Tags
Awami League, Bangladesh Elections 2024, BNP, Joe Biden, Khaleda Zia, Narendra Modi Failures, Sheikh Hasina, Xi Jinping
ఎం కోటేశ్వరరావు
డెబ్బయ్యారు సంవత్సరాల షేక్ హసీనా వరుసగా బంగ్లాదేశ్‌లో నాలుగవ సారి అధికారానికి వచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలో అధికారంలో ఉన్న మరే దేశ మహిళ ఎవరూ ఇంత దీర్ఘకాలం పదవిలో లేరు.పార్లమెంటులోని 350 స్థానాలకు గాను 300 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. మరో 50 సీట్లను మహిళలకు కేటాయించారు. పార్లమెంటులో తెచ్చుకున్న సీట్ల దామాషాకు అనుగుణంగా ఆయా పార్టీల నుంచి మహిళను నామినేట్ చేస్తారు. ఆదివారం నాడు జరిగిన ఎన్నికల్లో ఆమె నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీ 222 సాధించింది.ఆమెకు మద్దతు ఇస్తున్న కూటమిలోని చిన్న పార్టీలు, స్వతంత్రులను కూడా కలుపుకుంటే మద్దతు ఇంకా ఎక్కువే ఉంటుంది. రద్దయిన పార్లమెంటులో అవామీ లీగ్‌కు 306 స్థానాలున్నాయి. పదిహేడు కోట్ల మంది జనాభా ఉన్న ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బిఎన్‌పి), పరిమితమైన బలం కలిగిన కొన్ని కమ్యూనిస్టు, ఇతర వామపక్షాలతో కూడిన కూటమి, ఇతర చిన్న పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి. ఎన్నికలను తటస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరపాలని, ప్రతిపక్షాల అణచివేతకు నిరసనగా తాము పోటీ చేయటం లేదని అవి ప్రకటించాయి.
ఈ ఎన్నికలలో ఓటర్లు చాలా తక్కువ మంది పాల్గొనటాన్ని బట్టి పాలకపక్షం మీద తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు చెప్పవచ్చు.2018లో జరిగిన ఎన్నికల్లో 80.2, అంతకు ముందు 61.29శాతం ఓట్లు పోలుకాగా తాజాగా 41.8శాతమే నమోదైంది. బంగ్లాదేశ్‌లో ఎవరు అధికారంలో ఉన్నా ఎన్నికల అక్రమాల ఆరోపణలు, విమర్శలు, బహిష్కరించటాలు మామూలే. తమ ప్రభుత్వం మీద వచ్చిన విమర్శలను హసీనా తిరస్కరించారు, స్వేచ్చగా, న్యాయంగా ఎన్నికలు జరిగినట్లు చెప్పారు. పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం కోసం సాగించిన పోరు ఫలించి 1971లో స్వతంత్ర బంగ్లాదేశ్ ఏర్పడింది. ఆ విముక్తి పోరాటానికి నాయకత్వం వహించి బంగ బంధుగా పేరు తెచ్చుకున్న తొలి ప్రధాని షేక్ ముజిబుర్ రహమాన్ కుమార్తె షేక్ హసీనా. 1975లో జరిగిన మిలిటరీ తిరుగుబాటులో ముజిబుర్ రహమాన్‌తో పాటు కుటుంబ సభ్యులందరినీ చంపివేశారు. ఆ సమయంలో విదేశాల్లో ఉన్న హసీనా, ఆమె సోదరి రెహనా, హసీనా భర్త ఎంఎ వాజెద్ మియా ఢిల్లీలో అణుశాస్త్రవేత్తగా పని చేస్తుండటతో అతను, వారి పిల్లలు కూడా హత్యా కాండ నుంచి తప్పించుకున్నారు. తొలుత వారు జర్మనీలో, తరువాత మనదేశంలో ఆశ్రయం పొందారు. ఆమె ప్రవాసంలో ఉండగానే 1981లో అవామీ లీగ్ నేతగా ఎన్నికయ్యారు. తొలుత ప్రతిపక్ష నేతగా ఆ తరువాత 1996 నుంచి 2001వరకు తొలిసారి ప్రధానిగా పని చేశారు.రెండవ సారి 2009లో బాధ్యతలు చేపట్టి అదే పదవిలో కొనసాగుతున్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు ఆమె మీద పందొమ్మిది సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినట్లు చెబుతారు. మత తీవ్రవాదులను అణచివేసిన నేతగా పేరుతెచ్చుకున్నారు. ఆరుపదుల వయస్సులో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆమె ప్రకటించినప్పటికీ 76 సంవత్సరాలు వచ్చినా కొనసాగుతూనే ఉన్నారు.ఆమె సోదరి రెహనా లేదా కుమారుడు సాజిద్ వాహెద్ రాజకీయ వారసులుగా వస్తారని చెబుతున్నారు. ముజిబుర్ రహమాన్ హత్య తరువాత మిలిటరీ నియంత జియావుర్ రహమాన్ అధ్యక్షుడిగా అధికారానికి వచ్చాడు. 1978లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని ఏర్పాటు చేశాడు.1981లో మిలిటరీ తిరుగుబాటులో హతమయ్యాడు. తరువాత ఆ పార్టీకి భార్య ఖలీదా జియా నేతృత్వం వహించటమే కాదు, రెండుసార్లు ప్రధానిగా పని చేశారు.తాజా ఎన్నికలను బహిష్కరించారు. జియాఉర్ రహమాన్ అధికారంలో ఉండగా ముస్లిం ఛాందసవాదులను ప్రోత్సహించి ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు చూశాడు. వర్తమాన రాజకీయాల్లో బిఎన్‌పి మితవాద పార్టీగా ఉంది. దానికి జమాయతే ఇస్లామీ పార్టీ మద్దతు ఇస్తున్నది. మరో మిలిటరీ నియంత ఎర్షాద్ అధికారాన్ని చేజిక్కించుకోవటంతో అతగాడిని గద్దె దించేందుకు షేక్ హసీనా-ఖలీదా జియా ఇద్దరు చేతులు కలిపి ఆందోళనలు నిర్వహించారు. ఎర్షాద్ పదవి నుంచి దిగిన తరువాత ఇద్దరూ ప్రత్యర్దులుగా మారారు.
షేక్ హసీనా పదవీ కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు.కరోనా ముందు వరకు మెరుగ్గా కనిపించిన ఆర్థిక స్థితి తరువాత ఇప్పటి వరకు కోలుకోలేదు.దాంతో 470 కోట్ల డాలర్ల రుణం కోసం ఐఎంఎఫ్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. ధరలు ప్రత్యేకించి ఆహారద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది.కరెన్సీ విలువను తగ్గించటంతో జనజీవితాలు అతలాకుతలమయ్యాయి. దాంతో ప్రధాన ఎగుమతి పరిశ్రమ రెడీమేడ్ దుస్తుల తయారీ రంగంలో కార్మికులు సమ్మెలకు దిగారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు 40 నుంచి 17 బిలియన్ డాలర్లకు తగ్గాయి. అవి మూడు నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. ఈ ఏడాది విదేశీ చెల్లింపులు ఎక్కువగా ఉండటంతో పరిస్థితి ఇంకా దిగజారవచ్చని చెబుతున్నారు. బంగ్లా విముక్తి పోరాట సమయంలో పాకిస్థాన్ పాలకులతో చేతులు కలిపిన విద్రోహులను శిక్షించేందుకు ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. విచారణ జరిపి అనేక మందిని ఉరితీశారు. హేతువాదులను శిక్షించేందుకు, ఇస్లాంను కించపరిచేవారిని దండించేందుకు కొత్త చట్టాలను తేవాలంటూ హిఫాజత్ ఇ ఇస్లామ్ అనే మితవాద సంస్థ పుట్టుకు వచ్చింది.లౌకికవాదులు, హేతువాదులను ఇస్లామిక్ స్టేట్, ఆల్‌ఖైదా వంటి సంస్థలకు చెందిన వారు అనేక మందిని హత్య చేశారు. వారిపట్ల కఠినంగా వ్యవహరించి మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ అమెరికా, ఐరోపాలోని మానవహక్కుల నంస్థలు విమర్శలు చేశాయి. ఎన్నికలను తటస్థ ఆపద్దర్మ ప్రభుత్వం నిర్వహించాలన్న నిబంధనను 2014 ఎన్నికల్లో హసీనా ప్రభుత్వం రద్దు చేసింది. ఆ కారణంతో బిఎన్‌పి 2014 ఎన్నికలను బహిష్కరించింది. ఇప్పుడూ అదే చెప్పింది.
తాజాగా ఎన్నికలు స్వేచ్చగా జరగలేదని అమెరికా, బ్రిటన్ ఆరోపించాయి. వర్తమాన ప్రపంచ రాజకీయాల్లో బంగ్లాదేశ్ ఈ దేశాలకు అనుకూలంగా లేకపోవటమే దీనికి కారణం అని చెప్పవచ్చు. ఒక దేశ అంతర్గత అంశాల్లో మరొక దేశం జోక్యం చేసుకోవటం, వ్యాఖ్యానించటం తగనిపని, నిజంగా అక్రమాలు జరిగితే అక్కడి జనమే తేల్చుకోవాలి తప్ప మరొకరికి హక్కు లేదు.మరోవైపున చైనా, రష్యా, భారత్‌లు హసీనాను అభినందించాయి. ఆ మేరకు రాయబారులు ఆమెను కలిశారు. ప్రధాని నరేంద్రమోడీ ఫోన్ చేసి హసీనాకు అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్‌లో ఉన్న ఏకైక అణువిద్యుత్ కేంద్రాన్ని నిర్మించిన రష్యా రానున్న రోజుల్లో మరింతగా సహకరిస్తామని ప్రకటించింది. ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్ విదేశాంగ విధానం గురించి అనేక కథనాలు వచ్చాయి. చైనా ఇస్తున్న అప్పులతో అది మరొక శ్రీలంకగా మారుతుందన్న ప్రచారం వాటిలో ఒకటి. ఇటీవలి కాలంలో రెండు దేశాలు మరింతగా సన్నిహితం కావటమే దీనికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అమెరికా, ఇతర దేశాల మాదిరి తాజా ఎన్నికల్లో ఫలానా చర్యలు తీసుకోవాలి అంటూ చైనా ఎలాంటి షరతులను బంగ్లా ప్రభుత్వం ముందు ఉంచలేదు. రెండు దేశాల మధ్య సంబంధాలు పెరగటానికి 2012లో జరిగిన పరిణామం ఒక ప్రధాన కారణం. గంగోత్రి నుంచి ప్రారంభమైన గంగానది ఉపనదిని బంగ్లాదేశ్‌లో పద్మ అంటారు. అది అక్కడ పెద్ద నది. పద్మానది మీద కట్టిన భారీ వంతెన నిర్మాణంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రపంచబాంకు ఆ ఏడాది బహిరంగంగా ప్రకటించింది.నిధులు నిలిపివేయటంతో పరువు, ప్రతిష్టలకు సంబంధించిన అంశంగా భావించిన బంగ్లా ప్రభుత్వం చైనాను సంప్రదించగా 360 కోట్ల డాలర్లు ఇచ్చి దాన్ని పూర్తి చేయించింది. రాజధాని ఢాకాతో 21 జిల్లాలను అది అనుసంధానం గావించింది.తరువాత ఇతర దేశాల నుంచి తీసుకున్నట్లుగానే ప్రాజెక్టు రుణాలను చైనా నుంచి కూడా బంగ్లాదేశ్ పొందింది. 2016ay బిఆర్‌ఐ పధకంలో చేరి విద్యుత్ కేంద్రాలు, రైల్వే లైన్లు,రోడ్లు, రేవులు, సొరంగాల వంటి పదిహేడు ప్రాజెక్టులకు రుణాలు పొందింది. అంతే కాదు, తనకు అవసరమైన ఆయుధాల్లో 74శాతం చైనా నుంచి పొందుతున్నది. పశ్చిమ దేశాలతో ప్రత్యేకించి అమెరికా పోల్చుకుంటే ఎంతా లాభసాటిగా ఉండటమే చైనా పెట్టుబడుల వైపు మొగ్గుకు కారణం.
తన దారికి రాని దేశాల మీద మానవహక్కుల ఉల్లంఘన పేరుతో అమెరికా దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ మీద కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించింది. ఈ కారణంగా కూడా హసీనా సర్కార్ చైనాకు మరింత చేరువైంది.2021లో అమెరికా నిర్వహించిన ప్రజాస్వామ్య సదస్సుకు బంగ్లాదేశ్‌ను ఆహ్వానించలేదు. అప్పుడు చైనా రాయబారి బంగ్లాకు మద్దతుగా నిలిచారు.తన ఇండో-పసిఫిక్ వ్యూహం(క్వాడ్)లో చైనాకు వ్యతిరేకంగా కలసి రావాలని జోబైడెన్ తెచ్చిన వత్తిడిని బంగ్లా తిరస్కరించింది. ప్రచ్చన్న యుద్ధ ఆలోచనలు, కూటమి రాజకీయాలకు బంగ్లాదేశ్ దూరంగా ఉండాలని 2022లో చైనా బహిరంగంగానే హితవు చెప్పింది. దాంతో తాము అలీన విధానంతో స్వతంత్ర వైఖరిని అనుసరిస్తామని తరువాత బంగ్లాదేశ్ ప్రకటించింది. అమెరికా చెబుతున్నదానికి భిన్నంగా తైవాన్ ప్రాంతం చైనాలో అంతర్భాగమే అని ఒకే చైనా అని కూడా చెప్పింది.కొల్‌కతాకు 212 నాటికల్ మైళ్ల దూరంలో బంగాళఖాత తీరంలోని కాక్స్‌బజార్ రేవు ప్రాంతంలో నిర్మించిన జలాంతర్గామి కేంద్రానికి చైనా 120 కోట్ల డాలర్ల సాయంచేసినంత మాత్రాన భారత్ రక్షణకు ఎలాంటి ముప్పు లేదని బంగ్లాదేశ్ ప్రకటించింది. చైనా తమకు ఆర్థిక భాగస్వామి తప్ప రక్షణకు కాదని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లో చైనా నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలతో భారత్ కూడా లబ్దిపొందుతుందని ఈశాన్య భారతానికి వేగంగా భూ, జలమార్గాల ద్వారా సరకు రవాణా చేయవచ్చని కొందరు నిపుణులు చెప్పారు. చైనా పెట్టుబడులతో బంగ్లాదేశ్‌కు ఎలాటి ముప్పు లేదని వాటి మీద పెట్టుబడి కంటే లాభాలు ఎక్కువ అని జహంగీర్ నగర్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సాహెబా నామ్ ఖాన్ చెప్పాడు.
ఇక చైనా రుణాల గురించి తప్పుడు ప్రచారం బంగ్లాదేశ్ మీద కూడా చేస్తున్నారు.ప్రస్తుతం బంగ్లాదేశ్‌కు 2023లో 7,230 కోట్ల డాలర్ల విదేశీ రుణం ఉంది. వాటిలో ప్రపంచ బాంకు నుంచి 1,820, ఆసియన్ అభివృద్ధి బాంకు నుంచి 1,330, జపాన్ నుంచి 920, రష్యా నుంచి 510, చైనా నుంచి 480, భారత్ నుంచి 102 కోట్లు ఉన్నాయని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఎంఎ అబ్దుల్ మోమెన్ చెప్పాడు. దీన్ని బంగ్లాదేశ్‌కు అన్ని దేశాల నుంచి రుణాలు కావాలి, తీసుకుంటున్నది. ఇవి గాక వివిధ పథకాలకు తీసుకొనే రుణాలు వేరు. అమెరికా తెస్తున్న వత్తిడి, సృష్టించిన పరిస్థితిని చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నదని మన నరేంద్రమోడీ సర్కార్ అమెరికాకు తెలిపినట్లు 2023 ఆగస్టు 28వ తేదీ హిందూస్తాన్ టైమ్స్ పత్రిక రియాజుల్ హెచ్ లస్కర్ పేరుతో ఒక సమీక్ష ప్రచురించింది.ప్రతిపక్ష బిఎన్‌పికి మతోన్మాద జమాతే ఇస్లామీ మద్దతు ఉంది, దానికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నందున షేక్ హసీనా గెలవటం మన దేశానికి ఊరట కలిగించే అంశమే.
