Tags
BJP, Free Ration Scheme, Hunger India, India Hunger Index, Narendra Modi Failures, Ten years Narendra Modi rule
ఎం కోటేశ్వరరావు
ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పధకాన్ని మరో ఐదు సంవత్సరాలు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ చత్తీస్‌ఘర్ ఎన్నికల సభలో ప్రకటించారు. గతేడాది జరిగిన రాష్ట్రాల ఎన్నికలపుడు ప్రకటించి ఏడాది పొడిగింపు డిసెంబరు వరకు ఉంది. కానీ మోడీ కోయిల ముందే కూసింది అంటే ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల గానమే ! వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలు కూడా ఎంతో దూరం లేనందున అప్పుడు కూడా దీని గురించి ఊదరగొడతారని వేరే చెప్పనవసరం లేదు. ఈ పధకం ఖజానా మీద మరింత భారం మోపుతుందని కొందరు అంటున్నారు. కొత్తగా పడేదేమీ లేదన్నది మరొక వాదన.ఏది ఏమైనా పేదలకు మేలు చేస్తుంది. ఉచిత పధకాల వలన రాష్ట్రాలు దివాలా తీస్తాయని నరేంద్రమోడీ కర్ణాటక ఎన్నికల సందర్భంగా చెప్పారు. ఉచిత ఆహార భారాన్ని భరిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో పడదా ? చెప్పే మాటలకు చేతలకు పొంతన లేదంటే ఎక్కడో తేడా కొడుతోందని మోడీ గ్రహించారనుకోవాలి. పౌరులు గౌరవ ప్రదమైన, ఆరోగ్యకర జీవనం గడపాలంటే తగినంత ఆహారం, పోషకాలు అవసరం. వాటిని హక్కుగా పరిగణిస్తూ 2013 జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా గ్రామాలలో 75శాతం, పట్టణాలలో 50శాతం మంది అర్హులని పేర్కొన్నారు. కొత్తగా నరేంద్రమోడీ సర్కార్ దేశంలో ఎక్కడైనా రేషన్ పొందేందుకు వీలుగా కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. బహుశా దేశ భద్రతకు సంబంధించిన రహస్యంగా భావించి లేదా పరువు పోతుందని సిగ్గుపడిగానీ ఉచిత పధకాన్ని పొడిగించటానికి కారణం ఏమిటో ప్రధాని చెప్పలేదు అనుకోవాలి. ఒకవైపు ఆహార భద్రతకు తూట్లు పొడిచేందుకు మోడీ మంత్రాంగంలో భాగమైన నీతి ఆయోగ్ చూస్తుంటే మరోవైపు ఓట్లకోసం పడుతున్న పాట్లు ! అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేసినట్లు !
మోడీ కేంద్రంలో అధికారానికి వచ్చినపుడు ఆకలి సూచికలో దేశం 120కిగాను 99వ స్థానంలో ఉంది.అది 2022లో 121దేశాల్లో 107కు, 2023లో 125దేశాల్లో 111కు దిగజారింది. ఈ సూచికలను గత పదేండ్లలో ఏనాడూ కేంద్ర ప్రభుత్వం, బిజెపి అంగీకరించలేదు, తప్పుల తడక అని చెప్పటం తప్ప ఆకలి గురించి మాట్లాడదు. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పధకాన్ని మరో ఐదేండ్లు పొడిగించటం అంటే పదేండ్ల నాడు చెప్పిన అచ్చేదిన్ (మంచి రోజులు) రాలేదని, జనం చచ్చే ఆకలితో ఉన్నారని, పరిస్థితి దిగజారుతున్నది వాస్తవమేనని అంగీకరించటం కాదా ! నిర్దిష్టమైన సమాచారాన్ని ప్రభుత్వం సేకరించలేదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, ఇతర అంచనాల ప్రకారం పదేండ్ల అమలు తరువాత కుర్రవాళ్లలో 40శాతం మందికి తగినంత ఆహారం లేదు. మూడోవంతు మంది దేశ జనాభా పోషకార లేమితో ఉన్నారు. మనకు రెండు భారత దేశాలు కనిపిస్తున్నాయి. తగినంత ఆహారం లేక గిడసబారి పోయిన, బానకడుపుల వారు ఒకవైపు, ఉన్న డబ్బుతో విచ్చలవిడిగా తిని పెంచుకున్న ఊబకాయాలతో కార్పొరేట్ ఆసుపత్రులను పోషిస్తున్న వారిని మరోవైపు చూడవచ్చు.
తగినంత ఆహారం, పోషకపదార్ధాలు అందుబాటులో లేని కారణంగా దేశంలో ఉన్న ఆడా మగా రక్తహీనతతో ఉన్నారు.ఆహార భద్రతా పధకం ఈ సమస్యను పరిష్కరించటంలో విఫలమైంది. మరోవైపున నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వానికి, బిజెపి పాలిత రాష్ట్రాల పాలకులకు మార్గదర్శనం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పాటు చేసిన సంస్థ ఆరోగ్య భారతి. దేశంలో ” ఉన్నతమైన తెలివితేటలతో అందమైన, పొడవైన ” పిల్లలను పుట్టించేందుకు గర్భవిజ్ఞాన అనుసంధాన కేంద్రం పేరుతో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తలిదండ్రులు నల్లగా ఉన్నా, తెలివితేటలు పెద్దగా లేనివారైనప్పటికీ పురాతన భారత విజ్ఞానంతో పైన పేర్కొన్న లక్షణాలతో పిల్లలను పుట్టించేందుకు సంస్థ నిపుణులు పని చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నది. తరుణ్ విజరు అనే బిజెపి నేత నల్లవారితో కలసి సామరస్యపూర్వకంగా జీవిస్తున్నట్లు చేసిన ప్రకటన గురించి తెలిసిందే. ఇదే ఆరోగ్యభారతి మేథావులు ఆకలితో వచ్చే అనారోగ్య సమస్యలకు పరిష్కారాన్ని ఎందుకు చూపలేకపోతున్నారు. ప్రాచీన విజ్ఞానం, వేదాల్లో ఉన్నాయంటున్న పరిష్కార మార్గాలను వెలికి తీసి పైసా ఖర్చు లేకుండా లోపాలను సరి చేయవచ్చు కదా !
కరోనా కాలం నుంచి 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారధాన్యాలు ఇస్తున్నట్లు, రెండు లక్షల కోట్ల రూపాయలను అందుకు ఖర్చు చేస్తున్నట్లు బిజెపి పెద్దలు విజయగాధలను గానం చేస్తుంటారు. వారి జేబుల్లోంచి తీసి ఖర్చు చేయటం లేదు. దేశంలో ఆకలి ఇవాళ కొత్తగా ప్రారంభం కాలేదు.యుపిఏ పాలనకు ముందు అధికారంలో ఉన్న బిజెపి వాజ్‌పాయి సర్కార్ ఆహార భద్రతా పధకం గురించి ఎలాంటి ఆలోచనా చేయలేదు. సిఎంగా ఉన్న నరేంద్రమోడీ ఎన్నడూ అలాంటి ప్రతిపాదన కూడా చేసినట్లు తెలియదు. ఇక 80 కోట్ల సంఖ్య ఎలా వచ్చిందంటే గ్రామాల్లో 75శాతం, పట్టణాల్లో 50శాతం లెక్కన 67శాతం మందికి ఆహార భద్రత కల్పించాలని 2013 చట్ట చెప్పింది. అప్పటికి ఉన్న జనాభా 122 కోట్లు వారిలో 67శాతం అంటే 81.74 కోట్లు. ఇప్పుడు 142 కోట్లకు చేరింది, అంటే ఇవ్వాల్సింది 95.14 కోట్ల మందికి. పదిహేను కోట్ల మందికి మొండిచేయి చూపుతున్నారు. మరోవైపు ఆరోగ్య సూచికలేవీ మెరుగుపడిన దాఖలా లేదు. అందువలన ఆహార భద్రత, పోషకాహార పధకాలను సవరిస్తే తప్ప దీనివలన ఎలాంటి ప్రయోజనం లేదని అనేక మంది చెబుతున్నారు. అది వాస్తవం కాదని చెప్పేందుకు ప్రభుత్వం ఎలాంటి సర్వేలను నిర్వహించలేదు.దేశంలో ఆహార సబ్సిడీ కేటాయింపులు తగ్గుతున్నాయి. 2020-21లో కేంద్ర ప్రభుత్వం రు.5.41లక్షల కోట్లు ఖర్చు చేసింది.(2016 నుంచి ఎఫ్‌సిఐ తీసుకున్న అప్పులను ఒక్కసారే కేంద్ర ప్రభుత్వం తీర్చిన కారణంగా ఒక ఏడాదిలో ఇంతగా పెరిగింది) 2021-22లో వాస్తవ ఖర్చు రు.3,06,571 కోట్లు, 2022-23లో సవరించిన అంచనా రు.2,96,523, 2023-24లో ప్రతిపాదించిన మొత్తం రు.2,05,765 కోట్లు. యుపిఏ చివరి సంవత్సరం నుంచి నరేంద్రమోడీ తొలి ఆరు సంవత్సరాలలో ఆహార సబ్సిడీ మొత్తం లక్ష కోట్లకు అటూ ఇటూగా ఉంది. కరోనా లేకున్నా ఇప్పుడు కొనసాగిస్తున్న ఆహార ధాన్యాల ఉచిత పధకం గురించి అంతకు ముందు మోడీకి ఎందుకు తట్టలేదు. తన ఏలుబడిలో పరిస్థితి ఆకస్మికంగా దిగజారిందా ? గతంలో ఏ ప్రభుత్వం చేయలేనంతగా దేశ జిడిపిని పెంచినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. కాసేపు అంగీకరిద్దాం, దానికి అనుగుణంగా ఆహార సబ్సిడీ పెంచకపోగా తగ్గించారు.
2014-15లో ఆహార సబ్సిడీ కేటాయింపు జిడిపిలో 0.9శాతం, తరువాత 2019-20 నాటికి 0.5శాతానికి కోత పెట్టారు. కరోనా కాలంలో పాత బకాయిల చెల్లింపుతో 2.7శాతానికి పెరిగింది, క్రమంగా దిగజార్చుతూ 2023-24లో దాన్ని 0.7శాతానికి తగ్గించారు. ఇదేదో ఏదో అలా జరిగిపోయిందని చెప్పినట్లుగా సంభవించింది కాదు.పౌర పంపిణీ వ్యవస్థ(పిడిఎస్)ను ప్రైవేటీకరించాలని, ఉచిత ఆహార లబ్దిదారులను, సబ్సిడీలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ చేసిన సూచనలు తెలిసిందే. ప్రపంచబాంకు, ఐఎంఎఫ్ వేసిన బాటలో నడుస్తున్న రాజు కనుసన్నలలోనే సిబ్బంది పని చేస్తారు.ఆహార భద్రత పధకం కింద లబ్దిదారులను స్థంభింప చేశారని, అదనంగా అవసరమైన వారికి ఇవ్వటం లేదంటూ దాఖలైన పిటీషన్ మీద లబ్దిదారులను పెంచాలని సుప్రీం కోర్టు 2021 జూన్ 29న చేసిన సూచనను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.( ఎనభై కోట్ల సంఖ్య 2011 జనాభాప్రాతిపదిక అని ముందే చెప్పుకున్నాం.) దాంతో అదే ఏడాది సెప్టెంబరులో పిటీషనర్ల తరఫు లాయర్ ప్రశాంత భూషణ్ సంబంధిత కేంద్ర మంత్రికి నోటీసు పంపారు. అయినా చలనం లేకపోవటంతో 2022జనవరిలో కోర్టు సూచనలను అమలు జరపాలంటూ మరోపిటీషన్ దాఖలు చేశారు.దాంతో విధిలేక కొత్త జనాభా లెక్కలను సేకరించిన తరువాతనే విస్తరణ సాధ్యమని, సమీప భవిష్యత్‌లో విస్తరించే పధకాలేవీ లేవని కూడా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఏదో ఒక మార్గాన్ని చూడాలని కోర్టు కేంద్రానికి చెప్పింది. అయినా ఇంతవరకు చేసిందేమీ లేదు.
జనాభా లెక్కల సేకరణ ఎప్పుడు జరుగుతుందో తెలియని స్థితి. అప్పటి వరకు కోట్లాది మంది ఆకలితో మాడాలన్నమాట. కేంద్రం తన వాదనకు మద్దతుగా సమర్పించిన అఫిడవిట్‌లో కొన్ని నీతి ఆయోగ్ అభిప్రాయాలను పొందుపరచింది. మూడింట రెండువంతుల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందచేతకు ఉన్న అవకాశాలు, అవసరమా అన్న అంశాలను పరిశీలించాలని ఆ సంస్థ పేర్కొన్నది. అంతేకాదు ఆహార ధాన్యాల సేకరణ, పధకాల పంపిణీకి ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించుకొనే విధంగా ప్రైవేటు,కార్పొరేట్ సంస్థలకు బాధ్యతలను అప్పగించాలని కూడా సూచించింది. అంతకంటే దారుణం ఏమంటే సుప్రీం కోర్టు సూచించింది తప్ప ఆదేశాలు జారీ చేయలేదని, ఆహార భద్రత పధకం వర్తింప చేసేందుకు జనాభా అంచనాలను పరిగణనలోకి తీసుకోవాలని గతంలో చేసిన చట్టంలో లేదని అందువలన కోర్టు మార్గదర్శనం చట్టంలోని సెక్షన్ 9కి విరుద్దమని కూడా నీతి ఆయోగ్ 2022 ఆగస్టు 31న జరిపిన సమీక్షా సమావేశంలో ఒక వాదనను కేంద్రానికి అందించింది. అయితే ఈ అంశాలను ప్రభుత్వం కోర్టు ముందు సమర్పించలేదు. నిబంధనల సాకుతో అర్హులైన వారికి ఆహార హక్కు లేకుండా మాడ్చి చంపాలని చట్టం చెప్పిందా ? ఆ తరువాత అంటే అదే ఏడాది సెప్టెంబరులో నీతి ఆయోగ్ మేథావులు కొత్త వాదనను ముందుకు తెచ్చారు. ఆహార భద్రత పధక చట్టం అమలు జరిపిన ఎనిమిదేళ్ల కాలంలో జనాభా తలసరి ఆదాయం 33.4శాతం పెరిగిందని, అందువలన జనమంతా 2013-14లో ఉన్న మాదిరి ఉండరు గనుక పెరిగిన తలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నీతి ఆయోగ్ పెద్దలు వాదించారు. ఇది అసంబద్దమైన వాదన. అంబానీ, అదానీల సంపదను, అడుక్కొనేవారి ఆదాయాన్ని సరాసరి కట్టే లెక్కలవి.
ఆహార సబ్సిడీ అనేది అటు రైతాంగానికి ఇటు వినియోగదారులకు ఇచ్చేది. ఎఫ్‌సిఐ లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేసి ప్రభుత్వ విధానాల మేరకు వినియోగదారులకు అందచేస్తాయి. వాటిలో ధరకు విక్రయించేవి, ఉచితంగా అందచేసేవీ ఉంటాయి. ఈ లావాదేవీల్లో వచ్చే తేడా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది.గతంలో ఆయా రాష్ట్రాలలో ఉన్న దారిద్య్రాన్ని బట్టి ఏ రాష్ట్రానికి ఎంత ఆహారం కేటాయించేదీ నిర్ణయించేవారు. 2017-18 నుంచి దారిద్య్ర సర్వే, కొత్త కార్డులు ఇవ్వటం నిలిపివేశారు. రాష్ట్రాలు జారీ చేస్తే అందుకయ్యే ఖర్చును అవే భరించాల్సి ఉంటుంది. ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ఎవరు ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని ఒకే కార్డు పద్దతిని ముందుకు తెచ్చారు. మన దేశంలో దారిద్య్రరేఖ నిర్వచనంలో అనేక లోపాలు ఉన్నాయి. ఒక నిర్దిష్టత లేనికారణంగా ఎవరికి తోచిన అంచనాను ఆయా కమిటీలు ఇచ్చాయి. ప్రపంచ బాంకు అంతర్జాతీయ దారిద్య్ర రేఖను రూపొందించింది. దాని ప్రకారం 2011లో రోజుకు 1.90 డాలర్ల కంటే తక్కువ ఆదాయం వచ్చే వారు దారిద్య్ర రేఖకు దిగువన(దుర్భరదారిద్య్రంలో) ఉన్నట్లు. దాన్ని 2017 ధరల ప్రకారం 2022 సెప్టెంబరులో 2.15 డాలర్లకు పెంచింది. ప్రస్తుతం డాలరుకు 83 రూపాయలు ఉంది కనుక నెలకు రు.5.353 కంటే తక్కువ ఆదాయం వచ్చిన వారు దుర్భరదారిద్య్రంలో ఉన్నట్లు. కానీ మన ప్రభుత్వం పట్టణాల్లో నెలకు రు.1,260, గ్రామాల్లో రు.1,059గా గీత గీసింది.ఎందుకంటే ఏ దేశానికి ఆ దేశం తన రేఖను నిర్ణయించుకోవచ్చు.వాటిని చూపి దారిద్య్రాన్ని తగ్గించినట్లు చెప్పుకోవచ్చు. ప్రపంచ బాంకు తాజాగా రూపొందించిన మూడు ప్రమాణాల ప్రకారం డాలర్లలో రాబడితో వివిధ దేశాలలో దారిద్య్రం ఎలా ఉందో, ఉంటుందో పేర్కొన్నది.దాని ప్రకారం భారత్, చైనాల పరిస్థితి దిగువ విధంగా ఉంది. రాబడి గీతను బట్టిి ఎంత మంది దారిద్య్రంలో ఉన్నారో ఈ పట్టిక సూచిస్తుంది. ఉదాహరణకు రోజుకు 2.15 డాలర్లకంటే తక్కువ ఆదాయం వచ్చే వారు ఆఫ్రికాలోని కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్‌లో 69.9శాతం ఉన్నారు, అంటే వారంతా దుర్భరదారిద్య్రంలో ఉన్నట్లు లెక్క.
దేశం ×× 2.15 ×× 3.65 ×× 6.85
భారత్ ×× 11.9 ×× 46.5 ×× 83
చైనా ×× 0.10 ×× 2.00 ×× 24.7
పై అంకెల అర్ధం ఏమంటే చైనా గనుక దారిద్య్ర రేఖను రోజుకు 6.85 డాలర్లుగా నిర్ణయిస్తే అక్కడ 24.7శాతం మంది, అదే మనదేశంలో అయితే 83శాతం మంది దారిద్య్రంలో ఉన్నట్లు భావించాలి. 2.15 డాలర్లంటే చైనాలో దారిద్య్రం లేనట్లే. అందువలన మన పాలకులు దారిద్య్ర రేఖను ఎంతగా నిర్ణయిస్తారో, ఏ దేశంతో పోల్చుకుంటారో చూడాలి. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుకాకుండా చైనాను త్వరలో అధిగమిస్తామని చెబుతున్నారు గనుక దానితో పోల్చుతారా ?
ప్రపంచ ఆకలి సూచికను తయారు చేస్తున్న వారు పిల్లల్లో గిడసబారుతనం,ఎత్తుకు తగిన బరువు లేకపోవటం, బరువు తక్కువగా పుట్టటం, పసి ప్రాయ మరణాలు, తగినన్ని కాలరీల శక్తిని తీసుకోకపోవటాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పిల్లల్లో ఈ లోపాలు ఉన్నాయంటే తలిదండ్రులకు తగిన రాబడి లేకపోవటం తప్ప వేరు కాదు.2019 నుంచి 2021 మధ్య జరిపిన ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం ఐదేండ్ల లోపు పిల్లల్లో 35.5శాతం మంది గిడసబారిన వారు, 19.3శాతం ఎత్తుకు తగిన బరువు లేమి, 32.1శాతం మంది ఉండాల్సినదాని కంటే తక్కువ బరువుతో ఉన్నట్లు తేలింది. అచ్చేదిన్ అని చెప్పి అధికారానికి వచ్చిన వారి ఏలుబడిలో గురజాడ చెప్పినట్లు భావిభారత పౌరులు ఈసురోమంటున్నారు. పోషణ అభియాన్ పేరుతో బడుల్లో మధ్యాహ్న భోజన పధకం అమలు చేస్తున్నారు. దాని లక్ష్యం ఏమిటి అంటే ఆరు సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో 38.4శాతంగా ఉన్న గిడసబారుతనాన్ని 2016 నుంచి 2022 నాటికి ఏటా రెండుశాతం చొప్పున 25శాతానికి తగ్గింపు, పూర్తిగా పోగొట్టాలంటేే మరో పదమూడు సంవత్సరాలు పడుతుంది. ఇదే విధంగా పోషకాహార లేమి, తక్కువ బరువుతో పుట్టే పిల్లల తగ్గింపు కూడా ఏటా రెండు శాతం అని, రక్తహీనతను మూడుశాతం చొప్పున తగ్గిస్తామని పేర్కొన్నారు.రక్త హీనత అనేక అనర్దాలకు హేతువుగా ఉంది. రక్తహీనత ముక్త భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం 2018లో కొన్ని పధకాలను ప్రారంభించింది. ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-20 ప్రకారం దేశంలో 15-49 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళల్లో 50శాతం మంది, ఆరు నెలల నుంచి ఆరేండ్ల లోపు పిల్లల్లో 59శాతం మంది రక్తహీనతతో ఉన్నారు.ఏటా మూడు శాతం చొప్పున 2018 నుంచి 2022లోపు దాన్ని తగ్గిస్తామని చెప్పారు.ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. సర్వేకు ఎంపిక చేసిన ప్రశ్నావళి నుంచి రక్తహీనత అంశాన్ని తొలగించారు. అంటే వాస్తవ పరిస్థితి తెలవకుండా పాతరేసేందుకు పూనుకున్నారు. ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్థ గురించి కలలు కంటున్నా, ప్రపంచంలో ఐదవ స్థానానికి జిడిపిని వృద్ది చేశామని చెప్పినా ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్న. జనాలకు ఒక్క బియ్యమో, గోధుమలో ఉచితంగా ఇస్తే సమగ్ర పోషకాహారం లభిస్తుందా ? మిగతా వాటి సంగతేమిటి ? వాటికి కావాల్సిన ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వ విధానాలేమిటి ?
