Tags
BJP, Kangana ranaut, Kangana's controversial statement, Narendra Modi Failures, National Creators Award, Subhash Chandra Bose
ఎం కోటేశ్వరరావు
బిజెపి తరఫున హిమచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సినీ నటి పద్మశ్రీ కంగన రనౌత్ ఒక టీవి ఇంటర్వ్యూలో సుభాష్ చంద్రబోస్‌ను భారత ప్రధమ ప్రధానిగా వర్ణించారు. దీని మీద విమర్శలు, పరిహాసాలు వెల్లడయ్యాయి. దేశానికి స్వాతంత్య్రం రాకముందు ప్రవాసంలో అజాద్ హింద్ ఫౌజ్ ప్రభుత్వాన్ని రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సింగపూర్‌లో ఏర్పాటు చేశారు, ప్రధానిగా ప్రకటించుకున్నారు గనుక నేను అలా చెప్పాను తప్పేముంది అంటూ ఆమె ఎదురుదాడికి దిగారు. దాన్ని అర్ధం చేసుకోవచ్చు. ” నాకొక సంగతి చెప్పండి, మనకు స్వాతంత్య్రం వచ్చినపుడు ప్రధమ ప్రధాని సుభాస్ చంద్రబోస్ ఎక్కిడికి వెళ్లారు ” అని ఇంటర్వ్యూలో విలేకరిని కంగన ప్రశ్నించటమే ఆమె తెలివితేటలను వెల్లడించింది. సదరు విలేకరి ఆమె చెప్పిందాన్ని సరిచేసేందుకు ప్రయత్నించగా ” మీరు నాకేమీ చెప్పవద్దు. ఆయన ఎక్కిడికి వెళ్లారో ఈ రోజు స్పష్టం చేయాలి ” అని మరోసారి అతి తెలివిని ప్రదర్శించారు. దేశానికి స్వాతంత్య్రం రాకముందే సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న నాడు జపాన్ ఆక్రమణలో ఉన్న చైనాలోని తైవాన్ దీవుల్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన సంగతి ఆమెకు తెలిసి ఉంటే స్వాతంత్య్రం వచ్చినపుడు ఎక్కడికి వెళ్లారనే ప్రశ్న ఆమె నోటి వెంట వచ్చి ఉండేది కాదు.బోస్‌ను ప్రధమ ప్రధానిగా వర్ణించినందుకు విమర్శించిన వారి మీద విరుచుకుపడ్డారు. భారతీయ కళలను, గతాన్ని ప్రతిబింబించే ఖజురహౌ, ఎల్లోరా శిల్పాలు, అజంతా చిత్రాలు, అనేక దేవాలయాల మీద ఉన్న బూతుబొమ్మల, వాత్సాయన కామసూత్రాల ఒరవడిలో ఒళ్లుదాచుకోకుండా సినిమాల్లో నటించి ఆ సంప్రదాయాలను ముందుకు తీసుకుపోయిన అనుభవం ఆమెకుంది. నటనా నిష్ణాతుల్లో ఒకరు కావచ్చు గానీ తనకు అన్నీ తెలుసు అనుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది.
తన తెలివితేటలను ప్రశ్నించేవారు తన సినిమా ”ఎమర్జన్సీ” ని చూడాలని సలహా ఇచ్చారు.” ప్రధమ భారత ప్రధాని గురించి నాకు జ్ఞానదానం చేస్తున్నవారు ముందుగా దీన్ని(సుభాష్ చంద్రబోస్ ప్రవాస ప్రభుత్వ ప్రకటన వార్త) చదవాలి. కొత్తగా తెలుసుకొనే వారికి కొంత సాధారణ పరిజ్ఞానం వస్తుంది. కొద్దిగా చదువు సంధ్యలు నేర్చుకోవాలని నాకు చెబుతున్న మేథావులందరూ తప్పక తెలుసుకోవాల్సిందేమంటే నేనే రాసి, నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జన్సీ అనే సినిమా గురించి తెలుసుకోవాలి. అది ప్రాధమికంగా నెహ్రూ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఆడాళ్లకు ఏమీ తెలియదని చెప్పేందుకు చూసే మగబుద్దిని చూపకండి ” అని ఎదురుదాడికి దిగారు. సరిగ్గా లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందు 2024 మార్చినెల ఎనిమిదవ తేదీన ప్రధాని నరేంద్రమోడీ జాతీయ సృష్టికర్తల అవార్డులను(నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్) ఇరవై రంగాల్లో 23 మందికి ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో అసాధారణమైన ప్రతిభ చూపిన వారిని సత్కరించే పేరుతో తొలిసారిగా వీటిని ఇచ్చారు. కంగన చెప్పిన మాటలు ఈ అవార్డులకు ముందే వెలువడి ఉంటే బహుశా ఆమెను కూడా తిమ్మిని బమ్మిని చేసే చరిత్ర సృష్టికర్త లేదా ప్రభావితురాలు అంటూ అవార్డుతో సత్కరించి ఉండేవారు. ఎందుకంటే గతంలో ఆమె నరేంద్రమోడీ ప్రధాని అయిన తరువాతే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని సెలవిచ్చారు. అంతేనా నోబెల్ బహుమతి పోటీదారుగా నరేంద్రమోడీ ఉన్నారని ఏడాది క్రితం వచ్చిన ఒక తప్పుడు వార్తను ఆమె తాజాగా ఎక్స్‌లో పోస్టు చేశారు. అందువలన తొలి భారత ప్రధానిగా నెహ్రూను ఆమె అంగీకరించే ప్రశ్నే లేదు.
2001 నుంచి 2014వరకు గుజరాత్ సిఎం, తరువాత పదేండ్లుగా ప్రధానిగా ఉన్న నరేంద్రమోడీకి దేశంలో అసాధారణ ప్రతిభను గుర్తించాలనే ఆలోచన ఇప్పటి వరకు ఎందుకు తట్టలేదు అనే ప్రశ్న దేశద్రోహం కనుక ఎవరూ వేయకూడదు. పోనీ ఈ ప్రతిభావంతులు దేశంలో ఆకలిని తగ్గించేందుకు, దేశ, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని అటే పట్టి ఇట్టే తెచ్చే చిట్కాలను కనిపెట్టినందుకో, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామన్న మోడీ వాగ్దానాన్ని అమలు జరిపేందుకు దగ్గరదారిని చూపినందుకో, అచ్చేదిన్ ఎలా తేవాలో వెల్లడించినందుకో అవార్డులను అందుకున్నారా అంటే కాదు. మరి వీరి ప్రతిభ ఏమిటి ? బూమ్‌లైవ్ డాట్ కామ్ అనే పోర్టల్ ఈ అవార్డుల గురించి కొన్ని విశ్లేషణలను వెల్లడించింది.అవార్డు గ్రహీతలలో 60శాతం మంది హిందూమతం, బిజెపి నేతలను కలవటం లేదా పాలకపార్టీ విధానాలు లేదా భావజాలాన్ని బలపరిచిన వారు, సృష్టించిన వాటి స్వభావం ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే తటస్థుల పేరుతో బిజెపి చెబుతున్నదాన్ని జనంలోకి తీసుకుపోవటమే అవార్డులకు అర్హత. వాటి ప్రదాన సభలో నరేంద్రమోడీ అసలు విషయం చెప్పేశారు. ” రానున్న కొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ సభను ఏర్పాటు చేసినట్లు మీరు భావించవద్దు, ఎన్నికలకు ఈ అవార్డులకు సంబంధం లేదు ” అని ” స్పష్టంగా ” చెప్పారు. ఈ మాటలు చెబుతుండగా ఎదురుగా ఉన్న జనం మీకు నాలుగు వందల సీట్లు అంటూ నినాదాలు చేశారు. ” అవకాశం వుంటే వచ్చే శివరాత్రి లేదా మరొక తేదీన ఇలాంటి కార్యక్రమాన్ని నేను మాత్రమే నిర్వహిస్తానని మీకు హామీ ఇస్తున్నా ” అని కూడా మోడీ చెప్పారు.
కేవలం ఆరు రోజుల్లోనే ప్రభుత్వం రు. 2.4కోట్లు సామాజిక మాధ్యమాలపై వెచ్చించి మోడీని పొగిడించింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆధీనంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ మార్చి పది నుంచి 16వ తేదీ వరకు (ఎన్నికల ప్రకటన ) గూగుల్‌లో వీడియో ప్రకటనలకు ఖర్చు చేసింది. ఒక వీడియోలో జనం మోడీ మోడీ అని నినాదాలిస్తుండగా మోడీ అవార్డులను ప్రదానం చేస్తుంటారు.” అతను ఉన్న ధోరణులను అనుసరించి పోవటంలేదు, అతనే ఒక ధోరణి సృష్టికర్త ” అంటూ నేపధ్యంలో మోడీ గురించి యాంకర్ వ్యాఖ్యలు ఉన్నాయి. జయా కిషోరీ అనే ఆమె ”బహుముఖ ప్రజ్ఞాశాలి” అని పొగిడితే టెక్నికల్ గురూజీగా సామాజిక మాధ్యమాల్లో పేరున్న గౌరవ్ చౌదరి మేక్ ఇన్ ఇండియా చొరవ మోడీదే అని పొగిడారు. బహుశా అది ఘోరంగా విఫలమైన పధకం అని తెలియదో లేక తెలిసినా పోయేదేముంది అని అన్నారో చెప్పలేము. మైథిలీ ఠాకూర్ అనే 23 ఏండ్ల గాయని ”ఎంవిపి” అన్నారు. క్రీడల్లో మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అని ఉపయోగించే పదాన్ని వాడారు. బహుశా రాజకీయ అటగాడని అర్ధమేమో ! అవార్డులు రాకపోయినా నామినేట్ అయిన కొందరు ఇలాంటి అవార్డులు ఇస్తున్నందుకు అంటూ మోడీని ఆకాశానికి ఎత్తారు. సామాజిక మాధ్యమంలో పేరు పొందిన వారిని ప్రభుత్వ ప్రచారానికి వాడుకోవటం అన్ని చోట్లా జరుగుతున్నదే.
అవార్డులు పొందిన 23 మందిలో వారు సృష్టించిన అంశాల ఇతివృత్తాల గురించి డీకోడ్ పేరుతో బూమ్‌లైవ్ విశ్లేషించింది. వారిలో పదిహేను మంది సృష్టి మతపరమైన, బిజెపినేతలతో భేటీలు, బిజెపి విధానాలు, భావజాలాన్ని సమర్దించేవిగా ఉన్నట్లు పేర్కొన్నది.వారిలో ఏడుగురు హిందూయిజానికి సంబంధించిన అంశాలమీదే చురుకుగా ఉంటారని తేలింది. వారిలో ఒకరైన రణవీర్ అలహాబాదియా (బీర్ బిసెప్స్) నిరంతరం బిజెపి అజెండాలోని మత అంశాలనే పోస్టు చేస్తుంటాడు.శివుడు ఎవరు, శ్రీరామ ప్రభు, హనుమాన్‌జీ, సీతా మాత, రామాయణ పాఠాలు వంటివి వాటిలో ఉంటాయి.హిందూ దేవతలు, మతపరమైన భజనలు, గీతాలను ఆలపించే జయా కిషోరీ అనే ఆమెను ” ఉత్తమ సామాజిక మార్పు సృష్టికర్త ” అవార్డుకు ఎంపిక చేశారు. ఆమె జనవరి 22న అయోధ్యలో కాషాయ దుస్తులు ధరించి రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసంగాలు చేశారు. హిందూమతానికి సంబంధించిన పాటలు పాడే, వీడియోలు చేసే మైథిలీ ఠాకూర్‌ను సాంస్కృతిక రాయబారి అవార్డుకు, అలాంటి వాటినే సృష్టిస్తున్న జాహ్నవీ సింగ్‌ను వారసత్వ సంస్కృతి ప్రతీక అవార్డుకు ఎంపిక చేశారు. వేద సిద్దాంతం అనే పేరుతో హిందూమత, సనాతన ధర్మ తదితర పోస్టులు పెట్టే అర్దిమాన్ వంటి వారిని అవార్డులు వరించాయి. ఇక టెక్నికల్ గురూజీగా పేరున్న గౌరవ్ చౌదరి వంటి మరో ఆరుగురికి బిజెపి నేతలతో భేటీ జరిపిన పూర్వరంగంలో అవార్డులు వచ్చినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను పొగిడుతూ కార్యక్రమాలను రూపొందించిన వారు సరేసరి. ఒక ఎఫ్‌ఎం రేడియో జాకీగా ఉన్న రౌనక్ అవార్డులు పొందిన వారిలో ఒకరు. అతగాడు చేసిందల్లా ఒకటే. జి20 సమావేశాల సందర్భంగా ” భారత్ : ద బాస్ ” అనే పేరుతో ఒక వీడియోను పోస్టు చేశాడు. ఆ సమావేశాలను నిర్వహించినందుకు భారతీయులు ఎంతో గర్వపడుతున్నారని పేర్కొన్నాడు. మరో వీడియో ” ఇండియా బనేగా భారత్( భారత్‌గా మారనున్న ఇండియా) ” అనేదాన్ని చేసినందుకు అవార్డు ఇచ్చారు.వీటి గురించి బిజెపి నేతలు ఎంత గొప్పగా చెప్పుకున్నదీ తెలిసిందే.
సామాజిక మాధ్యమాల్లో బహుళ ప్రచారం పొందిన వారిని రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి వినియోగించుకోవటం ఇటీవలి కాలంలో రోజు రోజుకూ పెరుగుతున్నది.టీవీ యాంకర్లను రాజకీయ పార్టీల సభలకు రప్పించటం తెలిసిందే.ఈ నేపధ్యంలో బిజెపి అలాంటి వారిని అవార్డులు మరోపేరుతో మరింత ప్రచారం కల్పించి వారికి డిమాండ్‌ను పెంచటంతో పాటు తన ప్రచారానికి ఉచితంగా వాడుకొనేందుకు చూస్తున్నదన్నది స్పష్టం. వీరికి రాజకీయాలు, విధానాల గురించి అంతగా ప్రవేశం లేకున్నా పార్టీలు రాసి ఇచ్చిన అంశాలను తమవిగా చెప్పుకుంటూ జనాలను ప్రభావితం చేసేందుకు చూస్తారు.జనాలను ప్రభావితం చేసే ఇతివృత్తాల సృష్టికర్తలు, ప్రభావితులుగా ఉన్నవారికి అవార్డులు ఇచ్చిన నరేంద్రమోడీ అలాంటి వారి నేతగా టీమ్ అవార్డు పొందటానికి అర్హులని ఈ సందర్భంగా అంగీకరించకతప్పదు. ఆ అవార్డులో కథలు చెప్పటంలో నైపుణ్యం వున్నవారికి కూడా ఒక అవార్డు ఉంది. గత పది సంవత్సరాలుగా చెప్పిన మాట చెప్పకుండా జనాలకు కొత్త కతలు చెప్పటంలో నరేంద్రమోడీ అందరికంటే ఎంతో ఎత్తున ఉన్నారు.దేశంలో 46కోట్లకు పైగా యూట్యూబ్ ఖాతాదార్లు ఉన్నారని అంచనా. అందువలన దానిలో వెల్లడించే సమాచారంతో ఓటర్లను పెద్ద ఎత్తున ప్రభావితం చేయవచ్చని బిజెపి భావిస్తున్నది. పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నది. దానికి అనుగుణంగానే ఈ అవార్డుల పేరుతో ఆ రంగంలో పేరున్న వారందరినీ తనవైపు ఆకర్షించేందుకు పూనుకుంది. ప్రధాన రాజకీయ పార్టీలు, వాటిని చూసి సంస్థలు ఆశ్రయిస్తే ఈ ప్రభావితులుకు డబ్బేడబ్బు.స్టాటిస్టా అనే సంస్థ 2023లో ఒక విశ్లేషణ వెల్లడించింది. 2022నాటికి మనదేశంలో ఈ ప్రభావితుల మార్కెట్ విలువ పన్నెండు వందల కోట్ల రూపాయలని 2026 నాటికి 2,800 కోట్లకు పెరగనుందని పేర్కొన్నది. జనానికి ఎలా చెప్పాలో అన్న నేర్పరితనం వీరి దగ్గర ఉంటుంది తప్ప వీరి ప్రభావానికి పరిమితులు ఉన్నాయని హెచ్చరించింది. ప్రభావితులు, సృష్టికర్తలు రెండు రకాలు. 2007లో నరేంద్రమోడీ గుజరాత్ సిఎంగా ఉన్నపుడు ప్రముఖ జర్నలిస్టు కరణ్‌థాపర్ ఇంటర్వ్యూ ప్రారంభించిన మూడు నిమిషాల్లోనే సూటిగా సమాధానాలు చెప్పలేక మంచినీళ్లు తాగి అకస్మాత్తుగా ముగించి లేచిపోయిన మోడీ ఉదంతం తెలిసిందే. ఇలాంటి వారు ఉన్నారనే బహుశా ప్రధానిగా ఇంతవరకు ఒక్కసారి కూడా మోడీ విలేకర్ల సమావేశం పెట్టలేదు. అప్పటి నుంచి రెండవ తరగతి సానుకూల ప్రశ్నలతో ఇంటర్వ్యూలు జరిపే వారితో మాత్రమే మోడీ మాట్లాడుతున్నారు.ఎందుకంటే వారు ముందే ప్రశ్నలు పంపుతారు. అంతకు మించి అడగరు. సృష్టికర్తల అవార్డులు పొందిన వారు కూడా సానుకూల తరగతికి చెందిన వారే అన్నది వేరే చెప్పనవసరం లేదు.
