Tags
Amit Shah, Annamalai, BJP, Kushboo Sunder, Narendra Modi Failures, Tamil Nadu BJP rumblings, Tamilisai, Tamilnadu politics
ఎం కోటేశ్వరరావు
అక్కటా ఏమిటీ విధి వైపరీత్యం ! చంద్రబాబు పట్టాభిషేకానికి నేను వెళ్లటం ఏమిటి ? వెళితినిపో.. ఏదో ఒక మూలన కూర్చోకుండా అమిత్ షా అన్నను మర్యాదగా పలకరించాలనుకోవటం ఏమిటి ? అనుకుంటిని పో… నా నమస్కారానికి తిరస్కారంగా నన్ను చీవాట్లు పెట్టటం ఏమిటి ? అన్నగనుక దాన్లో తప్పులేదు ! పక్కనే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఇంకా పార్టీ పెద్దలు, ఇతరులు అనేక మంది చూస్తుండగానే బహిరంగవేదిక మీద అలా చేయవచ్చా ? అయినా అంత తప్పు నేనేం చేశాను ? పోనీ నా అపరాధం ఏదైనా ఉంటే నాలుగ్గోడల మధ్య చివాట్లు వేయవచ్చు. ఇలా బహిరంగవేదిక మీద, టీవీల ప్రత్యక్ష ప్రసారం జరుగుతోందని తెలిసి కూడా అమిత్ అన్నకు అంత ఆగ్రహం రావటం ఏమిటి ? నన్ను అవమానించటం ఏమిటి, తెలంగాణా గవర్నర్‌గా ఉండగా కెసిఆర్ చేసిన అవమానం దీనితో పోలిస్తే చాలా చిన్నది. అమిత్ అన్న చేసింది భరించలేనిదిగా ఉంది. బేటీ బచావో అంటూ మోడీ ఇచ్చిన నినాదాన్ని అమిత్ అన్న విస్మరించి ఇలా అవమానించటం ఏమిటి ? ఉన్న గవర్నర్ ఉద్యోగం వదులుకొని కేంద్ర మంత్రి పదవి మీద ఆశతో బరిలో దిగి అటు ఎన్నికల్లో ఓడి ఇటు అమిత్ అన్నతో చివాట్లు తిన్న తరువాత నేను రాష్ట్రంలో తలెత్తుకోగలనా ? కింకర్తవ్యం ఏమిటి ? ఇలా పరిపరి విధాలుగా తెలంగాణా మాజీ గవర్నర్, తమిళనాడు బిజెపి నేత తమిళశై సౌందర్‌రాజన్ మధనపడుతూ ఉండి ఉండాలి. ఎందుకంటే కొన్ని లక్షల మంది చూస్తుండగా జరిగిన ఉదంతాన్ని ఎవరైనా జీర్ణించుకోవటం కష్టం.
2024జూన్ 12న బుధవారం నాడు విజయవాడ సమీపంలోని కేసరపల్లిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రుల ప్రమాణోత్సవానికి హాజరైన అనేక మంది బిజెపి ప్రముఖులలో తమిళశై ఒకరు. వేదిక మీద ఆసీనుడైన అమిత్ షా, పక్కనే ఉన్న వెంకయ్య నాయుడికి ఆమె నమస్కారం చేయగానే అమిత్ షా ముఖకవళికలు మారిపోయాయి, అభివాదం చేసి వెళుతున్న ఆమెను వెనక్కు పిలిచి వేలు చూపుతూ తీవ్రంగా హెచ్చరిక లేదా మందలించినట్లు కనిపించింది.ఆమె ఏదో వివరణ ఇవ్వబోగా అదేమీ కుదరదన్నట్లు కనిపించింది. ఇదంతా క్షణాల్లోనే జరిగింది. ఏం మాట్లాడింది పక్కనున్న వెంకయ్యనాయుడు,ఇతర బిజెపినేతలు నోరువిప్పితేనే వాస్తవం తెలుస్తుంది.ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారమైంది. మీడియా సంస్థలు విశ్లేషణలు వెలువరించాయి. తమిళనాడు బిజెపిలో ఉన్న కుమ్ములాటల గురించే అమిత్ షా మందలించినట్లు పేర్కొన్నాయి. మీడియా వ్యాఖ్యానాలను పక్కన పెడదాం. ” తమిళశై అక్కను అమిత్‌షా గారు తీవ్రంగా మందలించినట్లు దానిలో కనిపిస్తున్నది.అయితే బహిరంగంగా చేసిన ఈ ”హెచ్చరిక”కు కారణం ఏదై ఉండవచ్చు ? అవాంఛనీయ బహిరంగ వ్యాఖ్యలా ? ” అని ఏకంగా తమిళనాడు బిజెపి ఐటి విభాగపు ఉపాధ్యక్షుడు కార్తిక్ గోపీనాధ్ ఎక్స్‌లో స్పందించారు. ఎక్కడ జనాలు సదరు వీడియోను చూడలేదో అని దాన్ని కూడా జతచేశారు.
తాజా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేత అన్నామలై అద్భుతాలు సృష్టించబోతున్నారు, తమిళనాడు రాజకీయ చరిత్రను తిరగరాయబోతున్నారన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఏ పార్టీతో పొత్తు లేకుండా డిఎంకె నాయకత్వంలోని కూటమిని మట్టికరిపిస్తారని చెప్పారు. అది జరగకపోగా ఇప్పుడు పార్టీ ఖాతా తెరవకపోవటానికి కారణం నువ్వంటే నువ్వన్నట్లు అన్నామలై-తమిళశై వర్గాలు కుమ్ములాటలకు దిగాయి. ఎన్నికల ఓటమి గురించి ఒక యూట్యూబ్ ఛానలతో తమిళశై మాట్లాడుతూ చీలికలు లేని అన్నా డిఎంకెతో సర్దుబాటు చేసుకొని ఉంటే మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని చేసిన వ్యాఖ్య బిజెపిలో విబేధాలకు కారణమైంది. పార్టీ అధ్యక్షుడు అన్నామలై దీనికి వ్యతిరేకమైన వైఖరితో ఉన్నారు. అన్నామలై కారణంగానే అన్నాడిఎంకెతో బిజెపి మైత్రి చెడిందని, దాంతో పార్టీ తీవ్రంగా నష్టపోయిందని పార్టీలో కొందరు మండిపడుతున్నారు. అన్నాడిఎంకె మాజీ మంత్రి ఎస్‌పి వేలుమణి మాట్లాడుతూ తమ పార్టీలో చీలికకు అన్నామలై పూర్తి కారకుడని విమర్శించారు. రెండు పార్టీలు పొత్తుపెట్టుకొని ఉంటే తమ కూటమి 35 సీట్లు గెలిచి ఉండేదన్న అతని అభిప్రాయాన్ని తమిళశై బలపరచటంతో రెండు వర్గాల మధ్య దూరం పెరిగింది. ఒక్క సీటుకూడా తెచ్చుకోని పార్టీ నేత చెప్పిన మాటలను ఎలా సమర్ధిస్తారంటూ అన్నామలై ధ్వజమెత్తారు. పన్నెండు స్థానాల్లో అన్నాడిఎంకెను మూడవ స్థానంలోకి నెట్టామని ఇది బిజెపి సాధించిన విజయమని అన్నామలై సమర్ధించుకున్నారు. గతంలో తాను పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నపుడు ఒక ప్రమాణం పెట్టుకున్నానని, సంఘవ్యతిరేక శక్తులను ప్రోత్సహించలేదని, కానీ ఇటీవల అలాంటి వారిని పార్టీలోకి తీసుకున్నారని. అన్నామలై మంచినేత అనటంలో తనకెలాంటి సందేహం లేదని, మనమంతా అనేక రకాల నేతలమని, భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటామని తమిళశై పరోక్షంగా అన్నామలై మీద ధ్వజమెత్తారు. అయితే దీని మీద మాజీనేత తిరుచ్చి సూర్య శివ స్పందిస్తూ ఆమె పార్టీ నేతగా ఉండగా రాష్ట్రంలో పార్టీలో చేరేందుకు ఎవరూ ముందుకు రాలేదని విమర్శించారు. దీంతో సామాజిక మాధ్యమంలో ఇద్దరి అభిమానులు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కుమ్ములాటలు బహిరంగమై పార్టీ పరువుతీశాయి.
ఓటర్లలో మాజీ హీరోయిన్ కుష్‌బూకు ఉన్న ఆకర్షణను ఎన్నికల్లో ఉపయోగించుకొని ఉంటే ఫలితాలు వేరుగా వచ్చి ఉండేవని బాలీవుడ్ దర్శకుడు, బిజెపి అభిమాని ఆనంద కుమార్ చెప్పారు. అన్నామలై గనుక కుష్‌బూను ప్రచారంలోకి దించి ఉంటే తమిళనాడులో ఫలితాలు వేరుగా ఉండేవన్నారు. తమిళనాడు బిజెపిలో సమన్వయం లేదు, రాజకీయాల్లో ఒకే ఒక్కడు ప్రత్యేకించి రాజకీయాలకు కొత్తగా వచ్చిన అన్నామలై పోరాడలేరు. ఓట్ల శాతం పెరిగి ఉండవచ్చు తప్ప ఒక్క సీటూ రాలేదన్నారు. ఎంతగానో ఆకర్షణ ఉన్న కుష్‌బూను బిజెపి ఎందుకు వినియోగించుకోలేదో, ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, జెపి నడ్డా వచ్చిన సభలకు ఎందుకు ఆహ్వానించలేదో ఆశ్చర్యంగా ఉందన్నారు.
అసలే సంపూర్ణ మెజారిటీకి పార్టీ దూరమై కారణాలను బహిరంగంగా చెప్పుకోలేని స్థితిలో పడితే ఒక్క సీటు కూడా రాని చోట ఈ రచ్చేమిటని కేంద్ర నాయకత్వం తలలు పట్టుకుంది. ఈ పూర్వరంగంలో అమిత్ షా బహిరంగ మందలింపు ఉదంతం చోటు చేసుకుంది.అన్నామలై కేంద్ర నాయకత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని బిజెపి మేథావుల విభాగపునేత కల్యాణ రామన్ ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో పార్టీకి ఒక అంకెలో వచ్చిన ఓట్లు ఇప్పుడు రెండంకెల శాతానికి పెరిగాయని చెప్పటం తప్పుదారి పట్టించటమే అన్నారు.2019లో తొమ్మిది సీట్లలో పోటీ చేసినపుడు 5.56శాతం ఓట్లు వచ్చాయని తాజాగా 23చోట్ల పోటీ చేస్తే 11.24శాతం వచ్చాయి. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే పోటీ చేసిన సీట్ల ప్రాతిపదికన ఈ సారి 14.25శాతం రావాలని రామన్ వాదించారు. అన్నామలైకి నైతిక విలువలు లేవని పదవికి రాజీనామా చేయాలన్నారు. అమిత్ షా తీరు గురించి డిఎంకె ప్రతినిధి ఎస్ అన్నాదురై ఎక్స్ ద్వారా స్పందిస్తూ ” ఇవేమి రాజకీయాలు ? తమిళనాడుకు చెందిన ప్రముఖ మహిళానేతను బహిరంగంగా మందలించటం సభ్యతేనా ? ఇది చాలా చెడు ఉదాహరణ, ప్రతి ఒక్కరూ దీన్ని గమనిస్తారని అమిత్ షా తెలుసుకోవాలి ” అని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ఓటమి తరువాత తమిళనాడు బిజెపిలో ఉన్న కుమ్ములాటల గురించి దేశంలోనే పెద్దగా తెలియదు. అమిత్ షా ఆగ్రహ ప్రదర్శనతో అది విశ్వవ్యాప్తమైంది.
కందకు లేని దురద కత్తిపీటకెందుకు !
అమిత్ షా తీరుపై అటు తమిళనాడులో, ఇటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళుల్లో నిరసన వ్యక్తమైంది. అయితే ముందే చెప్పుకున్నట్లు అక్కడి బిజెపి రెండు ముఠాల మద్దతుదార్లు తమనేతలకు అనుకూలంగా కాని వారికి ప్రతికూలంగా స్పందించారు.యాంటీ క్లైమాక్స్ (విలోమ పరాకాష్ట) ఏమిటంటే అవమానానికి గురైన తమిళశై అబ్బే అలాంటిదేమీ లేదు, పార్టీ కోసం పనిచేయాలనే సూచనలు ఇచ్చారంటూ గురువారం నాడు ఎక్స్ చేశారు.ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భంగా వేదికపై ఆసీనులైన కేంద్ర హౌం మంత్రి అమిత్ షా ఆయన తననేమీ మందలించలేదని, పార్టీ కోసం పనిచేయాలంటూ సూచనలు ఇచ్చారని పేర్కొన్నారు. ”ఎన్నికల తరువాత తొలిసారిగా ఆ వేదికపైనే అమిత్ షాతో మాట్లాడాను. ఎన్నికలు ముగిసినందున ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయని అడిగారు. నేను వాటిని వివరిస్తుండగా సమయం లేకపోవడంతో త్వరత్వరగా మాట్లాడుతూ పార్టీకి, నియోజకవర్గం అభివద్ధికి మరింత విస్తతంగా పనిచేయాలని చెప్పారు. దీనిపై రకరకాల వదంతులు వ్యాపించడంతో ఈ వివరణ ఇస్తున్నానని ” పేర్కొన్నారు. వేదికపై ఆమెతో అమిత్ షా మాట్లాడిన తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ వీడియో లేదా ఫొటోలను చూసిన మానవ మాత్రులెవరూ ఆ పెద్ద మనిషి సూచనలు ఇచ్చినట్లుగా భావించరు. ఆమె మౌనంగా ఉన్నా అదో తీరు. వివరణ ద్వారా తన ఆత్మగౌరవాన్ని ఫణంగా పెట్టారని చెప్పవచ్చు. మద్దతుగా స్పందించిన వారిని ఇరకాటంలో పెట్టారు. కేంద్రంలో ఐదేండ్లు అమిత్ షా అధికారంలో ఉంటారు గనుక కేంద్ర పెద్దల ప్రాపకం కోసం ఏమీ జరగలేదని ప్రకటించారు. అయినా కందకు లేని దురద కత్తిపీటలకెందుకు అన్నట్లు అవమానంపై ఆమెకు లేని అభ్యంతరం మనకెందుకు అన్నట్లు జనాలు ఆ స్పందనను చూసిన వారు భావిస్తున్నారు.
