వ్యాఖ్యానించి వుంటారని అనుకోలేము. సాధించిన దానికి సంతృప్తి చెందటం లేదనే సానుకూల అర్ధంలో కూడా కావచ్చు. అనేక సందర్బాలలో నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడించిన రాజన్ ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురౌతున్నట్లు వార్తలు వచ్చాయి.గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్ను వాడే మహారాజు అన్న వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ అతిగా స్పందించినట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షాలు అలాంటి వాటిని వుపయోగించుకోవటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ కేంద్ర మంత్రి ఆ విధంగా స్పందించటం అంటే ప్రభుత్వ వైఫల్యాలపై వస్తున్న విమర్శలను తట్టుకొనే సహనం కోల్పోతున్నారనటానికి సూచన ఇది.
