Tags

సత్య
ప్రపంచంలో నరమేధం జరగటానికి కారకులైన పెద్దమనుషులు శాంతి దూతలుగా నోబెల్ బహుమతులు అందుకుంటున్న తరుణమిది.అలాంటిది ఒక కమ్యూనిస్టు ఎలా స్పందించాడు? నోర్డిక్ పేజ్ అనే స్వీడన్‌కు చెందిన ఒక ఎలక్ట్రానిక్ పత్రిక ఈనెల పదవ తేదీన ఒక కధనాన్ని ప్రచురించింది.
వియత్నాంపై తొలుత జపాన్, తరువాత ఫ్రెంచి, వారి తరువాత అమెరికన్ సామ్రాజ్యవాదులు దాదాపు మూడు దశాబ్దాల పాటు యుద్ధం సాగించిన విషయం చరిత్రలో దాచేస్తే దాగదు. చివరకు కమ్యూనిస్టులను ఓడించలేము, వియత్నాంను ఆక్రమించలేమని అమెరికన్లు గ్రహించిన తరువాత వుత్తర,దక్షిణ వియత్నాంలను ఒకటి చేసేందుకు అంగీకరించి సలాం కొట్టి అమెరికన్లు తప్పుకున్నారు. దీనికి గాను ఎవరైతే యుద్ధం సాగించి లక్షలాది మంది ప్రాణాలు బలిగొన్నారో అందుకు నాయకత్వం వహించిన అమెరికా విదేశాంగశాఖ మంత్రి హెన్రీ కిసింజర్‌కు, వియత్నాం కమ్యూనిస్టు నేత లీ డక్ థోకు కలిపి 1973లో నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. కిసింజర్ దానిని అందుకున్నాడు గానీ లీ తిరస్కరించి నోబెల్ బహుమతుల చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించాడు. దక్షిణ వియత్నాంలో వాస్తవానికి శాంతి ఇంకా నెలకొనలేదు, ఈ స్ధితిలో నోబెల్ శాంతి బహుమతిని నేను అంగీకరించటం జరిగేది కాదు అని ప్రకటించి సున్నితంగా తిరస్కరించాడు. చరిత్రలో అలాంటి వారు ఇప్పటివరకు ఆయనొక్కరే.
రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోగానే వియత్నాం స్వతంత్ర దేశమని కమ్యూనిస్టుపార్టీ నేత హోచిమిన్ ప్ర కటించారు.అయితే జపాన్ స్ధానం ఆక్రమించిన ఫ్రెంచి వలసపాలకులు లీ ని ఎన్నో సంవత్సరాల పాటు జైలుపాలు చేశారు. ఫ్రెంచి వారిపై పోరాడిన గెరిల్లాలకు నాయకులలో ఒకడిగా తరువాత లీ బాధ్యతలు నిర్వహించారు. ఫ్రెంచి వారు ఓడిపోయిన తరువాత దక్షిణ వియత్నాంలోని తొత్తు ప్రభుత్వాన్ని బలపరిచే పేరుతో అమెరికన్లు దారుణ మారణకాండ సాగించారు. ఒకవైపు శాంతి చర్చలంటూనే మరోవైపు అన్ని రకాల రసాయన ఆయుధాలతో అమెరికన్లు దాడులు కొనసాగించారు. అమెరికా రక్షణ సలహాదారుగా కూడా పనిచేసిన కిసింజర్‌తో వియత్నాం ప్రతినిధిగా లీ డక్ థో 1968 నుంచి 1973వరకు చర్చలు సాగించారు.
జనంపై యుద్ధం చేసిన వారిని, వారిని ఎదిరించిన జననేతలను ఒకేగాటన కట్టి వుమ్మడిగా శాంతి బహుమతి ప్రకటించిన నోబెల్ కమిటీలో రాజకీయాలు, అమెరికా ప్రభావం ఎలా వుందో దీంతో ప్రపంచానికి కనువిప్పు కలిగింది. కమిటీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. శాంతి ఒప్పందంపై సంతకాలు చేసినప్పటికీ అమెరికన్లు దానిని వుల్లంఘించి దాడులు చేయటంతో అవి మరింత తీవ్ర మయ్యాయి. దీంతో ఇద్దరు నోబెల్ కమిటీ సభ్యులు నిరసన తెలుపుతూ రాజీనామా చేశారు. ఒక ఆసాధారణ వ్యక్తిగా చరిత్రకెక్కిన లీ 1990 అక్టోబరు 13న క్యాన్సర్‌తో మరణించారు.
భారత్‌లో ఏటా పదివేల కోట్ల సిగిరెట్ పీకలు
పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్ అన్న మాట నిజం అవుతుందని నిజంగా నమ్మారేమో లేకపోతే మన దేశంలో ఏటా పదివేల కోట్ల సరదా సరదా సిగిరెట్ పీకలు ఎలా పోగుపడతాయి? ఇవి పోగుపడితే పొద్దున్నే వూడ్చితే పోతాయి కదా అనుకోకండి సిగిరెట్లతో పాటు పీకలలో కూడా క్యాన్సర్‌కు దారితీసే విషం వుంటుంది. స్వచ్ఛ భారత్ అంటూ ఒకవైపు ఆర్భాటం సాగిస్తుంటే మరి ఈ సమస్యను పరిష్కరించటం ఎలా అన్నది తలనొప్పి వ్యవహారమే. సిగిరెట్ కాల్చి చివరికి రాగానే నిర్లక్ష్యంగా పారవేసే వారు నిప్పును ఆర్పకుండానే పీకలను పడవేస్తున్న కారణంగా అవి అగ్ని ప్రమాదాలకు కూడా దారితీస్తున్నాయి. కేరళలో 2009-10లో ఏడాది కాలంలో సిగిరెట్ పీకలను నిర్లక్షంగా పారవేసిన కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవించి 60 హెక్టార్ల అడవి కాలిపోయిందని తేలింది. హైదరాబాదులో వీటివలన 2010-13 మధ్య 1333 అగ్ని ప్రమాదాలు జరిగినట్లు నమోదైంది.
