Tags
imran khan, Joe Biden, pakistan, Pakistan elections 2023, Pakistan Military, Pakistan political crisis
ఎం కోటేశ్వరరావు
ఆగస్టు పదవ తేదీన పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సిఫార్సు చేశారు. దాన్ని ఆమోదించిన అధ్యక్షుడు అరీఫ్ అల్వీ పద్నాలుగవ తేదీన తాత్కాలిక ప్రధానిగా అన్వార్ ఉల్ హక్ కాకర్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. పాక్ రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ రద్దు తరువాత ఏర్పడే తాత్కాలిక ప్రభుత్వ ఆధ్వర్యంలో మూడు నెలల్లోగా ఎన్నికలు జరగాలి, ఆ మేరకు నవంబరు ఎనిమిదవ తేదీ లోపు ఎన్నికలు జరిపి కొత్త సభ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. బలూచిస్తాన్ అవామీ పార్టీ ప్రతినిధిగా గెలిచిన అన్వర్ పేరును అధికార, ప్రతిపక్షం రెండూ సిఫార్సు చేశాయి. గత ఏడాది అవిశ్వాస తీర్మానంతో ప్రధాని పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ మీద అవినీతి కేసు మోపి మూడేండ్ల జైలు శిక్ష విధించి ఆగస్టు ఐదవ తేదీన జైలుకు పంపారు. ఐదు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడిగా ఎన్నికల సంఘం ప్రకటించింది. మాజీ క్రెకెటర్ ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతి, అరెస్టు, జైలుకు పంపటం వెనుక పాక్ మిలిటరీని లోబరుచుకున్న అమెరికా కుట్ర ఉన్నట్లు కొన్ని ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. విధించిన శిక్ష మీద ఉన్నత న్యాయస్థానానికి చేసుకున్న అప్పీలు ఎప్పటికి పరిష్కారం అవుతుందో చెప్పలేము. ఎన్నికల లోపు తీర్పు వచ్చే అవకాశం లేదు.తనకు శిక్ష విధించటం ప్రజాస్వామ్యం మీద దాడిగా ఇమ్రాన్ ఖాన్ వర్ణించాడు.ప్రధానిగా విదేశీ పర్యటనలు జరిపినపుడు అక్కడ ప్రభుత్వాలు అందచేసిన కానుకల వివరాలను వెల్లడించకుండా అక్రమాలకు పాల్పడినట్లు కేసు దాఖలు చేశారు. తాను చెప్పేది వినకుండా శిక్ష విధించారని ఖాన్ పేర్కొన్నాడు.
2018 జూలై 25న జరిగిన ఎన్నికలలో 31.82 శాతం ఓట్లు 342 స్థానాలకు గాను 149 తెచ్చుకొని పెద్ద పార్టీగా ఎన్నికై స్వతంత్రులు, చిన్న పార్టీల వారి మద్దతుతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఈఏడాది మే నెలలో జరిగిన సర్వే ప్రకారం పాక్ ఎన్నికల్లో 45శాతం ఓట్లతో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహరిక్ పార్టీ(పిటిఐ) ముందున్నట్లు తేలింది.తరువాత 22, 13శాతాలతో ముస్లింలీగ్, పీపుల్స్ పార్టీ ఉంది. పాక్ జాతీయ అసెంబ్లీలో ఈ ఏడాది 336 స్థానాలున్నాయి. వీటికి మూడు పద్దతుల్లో సభ్యులను ఎన్నుకుంటారు. సాధారణ స్థానాల్లో మన దేశంలో మాదిరి 266 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. వాటిలో రాష్ట్రాలలో వచ్చిన స్థానాలను బట్టి దామాషా ప్రాతిపదికన మహిళలకు రిజర్వుచేసిన 60 స్థానాలను కేటాయిస్తారు. మరో పదింటిని మొత్తంగా వచ్చిన సీట్లలో దామాషా ప్రాతిపదికన ముస్లిమేతరులుకు అవకాశమిస్తారు. గత ఎన్నికలలో మొత్తం 14 పార్టీలకు ప్రాతినిధ్యం వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ను జైలుకు పంపటం, అనర్హుడిగా ప్రకటించటంతో వచ్చే ఎన్నికల్లో ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. ఏ పార్టీ అధికారానికి వచ్చినా అది పాక్ మిలిటరీ కనుసన్నలలో నడవాలనేది గత 76 సంవత్సరాల అనుభవం వెల్లడించింది. పాక్ మిలిటరీ అమెరికా కీలుబొమ్మగా ఉందని, అమెరికాను వ్యతిరేకించే శక్తులను సహించరని తాజాగా ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతి ఉదంతంలో కూడా తేటతెల్లమైంది. పాకిస్తాన్ను పక్కన పెట్టి మనదేశాన్ని అమెరికా చంకనెక్కించుకుందన్న ప్రచారం కూడా వాస్తవం కాదని, చైనాను దెబ్బతీసేందుకు గాను మనతో వ్యవహరిస్తోందని అమెరికాలో పాక్ రాయబారి అసాద్ మజీద్ ఖాన్ తమ ప్రభుత్వానికి పంపిన వర్తమానం వెల్లడించింది.
ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతి వెనుక అమెరికా హస్తం ఉన్నట్లు అమెరికాకు చెందిన ఇంటరెసెప్ట్ అనే మీడియా సంస్థ తనకు దొరికిన పాక్ అధికారిక పత్రాలను ప్రచురించింది.ఆ పత్రం వాస్తవమైనదే అని ఇమ్రాన్ ఖాన్ తరువాత పదవిలోకి వచ్చిన షెహబాజ్ షరీఫ్ అంగీకరించాడు. ఉక్రెయిన్ సంక్షోభంపై పాకిస్తాన్ తటస్థవైఖరిని తీసుకోవటాన్ని రష్యా అనుకూల వైఖరిగా అమెరికా పరిగణించింది. ఉక్రెయిన్‌కు మద్దతుగా పాక్ నిలవాలని అంతకు ముందే ఐరోపా దేశాల రాయబారులు బహిరంగంగా పిలుపునిచ్చారు. గతేడాది మార్చి ఆరవ తేదీన అమెరికా-పాక్ అధికారుల సమావేశం జరిగింది. దానికి ఒక రోజు ముందే ఇమ్రాన్ ఖాన్ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఐరోపా రాయబారుల మీద స్పందిస్తూ ” మేము మీకేమైనా బానిసలమా ? మా గురించి మీరేమనుకుంటున్నారు ? మేం బానిసలమని, మీరేమి కోరితే మేమది చేయాలని అనుకుంటున్నారా ? మేము రష్యా స్నేహితులం, మేము అమెరికాకూ స్నేహితులమే, మేము చైనా, ఐరోపాకూ స్నేహితులమే, మేము ఎవరి కూటమిలోనూ లేము ” అని స్పష్టం చేశాడు. ఈ మాటలు అమెరికా అహాన్ని దెబ్బతీశాయి. దశాబ్దాల తరబడి తమ కనుసన్నల్లో నడుస్తున్న పాకిస్తాన్ ఇలా మాట్లాడటమా అని రగిలిపోయింది. అప్పటికే అమెరికా రంగంలోకి దిగిన అంశం గురించి తెలుసుకున్నకారణంగానే ఇమ్రాన్‌ఖాన్ ఇలా బహిరంగంగా స్పందించారన్నది స్పష్టం.
పాక్-అమెరికా అధికారులు సమావేశమైన నెల రోజుల తరువాత ఖాన్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు, పదవి నుంచి తప్పించారు. అప్పటి నుంచి కొద్ది రోజుల్లోనే పాక్ విదేశాంగ వైఖరి మారిపోయింది. ఉక్రెయిన్ వివాదంలో అమెరికా, ఐరోపా పక్షాన చేరింది. అంతే కాదు, ఉక్రెయిన్‌కు అవసరమైన ఆయుధాలు, మందుగుండును తయారు చేసి పంపుతున్నది. ఆగస్టు మూడవ తేదీన వచ్చిన వార్తల ప్రకారం అమెరికాతో పాకిస్తాన్ ఒక రక్షణ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. దాని ప్రకారం సంయుక్త మిలిటరీ విన్యాసాలు, శిక్షణ, మిలిటరీ పరికరాల సహకారం ఉంటుంది. గత ఏడాది ఏప్రిల్ పదిన ఇమ్రాన్ ఖాన్ పదవి కోల్పోయారు. అప్పటి వరకు 2018 నుంచి ఉన్న నిషేధాన్ని సడలించి అదే ఏడాది సెప్టెంబరు నెలలో 45 కోట్ల డాలర్లతో పాకిస్తాన్ వద్ద ఉన్న అమెరికా గతంలో అమ్మిన ఎఫ్ 16 యుద్ధ విమానాలను నవీకరించేందుకు అమెరికా ఒప్పందం చేసుకుంది. దానికి ఉగ్రవాదం మీద పోరుకు సిద్దంగా ఉండేందుకు అని సాకు చెప్పారు. నిజానికి ఉగ్రవాదుల మీద విమానాలతో దాడి చేసి నిర్మూలించిన చరిత్ర పాకిస్తాన్‌కు గానీ అమెరికాకు గానీ లేదు. ఇరుగుపొరుగున ఉన్న దేశాలలో ఒక్క మన మీదనే పాక్ గతంలో యుద్ధానికి దిగింది. ఇప్పుడు ఏ ఇతర దేశం మీద అది పోరుకు దిగే అవసరమూ లేదు, అలాంటి ఆలోచనా లేదు. అవసరమైతే ఆ విమానాలు మన మీద దాడికే అన్నది స్పష్టం. అది అమెరికాకు తెలియందీ కాదు.
ఇక పాక్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం గురించి చూస్తే ఇమ్రాన్ ఖాన్ మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గితే అంతకు ముందు ఖాన్‌కు మద్దతు ఇచ్చిన వారందరినీ క్షమించి వేస్తామని అమెరికా అధికారి చెప్పినట్లు పాక్ రాయబారి పంపిన వర్తమానంలో ఉంది.అవిశ్వాస తీర్మాన సమయానికే పాక్ మిలిటరీతో అధికార పార్టీ వివాదంలో ఉంది. పాక్ రాయబారి అసాద్ మజీద్ ఖాన్‌తో జరిపిన సమావేశానికి దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల అమెరికా సహాయ మంత్రి డోనాల్డ్ లు, మరో అధికారి వచ్చారు. ఆ సమావేశంలో డోనాల్డ్ లు మాటల సారం ఇలా ఉంది. ఉక్రెయిన్ అంశంలో పాక్ వైఖరి అమెరికా, ఐరోపాకు ఆందోళన కరంగా ఉంది. తటస్థం అని చెప్పుకోవచ్చుగాని అలా కనిపించటం లేదు. ప్రధాని మీద అవిశ్వాస తీర్మానం నెగ్గితే రష్యా పర్యటనను కేవలం ప్రధాని తీసుకున్న నిర్ణయంగా పరిగణించి మిగతా అందరినీ అమెరికా క్షమించి వేస్తుంది. లేకుంటే గట్టిగా వ్యవహరించాల్సి వస్తుంది. ఐరోపా దీన్ని ఎలా చూస్తుందో చెప్పలేము, నేననుకోవటం వారి స్పందన కూడా ఇలాగే ఉంటుంది. ఖాన్ గనుక అధికారంలో గనుక కొనసాగితే ఐరోపా, అమెరికా అతన్ని ఒంటరిపాటు చేస్తాయి. అమెరికా అధికారి మాట్లాడిన దాని మీద పాక్ రాయబారి స్పందన సారం ఇలా ఉంది. అమెరికా నేతల నుంచి ఎలాంటి స్పందన, సంప్రదింపులు లేవు.దీన్ని బట్టి మారు మాట్లాడకుండా మీకు అవసరమైన వాటన్నింటికీ పాకిస్తాన్ మద్దతు పలుకుతుందనే భావనలో మీరున్నట్లు, మమ్మల్ని ఖాతరు చేయటం లేదని మావారు అనుకున్నారు. ఉక్రెయిన్-రష్యా పోరు మన సంబంధాల మీద ప్రభావం చూపదు. దీని మీద లూ మాట్లాడుతూ మీరు అనుకుంటే అనుకున్నారు కొంత నష్టం జరిగినా అదేమీ పెద్దది కాదులే.ఖాన్ను సాగనంపిన తరువాత మన సంబంధాలు తిరిగి మామూలు స్థితికి చేరతాయి. ఇప్పటికే కొంత దెబ్బ తగిలింది. కొద్ది రోజుల్లో మీ దేశ రాజకీయ పరిస్థితి మారుతుందో లేదో చూద్దాం.మారితే ఈ సమస్య గురించి మాకు పెద్ద విబేధాలేమీ ఉండవు, లేదో దీని సంగతి తేల్చుకోవాల్సి ఉంటుంది, ఎలా అదుపులోకి తేవాలో నిర్ణయిస్తాం అన్నాడు. ఈ సమావేశం జరిగిన తరువాత మార్చి ఎనిమిదవ తేదీన అవిశ్వాస తీర్మానం పెట్టారు. నెల రోజుల తరువాత అమెరికా జోక్యం గురించి ఇమ్రాన్ ఖాన్ బహిరంగంగానే తన మద్దతుదారులతో సభలో చెప్పాడు. అయితే తమ జోక్యం అన్నది ఆరోపణ తప్ప వాస్తవం కాదని అమెరికా ఖండించింది.
పాక్ రాయబారి పంపిన వర్తమానం గురించి అనధికారికంగా వెల్లడి కావటంతో పత్రికల్లో చర్చ మొదలైంది. ఇమ్రాన్ ఖాన్‌కు జనంలో ఆదరణ పెరిగింది, అమెరికా, ఐరోపా వ్యతిరేకత కనిపించింది. దాంతో మిలిటరీ రంగంలోకి దిగింది.అధికారిక రహస్యాలను వెల్లడించినా, ప్రచురించినా, మిలిటరీని విమర్శించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ఎలాంటి వారంట్లు లేకుండానే తనిఖీలు చేస్తామని, దీర్ఘకాల జైలు శిక్షలుంటాయని, రాజకీయ, పౌర అంశాల్లో మిలిటరీ అధికారులకు అపరిమిత అధికారాలను ఇస్తున్నట్లు హెచ్చరికలను జారీ చేసింది. ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా రాసినా, చివరికి అతని పేరును పదే పదే ప్రస్తావించినా సంగతి తేలుస్తామని మీడియా సంస్థలకు వర్తమానాలు పంపినట్లు వార్తలు వచ్చాయి. అంతే కాదు ఖాన్ మద్దతుదారుగా భావిస్తున్న ఒక ప్రముఖ జర్నలిస్టు అర్షాద్ షరీఫ్ ఈ ఆంక్షలతో దేశం విడిచి వెళ్లాడు. అక్టోబరు నెలలో నైరోబీలో అతన్ని కాల్చి చంపారు. ఎలా, ఎందుకు జరిగిందో ఇంతవరకు వెల్లడికాలేదు.మరో జర్నలిస్టు ఇమ్రాన్ రియాజ్ ఖాన్ను మే నెలలో ఒక విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అతని ఆచూకీ ఇంతవరకు వెల్లడి కాలేదు. గతేడాది నవంబరులో అసలు ఇమ్రాన్ ఖాన్ మీదనే జరిగిన హత్యాయత్నంలో ఒక మద్దతుదారు మరణించిన సంగతి తెలిసిందే.
పాక్ రాయబారి వర్తమానంలో మన దేశం గురించి కూడా అమెరికాాపాక్ మధ్య జరిగిన సంభాషణల్లో కొన్ని అంశాలు చోటు చేసుకున్నాయి. పాక్ రాయబారి డోనాల్డ్ లూ తో దీని గురించి మాట్లాడిన అంశాలు ఇలా ఉన్నాయి. అమెరికా-భారత్ సంబంధాల గురించి సెనెట్ సబ్ కమిటీ సమావేశంలో మీరు మాట్లాడిన తీరు చూస్తే భారత్,పాకిస్తాన్ పట్ల భిన్న ప్రాతిపదికలను అనుసరిస్తున్నట్లు ఉంది. భద్రతా మండలి, ఐరాస సమావేశానికి భారత్ గైరు హాజరు గురించి ఈ వైఖరి స్పష్టంగా కనిపించింది. వారి పట్ల ఒక వైఖరి మా పట్ల మరో వైఖరి ఎందుకు ? భారత్ కంటే మా నుంచి మీరు ఎక్కువ ఆశిస్తున్నట్లు, ఎక్కువ ఆందోళన చెందినట్లు కనిపిస్తోంది. దీని మీద డోనాల్డ్ స్పందిస్తూ చైనాలో ఏం జరుగుతోందనే దాన్ని బట్టి అమెరికాాభారత్ సంబంధాలు ఉంటాయి. దానితో పాటు మాస్కోతో భారత్‌కు సన్నిహిత బంధం ఉంది. ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్ధులు వెలుపలికి వచ్చిన తరువాత భారత వైఖరిలో మార్పు ఉంటుందని నేను అనుకుంటున్నాను అన్నాడు. మొత్తం మీద చూస్తే అమెరికా తన అవసరాలకోసం ఎంతకైనా తెగిస్తుందని, ఏ దేశ అంతర్గత వ్యవహారాల్లోనైనా జోక్యం చేసుకుంటుందని పాక్ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. వాటి నుంచి మనం పాఠాలు నేర్చుకుంటామా ?
