Tags
America Party, BILLIONAIRE RAJ, Democratic party, Donald trump, Elon Musk, MAGA Republicans, Republican party
ఎం కోటేశ్వరరావు
ప్రపంచ ధనికుడు ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మీద ఆగ్రహంతో ‘‘ అమెరికా పార్టీ ’’ పేరుతో రాజకీయ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించేశాడు. దాని మీద రాజకీయ పండితులు చర్చలు చేస్తున్నారు. తమకు ప్రయోజనం కలిగించని లేదా వ్యతిరేకించిన పాలకుల మీద ఆగ్రహించిన వాణిజ్య, పారిశ్రామికవేత్తలు డబ్బుమదంతో తెల్లవారేసరికి పార్టీ పెట్టి తడాఖా చూపుతామంటూ హడావుడి చేయటం అన్ని దేశాలలో జరిగేదే. అమెరికాలో కూడా అదే జరిగింది. ఇప్పుడున్న స్థితిలో అతగాడి ప్రయత్నం ఎడారిలో ఇసుక అమ్మటమే అవుతుందన్నది ఒక వ్యాఖ్య. ట్రంప్‌తో ప్రేమాయణానికి కటీఫ్ చెప్పిన తరువాత తన ఫ్యాక్టరీలు, వ్యాపారాలను చూసుకుంటానని చెప్పిన పెద్దమనిషి బిగ్, బ్యూటీఫుల్( పెద్దది, అందమైన) బిల్లుగా వర్ణించినదానిని పార్లమెంటు గనుక ఆమోదిస్తే తాను రాజకీయ పార్టీని పెడతానని ప్రకటించాడు.ఆమోదం పొందటం, రాజకీయ పార్టీ ప్రకటన వెంటనే జరిగాయి.మఖలో పుట్టి పుబ్బలో అంతరించే పార్టీలు ప్రపంచమంతటా ఉన్నాయి. ఇది కూడా అలాంటిదే అవుతుందా, 24.7బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో ప్రపంచ ధనికుడిగా ఉన్న మస్క్ డబ్బును వెదజల్లి అమెరికా రాజకీయాలను మలుపుతిప్పుతాడా, అక్కడ ఇప్పటికే తిష్టవేసిన రిపబ్లిన్, డెమోక్రటిక్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలుపుతాడా ? ఇలా పరిపరి విధాలుగా ప్రపంచ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. నిన్నటి వరకు ముద్దులాడుకున్న వారు నేడు దెబ్బలాడుకుంటున్నారు. రేపేం చేస్తారో తెలియదు, రాజకీయాలు, వ్యాపారాల్లో ఏదైనా జరగవచ్చు.
అసలు వారెందుకు విడిపోయారు ? తాను తయారు చేసే టెస్లా విద్యుత్ కార్లతో అమెరికాను ప్రపంచాన్ని నింపాలని ఎలన్ మస్క్ ఆశపడ్డాడు. అందుకు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉంటే తన ఆటలు సాగించుకోవచ్చనుకున్నాడు. ట్రంప్ పలుకుబడితోనే నరేంద్రమోడీపై వత్తిడి తెచ్చి మనదేశంలో స్టార్‌లింక్‌ను సాధించిన సంగతి తెలిసిందే, టెస్లా కార్లను కూడా మార్కెటింగ్ చేస్తానని ప్రకటించాడు.మస్క్ కంపెనీకి స్థానిక మార్కెట్ మొత్తాన్ని అప్పగిస్తే అమెరికాలో పెట్రోలు, డీజిలు, గ్యాస్ వ్యాపారం చేసేవారు, వాటితో నడిచే కార్లు తయారు చేసేవారు చేతులు ముడుకు కూర్చుంటారా ? రంగంలోకి దిగి ట్రంప్‌కు వార్నింగ్ ఇవ్వటంతో అతగాడు వెనక్కు తగ్గాడు.అక్కడే మొదలైంది రచ్చ. దాన్ని బయటకు చెప్పుకోలేడు గనుక ట్రంప్ యంత్రాంగం రూపొందించిన పొదుపు బిల్లు ఆమోదం పొందితే అమెరికా సర్వనాశనం అవుతుందంటూ ధ్వజమెత్తాడు. ట్రంప్ ఊరుకుంటాడా ఇలాగే వాగితే నీ కార్లకు ఇస్తున్న సబ్సిడీల మొత్తాన్ని ఎత్తివేస్తా ఆలోచించుకో అన్నాడు. కాస్త మెత్తబడినప్పటికీ ఆవిరైన ప్రేమ తిరిగి చిగురించలేదు, ఛీ పో అంటే ఛా పో అనుకున్నారు. ఇప్పుడేం జరుగుతుందన్నది ఆసక్తి కలిగించే అంశం.
అమెరికాను మరోసారి గొప్పదాన్ని చేయాలనే పిలుపును సమర్ధించిన వారందరికీ మస్క్ నిర్ణయం రుచించలేదు.ట్రంప్ ద్వారా గరిష్టంగా లబ్దిపొందాలని చూసిన బడాబాబులకు అమెరికా పార్టీ గురించి భయం లేదుగానీ మస్క్ తెస్తున్న వత్తిడి గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. పార్లమెంటు ఆమోదించి ట్రంప్ సంతకం అయిన పొదుపు చట్టం అమలు జరిగితే కార్మికవర్గ సంక్షేమ కార్యక్రమాల మీద తొలివేటు పడుతుందనే భయంతో ఇప్పటికే జనం భారీ ఎత్తున రెండుసార్లు నిరసన ప్రదర్శనలు చేశారు.ప్రాధమిక వార్తల ప్రకారం ఇది అమల్లోకి వస్తే కోటీ 30లక్షల మందికి ఆరోగ్యబీమా గల్లంతు లేదా ఉన్నప్పటికీ నిరుపయోగంగా మారుతుందనే విశ్లేషణలు వచ్చాయి.జనాల నుంచి ఎదురయ్యే నిరసనలను ఎలా అణచివేయాలా అని చూస్తుంటే మధ్యలో మస్క్ గొడవేంటని ఇతర కార్పొరేట్ శక్తులు చిరాకు పడుతున్నాయి. ట్రంప్ చట్టంతో ఇప్పటికే ఉన్న దేశ రుణానికి మరో నాలుగున్నరలక్షల కోట్ల డాలర్లు తోడవుతుందని మస్క్ ధ్వజమెత్తాడు. ఇప్పటికే జిడిపిలో 122శాతం 36.2లక్షల కోట్ల డాలర్ల అప్పు ఉంది. దాన్ని మరో నాలుగులక్షల కోట్ల డాలర్లు పెంచుకొనేందుకు మే నెలలో అనుమతి ఇచ్చారు, ఇప్పుడు మరో ఐదు లక్షల కోట్లడాలర్ల వరకు పెంచాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికాలో జన్మించి 2002లో అమెరికా పౌరసత్వం పొందిన మస్క్‌కు కెనడా పౌరసత్వం కూడా ఉంది. నిబంధనల ప్రకారం అమెరికా గడ్డమీద పుట్టిన వారు మాత్రమే అధ్యక్షపదవికి అర్హులు. ప్రస్తుతం రెండు పార్టీలు పోటాపోటీగా పార్లమెంటు ఉభయ సభల్లో సీట్లు తెచ్చుకుంటున్న పూర్వరంగంలో తనకున్న ధనబలంతో సెనెట్‌లో రెండు మూడు, ప్రజాప్రతినిధుల సభలో 8 నుంచి 10 తెచ్చుకుంటే చక్రం తిప్పవచ్చన్నది మస్క్ ఎత్తుగడ.తాజాగా మస్క్ వ్యతిరేకించిన ట్రంప్ ముందుకు తెచ్చిన బిగ్, బ్యూటీఫుల్ బిల్లు పార్లమెంటులో చావుతప్పి లొట్టపోయినట్లుగా నెగ్గింది. వంద మంది ఉన్న సెనెట్‌లో వ్యతిరేక, అనుకూల ఓట్లు 50 చొప్పున రాగా ఉపాధ్యక్షుడిగా ఉన్న జెడి వాన్స్ తన నిర్ణయాత్మక ఓటుతో బిల్లును గట్టెక్కించాడు. ప్రజాప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు 220 ఓట్లు ఉన్నప్పటికీ బిల్లుకు అనుకూలంగా 218 మాత్రమే రాగా 212 ఉన్న డెమోక్రాట్లతో మరో ఇద్దరు అధికారపక్ష సభ్యులు చేతులు కలపటంతో వ్యతిరేకంగా 214 వచ్చాయి. ఇలాంటి సమయాల్లో మూడో పక్షానికి ఎంపీలు ఉంటే కింగ్ మేకర్‌లుగా మారతారు. ఎలన్ మస్క్ ఆకాంక్ష, యత్నం అదే. రెండు పార్టీల విధానాలకు ప్రత్యామ్నాయం గురించి కాదు. గతంలో డెమోక్రటిక్ పార్టీకి, గత ఎన్నికల్లో రిపబ్లికన్ ట్రంప్‌కు మద్దతు ఇచ్చాడు. ఎవరికి బాసటగా ఉన్న తన లాభమే పరమావధి.
రెండు పార్టీలకు పరిష్కారం తన పక్షమే అని, అమెరికన్లు కోల్పోయిన స్వాతంత్య్రాన్ని తిరిగి ఇస్తానని మస్క్ చెప్పాడు. మూడిరట రెండు వంతుల మంది కొత్త పార్టీ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ట్రంప్ ఏలుబడిలో ప్రభుత్వ సిబ్బంది సామర్ధ్యం పెంచే పేరుతో ఎలన్ మస్క్ చేపట్టిన డోజ్ ఉద్యోగులను తొలగించేందుకు పని చేసింది తప్ప మరొకటి కాదు. ట్రంప్ తెచ్చిన చట్టం కార్పొరేట్లకు పన్నుల తగ్గింపు, సామాన్యుల సంక్షేమం కుదింపుకు ఉద్దేశించింది. ప్రస్తుతం 7.1 కోట్ల మంది ఆరోగ్యబీమాపై ఆధారపడి ఉన్నారు. రానున్న పది సంవత్సరాల్లో కోటీ 70లక్షల మంది ఈ పథకానికి దూరం అవుతారు. మనదేశంలో ఆహార భద్రతా పథకం కింద 80 కోట్ల మందికి ఉచిత బియ్యం, గోధుమలు ఇస్తున్నట్లుగానే అమెరికాలో అదనపు పోషకాహారం పేరుతో 4 కోట్ల మంది ఆహార కూపన్లు ఇస్తున్నారు. వీరిలో 47 లక్షల మంది వాటిని కోల్పోతారు. కొత్త చట్టం అమలుచేస్తే సంక్షేమ పథకాలకు లక్ష కోట్లడాలర్లు కోతపడుతుందని అధ్యక్ష భవనం రూపొందించిన పత్రమే చెప్పింది. ఈ సొమ్మును దేనికి ఖర్చు చేస్తారో తెలుసా ! అక్రమంగా సరిహద్దు దాటకుండా ఉండేందుకు మెక్సికో సరిహద్దులో ఏర్పాటు చేసిన ఇనుప గోడకు 46బిలియన్ డాలర్లు, వలస వచ్చిన వారికి నిర్బంధ శిబిరాల్లో పడకలకు 45బి.డాలర్లు, వలస వచ్చిన వారిని గుర్తించి 2029 నాటికి దేశం నుంచి తరిమివేసేందుకు అవసరమైన మరో పదివేల మంది సిబ్బంది నియామకానికి ఇలా మొత్తం 350 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నారు. కొత్త లేదా పాత విద్యుత్ కార్లు కొనుగోలు చేసే వారికి ఇస్తున్న పన్ను రాయితీలు సెప్టెంబరు 30తో ముగుస్తాయి, వాటిని 2032వరకు పొడిగిస్తారు. పార్లమెంటు అనుమతి లేకుండా ప్రభుత్వం అప్పులు చేయటానికి లేదు, ఒక పరిమితి ఉంటుంది. అయితే 1960 నుంచి ఇప్పటికి 78 సార్లు నిబంధనలను సవరించారు. ట్రంప్ తొలిసారి పాలనా కాలంలో 8లక్షల కోట్ల మేర కొత్త అప్పు చేసేందుకు నిబంధనలు సడలించారు. ఇలాంటి సవరణలకు రెండు పార్టీలూ సై అంటాయి.
అమెరికా రాజకీయాల్లో బ్లాక్‌మెయిల్ చేయటం కూడా మామూలే, పెరోట్ కుమార్తె గురించి బుష్ తప్పుడు ప్రచారం చేయటం, అదివాస్తవం కాదని నిరూపించుకోలేని స్థితిలో 1992 ఎన్నికల్లో తొలుత పోటీ నుంచి వెనక్కు తగ్గాడు, తరువాత తిరిగి రంగంలోకి వచ్చాడు. బుష్ కుటుంబం మీద ఉన్న ఆగ్రహంతో రాస్ పెరోట్ అనే బిలియనీర్ 1992 అధ్యక్ష ఎన్నికలలో రిఫామ్ పార్టీ పేరుతో పోటీ చేశాడు. బిల్ క్లింటన్ డెమోక్రటిక్ పార్టీ (43) జార్జి బుష్ రిపబ్లికన్ పార్టీ 37.5 శాతం ఓట్లు తెచ్చుకోగా పెరోట్‌కు 18.9శాతం ఓట్లు వచ్చాయి. అయితే అధ్యక్ష ఎన్నికకు కావాల్సిన ఎలక్టరల్ కాలేజీలో ఒక్క ఓటూ రాలేదు. ఎలన్ మస్క్ కూడా బ్లాక్‌మెయిలింగ్‌లో తక్కువ తినలేదు. ఎప్‌్‌స్టెయిన్ అనేవాడు బడాబాబులకు పిల్లల్ని తార్చి డబ్బుగడిరచటంలో పేరు మోశాడు. అతగాడి జాబితాలో డోనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నట్లు విమర్శలు వచ్చాయి. అనుమానాస్పద స్థితిలో వాడు జైల్లో చచ్చాడు. దాంతో ఎప్‌స్టెయిన్స్ ఫైల్స్ గురించి దర్యాప్తును మూసివేసి పెద్దలను కాపాడారని గుప్పు మంది. అందే అంశాన్ని ట్రంప్‌తో చెడిన తరువాత మస్క్ ముందుకు తెచ్చాడు. ఆ విషయాలు అతగాడికి ఎప్పుడో తెలిసినప్పటికీ గత ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతుగా సర్వశక్తులూ వడ్డాడు, తన సామాజిక మాధ్యమం ఎక్స్‌ను ఉపయోగించాడు, పెద్ద మొత్తంలో స్వంతంగా సొమ్ము ఖర్చు చేశాడు. అందువలన పార్టీ పెట్టి తమను దెబ్బతీస్తాడనుకుంటున్నటున్న మస్క్‌ను వేరే రూపంలో దెబ్బతీసే అవకాశాలు లేకపోలేదు.
పార్టీలను ఏర్పాటు చేయటంలోనూ, రాజకీయాల్లో బిలియనీర్లు పాల్గొనటం ఎలన్ మస్క్‌తో ప్రారంభం కాలేదు. రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఒక అధ్యయనంలో ఫోర్బ్స్ రూపొందించిన జాబితా ప్రకారం ప్రపంచంలోని 2072 మంది బిలియనీర్లలో 11శాతం మంది రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు, తమ ప్రభావాన్ని చూపేందుకు ధనికులు ముందుకు వస్తున్నారనటానికి ఇదొక సూచిక. వారు ఎలాంటి విధానాలకు మద్దతు ఇస్తారో కూడా వేరే చెప్పనవసరం లేదు. వారికి ప్రపంచంలో బలమైన సంబంధాలు ఉన్నప్పటికీ సైద్ధాంతికంగా పెద్దగా తెలియదని తేలింది. ప్రపంచ ధనికుల కేంద్రం అమెరికా అయినప్పటికీ ఇక్కడి బిలియనీర్లు ప్రపంచ సగటు కంటే తక్కువగా కేవలం 3.7శాతమే రాజకీయాల్లో ఉన్నారు. రెండు ప్రధాన పార్టీల్లో వీరు తమను అధ్యక్షపదవి అభ్యర్థులుగా ఎన్నుకోవాలని భారీ మొత్తాల్లో నిధులు ఖర్చు చేశారు.లాస్ ఏంజల్స్ నగర మేయర్ పదవి కోసమే రెండుసార్లు జెబి ప్రిట్జ్‌కర్ 35 కోట్ల డాలర్లు ఖర్చు చేశాడంటే అధ్యక్ష పదవికి స్వయంగా లేదా మద్దతు ఇచ్చేవారు ఎంత మొత్తాలు ఖర్చు చేస్తారో అర్ధం చేసుకోవచ్చు. 2022 మధ్యంతర పార్లమెంటు ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలకు బిలియనీర్లు ఇచ్చిన విరాళాల మొత్తం 88 కోట్ల డాలర్లు. అగ్రస్థానంలో ఉన్న ఇరవై మందిలో 14గురు రిపబ్లికన్ పార్టీకి ఇచ్చినట్లు తేలింది. వివిధ దేశాల ప్రభుత్వాలలో కొలువుదీరిన వారు 242 మంది కాగా సగటున 2.5 పదవులు చేపట్టారు. మనకు మిరేజ్, రాఫేల్ యుద్ద విమానాలు అమ్మిన కంపెనీ యజమాని సెర్గీ దసాల్ట్ ఫ్రాన్సులో ఏకంగా 16 పదవుల్లో పని చేశాడు. తన భార్య రాఫేల్ పేరునే విమానానికి పెట్టాడు. బిలియనీర్లు నిరంకుశ, నియంత పాలనలోనే ఎక్కువగా పదవుల్లో రాణించారట. అమెరికా బిలియనీర్లలో డెమోక్రాట్ల కంటే రిపబ్లికన్లను సమర్ధించిన వారు రెండున్నరరెట్లు ఎక్కువ, ఐరోపాలో అత్యధికులు మితవాద శక్తుల మద్దతుదార్లు. ఎలన్ మస్క్ కార్మికవర్గానికి వ్యతిరేకి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో అతగాడి పార్టీ గెలుస్తుందో లేదో చెప్పలేము గానీ ఓట్లను చీల్చితే రిపబ్లికన్ పార్టీ బలం తగ్గి డెమోక్రాట్లు లాభపడితే ట్రంప్‌కు అడుగుడుగునా ప్రతిఘటన తప్పదు !
