Tags
cia, coup against Sheikh Hasina, Hillary Clinton, Muhammad Yunus, Narendra Modi, Sheikh Hasina, Sheikh Hasina's ouster
ఎం కోటేశ్వరరావు
బంగ్లాదేశ్‌లో జరిగిన అనూహ్య పరిణామాల పూర్వరంగలో మైక్రో ఫైనాన్స్ ద్వారా ప్రపంచ వ్యాపితంగా గుర్తింపు పొందిన నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనిస్(84)ను అధికారాన్ని హస్తగతం చేసుకున్న మిలిటరీ ప్రభుత్వ సారధిగా నియమించింది. గురువారం రాత్రి ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ప్రమాణ స్వీకారం చేశాడు.ఎంతకాలం ఈ ఏర్పాటు అమల్లో ఉంటుంది ? ఎప్పుడు ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిస్తారు ? ఎన్నికల నిర్వహణకు ”తగిన పరిస్థితులు” లేవని తాత్కాలిక ప్రభుత్వాన్నే కొనసాగిస్తారా ? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయి. మరోవైపున మనదేశంలో ఆశ్రయం పొందిన మాజీ ప్రధాని షేక్ హసీనా ఇక్కడే ఉండేందుకు నరేంద్రమోడీ సర్కార్ అంగీకరిస్తుందా ? లేకపోతే ఆమె ఎక్కడకు వెళతారు ? ఇలాంటి అంశాల మీద కూడా ఇది రాసిన సమయానికి స్పష్టత లేదు. ఎవరీ యూనస్ అనే శోధన అంతర్జాలంలో జరుగుతున్నక్రమంలో సూదికోసం సోదికి పోతే పాత బాగోతాలన్నీ బయట పడినట్లుగా అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ నాటి పరిణామాల పూర్వరంగంలో వెలువడిన వార్తలు, విశ్లేషణలు, బయటపడిన అంశాలే. అవన్నీ కూడా అతగాడు అమెరికా మనిషి అని చూపుతున్నాయి. తోలుమ్మలాటలో తెర వెనుక ఉన్నవారు బొమ్మలను ఎలా ఆడించేదీ, వాటిపేరిట పలికే మాటలూ తెలిసిందే. బంగ్లాదేశ్‌లో ఇప్పుడు అదే క్రీడకు తెరలేచినట్లు చెప్పవచ్చు.
ఈ పెద్ద మనిషి గతంలోనే రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నట్లు , ప్రధాని పదవికోసం ప్రయత్నించినట్లు వెల్లడైంది. 2007 ఫిబ్రవరి 13న కొల్‌కతాలోని అమెరికా కాన్సులేట్ జనరల్ తమ ప్రభుత్వానికి పంపిన ఒక వర్తమానం వికీలీక్స్ వెల్లడించిన పత్రాల్లో ఉంది. దానిలో ఉన్న సమాచార సారం ఇలా ఉంది. యూనస్ రాజకీయాల్లోకి రావాలని దానికి గాను తన పథకాల గురించి అమెరికా అధికారికి వెల్లడించాడు. రాజకీయాల్లోకి వస్తే తలెత్తే ముప్పు గురించి కూడా చెప్పాడు. అక్కడ అంతర్యుద్ధం చెలరేగ కుండా ఉండేందుకు మిలిటరీ మద్దతు ఉన్న తాత్కాలిక ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించటాన్ని సమర్ధించాడు. దేశంలో అవినీతి, హింసాకాండ నుంచి కాపాడేందుకు ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు, ప్రజలు తనకు మద్దతు ఇవ్వాలని ఫిబ్రవరి 11న ఒక బహిరంగ లేఖ రాశాడు.(పరిస్థితి తనకు అనుకూలంగా లేదని గ్రహించి రెండు నెలల తరువాత సదరు ఆలోచన విరమించుకున్నాడు) హసీనా-ఖలీదా జియా మధ్య అధికార క్రీడలో నలుగుతున్న ప్రజాస్వామ్య క్రమంలో గొప్ప నైతిక వ్యక్తిత్వం మరియు బలమైన సంస్థాగత నైపుణ్యాలు ఉన్న యూనస్ అభ్యర్థిత్వం ప్రత్యామ్నాయాన్ని చూపగలదు అని అమెరికా అధికారి తమ ప్రభుత్వానికి నివేదించాడు. ఢాకాలోని అమెరికా రాయబార కార్యాలయం ఆ లేఖను ధృవీకరించి స్వదేశానికి పంపింది.
ఇన్నేండ్ల తరువాత యూనస్‌ను గద్దె నెక్కించటానికి అమెరికాకు అవకాశం దొరికింది. అతని మీద వందకు పైగా కేసులు నమోదయ్యాయి. అవన్నీ రాజకీయ ప్రేరేపితమని అతను కొట్టిపారవేశాడు.మైక్రో ఫైనాన్స్ పేరుతో పేదల రక్తం తాగే మనిషి అని ఒక సందర్భంగా షేక్ హసీనా వర్ణించింది.ఇతగాడు అమెరికా మానసపుత్రుడు.ప్రతి దేశంలో తనకు అవసరమైన వారికోసం అమెరికా సిఐఏ గాలం వేస్తుంది.ఒకసారి చిక్కిన తరువాత తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. వర్ధమాన దేశాల వారిని ఆకర్షించేందుకు వేసే ఎరల్లో విద్య, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించే పేరుతో అమెరికా ప్రభుత్వం ఎన్నో ఎత్తులు వేసింది, వాటిలో ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్ ఒకటి.యూనస్‌ను దానికి ఎంపిక చేశారు.సిఐఏ నేరుగా ఎంపిక చేయదు గాని ఎంపిక తరువాత అది రంగ ప్రవేశం చేస్తుంది.ఈ స్కాలర్ షిప్‌ను 1965లో యూనస్ పొందాడు. అర్ధశాస్త్రంలో పిహెచ్‌డి కూడా అమెరికాలోనే చేశాడు.1983లో గ్రామీణ బ్యాంకును ప్రారంభించి మైక్రోఫైనాన్స్ ద్వారా దారిద్య్రాన్ని తొలగించవచ్చనే చిట్కాను ముందుకు తెచ్చాడు. దానికి గాను 2006లో మరొకరితో కలసి నోబెల్ బహుమతి పొందాడు. ఆ బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బిల్‌క్లింటన్ లాబీయింగ్ చేశాడు.మైక్రోఫైనాన్స్ పధకాన్ని అమలు చేసిన బంగ్లాదేశ్‌లో పేదరికం గణనీయంగానే ఉంది. ఇప్పుడు రోజుకు 6.85డాలర్ల దారిద్య్రరేఖలో(ప్రపంచబాంక్ 2022) 74.1శాతం మంది ఉన్నారు. (అఫ్ కోర్స్ మనదేశంలో కూడా మైక్రోఫైనాన్స్ తారక మంత్రంగా చంద్రబాబు నాయుడు వంటి వారు ఊదరగొట్టారు, అమలు చేశారు.ప్రైవేటు కంపెనీలు జనాల రక్తాన్ని పీల్చాయి, అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవటంతో తరువాత సదరు కంపెనీలన్నీ జెండా ఎత్తేశాయి.) అయితే పైన చెప్పుకున్న అదే ప్రమాణం ప్రకారం భారత్‌లో 81.8శాతం ఉన్నారు.పాకిస్తాన్‌లో 84శాతంపైగా ఉన్నారు గనుక బిజెపి వారు తరచూ దానితో పోల్చి చూడండి మా మోడీ ఘనత అంటారన్నది తెలిసిందే.పేదరికం, దారిద్య్రం, నిరుద్యోగానికి తోడు ప్రతిపక్షాల అణచివేత షేక్ హసీనా మీద జనంలో వ్యతిరేకత పెరగటానికి, దాన్ని అవకాశంగా తీసుకొని అమెరికా కుట్రలో భాగంగా ప్రభుత్వ కూల్చివేత జరిగింది. తమ మానసపుత్రుడు గనుక యూనస్‌కు అమెరికా అనేక అవార్డులు ఇచ్చి స్థాయిని పెంచింది. ఇక షేక్ హసీనా విషయానికి వస్తే యూనస్ కార్యకలాపాలపై దర్యాప్తును ప్రారంభించి రుణాల వసూలుకు బలప్రయోగ పద్దతులను ప్రయోగించినట్లు వెల్లడించించారు. పదవీ విరమణ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో 2011లో అతగాడిని బాంకు బాధ్యతల నుంచి తొలగించింది. సుప్రీం కోర్టు ఆ చర్యను సమర్ధించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా నోబెల్ బహుమతి సొమ్ముతో సహా పుస్తకాల మీద సొమ్మును స్వీకరిస్తున్నారంటూ 2013లో కేసు నమోదు చేశారు. యూనస్ స్థాపించిన గ్రామీణ టెలికాం కంపెనీలో కూడా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.2023లో సదరు కంపెనీ సిబ్బంది తమ సొమ్మును స్వాహా చేసినట్లు ఒక కేసును దాఖలు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆ కేసులో శిక్ష పడి ప్రస్తుతం బెయిలు మీద ఉన్నాడు. సిఐఏ ఏర్పాటు చేసినట్లు భావిస్తున్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆ తీర్పును తప్పుపట్టింది.
అంతర్జాలంలో వెల్లడైన సమాచారం ప్రకారం అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌కు యూనస్ అత్యంత సన్నిహితుడు. ఆర్కాన్సాస్ గవర్నరుగా ఉన్నప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి. బిల్ క్లింటన్ సతి హిల్లరీ క్లింటన్ పేరుతో ఉన్న ఫౌండేషన్‌కు భారీ మొత్తంలో నిధులు ఇచ్చాడు. వాటి వివరాలను ఫౌండేషన్ వెబ్‌సైట్ నుంచి తరువాత తొలగించారు. దీర్ఘకాలం పాటు సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉంది. ఏడుదేశాల మీద దాడులు జరిపించి మానవహక్కులను హరించిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు శాంతిదూతగా నోబెల్ బహుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.అదే పెద్ద మనిషి చేతుల మీదుగా యూనస్ అనేక అవార్డులు అందుకున్నాడు.ఒబామా నుంచి అమెరికా అధ్యక్షుడి పేరుతో ఉన్న స్వేచ్చా పతకాన్ని, అమెరికా పార్లమెంటు బంగారు పతకం, సిఐఏతో సంబంధమున్న రాక్‌ఫెల్లర్ సోదరులు, ఫోర్డు ఫౌండేషన్ సంస్థలు ఏర్పాటు చేసిన రామన్ మెగాసెసే అవార్డు వాటిలో ఉన్నాయి. విదేశాంగ మంత్రిగా హిల్లరీ క్లింటన్ పనిచేసిన సమయంలో పద్దెనిమిది రకాల లావాదేవీలతో యుఎస్ ఎయిడ్ అనే సంస్థ యూనస్‌కు గ్రాంటులు, రుణాలు, కాంట్రాక్టుల రూపంలో కోటీ 30లక్షల డాలర్ల మేర లబ్దిచేకూర్చినట్లు తరువాత వెల్లడైంది. గ్రామీన్ అమెరికా పేరుతో హిల్లరీ క్లింటన్ పలుకుబడితో అమెరికా ఆర్థికశాఖ ఆరు లక్షల డాలర్ల గ్రాంటు ఇచ్చింది.యూనస్ మీద బంగ్లా ప్రభుత్వం జరుపుతున్న విచారణను విరమించుకోవాలని ఆమె వత్తిడి తెచ్చినట్లు అమెరికా పార్లమెంటరీ డాక్యుమెంట్లు స్పష్టం చేశాయి.హిల్లరీ ఫౌండేషన్ అంతర్జాతీయ విధాన డైరెక్టర్‌గా ఉన్న అమితాబ్ దేశారు ద్వారా ఆమె బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చారు.2012 జూన్ 11వ తేదీన అతగాడు పంపిన ఒక ఇమెయిల్ వర్తమానంలో ” ఒకవేళ మీరు ఇప్పటికే దాన్ని చూసి ఉండనట్లయితే వెంటనే చూడాలని డబ్లుజెసి(బిల్‌క్లింటన్), హెచ్‌ఆర్‌సి( హిల్లరీ క్లింటన్) కోరారు.” అని పేర్కొన్నారు.ప్రపంచబాంకులోని ఇద్దరు కీలక అధికారులను ఎఫ్‌బిఐ, సిఐదే ద్వారా బ్లాక్‌మెయిల్ కూడా చేయించారు. ఆ కారణంగానే పద్మానదిపై వంతెన నిర్మాణానికి మంజూరు చేసిన 120 కోట్ల డాలర్ల రుణాన్ని నిలిపివేసింది, దాని నిర్మాణంలో అవినీతి జరిగినట్లు సాకు చూపింది.(అవమానానికి గురైన హసీనా తరువాత అదే వంతెనకు చైనా నిధులు తెచ్చి పూర్తి చేసింది, దాంతో చైనాకు దగ్గరైనట్లు చెబుతారు) అంతే కాదు హసీనా మీద కక్ష కట్టిన అమెరికా సర్కార్ న్యూయార్క్‌లో ఉంటున్న ఆమె కుమారుడు సాజీబ్ వాజెద్ జారు (ఇప్పుడు బంగ్లాదేశ్‌లోనే ఉన్నట్లు వార్తలు) కంపెనీ మీద దాడులు జరపాలని 2017లో నాటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ సెనెటర్ చుక్ గ్రాసీ వత్తిడి తెచ్చినట్లు కూడా వెల్లడైంది.మైనస్ టూ ఫార్ములా ( షేక్ హసీనా, ఖలీదా జియా ) ప్రకారం వారిద్దరికీ రిటైర్మెంట్ ఇచ్చి ప్రవాసం పంపి మహమ్మద్ యూనస్‌ను నూతన నేతగా చేసే అవకాశాన్ని పరిశీలించాలని బంగ్లా కీలక అధికారులతో హిల్లరీ క్లింటన్ 2007లో విశ్వప్రయత్నాలు చేసినట్లు వెల్లడైంది. ఈ నేపధ్యంలోనే నూతన నేతగా మహమ్మద్ యూనస్‌ను మిలిటరీ ముందుకు తేవచ్చునని 2007 ఏప్రిల్ ఏడున బిబిసి ఒక వార్తను ప్రసారం చేసింది. అదే ఏడాది ఫిబ్రవరిలో అమెరికాకాన్సులేట్ జనరల్ సానుకూలత వ్యక్తం చేస్తూ పంపిన వర్తమానం గురించి ముందే చెప్పుకున్నాం.
హసీనాకు ఉద్వాసన మహమ్మద్ యూనస్‌కు పట్టం గట్టటం వెనుక ఉన్న సంబంధం ఏమిటో ఇప్పటికే అర్ధమై ఉంటుంది.యూనస్ పట్ల 2009లో అధికారానికి వచ్చిన హసీనా కఠిన వైఖరి ఎందుకు తీసుకున్నారో విశ్లేషిస్తూ మనదేశంలోని స్టేట్స్‌మన్ పత్రికలో 2019 ఏప్రిల్ ఐదున అమెరికాకు చెందిన జర్నలిస్టు బిజడ్ ఖుస్రూ రాశాడు. మిలిటరీతో చేతులు కలిపి తనను, ఖలీదాను ప్రవాసం పంపేందుకు యూనస్ కుట్ర చేశాడని, రాజకీయాల్లోకి రావాలని స్వయంగా సిద్దపడినట్లు ఆమె భావించారు. దశాబ్దాలపాటు సాగిన గిరిజన తిరుగుబాట్లకు స్వస్తిపలికిన తనకు నోబెల్ బహుమతి ఇవ్వకుండా యూనస్‌కు ఇచ్చారని ఆమె అసూయ చెందినట్లు ఖుస్రూ పేర్కొన్నారు. రాసిన అంశాల సారం ఇలా ఉంది.హసీనా 2009లో అధికారానికి రాక ముందు తాత్కాలిక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా తనను నియమిస్తే సంతోషిస్తానని యూనస్ ఢాకాలో ఒక సభలో ప్రకటించాడు. ఆ మరుసటి రోజు అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ జలీల్ ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. దానికి ఐదు నెలల ముందు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నట్లు యూనస్ చెప్పాడని, అంతేగాక పాలన పట్ల అతని అభిప్రాయాలతో తాము విబేధిస్తున్నట్లు కూడా జలీల్ చెప్పాడు. ఈ వైఖరి తీసుకోవటానికి హసీనాకు ఢిల్లీ నుంచి అందిన సమాచారం కూడా ఒక కారణం. అదేమంటే హసీనా స్థానంలో యూనస్‌ను ఉంచాలని అమెరికా కోరుకుంటున్నదని దాని పట్ల భారత్ కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. అంతే కాదు, మతవాద జమాతే ఇస్లామీకి రాజకీయ రంగంలో చోటు కల్పించకూడదన్నది భారత వైఖరి కాగా జమాతే మీద చర్య తీసుకుంటే దాన్ని అజ్ఞాతవాసంలోకి నెట్టడమే అవుతుందని అమెరికా చెప్పిందట. జమాతే ప్రధాన రాజకీయ స్రవంతిలో ప్రవేశిస్తే అది మతవాదాన్ని తగ్గించుకుంటుందన్న తమ వైఖరిని భారత్ అర్ధం చేసుకోవటం లేదని అమెరికా చెప్పింది. తన పట్ల ఉన్న వైఖరిని మార్చుకోవాల్సిందిగా హసీనాను కోరాలని అమెరికా రాయబారిని కోరగా, తాను ఆపని చేస్తానని ఆమెతో ఒక మంచిమాట చెప్పిస్తానని హామీ ఇచ్చాడని అయితే హసీనా అందుకు అంగీకరించకపోగా యూనస్‌ను బాంకు పదవి నుంచి తప్పించారు.
హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన మిలిటరీ అధికారులు కేవలం 45 నిమిషాల సమయమిచ్చి ఆమెను బలవంతంగా భారత్‌కు పంపిన సంగతి తెలిసిందే. డెయిలీ స్టార్ అనే పత్రిక వెల్లడించిన సమాచారం ప్రకారం ఫ్రాన్సులో ఉన్న యూనస్ స్వదేశానికి తిరిగి వచ్చి బాధ్యతలు స్వీకరించాలని విద్యార్థులు కోరారు. తాను పూర్తి చేయాల్సిన పనులెన్నో ఉన్నందున రాలేనని యూనస్ తొలుత చెప్పాడు.విద్యార్థులు పదే పదే కోరటంతో అంగీకరించాడు. దేశంలో ఆరాచకాన్ని తొలగించే క్రమంలో హసీనాను గద్దెదించటం పట్ల సంతోషం వెలిబుచ్చాడు. విద్యార్థులు, దేశ పౌరులు ఎన్నో త్యాగాలు చేసినపుడు నాకు సైతం కొంత బాధ్యత ఉంది, అందుకే అంగీకరించాను అన్నాడట.హసీనాను గద్దె దించిన రోజును రెండవ విముక్తి దినంగా యూనస్ వర్ణించినట్లు ఒక జర్నలిస్టు చెప్పాడు. ఇలాంటి వ్యక్తి సారధ్యంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం స్వేచ్చగా ఎన్నికలు నిర్వహిస్తుందా అన్ని పార్టీలకు అవకాశం కల్పిస్తుందా ? ఏదో ఒక ముసుగులో అమెరికా అనుకూల బిఎన్‌పి-జమాతే మతశక్తులకు అధికారం కట్టబెడుతుందా ? బంగ్లాదేశ్‌లో అమెరికా మిలిటరీ స్థావరాన్ని ఏర్పాటు చేసి అటు చైనా ఇటు భారత్‌కూ ముప్పు తెస్తుందా ? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి.
