Tags
Amit Shah, Azad Kashmir, BJP, China, Gilgit-Baltistan, Jammu and Kashmir Reorganisation Bill, Narendra Modi Failures, Nehru ‘blunders’ on Kashmir, pakistan, Pakistan-Occupied Kashmir, POK, UNSC Failures
ఎం కోటేశ్వరరావు
జమ్మూ మరియు కాశ్మీర్ అసెంబ్లీలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతానికి 24 సీట్లు కేటాయించారు. అంటే దాన్ని స్వాధీనం చేసుకొని నరేంద్రమోడీ మన దేశంలో విలీనం చేయనున్నారా ? అంటూ సామాజిక మాధ్యమాల్లో రకరకాల వ్యాఖ్యలతో పోస్టులు వెలువడ్డాయి. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటామని బిజెపి నేతలు పదే పదే చెబుతున్న మాటల పూర్వరంగంలో ఇలాంటి ప్రచారం సామాజిక మాధ్యమంలో ఆశ్చర్యం కలిగించదు. ఇది నిజమే అనుకొనేవారు కూడా ఉండవచ్చు. వాట్సాప్ మరుగుజ్జులు వెంపల చెట్టుకు నిచ్చెనలు వేసే రకం అన్నది తెలిసిందే. డిసెంబరు ఆరవ తేదీన లోక్‌సభలో హౌం మంత్రి అమిత్ షా జమ్మూ-కాశ్మీర్ రిజర్వేషన్ బిల్లు-2023, జమ్మూ-కాశ్మీర్ పునర్వ్యస్థీకరణ బిల్లు-2023 అనే రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. పాక్ ఆక్రమిత కాశ్మీరు కూడా మనదే కనుక ఆ ప్రాంతానికి 24 సీట్లను జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో కేటాయించినట్లు అమిత్ షా చెప్పారు.
పాక్ ఆక్రమిత కాశ్మీరుకు 24 స్థానాలు పక్కన పెట్టటం బిజెపి ఘనతేమీ కాదు. కాశ్మీరు మన దేశంలో విలీనమైనప్పటి నుంచీ ఉన్నాయి. 1988 వరకు వాటితో సహా అసెంబ్లీలో వంద సీట్లు ఉన్నాయి. తరువాత వాటిని 111కు పెంచారు. వాటిలో 24 స్థానాలు మినహా మిగతా వాటికే ఎన్నికలు జరుగుతాయి. ఆ ప్రాంతం మన ఆధీనంలో లేదు గనుక అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటు నుంచి రోజు వారీ కార్యకలాపాల వరకు వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికైన స్థానాలలో మెజారిటీనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇప్పుడూ అదే కొనసాగుతుంది. ఇంతకు ముందు లడక్‌లోని నాలుగు స్థానాలతో సహా 87కు ఎన్నికలు జరిగేవి.2019 కాశ్మీరు రాష్ట్రాన్ని రద్దు చేసి జమ్మూ-కాశ్మీరు, లడక్‌లుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చారు. 2020లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత జమ్మూ-కాశ్మీరులో అసెంబ్లీ స్థానాలను 114కు పెంచారు. పాక్ ఆక్రమిత కాశ్మీరుకు కేటాయించిన 24పోను 90లో ఇప్పుడు కాశ్మీరు డివిజన్‌లో 47, జమ్మూలో 43 స్థానాలు ఉన్నాయి. గతంలో ఇద్దరు నామినేటెడ్ సభ్యులు ఉండేవారు ఇప్పుడు ఐదుగురికి పెంచారు.వారిలో ఇద్దరు మహిళలు, ఒక మహిళతో సహా ఇద్దరు వలస వెళ్లిన కాశ్మీరీ పండిట్ల నుంచి, ఒకరు పాక్ ఆక్రమిత కాశ్మీరు నుంచి వలస వచ్చిన వారి నుంచి గవర్నర్ నామినేట్ చేస్తారు.వలస వెళ్లిన కాశ్మీరీ పండిట్ల కుటుంబాల గురించి ఎన్నో అతిశయోక్తులను ప్రచారంలో పెట్టిన సంగతి తెలిసిందే. లోక్‌సభలో అమిత్ షా చెప్పినదాని ప్రకారం 46,631 కుటుంబాలు రాష్ట్రం వదలి వెళ్లారు.వారికి సీట్లు కేటాయింపు ప్రతిపాదన దశలోనే వివాదం తలెత్తింది, ఇప్పుడూ ఉంటుంది.
పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న గిల్గిట్-బాల్టిస్థాన్‌తో సహా కాశ్మీరు ప్రాంతం మొత్తం, కాశ్మీరులోని లడక్‌లో భాగంగా ప్రస్తుతం చైనా ఏలుబడిలో ఉన్న ఆక్సారుచిన్ ప్రాంతం కూడా మనదే అన్నది స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మనదేశం ప్రకటిస్తున్నది. అయితే కాశ్మీరు రాష్ట్ర అసెంబ్లీలో పాక్ ఆక్రమిత ప్రాంతానికి 24 సీట్లు కేటాయించటం తప్ప చైనా ఆధీనంలోని ప్రాంతానికి గతంలో కూడా ఎలాంటి సీట్లు కేటాయించలేదు. ఇప్పుడు లడక్ కేంద్ర పాలిత ప్రాంతం, ప్రస్తుతం దానికి అసెంబ్లీ ఏర్పాటు లేదు. గిల్గిట్ కూడా కాశ్మీరులో భాగమే అయినప్పటికీ అది మినహా మిగిలిన ఆక్రమిత ప్రాంతం పట్ల పాకిస్థాన్ వేర్వేరు వైఖరులను తీసుకున్నది. గిల్గిట్ ప్రాంత వాసులు తమతో విలీనం కావాలని కోరుకున్నందున అది తమ ప్రాంతమే అని ప్రకటించుకుంది. తమ ఆక్రమణలోని మిగతా ప్రాంతాన్ని ” విముక్త (ఆజాద్) కాశ్మీరు” అని ప్రకటించి ప్రత్యేక పాలిత ప్రాంతంగా ఉంచింది. అది తనదని చెప్పటం లేదు. ఎప్పటికైనా మొత్తం కాశ్మీరు స్వతంత్ర దేశంగా ఏర్పాటు కానుందని చెబుతున్నది. అందుకే పాక్ పార్లమెంటులో దానికి ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించలేదు. ఆ ప్రాంతానికి విడిగా ఎన్నికలు జరుపుతూ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నది. చైనాతో కుదిరిన ఒప్పందం మేరకు 1963లో గిల్గిట్‌లోని షాక్స్‌గమ్ ప్రాంతాన్ని చైనాకు అప్పగించింది. దాని గుండా చైనా కారకోరం రహదారి నిర్మించటంతో ఆ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత వెల్లడైంది.అనేక తర్జన భర్జనల తరువాత పాకిస్తాన్ గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతాన్ని 2020లో పాక్ ఐదవ రాష్ట్రంగా ప్రకటించుకుంది. ఆక్రమిత కాశ్మీరులోని పౌరులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగా గిల్గిట్ వాసులు విలీనాన్ని కోరుకున్నట్లు పాక్ చెబుతున్నది.
తాజా పరిణామాల వెనుక బిజెపి రాజకీయం స్పష్టంగా కనిపిస్తున్నది. గతంలో ఒబిసిగా ప్రకటించిన పహాడియా సామాజిక తరగతిని 2020లో కేంద్ర ప్రభుత్వం నియమించిన జిడి శర్మ కమిషన్ ద్వారా వారిని గిరిజనులుగా సిఫార్సు చేయించారు. తాజాగా చేసిన సవరణల్లో అసెంబ్లీలో తొమ్మిది స్థానాలను షెడ్యూలు తరగతులకు కేటాయించారు. వీరికి నాలుగుశాతం ఉద్యోగ రిజర్వేషన్లు ఇచ్చారు. అంతకు ముందు కాశ్మీరులో ” బలహీన, ఆర్థిక, సామాజిక న్యాయానికి దూరంగా ఉన్న కులాలు ”గా పేర్కొన్నవారిని ఒబిసిగా మార్చారు. ఇవన్నీ ఓటుబాంకు రాజకీయాలలో భాగం అన్నది స్పష్టం.ం దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న అనేక కులాలు తమను గిరిజనులు, దళితులు, ఓబిసిలుగా పరిగణించాలని, రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారు. దళితులు వర్గీకరణ కోరుతున్నారు. బిజెపికి చిత్తశుద్ది ఉంటే దేశమంతటా ఉన్న ఈ సమస్యను పక్కన పెట్టి కేవలం కాశ్మీరులోనే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్నది ప్రశ్న. పహాడియాల జీవన విధానం గిరిజనుల మాదిరే ఉంటుందన్నది వాస్తవమే.అలాంటి వారు అనేక మంది ఉన్నారు. కాశ్మీరు పట్ల జవహర్‌లాల్ నెహ్రూ తీవ్ర తప్పిదాలకు పాల్పడ్డారంటూ గతం నుంచి చేస్తున్న దాడిని హౌం మంత్రి అమిత్ లోక్‌సభలో కొనసాగించారు. ఆక్రమిత కాశ్మీరును విముక్తి చేసేందుకు పురోగమిస్తున్న సైన్యాన్ని ముందుకు పోనివ్వలేదని, వివాదాన్ని ఐరాసకు నివేదించారని చరిత్రను వక్రీకరించేందుకు పూనుకున్నారు.ఆక్రమిత కాశ్మీరులోని ముజఫరాబాద్ వైపు సైన్యం ముందుకు పోయి ఉంటే ఇప్పుడు మన దేశంలో ఉన్న రాజౌరీ, పూంచ్ ప్రాంతాలు పాక్ ఆక్రమణలోకి వెళ్లి ఉండేవని కాశ్మీరు మాజీ సిఎం ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. మరొక మార్గం లేని స్థితిలోనే ఐరాసకు నివేదించారని కూడా చెప్పారు.
బ్రిటీష్ పాలన అంతమైన తరువాత కాశ్మీరు, హైదరాబాద్ సంస్థానాలు భారత్‌లో విలీనానికి అంగీకరించలేదు, స్వతంత్ర దేశాలుగా ఉంటామని ప్రకటించాయి. కాశ్మీరు ఎట్టి పరిస్థితుల్లో భారత్‌లో ఉండాలని నెహ్రూ చెప్పారు. హైదరాబాద్ స్వతంత్ర దేశంగా ఉంటే మన దేశానికి కడుపులో కాన్సర్ మాదిరి తయారవుతుందని వల్లభారు పటేల్ భావించారు. అందువలన ఒకవేళ కాశ్మీరు పాలకుడు పాకిస్తాన్‌తో కలవాలని అనుకుంటే దానికి తాను అడ్డుపడబోనని హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనం కావటం ముఖ్యమని వాదించినట్లు చెబుతారు. జునాఘడ్ సంస్థాన విలీనాన్ని పాకిస్తాన్ అంగీకరించిన తరువాత పటేల్ వైఖరిలో మార్పు వచ్చింది. సంస్థానాలు ఏ దేశంలో విలీనం కావాలో తేల్చుకొనే స్వేచ్చను ఇచ్చినందున ప్రస్తుత గుజరాత్‌లోని జునాఘడ్ నవాబు భారత్‌లో విలీనానికి అంగీకరించాడు. స్వాతంత్య్రానికి కొన్ని నెలల ముందు నవాజ్ భుట్టో (తరువాత కాలంలో పాక్ ప్రధానిగా పని చేసిన జుల్ఫికర్ ఆలీ భుట్టో తండ్రి) సంస్థాన నూతన ప్రధానిగా నియమితుడయ్యాడు.భుట్టో సలహామేరకు మనసు మార్చుకొని పాకిస్తాన్‌లో కలిసేందుకు అంగీకారం తెలిపాడు. సంస్థానంలోని జనం దానికి వ్యతిరేకత తెలపటంతో ముందు జాగ్రత్తగా భారత ప్రభుత్వం అక్కడకు మిలిటరీని పంపింది.నవాబు కరాచీ పారిపోయాడు, విధిలేక సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవాలని భుట్టో భారత ప్రభుత్వాన్ని కోరాడు.1947 నవంబరులో ప్రజాభిప్రాయ సేకరణ జరపగా 91శాతం మంది భారత్‌తో కలవాలని కోరారు. హైదరాబాద్ సంస్థానం విషయానికి వస్తే యధాతధ పరిస్థితి కొనసాగాలని స్వాతంత్య్రం వచ్చిన మూడునెలల తరువాత ఒప్పందం కుదిరింది. అప్పటికే కమ్యూనిస్టులు నిజాంపై తిరుగుబాటు చేసి సాయుధపోరాటం జరుపుతున్న పూర్వరంగంలో పరిణామాలు ఎటువైపు దారితీసేది తెలియని స్థితిలో 1948 సెప్టెంబరు పదమూడున సైనిక చర్యకు పూనుకోవటం, మూడు రోజుల్లోనే నవాబు లొంగిపోవటంతో దేశంలో విలీనమైంది.
కాశ్మీరు రాజు హరిసింగ్ ఏ దేశంలోనూ విలీనం కాకుండా స్వతంత్ర దేశంగా ఉంటామని ప్రకటించాడు. దానికి అక్కడి హిందూత్వశక్తులు మద్దతుతెలిపారు. పాకిస్థాన్ ఎత్తుగడలను పసిగట్టిన నెహ్రూ కాశ్మీరులో పరిస్థితి ప్రమాదకరంగాను, దిగజారుతోందని, పెద్ద పరిణామం జరగబోతోందని1947 సెప్టెంబరు 27న హౌం మంత్రిగా ఉన్న పటేల్‌కు పంపిన నోట్‌లో నెహ్రూ పేర్కొన్నారు. చలికాలంలో పాక్ చొరబాటుదార్లను పంపవచ్చని కూడా హెచ్చరించారు. అప్పటికే కొన్ని చోట్ల తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి. అక్టోబరులో అనుకున్నంతా జరిగింది. తిరుగుబాట్లతో తమకెలాంటి సంబంధం లేదని తోటి ముస్లింల మీద జరుగుతున్న అత్యాచారాలకు ప్రతీకారంగా గిరిజనులు వారంతటవారే కార్యాచరణకు పూనుకున్నారని పాక్ పాలకులు ప్రకటించారు.ఈ స్థితిలో హరిసింగ్ భారత్ మిలిటరీ సాయం కోరారు. వెంటనే మిలిటరీ రంగంలోకి దిగి చొరబాటుదార్లను వెనక్కు కొట్టటం ప్రారంభించింది. అది తరువాత పూర్తి స్థాయి యుద్ధంగా మారింది. కాశ్మీరును భారత్‌లో విలీనం చేసేందుకు హరిసింగ్ అంగీకరించినందున ” తటస్థ ” వేదికగా ఉన్న ఐక్యరాజ్య సమితి కాశ్మీరు సమస్యను పరిష్కరిస్తుందనే ఆశాభావంతో మన ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి నివేదించింది. అది వల్లభారు పటేల్‌తో సహా మొత్తం మంత్రివర్గ నిర్ణయం తప్ప నెహ్రూ ఒక్కరే తీసుకున్నది కాదు. కానీ తరువాత జరిగిన పరిణామాల తరువాత అంతర్జాతీయ కుట్రను గ్రహించి చేసిన పొరపాటును కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఐరాసలో అమెరికా, బ్రిటన్ మన వైఖరిని సమర్ధించకపోగా వ్యతిరేకించాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఏర్పాటు నాటి సోవియట్‌ను దెబ్బతీసేందుకు ఒక సాధనంగా ఉంటుందని అవి భావించటమే కారణం. అధికార రాజకీయాలు తప్ప నైతిక అంశాలు ఐరాసను నడిపించటం లేదని ప్రధాని నెహ్రూ నాడు వైస్‌రారుగా ఉన్న మౌంట్‌బాటన్‌కు రాశారు. ఐరాసను పూర్తిగా అమెరికా నడిపిస్తున్నదని పాక్ చొరబాటుదార్లు పూర్తిగా వెనక్కు వెళ్లేంతవరకు ప్రజాభిప్రాయసేకరణ డిమాండ్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు.
భద్రతా మండలి 1948 ఏప్రిల్ 21న ఆమోదించిన తీర్మానం ప్రకారం కాశ్మీరు నుంచి పాక్ సాయుధ చొరబాటుదారులను పూర్తిగా ఉపసంహరించుకోవాలి. శాంతి భద్రతల పరిరక్షణ అవసరాల రీత్యా క్రమంగా భారత్ తన దళాలను కనీస స్థాయికి వెనక్కు తీసుకోవాలి. తరువాత ఐరాస నియమించిన అధికారి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. అయితే తీర్మానం మేరకు పాకిస్తాస్ తన దళాలను ఇప్పటికీ విరమించలేదు. ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రత్యేక పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. తాము వెనక్కు తగ్గితే కాశ్మీరును భారత్ పూర్తిగా ఆక్రమిస్తుందనే వితండవాదాన్ని వినిపిస్తున్నది. భద్రతా మండలి తీర్మానాన్ని ముందు పాక్ అమలు జరపాలని మన దేశం కోరుతున్నది. ప్రతిష్ఠంభన ఏర్పడటంతో 1949లో ఐరాస ఏర్పాటు చేసిన కమిషన్ తాము విఫలం చెందినట్లు ప్రకటించింది. ఉల్లంఘించిన పాకిస్తాన్‌పై తరువాత కాలంలో భద్రతా మండలి ఎలాంటి చర్యలూ తీసుకోకపోవటానికి పాకిస్థాన్‌కు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు వెన్నుదన్నుగా ఉండటమే. అమెరికా నేతలు నరేంద్రమోడీ భుజాల మీద చేతులు వేసి కౌగిలించుకున్నా, మనకు ఎన్నికబుర్లు చెప్పినప్పటికీ ఇప్పటికీ అమెరికా అసలు కథ అదే. దీని గురించి చెప్పే ధైర్యం విశ్వగురువుగా భావించే నరేంద్రమోడీకి లేదా ఇతర మంత్రులకు లేదు. ఆక్రమిత కాశ్మీరు సమస్య పరిష్కారానికి గడచిన పది సంవత్సరాలలో తమ ప్రభుత్వం చేసిందేమిటో చెప్ప కుండా పదే పదే నెహ్రూ మీద దాడి చేయటం ఒక మైండ్‌గేమ్‌లో భాగం తప్ప మరొకటి కాదు.దీని వలన ఒరిగేదేమిటి ?
