Tags
BJP, China, Donald trump, India-US trade, India’s manufacturing hopes, Narendra Modi Failures, US-China Tariff deal, Xi Jinping
ఎం కోటేశ్వరరావు
పరస్పరం లబ్ది పొందే విధంగా భారత్ మరియు అమెరికా మధ్య నిర్మాణాత్మకంగా వాణిజ్య చర్చలు జరుగుతున్నట్లు మన వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్ నాలుగు రోజుల అమెరికా పర్యటన తరువాత శుక్రవారం నాడు ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. వెంటనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆపిల్ కంపెనీ భారత్‌లో గనుక ఉత్పత్తి కొనసాగిస్తే వాటి మీద 25శాతం పన్ను విధిస్తామని ప్రకటించాడు. ఒక రోజు ఆగి శామ్‌సంగ్ మీద కూడా అన్నాడు. అయినా సరే ఆ కంపెనీలు మనదేశంలో ఫోన్లు తయారీ చేస్తాయని చెబుతున్నారు. వెయ్యి డాలర్లకు యాపిల్ ఫోన్ తయారు చేస్తే 25శాతం చొప్పున 250 పన్ను చెల్లింపు, మరో 30డాలర్లు అసెంబ్లింగ్ ఖర్చు పోయినా అమెరికాలో తయారు చేసేదాని కంటే ఇంకా 280 డాలర్ల మేర లాభం ఉంటుంది గనుక ట్రంప్‌ను ఖాతరు చేయదని అంటున్నారు.మనం వాడుతున్న ఫోన్లలో ఒక్కో భాగం ఒక్కో దేశంలో తయారై వాటిని ఒక చోట చేర్చి మనం వాడే ఫోన్లుగా తయారు చేస్తారు. ఇది ఎక్కడ చౌక అయితే అక్కడికి ఏ కంపెనీ అయినా తరలిపోతుంది. అంటే ఆయా దేశాలు విడి భాగాలు నాణ్యం, చౌకగా తయారు చేయటాన్ని బట్టి వాటికి మార్కెట్ ఉంటుంది. అన్నీ ఒక దగ్గరకు చేర్చే ప్రక్రియసాధనాన్ని సరఫరా గొలుసు అంటున్నారు. పియూష్ గోయల్ అమెరికా వెళ్లటంతో ఆ పర్యటన మన దేశానికి శక్తినిస్తుందా ముప్పు తెస్తుందా అన్న సందేహాలు తలెత్తాయంటేనే అనుమానబీజం పడినట్లు. ఏం సాధిస్తారో చూద్దాం !
అమెరికా,చైనా నేతలు పన్నుపోరుకు తెరతీసినపుడు మనదేశంలోని పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు గాలివాటు లాభాలే లాభాలు అని సంబరపడ్డారు. చైనా సరఫరా గొలుసు బద్దలవుతుందని, దాని స్థానంలో తాముంటామని అమెరికాతో వాణిజ్యంలో మరింత లబ్ది పొందుతామని కలలు కన్నారు. అయితే ఆ రెండు దేశాలు జెనీవా ఒప్పందం కుదుర్చుకోవటంతో కుదేలయ్యారు.దేశమంతా పహల్గాం దారుణం, తదనంతర పరిణామాలతో నిమగ్నం కావటంతో దీని గురించి మీడియా పెద్దగా పట్టించుకోలేదు. ఆశలు కల్పించటంలో అది కూడా తక్కువ తినలేదు గనుక తేలుకుట్టిన దొంగలా ఉంది. జెనీవా ఒప్పందం జనాల నిత్యజీవితంపై వెంటనే ప్రభావం చూపేది కానందున మన జనాలకూ పట్టలేదు. వాణిజ్యంలో మనదేశం అమెరికాకు ఎక్కువ ఎగుమతి చేస్తూ తక్కువ దిగుమతి చేసుకుంటోంది. రెండు దేశాలూ పరస్పరం పన్నులు లేకుండా ఒప్పందం చేసుకుంటాయనే ప్రచారం జరిగింది. దాని వలన అమెరికాకు ఎక్కువ లాభం తప్ప మనకు కాదు. దిగుమతుల ముప్పు లేకుండా అనేక వస్తువుల మీద పెద్ద మొత్తంలో పన్నులు వేస్తూ మన వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు ఒక రక్షణ గోడ కట్టాం. దాన్ని బద్దలు చేయాలని ట్రంప్ కోరుతున్నాడు. నరేంద్రమోడీ అందుకు అంగీకరించినా, నామమాత్రపు పన్నులు వేసినా మన కోళ్ల, పాడి పరిశ్రమలు, వ్యవసాయం వంటివి కుదేలు అవుతాయి. అక్టోబరులో అనుకున్నది జూలై రెండవ వారంలో ఒప్పందం కుదురుతుందనే వార్తలు వచ్చాయి గనుక అప్పటి వరకు వేచి చూద్దాం. రెండు ఆర్థిక అగ్రరాజ్యాలు ఒప్పందం కుదుర్చుకున్న తరువాత వస్త్రాలు,ఔషధ, ఎలక్ట్రానిక్స్ రంగాలలో మనదేశానికి ఉన్నట్లు భావిస్తున్న అవకాశాలు కుచించుకుపోయినందున వ్యూహాత్మక పునరాలోచన చేయాల్సి ఉందని పోలిసీ సర్కిల్స్ అనే మీడియా ‘‘ అమెరికాచైనా పన్నుల ఒప్పందం భారత ఉత్పత్తిదారుల ఆశలను కల్లలు చేసింది ’’ అనే పేరుతో చేసిన ఒక విశ్లేషణలో పేర్కొన్నారు.దాని సారాంశం ఇలా ఉంది. కొద్ది వారాలకు ముందు భారత ఎగుమతిదారులు ఉత్సాహంతో ఎగిరి గంతులు వేశారు, ఇప్పుడు నీరుగారిపోయారు. అమెరికా వస్తువుల మీద పది, చైనా వస్తువుల మీద 30శాతం పన్నుల విధింపుకు రెండు దేశాలు అంగీకరించాయి. దీంతో మన ఎగుమతిదార్ల లెక్కలు తారుమారయ్యాయి. అయితే మన వస్తువుల మీద విధిస్తున్న పదిశాతంతో పోలిస్తే చైనా సరకుల మీద 30శాతం ఉన్నందున మన ఎగుమతి అవకాశాలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయని కూడా కొందరు భావిస్తున్నారు. మన దేశం నుంచి ఎగుమతి చేస్తే 20శాతం పన్నులు తక్కువగా ఉంటాయి గనుక వైద్య పరికరాలను తయారు చేసే పరిశ్రమలు భారత్‌కు రావచ్చని భావిస్తున్నారు. అయితే ఇది అమెరికాతో మనదేశం జరుపుతున్న చర్చల ఫలితాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఐఫోన్లను భారత్‌లో తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేస్తే 25శాతం పన్ను విధిస్తామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
చైనా ప్లస్ ఒకటి అనే విధానం కింద అనుసరించిన తీరు కూడా మిశ్రమ ఫలితాలే ఇచ్చాయి.వియత్నాం,థాయ్‌లాండ్, కంపూచియా వంటి దేశాలు ఎక్కువగా సంస్థలను ఆకర్షించటానికి కారణం అక్కడ మనకంటే ఖర్చులు తక్కువగా ఉండటం, సులభమైన విధానాలతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలే కారణం. ఆపిల్ ఫోన్ల తయారీలో తప్ప ఇతర రంగాలలో మనం పెద్దగా రాణించలేదు. జెనీవా ఒప్పందం తాత్కాలిక స్వభావం భవిష్యత్ అనిశ్చితిని ముందుకు తెచ్చింది.ఆఫ్రికా మార్కెట్‌లోకి ఇటీవల మన ఎగుమతిదార్లు చొచ్చుకుపోయారు, అయితే ఈ ఒప్పందం చైనాకు అనుకూలతను పునరుద్దరించింది. ఒప్పందంలో లేని అంశాలు భారత్‌కు అనుకూలమే అయినా అమెరికాతో కుదిరే వాణిజ్య ఒప్పందం మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచ ఉత్పత్తిదారుగా మారాలన్న లక్ష్యం అంత తేలిక కాదు. ఏప్రిల్ 25న ఇదే పొలిసీ సర్కిల్స్ చేసిన విశ్లేషణలో ఎంతో ఆశాభావం, అపరిమిత లాభాల గురించి చర్చించారు. చైనాపై ట్రంప్ ప్రకటించిన 145, 245శాతాల పన్నులు అమలు జరుగుతాయని అనేక మంది భావించారు.కౌంటర్ పాయింట్ రిసర్చ్ వేసిన అంచనా ప్రకారం 2026 నాటికి ప్రపంచ స్మార్ట్ ఫోన్ల తయారీలో చైనా వాటా 64 నుంచి 55కు, భారత్ 18 నుంచి 25లేదా 28శాతానికి పెంచుకుంటుందని పేర్కొన్నారు.ఆపిల్ కంపెనీ భారత్‌లో తన ఉత్పత్తి వాటాను 202627 నాటికి 20 నుంచి 35శాతానికి పెంచుకోనుందని కూడా పేర్కొన్నారు.(దీనికి పిఎల్‌ఐ స్కీము కింద ఇచ్చే రాయితీలు ప్రధాన కారణం, ఆ సొమ్ము అయిపోయిన తరువాత సంగతేమిటి ?) కానాలిస్ సమాచారం ప్రకారం 2024లో 79శాతం డెల్ లాప్‌టాప్‌లు చైనాలో ఉత్పత్తి కాగా వచ్చే ఏడాది నాటికి సగం ఉత్పత్తిని వియత్నాం నుంచి చేయాలని ఆ కంపెనీ, అదే విధంగా చైనాలో 85శాతం ఉన్న ఉత్పత్తిని హెచ్‌పి కంపెనీ తైవాన్, మెక్సికోలకు గణనీయంగా తరలించాలని చూస్తోంది.
చైనా ప్లస్ ఒకటి అనే విధానంలో వియత్నాం,థాయ్‌లాండ్, కంపూచియా, మలేసియాలతో పోలిస్తే మన దేశం పరిమితమైన విజయాన్ని సాధించిందని నీతి అయోగ్ పేర్కొన్నది. ఇనుము, ఉక్కు రంగంలో 2025 ఆర్థిక సంవత్సరం తొలి మూడు మాసాల్లో మన ఎగుమతులు 33శాతం తగ్గాయి, దీనికి చైనా సరఫరా ఎక్కువగా ఉండటంతో పాటు దిగుమతులు చేసుకొనే దేశాల్లో గిరాకీ కూడా తగ్గింది. చైనా వస్తువులపై 60శాతం పన్నులు ఉంటే భారత్ పోటీ పడే వీలు కలుగుతుందని కూడా నీతి అయోగ్ పేర్కొన్నది. కానీ ఇప్పుడు 30శాతం ఉన్నాయి, రానున్న రోజుల్లో తమ మీద భారం ఎక్కువ అనుకుంటే ట్రంప్ తగ్గించినా ఆశ్చర్యం లేదు. మన పరిస్థితి ఏమిటన్నది సమస్య.చైనా ఇప్పుడు మరింత లాభదాయకమైన వస్తు ఉత్పత్తి మీద కేంద్రీకరించింది. శ్రమశక్తి ఎక్కువగా ఉండే వాటిని క్రమంగా తగ్గిస్తున్నది. అయినా అలాంటి వాటిని అందిపుచ్చుకోవటంలో మనం వెనుకబడి ఉన్నాం. అప్పనంగా రావాలంటే ఏదీ మన దగ్గరకు రాదు. విషాదం ఏమిటంటే జిడిపిలో నాలుగో స్థానం, త్వరలో అమెరికా, చైనాలను అధిగమిస్తాం అన్న పోసుకోలు కబుర్లు చెబుతున్నారు. పదకొండు సంవత్సరాల మోడీ పాలన తరువాత అదీ నైపుణ్య వృద్ధి పేరుతో వేల కోట్లు ఖర్చు చేసిన తరువాత ప్రపంచంలో నైపుణ్య కార్మిక శక్తిలో 25వ స్థానంలో ఉన్నాం. అంటే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేని దుస్థితి. ఆపిల్ ఫోన్ల ఎగుమతి గురించి కేంద్ర పాలకులు పెద్దగా ప్రచారం చేస్తున్నారు. అమెరికాచైనా ఒప్పందం మన ఆశల మీద నీళ్లు చల్లిందని బిబిసి వ్యాఖ్య పేర్కొన్నది. ఇప్పుడు చైనా వస్తువుల మీద 30శాతం, మన వస్తువుల మీద 27 శాతం అమెరికా పన్ను విధిస్తున్నది. దీంతో చైనా నుంచి మన దేశానికి వస్తాయని చెప్పిన పరిశ్రమలు, కంపెనీలు, పెట్టుబడులు ఇప్పుడు వస్తాయా ? గత పదకొండు సంవత్సరాల నుంచి చెబుతున్న కబుర్లు ఆచరణలో కనిపించటం లేదు. చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలున్నాయని చెప్పేవారు కొనసాగిస్తూనే ఉన్నారు. వాటిని పాలకులు మన జనాలకు రంగుల కలగా చూపుతున్నారు. మోడీ విధానాలు దీర్ఘకాలంలో ఫలితాలు ఇస్తాయంటున్నారు. పదకొండు సంవత్సరాలలో మన పారిశ్రామిక ఉత్పత్తి జిడిపిలో 15శాతం చుట్టూ తిరుగుతున్నది తప్ప పెరగటం లేదు, పిఎల్‌ఐ పధకం పరిమితంగానే ప్రయోజనం కలిగించింది. నిజానికి యుపిఏ హయాంలో ఎక్కువగా ఉంది. కుండలో కూడు కదలకూడదు పిల్లోడు మాత్రం దుడ్డులా మారాలి అన్నట్లుగా మన వ్యవహారం ఉంది. ఇది నేను అంటున్నది కాదు. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా చెప్పిందే. పరిశోధన మరియు అభివృద్ధి రంగానికి జిడిపిలో మనదేశం 0.64శాతం ఖర్చు చేస్తుంటే చైనా 2.68, అమెరికా 3.5 శాతం చివరికి చైనాలోని ఒక్క హువెయి సంస్థ చేస్తున్న మొత్తం భారత్‌లో ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఖర్చు కంటే ఎక్కువ అన్నారు. పరిస్థితి ఇలా ఉంటే సాంకేతికంగా మనం వెనుకబడక ఎక్కడ ఉంటాం అని ప్రశ్నించారు.
రాజకీయంగా నరేంద్రమోడీ తన ప్రధాని పదవీ కాలంలో ఇంతటి విపత్కర పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదంటే అతిశయోక్తి కాదు. ఇంటా బయటా ఉన్న వంది మాగధుల కారణంగా విశ్వగురువుగా వర్ణితమైనందున ఇప్పుడు అదే ఇరకాటాన్ని తెచ్చింది. ఉదాహరణకు భారత్`పాకిస్తాన్ మధ్య తానే మధ్యవర్తిగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చానని ట్రంప్ ప్రకటించటాన్ని అంగీకరిస్తే గురు పీఠాన్ని స్వయంగా తక్కువ చేసుకున్నట్లు అవుతుంది. దాంతో పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన ప్రతిపాదనను అంగీకరించామని ప్రధమగణాలతో చెప్పించారు. అయినా ట్రంప్ పదే పదే అదే చెప్పాడు. చివరకు విధిలేక పాకిస్తాన్‌తో తలెత్తిన మిలిటరీ పరిస్థితి గురించి అమెరికా నేతలతో ఒప్పందానికి ముందు మాట్లాడినట్లు మన విదేశాంగశాఖ మెల్లగా అంగీకరించింది. పాక్‌పై మనదేపైచేయిగా ఉన్నపుడు ఏం సాధించి అంగీకరించారన్న ప్రశ్న మోడీని మరింత ఇరకాటంలో పెట్టింది. దుర్మార్గానికి పాల్పడిన వాడు ప్రాణభీతితో రాజీ అనగానే అంగీకరించాలా ? పాకిస్తాన్ ఉగ్రవాదులను అప్పగించలేదు, పట్టిస్తామని చెప్పలేదు, అసలు మద్దతు ఇచ్చినట్లు అంగకరించలేదు. ఈ విషయాలన్నీ అడుగుతారని పార్లమెంటు సమావేశం జరపటానికే నిరాకరించారు అపర ప్రజాస్వామికవాది. ప్రజాస్వామ్య దేవాలయం అని స్వయంగా వర్ణించి మొక్కిన పార్లమెంటులో మాట్లాడేందుకు భయపడుతున్నారని జనం అనుకుంటున్నారు. ఎంతటి విపత్కర స్థితి !
