డాక్టర్ కొల్లా రాజమోహన్,
కృష్ణ – గోదావరి బేసిన్ ఆంధ్ర రాష్ట్రంలోని తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా,గుంటూరు జిల్లాలలో వ్యాపించి ఉన్నది. ఇది భూఉపరితల పరంగా చూస్తే 28 వేల చదరపు కిలోమీటర్లలోను, సముద్రగర్భంలో 24 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. కేంద్ర పభ్రుత్వరంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC)- 14 ఆగస్టు 1956 నుండి చమురు, గ్యాస్ నిక్షేపాల కోసం పరిశోధనలు జరుపుతున్నది.1978వ సంవత్సరంలో నర్సాపురం వద్ద మొదటిబావిని తవ్వి గ్యాస్ ను కనుగొన్నా రు. ఆ బేసిన్ లోని ఇతర ప్రాంతాల్లో కూడా చమురు, గ్యాస్ నిక్షేపాలు బయటపడ్డాయి. ఓ యన్ జీ సీకి ఉన్న ఆస్తులన్నిటిలోకీ అత్యంత ఎక్కువ ఉత్పాదకత వున్న విలువైన ఆస్తుల్లో కేజీ బేసిన్ ముఖ్యమైనది. ఇలాంటి సంపద్వంతమైన కేజీ బేసిన్ నిలువలు మన ముంగిట్లో వున్నా ఆంధ్రపజ్రలకు అందుబాటులో లేకపోవడమే విషాదం.
తాజా పరిణామం…
కాకినాడకు 30 కిలోమీటర్ల దూరాన సముద్రగర్భం నుండి 2024, జనవరి7న ముడిచమురు ఉత్పత్తి ప్రారంభమవటమే తాజా పరిణామం. కృష్ణ – గోదావరి బేసిన్ లో సహజవాయువుతో పాటుగా చమురు ఉత్పత్తి విలువ కొన్ని లక్షల కోట్లకు మించి ఉంటుందని అంచనా. ఆంధ్రతీరంలోవున్న చమురు నిక్షేపాలు దేశ ఆర్ధిక వ్యవస్ధ స్వరూపాన్నే మార్చబోతున్నాయి. దీనివలన ఆంధ్రప్రాంత ప్రజలు సర్వతోముఖాభివృద్ధిని సాధించవచ్చు. కానీ బడా కార్పొరేట్ కంపెనీల అధిపత్యానికి కేంద్ర పాలకులు లొంగిపోవటం వలన ఆంధ్రపజ్రలు సంపదలకు దూరమయ్యారు. ఆంధ్ర రాష్ట్రం మరింత నష్టపోతున్నది. అన్వేషణ,వెలికితీత, ఉత్పత్తి, పంపిణీ, వినియోగం, ధర నిర్ణయ విధానాలను సరిగ్గా నిర్వహించిన చోట ప్రజలు సంపదలను అనుభవిస్తున్నారు. లేనిచోట రిలయన్స్ అంబానీ లాంటి కొద్దిమంది కార్పొరేట్ శక్తులు లక్షల కోట్లరూపాయల సంపదలకు అధిపతులై విలాసజీవితం గడుపుతున్నారు.
లీటర్ పెట్రోల్ ను రు10, గ్యాస్ సిలిండర్ను రు 100 కే ఇవ్వవచ్చు!
కేవలం విద్యుత్ ఉత్పాదనలోనేకాక ఎరువుల తయారీలో కూడా సహజవాయువు ఎంతగానో ఉపయోగపడుతుంది. దాంతోపాటు చౌకగా లభించేగ్యాస్ ఆధారిత విద్యుత్తును అందించటం ద్వారా సిమెంట్, సెరామిక్, రసాయనిక,అల్యూమినియం, స్టీల్ ప్లాంట్, ఫ్యా బ్రికేషన్ పరిశ్రమలలో ఖరీదైన విద్యుత్ మీద ఆధారపడటం తగ్గుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారానికిగ్యాస్ సరఫరా చేస్తే సంవత్సరానికి1200 కోట్ల రూపాయలకు మించి ఖర్చు తగ్గుతుందని 2010లోనేఅంచనా వేశారు. కే.జీ.బేసిన్ గ్యాస్ చాలినంతగా న్యాయమైన ధరకు లభిస్తే కాకినాడ నుండి విశాఖపట్నం వరకు కాలుష్య రహిత రసాయనిక పరిశమ్రల కారిడార్ ను నెలకొల్పవచ్చు. కే.జీ బేసిన్ లో రోజుకి కొన్ని మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ గ్యాస్ నిక్షేపాలు కనుగొన్నారు. కేవలం ఒక్క ఎం ఎం ఎస్ సిఎం డి యూనిట్ గ్యాస్, సుమారు 1000 కోట్ల విలువైన పారిశ్రామిక పెట్టుబడిని ఆకర్షించగలదని నిపుణుల అంచనా. అంటే కేజీ బేసిన్ గ్యాస్ లో సగాన్ని ఉపయోగించుకున్నా మనం లక్ష కోట్ల విలువైన పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించవచ్చు.లక్షలాదిమందికి ఉపాధిఅవకాశాలను కలిగించవచ్చు . రవాణా రంగంలో బస్సులకు, లారీలకు,కార్లకు, ఆటోలకు సిఎన్ జీ గ్యాస్ వాడకంవల్ల ఖర్చు తగ్గటమేకాకుండా కాలుష్యం నుండి పర్యావరణాన్ని కూడా రక్షించుకోవచ్చు. గృహ అవసరాలకు గ్యాస్ పైపుల ద్వారా అతి చౌకగా వంటగ్యాస్ ను అందించవచ్చు. దీని మూలంగా గ్యాస్ సిలిండర్లపై పభ్రుత్వ సబ్సిడీభారం తగ్గుతుంది. ప్రస్తుతం వెయ్యి రూపాయలకు పైగా ఖరీదవుతున్న వంట గ్యాస్ సిలిండర్ కు సమానమైన గ్యాస్ ను పైపులైన్ ద్వారా వందరూపాయలకే ఇవ్వవచ్చును. అలానే లీటర్ పెట్రోలును రు 10 కే వాహనదారులకు అందించవచ్చు.
నూతన పాలసీతో కార్పొరేట్ సంస్థల అధిపత్యం!
1991లో పీవీ నరసింహారావు పభ్రుత్వం నూతన ఆర్థిక విధానాలను చేపట్టింది. దేశం ఎదుర్కొంటున్న సర్వసమస్య లకు ఏకైక పరిష్కారంగా ప్రైవేటైజేషన్ ను ముందుకు తెచ్చారు. అందులో భాగంగా చమురు సహజవాయువు ప్రాంతాల వేలంకు దేశ విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు. దేశీయకంపెనీ అయిన రిలయన్స్, విదేశీ సంస్ద అయిన కెయిర్న్ లాంటి కార్పోరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. ఇవి ప్రభుత్వ సంస్థలను రద్దు చేయకుండానే వాటిపునాదిని ఉపయోగించుకుని విపరీతమైన లాభాలను గడించాయి. ప్రపంచీకరణ విధానాలలో భాగంగా చమురు గ్యాస్ నిక్షేపాలను దేశ విదేశీ కార్పోరేట్ వ్యాపార సంస్థలకు భాగస్వామ్యం కల్పించే ఉద్దేశంతో కేంద్రం 1997లో నూతన అన్వేషణ లైసెన్సింగ్ పాలసీ( నెల్ప్-NELP) ని పవ్రేశ పెట్టింది. నూతన విధానానికి రెండు లక్ష్యాలను పభ్రుత్వం పక్రటించింది. సముద్ర గర్భంలోనూ,భూ ఉపరితలంలోనూ నూతన గ్యాస్ నిక్షేపాల కోసం అన్వేషణను ప్రోత్సహించి,
పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా స్వదేశీ గ్యాస్, చమురు ఉత్పత్తిని పెంచి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించటం. రెండవది, ఈ పథకం కింద పభ్రుత్వం వేలంపాట ద్వారా కొన్ని నిర్దిష్టప్రాంతాలలో నిక్షేపాల అన్వేషణకు ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అవకాశాన్ని కల్పించింది. ఈ పథకం పక్రారం తాము పెట్టిన పెట్టుబడిని లాభాలతో సహా త్వరగా రాబట్టుకోవడానికి వీలుగా ప్రభుత్వంతో సంప్రదించి ధర నిర్ణయించే అవకాశాన్ని పభ్రుత్వం ఈ నూతన అన్వేషణ దారులకు కల్పించింది. ఈ నూతన విధానం పక్రారం కృష్ణా- గోదావరి బేసిన్ లో సముద్రగర్భంలోని బావులలో అత్యధిక నిల్వలున్న గ్యాస్,చమురు నిక్షేపాలను రిలయన్స్ కంపెనీ కైవసం చేసుకుంది. ఈ కంపెనీ తన సామ్రాజ్యాన్ని అనేక
రంగాల్లోకి విస్తరించుకున్నది.
అంగట్లో అన్నీ ఉన్నా…
సహజవాయువు, చమురునిక్షేపాలు మన ముంగిట్లో అంటే కే.జీ.బేసిన్ లో పుష్కలంగా ఉన్నా ఆ వనరులను ఉపయోగించుకోలేని దుస్థితిలో మనం ఉన్నాం. దీనికి ప్రధాన కారణం కే.జీ.బేసిన్ గ్యాస్ సంపద రాష్ట్రసరిహద్దులు దాటి తరలిపోవడం. సహజ న్యాయసూత్రాల పక్రారం కే.జీ.బేసిన్ లో లభ్యమయ్యే సహజవాయువు మన రాష్ట్రఅవసరాలు తీరిన తర్వాతనే మనసరిహద్దులు దాటిపోవాలి. సహజ వనరుల యాజమాన్యం, నియంత్రణ ఆ ప్రాంత ప్రజలందరి ప్రయోజనాలను న్యాయమైనరీతిలో కాపాడేటట్లుగా రాజ్యవ్యవస్థ వ్యవహరించాలని భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలు చెప్తున్నాయి. సహజ న్యాయానికి, రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా బేసిన్ లో లభ్యమవుతున్న సహజవాయువు మన సరిహద్దులు దాటి 1500 కిలోమీటర్లదూరంలో ఉన్న గుజరాత్, మహారాష్ట్రలకు తరలిపోతున్నది. 45.50% గ్యాస్ ను గుజరాత్ కు తరలిస్తున్నారు. 24% మహారాష్టలోని పరిశమ్రలకు ఇచ్చేస్తున్నారు. మిగిలిన దాన్ని ఉత్తరపద్రేశ్ కు తరలిస్తున్నారు. ఆంధప్రద్రేశ్ రాష్ట్ర అవసరాలకు 1.2 శాతాన్ని మాతమే కేటాయిస్తున్నారు. కేంద్రపభ్రుత్వ కార్పోరేట్ అనుకూల విధానాలు, రాష్ట్రపభ్రుత్వాల నిష్క్రియాపరత్వం, పటిష్టమైన ప్రజా పోరాటాలు సాగని ఫలితంగా మన సహజసంపద తరలిపోతున్నది.
ప్రహసనంగా మారిన ధరల నిర్ణయం ధర!
కేజీ బేసిన్ లో సహజవాయువు ధరను నిర్ణయించటం ఒక ప్రహసనంగా మారింది. రిలయన్స్ కంపెనీ ప్రవేశించేవరకూ గెయిల్ సంస్థ ల్యాంకో పరిశమ్రకు యూనిట్ ఒకటికి 1.97 డాలర్లకు సరఫరా చేస్తున్నది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కు కేజీ బేసిన్ నుండి ఒక యూనిట్ గ్యాస్ ను 2.97 డాలర్లకు సరఫరా చేస్తానని రిలయన్స్ కంపెనీ అగ్రిమెంట్ కుదుర్చుకున్నది. తదనంతరం ప్లేట్ ఫిరాయించి 4.3 డాలర్లకైతేనే గ్యాస్ ఇస్తామన్నది. ఇంత ఎక్కువ ధరలు నిర్ణయించటానికి శాస్త్రీయ ఆధారాలు లేవని, ఆ ధరకు గ్యాస్ కొనుగోలు చేస్తే ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి, తదితర పరిశమ్రలకు భారం అధికమవుతుందన్న ఆనాటి కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి జైపాల్ రెడ్డిని ఆ శాఖ నుండి తప్పించేశారు. ధర పెంచటం అన్యాయమన్న కేంద్రకార్యదర్శుల కమిటీనిర్ణయాన్ని ఆమోదించలేదు. రంగరాజన్ అధ్యక్షతనగల పధ్రాన ఆర్థిక సలహా మండలి నిర్ణయాన్ని ఒప్పు కోలేదు. పణ్రబ్ ముఖర్జీ అధ్యక్షతన కేంద్రపభ్రుత్వం ఒక మంత్రుల కమిటీని నియమించింది. ఆ కమిటీ ఏదోఘనకార్యం చేసినట్లుగా నటించి రిలయన్స్ కోరిన 4.33 డాలర్ల ధరను 4.2 డాలర్లకు తగ్గించింది. కొండను తవ్వి ఎలుకను పట్టటం అంటే ఇదే!
ఆనాటి రాష్ట్రపభ్రుత్వ ఆందోళన
అలస్యంగానైనా మేల్కొన్న ఆనాటి ఆంధర్రాష్ట్ర పభ్రుత్వం కేజీ బేసిన్ లోని సహజ సంపదలో మన రాష్ట్రానికి న్యాయసమ్మతమైన వాటా లభించాలని కేంద్రపభ్రుత్వాన్ని కోరితే రిలయన్స్ కంపెనీతో మాట్లాడుకోమంది. ఉన్న నిల్వలు మాకే సరిపోవు కాబట్టి కొత్తగా ఆంధప్రద్రేశ్ రాష్ట్రానికి ఒక్క యూనిట్ సహజవాయువును కూడా సరఫరా చేయలేను అని తేల్చి చెప్పింది. దీని ఫలితంగా మన రాష్ట్రంలో అప్పటికే ప్రైవేట్ రంగంలో నెలకొల్పన గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పాదన కేంద్రాలకు గ్యాస్ సరఫరా అసాధ్యమైంది. ఈ పరిస్థితులలో ఆనాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిగారు కేంద్రానికి కొన్ని సూచనలు చేస్తూ 29 లేఖలు రాశారు. న్యాయబద్ధమైన సూచనలలో ఏ ఒక్కదానిని కూడా కేంద్రపభ్రుత్వ మంత్రుల కమిటీ పరిగణనలోకి తీసుకొననేలేదు. ఈ విధానం హక్కులను నిరాకరించటమే గాక అణిచివేయటం కాదా! 12వ ఆర్థిక సంఘం కూడా ఏ ప్రాంతంలో దొరికేసహజ వనరులపైన ఆ ప్రాంతానికి వినియోగ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ అక్టోబర్, 2013 రిపోర్టులో, సహజ వనరులు ఉత్పత్తి అవుతున్న రాష్ట్రానికి కనీసం 50 శాతం గ్యాస్ తో పాటు రాయల్టీనీ కూడా ఇవ్వాలని రికమెండ్ చేసింది. సముద్ర అంతర్భాగం నుండి గ్యాస్ తీసినా, భూమినుండి తీసినా రాష్ట్రానికి వాటా వుండాల్సిందేనని పార్లమెంటు కమిటీ తేల్చిచెప్పింది. మన రాష్ట్రంలో లభ్యమయ్యే సహజ వనరులలో కొంత భాగాన్ని మాత్రమే మన రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికోసం డిమాండ్ చేస్తున్న అత్యంత హేతుబద్ధమైన, న్యాయమైన ఈ డిమాండ్ ను కూడా కేంద్రపభ్రుత్వం నిరాకరించటం అంటే ఫెడరలిజాన్ని నిరాకరించటమే, కార్పోరేట్ కంపెనీలకు పత్ర్యక్షంగా వత్తాసు పలకటమే!
కష్టాలు మాకు-సంపద మీకా?
భూమిలోపల కొన్ని లక్షల సంవత్సరాల పరిణామాల ఫలితంగా సహజవాయువు, చమురుఏర్పడుతుంది. ప్రజలు సముద్రపు ఆటుపోట్లను, అల్పపీడనాలను, వాయుగుండాలను,ఉప్పెనలను, సునామీలు, పంట పొలాలలో గ్యాస్ బ్లో అవుట్లు లాంటి కష్టాలను ఎదుర్కొంటూ జీవిస్తున్నారు. మన గ్రామాల నుండి మన పొలాల నుండి గ్యాస్ ను పైపులద్వారా గుజరాత్ కు తీసుకొని వెళ్తూ మనకు ఒక్క కేజీ గ్యాస్ కూడా ఇవ్వరట. మన రాష్ట్రంలో లభించేసహజ వనరులను దోచుకుని రిలయన్స్ వంటి బడా కార్పోరేట్ సంస్థలు ఇబ్బడి
ముబ్బడిగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటాన్ని, మన ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మనం వ్యతిరేకించాలి. లేనిపక్షంలో మనం భవిష్యత్ తరాల ముందు దోషులుగా నిలబడవలసి వస్తుంది. నిజానికి ఇది పభ్రుత్వ, ప్రజా ప్రతినిధుల బాధ్యత. అయితే ఇప్పటివరకు మన ప్రజా ప్రతినిధులు స్పందించాల్సిన రీతిలో స్పందించని ఫలితంగా ప్రజాఉద్యమాన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా రాజీలేని సమైక్య ఉద్యమాన్నినిర్వహించవలసిన అవసరం నేడు ఏర్పడింది. కేజీ బేసిన్లో లభించే సహజ వనరులపై మన ప్రాథమిక హక్కును సాధించుకోవటానికి పోరాట దీక్షతో కలసికట్టుగా ముందడుగులు వేద్దాం!
డాక్టర్ కొల్లా రాజమోహన్, కృష్ణా గోదావరి బేసిన్ చమురు గ్యాస్ సాధన సమితి.
