ఎం కోటేశ్వరరావు
అమెరికా సూచించిన నెల రోజుల పాటు కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకరించింది. సంక్షోభ ముగింపుకోసం రెండుదేశాల ప్రతినిధులు మంగళవారం నాడు సౌదీ అరేబియా నగరం జెడ్డాలో సమావేశం జరిపారు. ఈ వర్తమానాన్ని రష్యాకు పంపుతామని ప్రకటించారు.ఉక్రెయిన్ సంసిద్దత వ్యక్తం చేసిందని చెబుతూ నిలిపివేసిన మిలిటరీ సాయం, గూఢచార సమాచార అందచేతను వెంటనే పునరుద్దరించనున్నట్లు అమెరికా ప్రకటించింది. బుధవారం ఉదయం వరకు దీని మీద రష్యా స్పందన వెలువడలేదు.కాల్పుల విరమణ తరువాత ఖనిజాల ఒప్పందం చేసుకోనేందుకు ఏకీభావం కుదిరినట్లు సమాచారం. మరోవైపు పుతిన్, జెలెనెస్కీ సేనలు దాడుల తీవ్రతను పెంచాయి. ఉక్రెయిన్ ఆక్రమించిన కురుస్కు ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు రష్యా సేనలు కేంద్రీకరించాయి. సంప్రదింపులకు తాను పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు సోమవారం నాడే అక్కడకు చేరుకున్న జెలెనెస్కీ ప్రకటించాడు. యుద్ధం ప్రారంభమైన మరుసటి రోజునుంచే తాము శాంతిని కోరుతున్నామని, కొనసాగటానికి రష్యాయే కారణమని సామాజిక మాధ్యమంలో ఆరోపించాడు. ఒకవైపు మిలిటరీ సాయం, గూఢచార సమాచార అందచేత నిలిపివేసి ఉక్రెయిన్ మీద, దారికి రాకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తానని రష్యాను ట్రంప్ బెదిరించాడు.తాము ఇరుపక్షాల పట్ల సమవైఖరితో ఉన్నట్లు కనిపించేందుకు ఒక ఎత్తుగడగా ఇలా చేసినట్లు కొందరు చెబుతున్నారు. కురుస్కు ప్రాంతంలో తిష్టవేసిన జెలెనెస్కీ సేనలను అదుపులోకి తెచ్చుకొనేందుకు రష్యా ఏడువైపుల నుంచి చక్రబంధాన్ని బిగిస్తున్నట్లు వార్తలు. దీన్ని బ్రిటన్ మిలిటరీ గూఢచారులు కూడా ధృవీకరించారు. ఉక్రెయిన్ వైపు నుంచి కురుస్కు వచ్చే రోడ్లను మూసివేసినట్లు చెబుతుండగా తమకు ఎలాంటి ముప్పు లేదని జెలెనెస్కీ మిలిటరీ ప్రకటించింది. కొద్ది నెలల క్రితం ఉక్రెయిన్ సేనలు ఈ ప్రాంతంలో పదమూడువేల చదరపు కిలోమీటర్ల మేర రష్యా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాయి. దానిని తిరిగి స్వాధీనం చేసుకోవటం కంటే రష్యా ఉక్రెయిన్ మీద దాడులు కేంద్రీకరించింది. రష్యాతో జరిపే చర్చల్లో తాను ఆక్రమించుకున్న ప్రాంతాన్ని తురుపుముక్కగా వినియోగించుకోవాలని జెలెనెస్కీ చూశాడు. అయితే దాని గురించి పుతిన్ ఎలాంటి ప్రస్తావన తేవటం లేదు. ఫిబ్రవరి నాటికి 800 చదరపు కిలోమీటర్ల మేర స్వాధీనం చేసుకున్నట్లు ఇప్పుడు మిగిలిన ప్రాంత విముక్తికి కేంద్రీకరించినట్లు వార్తలు. రష్యన్ల మాదిరే క్లిష్టమైన నిర్ణయాలు చేసేందుకు జెలెనెస్కీ సిద్దం గావాలని జెడ్డాకు వస్తూ అమెరికా విదేశాంగ మంత్రి మారియో రూబియో విమానంలో విలేకర్లతో చెప్పాడు.
ఏం జరుగుతుందో చూద్దామన్నట్లుగా ఉన్న ఐరోపా యూనియన్ మంగళవారం నాడే పారిస్‌లో భేటీ అయింది. ముప్పై దేశాలకు చెందిన మిలిటరీ అధిపతులు, రాజకీయవేత్తలు పాల్గొన్నారు.ఈ సమావేశాల్లో ఉక్రెయిన్ భద్రత, సాయం గురించి చర్చించినట్లు తప్ప వివరాలు వెల్లడి కాలేదు. శనివారం నాడు బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ ప్రపంచ నేతలతో అంతర్జాలంలో మాట్లాడేందుకు నిర్ణయించారు. కలసి వచ్చే వారితో ఒక కూటమి ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికాతో తాము దగ్గర కావటం తమ ప్రయోజనాలకు భంగకరమని బ్రిటన్ భావిస్తున్నదని రష్యన్ విదేశీ గూఢచార సంస్థ ఒకటి పేర్కొన్నది.గూఢచర్య ఆరోపణలతో ఇద్దరు తమ దౌత్యవేత్తలను బహిష్కరిస్తూ రష్యా తప్పుడు ఆరోపణలు చేసిందని బ్రిటన్ ఆరోపించింది. ఇదే తొలిసారి కాదని గతంలో కూడా ఇలాగే చేసిందని పేర్కొన్నది. గతేడాది ఏడుగురు బ్రిటీష్ దౌత్య సిబ్బందిని రష్యా ఇదే ఆరోపణలతో బహిష్కరించింది. తాజా బహిష్కరణకు ముందు లండన్‌లోని రష్యా దౌత్యసిబ్బందిలో ఒకరి నియామకాన్ని రద్దు చేసింది, కార్యాలయ వ్యవహారాలను పరిమితం కావించింది.దీనికి ప్రతిగా రష్యా బ్రిటీష్ దౌత్యవేత్తలను బహిష్కరించింది.వారు తప్పుడు సమాచారంతో రష్యాలో ప్రవేశించినట్లు తెలిపింది. తొలి రోజుల్లో ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి ముందుకు వచ్చినప్పటికీ బ్రిటన్ అడ్డుపడినట్లు గతంలో వార్తలు వచ్చాయి, అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవు.తాజాగా ఉక్రెయిన్‌కు మద్దతుగా అనేక దేశాలను బ్రిటన్ సమీకరిస్తున్నది. ఉక్రెయిన్‌కు శాంతి పరిరక్షణ పేరుతో మిలిటరీని పంపితే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని ఆస్ట్రేలియాను అక్కడి రష్యా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో హెచ్చరించింది. పశ్చిమ దేశాల బూట్ల చప్పుళ్లను చూస్తూ ఊరుకోబోమని పేర్కొన్నది. తమ గడ్డ నుంచి రిమోట్ ద్వారా ప్రయోగించే 45లక్షల డ్రోన్లను తయారు చేయనున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. వాటిలో బాంబులను పెట్టి సరిహద్దులో లేదా రష్యా ఆధీనంలోని ప్రాంతాల మీద దాడులకు వీటిని వినియోగిస్తారు.
అనూహ్యమైన రాజకీయ పరిణామాల పూర్వరంగంలో చైనా మధ్యవర్తిత్వంతో ఉప్పు నిప్పుగా ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్ రాజీకి వచ్చి సాధారణ సంబంధాలు నెలకొల్పుకుంటున్నాయి. రాజు మహమ్మద్‌బిన్ సల్మాన్ అధికారానికి వచ్చాక అమెరికాకు దూరం జరుగుతూ అంతర్జాతీయ సమావేశాలకు తటస్థ వేదికగా తయారవుతున్నారు. అరబ్‌లీగ్ సమావేశాలు అక్కడే జరిగాయి, ఉక్రెయిన్‌పై చర్చలకు సైతం తెరతీశారు. మధ్య ప్రాచ్యంలో తిరుగులేని శక్తిగా కనిపించేందుకు చూస్తున్నారు. అందరూ ఎదురుచూస్తున్న శాంతి కావాలో లేదో ఉక్రెయిన్ తేల్చుకోవాలని సౌదీ చర్చలపై రష్యా స్పందించింది. సముద్ర, వాయుదాడుల నిలిపివేతకు ఒప్పందం కుదుర్చుకోవాలని ఉక్రెయిన్ ప్రతిపాదించే అవకాశం ఉందని, మరోసారి దాడులు రష్యా దాడులు జరగకుండా రక్షణ కోసం పట్టుబట్టవచ్చని వార్తలు, గతంలో ఐరోపా యూనియన్ కూడా దీన్నే ప్రతిపాదించింది. వీటిని మాత్రమే సులభంగా పర్యవేక్షించవచ్చని చెబుతున్నారు. ఈ వారంలో అమెరికాతో చర్చలు జరిగే అవకాశం లేదని, ఆవైపు నుంచి ఎలాంటి వర్తమానం రాలేదని రష్యా విదేశాంగశాఖ ప్రకటించింది. వారితో సంబంధాల పునరుద్దరణ గురించి సంప్రదింపులు ప్రాధమికదశలో ఉన్నాయని రష్యా ప్రతినిధి దిమిత్రి పెట్కోవ్ చెప్పాడు. మార్గం ఎంతో క్లిష్టంగా, సుదీర్ఘంగా ఉందని అయినప్పటికీ రెండు దేశాల నేతలు రాజకీయ సంకల్పాన్ని ప్రకటించారని అన్నాడు.ఉక్రెయిన్‌కు తన స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన ఎలన్ మస్క్ ప్రశ్నించిన వారిని మీరెంత, మీ బతుకెంత నోరు మూసుకోండి అంటూ విరుచుకుపడుతున్నాడు.తన సేవలు నిలిపివేస్తే జెలెనెస్కీ సేనలు కుప్పకూలిపోతాయని కూడా అన్నాడు. ఉక్రెయిన్ తరఫున స్టార్‌లింక్‌కు రుసుము చెల్లిస్తున్న పోలాండ్ దీని మీద స్పందిస్తూ తాము ప్రత్నామ్నాయ కంపెనీ సేవలను ఎంచుకుంటామన్నది.మస్క్‌కు అంత అహంకారం పనికి రాదని పేర్కొన్నది. స్టార్‌లింక్ లేకపోతే ఉక్రెయిన్ ఎప్పుడో ఓడిపోయి ఉండేదని అమెరికా మంత్రి రూబియో వ్యాఖ్యానించాడు. ఈ పరిణామం తరువాత ఫ్రాంకోబ్రిటీష్ యూటెల్‌సాట్ కంపెనీ వాటాల ధరలు 650శాతం పెరిగాయి.
సౌదీలో మంగళవారం నాటి చర్చలతో వెంటనే తేలేదేమీ ఉండదని వాషింగ్టన్‌మాస్కో సంప్రదింపులకు తెరతీస్తాయని, ఈ లోగా రష్యా తాను చేయదలచుకున్నది చేస్తుందని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి.దానికి నిదర్శనంగా గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఈ పూర్వరంగంలోనే ట్రంప్ ఒక ప్రకటన చేస్తూ అవసరమైతే రష్యా మీద కొత్త ఆంక్షలు, సుంకాలు విధిస్తామని ప్రకటించాడు. పుతిన్‌తో కంటే జెలెనెస్కీతో వ్యవహరించటం ఎంతో క్లిష్టంగా ఉందని కూడా అన్నాడు. ట్రంప్ ప్రకటనను రష్యా ఖాతరు చేయలేదు. తరువాత దాడులను మరింతగా పెంచింది. సరిహద్దుల నుంచి రష్యా రేపే వెళ్లిపోతుందని తాము అనుకోవటం లేదని, కాల్పుల విరమణ కొన్ని నెలలు, సంవత్సరాలు ఉన్నప్పటికీ తమ తరువాత భద్రత గురించి ఉక్రెయిన్ ఆలోచిస్తున్నది. కొద్ది రోజుల క్రితం సౌదీలో జరిగిన చర్చలలో తాత్కాలిక కాల్పుల విరమణకు షరతులతో రష్యా సుముఖత చూపింది. అంతిమంగా కుదరాల్సిన శాంతి ఒప్పందంలో ఉండాల్సిన అంశాల గురించి ముందే వెల్లడిరచాలని, ఏ ఏ దేశాలు భాగస్వాములౌతాయి, శాంతి పరిరక్షణ ఎలా జరుగుతుంది అన్నది స్పష్టం కావాలని షరతులు పెట్టింది. ఉక్రెయిన్ గడ్డపై నాటో దళాల ఏర్పాటును వ్యతిరేకించింది. ఆ తరువాతే శాంతి పరిరక్షణకు సముఖంగా ఉండే దేశాలతో కూటమి ఏర్పడాలని ఐరోపా యూనియన్ ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది.చైనా, భారత్ వంటి దేశాలతో కూడినది తమకు అనువుగా ఉంటుందనే సంకేతాలను రష్యా పంపింది.
అమెరికాతో సహా ప్రపంచం మొత్తాన్ని వ్లదిమిర్ పుతిన్ వంగదీశాడని, విజయం సాధించాడని మీడియా పండితులు వాపోయారు. నాలుగో ఏట ప్రవేశించిన ఉక్రెయిన్ సంక్షోభంలో ఎటువైపు ఎందరు మరణించారన్నది ఇప్పటికీ వెల్లడికాలేదు. పశ్చిమ దేశాలు లక్షా యాభైవేల నుంచి రెండులక్షల మంది రష్యా సైనికులు మరణించినట్లు చెబుతుండగా ఇంతవరకు 5,937 మంది మరణించినట్లు రష్యా రక్షణమంత్రిత్వశాఖ చెప్పింది.ఉక్రెయిన్ అధికారికంగా చెప్పినదాని ప్రకారం 45,100 మంది మరణించగా 3.9లక్షల మంది గాయపడ్డారు. మొత్తం 80లక్షల మంది పౌరులు విదేశాలకు శరణార్దులుగా వెళ్లటం గానీ తమ నెలవులు తప్పినట్లు చెబుతున్నారు. ఊహించని మలుపులు తిరుగుతున్న ఈ సంక్షోభంలో ఇంతకాలం రష్యాను దురాక్రమణదారుగా వర్ణించిన అమెరికా భద్రతా మండలిలో గతనెలలో ప్రవేశపెట్టిన అలాంటి తీర్మానాన్ని వీటో చేయటం విశేషం. నాటో కూటమిలో ఒక్క ఐరోపా దేశాలు మాత్రమే రష్యాను వ్యతిరేకిస్తున్నాయి. తమ రక్షణకు హామీ ఇవ్వకపోతే ఖనిజాల ఒప్పందం మీద సంతకం చేసేది లేదంటూ ట్రంప్ సమక్షంలో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌తో పదినిమిషాల పాటు జెలెనెస్కీ వాదులాటకు దిగి వెళ్లిపోయాడు. తరువాత మెత్తబడి మరోసారి అమెరికాతో చర్చలకు వచ్చాడు. రష్యా వైఖరిలో ఎలాంటి మార్పులు లేవు. తమ స్వాధీనంలోకి వచ్చిన ఉక్రెయిన్ ప్రాంతాలను తిరిగి అప్పగించేది లేదని, వాటిని స్వతంత్ర దేశాలుగా గుర్తించాలని పుతిన్ పట్టుబడుతున్నాడు. వాటి మీద ఆశలు వదులుకోవాలని ట్రంప్ కూడా జెలెనెస్కీకి చెప్పాడు. ఈ పూర్వరంగంలో సౌదీ చర్చలు ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారితీసేది ఎవరూ చెప్పలేని స్థితి నెలకొన్నది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారానికి వచ్చి 50రోజులు దాటింది.రోజుకొక మాట, ఎప్పుడేం చేస్తాడో తెలియని అనిశ్చితి ప్రపంచాన్నే కాదు, అమెరికాను సైతం ఆవరించింది. ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు చెప్పలేను, ఇప్పుడు సంధికాలంలో ఉన్నాం అన్న ట్రంప్ వ్యాఖ్యతో సోమవారం నాడు అమెరికా స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. నాలుగు లక్షల కోట్ల డాలర్ల మేర సంపద విలువ పడిపోయింది. ఈ ప్రభావంతో చైనా, హాంకాగ్ స్టాక్ మార్కెట్లు కూడా మంగవారం నాడు పతనమైనా తిరిగి కోలుకున్నట్లు వార్తలు. గత ఏడాది కాలంగా కొంత మంది మాంద్య భయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రంప్ గెలిస్తే నివారిస్తాడని అనేక మంది ఆర్థికవేత్తలు ఆశలు పెట్టుకున్నారు.వర్తమాన పరిణామాలను బట్టి సందేహమే అని పెదవివిరుస్తున్నారు.‘‘ జోశ్యాలను నేను అసహ్యించుకుంటాను. మనం చాలా పెద్ద కసరత్తు చేస్తున్నాం గనుక సంధికాలం ఉంటుంది.అమెరికాకు సందపదలను తిరిగి తీసుకువస్తున్నాం, అదే పెద్ద విషయం. అది కొంత సమయం తీసుకోవచ్చు గానీ మనకు ఎంతో గొప్పది. ’’ అని ఆదివారం నాడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. చైనాపై సుంకాల గురించి మాట మార్చలేదు గానీ మెక్సికో, కెనడాల మీద అమలు జరుపుతానని ఒక మాట నెల రోజుల వాయిదా అని మరో మాట, అంతలోనే అబ్బే అదేం లేదంటూ చేస్తున్న ప్రకటనలు కొంత గందరగోళానికి దోహదం చేస్తున్నాయి. రానున్న పన్నెండు నెలల కాలంలో మాంద్య అవకాశాలు 15 నుంచి 20శాతానికి పెరిగినట్లుశుక్రవారం నాడు గోల్డ్‌మన్ శాచస్ ప్రకటించింది. ట్రంప్ ప్రకటించిన సుంకాలు అమల్లోకి వస్తే ధరలు,ద్రవ్యోల్బణ పెరుగుదలతో వృద్ధి రేటు దెబ్బతిని మాంద్యంలోకి పోవచ్చని స్టాక్‌మార్కెట్లో మదుపుదార్లు భయపడుతున్నారు.
