Tags
#Hindutva, Anti Muslim, Communal Sentiments, Himanta Biswa Sarma, Hindu Rashtra, Hindu Supremacists, Hindutva fanatics, Narendra Modi Failures, RSS, Union Minister Giriraj Singh
ఎం కోటేశ్వరరావు
” ముస్లింలు నాకు ఓటు వేయలేదు.కాబట్టి ఇప్పుడు నేను కూడా వారికోసం పని చేయటం లేదు. నా ప్రాంతంలోని ఒక మౌల్వీ ఒక ఇల్లు, ఉజ్వల గ్యాస్, ఐదులక్షల రూపాయల ఆయుష్మాన్, మరుగుదొడ్డి, రేషన్ కార్డు కూడా పొందాడు. నాకు ఓటు వేసి ఉంటే ప్రమాణం చేసి చెప్పాలని నేను అడిగాను, అతనా పనిచేయలేదు. నా హృదయం ముక్కలైంది. ఇది సనాతన ధర్మాన్ని బలహీన పరిచేందుకు, భారత్‌పై ముస్లిం యుద్ధం (ఘజ్వా ఏ హింద్ ) చేసేందుకు పక్కాగా రూపొందించిన ఒక వ్యూహం ” తెల్లారగానే సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ సబ్‌కా విశ్వాస్ సుప్రభాతంతో జనాన్ని నిద్రలేపే కారణజన్ముడైన దేవుని బిడ్డ నరేంద్రమోడీ గురించి తెలిసిందే. అలాంటి దైవాంశసంభూతుడి మంత్రివర్గ సభ్యుడైన జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మూడోసారి అధికారానికి వచ్చిన తరువాత తాజాగా ఎక్స్ ఖాతాలో వెల్లడించిన అభిప్రాయమిది. రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రిగా ” నా బాధ్యతలను నమ్మకంగా మరియు మనస్సాక్షిగా నిర్వర్తిస్తాను. మరియు రాజ్యాంగం మరియు చట్ట ప్రకారం అన్ని రకాల ప్రజలకు భయం లేదా అభిమానం, ఆప్యాయత లేదా దురుద్దేశ్యం లేకుండా న్యాయం చేస్తాను ” అని ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రి దాన్ని ఉల్లంఘించారు. ఇందుకు గాను అతగాడిని మంత్రి వర్గం నుంచి ప్రధాని తొలగించాలి, లేదా రాజ్యాంగాన్ని కాపాడాల్సిన రాష్ట్రపతి తన బాధ్యతను నిర్వర్తించాలి. ఏదీ జరిగే సూచనలు లేవు.
ఘజ్వా ఏ హింద్ అనే పదాన్ని ఇటీవల అనేక మంది ముఖ్యంగా హిందూ-ముస్లిం మతోన్మాదులు, ఉగ్రవాదులు, కొన్ని మీడియా సంస్థల జర్నలిస్టులు రెండు మతాలవారినీ రెచ్చగొట్టేందుకు వినియోగిస్తున్నారు. కొంత మంది ఇస్లామిక్ పండితులు దాని అసలు అర్దాన్ని వక్రీకరిస్తున్నారని వివరణ ఇచ్చారు. దాని సారం ఏమిటంటే మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలకు తప్పుడు భాష్యం చెబుతున్నారు.దానితో విబేధించే పండితులు కూడా ఉన్నారు. క్రైస్తవం మీద తిరుగుబాటులో భాగంగా ఇస్లాం ఉద్భవించింది. క్రీస్తుశకం 530వ సంవత్సరంలో జన్మించిన మహమ్మద్ ప్రవక్త 632జూన్ ఎనిమిదిన మరణించాడు.ఎవరి భాష్యం ఎలా ఉన్నప్పటికీ నాడు చెప్పిన అంశాలు నేడు వర్తించవన్నది తెలిసిందే. ఈ అంశాలలో హిందూ-ముస్లిం మతశక్తులు బొమ్మా- బొరుసు వంటివి. సమాజాన్ని వెనక్కు తీసుకుపోవాలని రెండూ చెబుతున్నాయి. అరబ్బీలో ఘజ్వా అంటే యుద్ధం. భారత ఉపఖండం మీద దాడి చేసి ఇస్లాం భావజాలాన్ని వ్యాపింప చేయాలని ప్రవక్త చెప్పాడని, దాన్ని కొనసాగించాలని ముస్లిం తిరోగమనవాదులు నిత్యం రెచ్చగొడుతుంటారు. ముస్లింలు ఇప్పటికీ ఘజ్వాను వదల్లేదని అందువలన వారి దాడి నుంచి హిందూ లేదా సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ హిందూ తిరోగమన వాదులు పదే పదే దాన్ని ఆయుధంగా చేసుకుంటున్నారు.నిజానికి సనాతనం అంత గొప్పదైతే మరి అంటరానితనం, వివక్షలనే కాన్సర్లు మన సమాజంలో ఎలా విస్తరించాయి ? మహానుభావుడు అంబేద్కర్‌కు సనాతనం గురించి తెలియదా ? పక్కాగా తెలుసు, నాటి సనాతనుల ఆచరణను చూసే దాన్ని వ్యతిరేకించి బౌద్దంలోకి మారిన సంగతి తెలిసిందే.అంటరాని తనంతో సహా అనేక వివక్షలను రుద్దిన మనుస్మృతిని అమలు జరపాలని అంటే దళితులు, గిరిజనులు, వెనుక బడిన తరగతుల వారు బిజెపికి దూరం అవుతారనే భయంతో దాని బదులు సనాతన ధర్మం అనే పల్లవిని అందుకున్నారు. ఇది కూడా ఎంతో కాలం నడవదన్నది వేరే సంగతి.
దానిలో భాగంగానే హిందూ దేవాలయాలు, యాత్రా ప్రాంతాలలో ఉన్న ముస్లింల దుకాణాలను మూసివేయాలి. ముస్లిం పేర్లతోనే ముస్లింలు దాబాలను ఎందుకు తెరవరు ? కన్వర్ యాత్రీకులను మోసం చేసేందుకు ముస్లిం దాబాల యజమానులు హిందూ పేర్లు పెడుతున్నారు,పేర్లు ఎందుకు మార్చాలి, దాబాలను ఎందుకు తెరవాలి అంటూ విశ్వహిందూ పరిషత్ ప్రశ్నిస్తోంది. సంఘపరివార్ ఏర్పాటు చేసిన సంస్థలకు చెందిన వారు, దాని మతోన్మాద వైరస్ బారిన పడిన వారు ఇలాంటి విద్వేషాన్ని వెళ్లగక్కటం తెలిసిందే. అఫ్ కోర్సు అలాంటి వాటిని అలఓకగా వెల్లడించే వారిలో పేరుమోసిన వ్యక్తి గిరిరాజ్ సింగ్ అన్నది తెలిసిందే. ఇలా మాట్లాడటం తగదని తన సహచరులకు నరేంద్రమోడీ అంతర్గతంగానైనా చెప్పి ఉంటే గిరిరాజ్ సింగ్ లాంటి వారు, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు పదే పదే రెచ్చిపోతాయా ? దైవాంశ సంభూతుడిని తిరస్కరిస్తాయా ? మీరంతా నిమిత్త మాత్రులు, మీతో చెప్పించేది, చేయించేదీ అన్నీ నేనే అనే భగవద్గీత సారం తెలిసిందే. చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి…గుడిసెలు అనే సామెత తెలిసిందే కనుక టీకా తాత్పర్యాలు అవసరం లేదు.
మన దేశంలో ఇలాంటి పరిస్థితి ఉంది గనుకనే నరేంద్రమోడీ మూడవసారి అధికారానికి వచ్చిన తరువాత అమెరికా మత స్వేచ్చ నివేదికలో మైనారిటీలకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులు, విద్వేష ప్రచారం గురించి పేర్కొన్నారు. ప్రతి ఏటా అమెరికా నివేదికల్లో ఈ అంశాలను ప్రస్తావిస్తూనే ఉన్నారు.వాటిని ఒక వైపు మోడీ సర్కార్ ఖండిస్తున్నదీ, తిరస్కరిస్తున్నది. మరోవైపున కాషాయ దళం తనపని తాను చేస్తున్నది. నిజం ఏమిటో మన జనానికి తెలియదా ? మణిపూర్‌లో క్రైస్తవులైన గిరిజన కుకీల మీద జరిగిన దాడులు,హత్యాకాండ, ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించిన వైనం అక్కడి బిజెపి రాష్ట్ర ప్రభుత్వం దాచినా దాగలేదు.గిరిజనులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలోనే కాదు, చివరకు హిందువులైన మెయితీలు అధికంగా ఉన్న చోట కూడా బిజెపి రెండు చోట్లా తాజా లోక్‌సభ ఎన్నికల్లో మట్టికరచింది. గిరిరాజ్ సింగ్ కేంద్ర మంత్రిగా ఎవరి పట్లా వివక్ష చూపనంటూ చేసిన ప్రమాణస్వీకారాన్ని ఉల్లంఘించి మాట్లాడారు గనుకనే ఆ పెద్ద మనిషి గురించి చెప్పుకోవాల్సి వస్తున్నది. ముస్లింలు దుకాణాలు తెరవకూడదు, ఉన్నవాటిని మూసివేయాలంటూ వీరంగం వేసిన అయోధ్య ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో హిందువులే మెజారిటీ అయినప్పటికీ అక్కడ బిజెపి ఓడిపోయింది. ప్రతిపక్షాలు గెలిస్తే రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారని స్వయంగా నరేంద్రమోడీ చెప్పినా అక్కడి జనాలు పట్టించుకోకుండా చెంపదెబ్బ కొట్టినట్లుగా తీర్పు చెప్పారు.
ఆరునెల్లు గడిస్తే వారు వీరవుతారు అన్నట్లుగా బిజెపితో చేతులు కలిపిన ఇతర పార్టీలు కూడా దాని భావజాలాన్ని, విద్వేషాన్ని తలకెక్కించుకుంటున్నాయి.లోక్‌సభ ఎన్నికల్లో తనకు ఓటు వేయని యాదవులు, ముస్లింల కోసం తాను ఎలాంటి పనులు చేయనని బీహార్‌లోని నితీష్ కుమార్ పార్టీ జెడియు సీతామరి ఎంపీ దేవేష్ చంద్ర ఠాకూర్ ఇటీవల ప్రకటించారు. యాదవులు, ముస్లింలు తనవద్దకు వస్తే స్వీట్లు పెట్టి, టీ ఇచ్చి పంపుతాను తప్ప వారికి ఎలాంటి పనులూ చేయనని అన్నారు.హృదయంలో చెలరేగిన భావాలతోనే ఠాకూర్ అలా మాట్లాడినట్లు అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అతగాడిని సమర్ధించారు.కేంద్రం, రాష్ట్రం అమలు జరిపిన పధకాలతో లబ్ది పొందిన ముస్లింలు తనకూ ఓట్లు వేయలేదన్నారు. దీనికంతటికీ మంగళసూత్రాలు లాక్కుంటారంటూ ప్రతిపక్షాల మీద ప్రధాని నరేంద్రమోడీ చేసిన తప్పుడు ప్రచారమే కారణని ఆర్‌జెడి విమర్శించింది. ఎంపీలు, ఎంఎల్‌ఏలు నియోజకవర్గాల్లో ఉన్న అందరికీ చెందిన వారు తప్ప ఒక కులం, మతానికో ప్రాతినిధ్యం వహించేవారు కాదని, రాజ్యాంగం మేరకు దేశం నడుస్తున్నది తప్ప కొంత మంది బుర్రల్లో పుట్టినదాని ప్రకారం కాదని పేర్కొన్నది. ఇలాంటి ఎంపీలు, కేంద్ర మంత్రుల వద్దకు కేవలం టీ తాగేందుకు ఆత్మగౌరవం కలవారు ఎవరైనా వెళతారా ?యాదవులు, ముస్లింలే కాదు, వీరికి ఓటేయని ఏ సామాజిక తరగతికీ మినహాయింపు ఉండదని అందరూ గమనించాలి.ఇలాంటి వారు బిజెపి, దాని మిత్రపక్షాల్లో ఎంతగా వర్ధిల్లితే అంతగా జనం అసలు రంగు తెలుసుకుంటారు.
గిరిరాజ్ సింగ్ ఏం మాట్లాడినా బిజెపి పెద్దలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. 2019లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నాటి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలోనే బీహార్ బెగుసరారు నియోజకవర్గంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బహుశా ఈ పెద్ద మనిషి డిఎన్‌ఏలోనే ముస్లిం ద్వేషం ఉన్నట్లు అతగాడి వదరుబోతుతనం వెల్లడిస్తున్నది.దేశ విభజన సందర్భంగా ముస్లింలందరినీ పాకిస్తాన్ పంపకపోవటం మన పూర్వీకులు చేసిన పెద్ద తప్పిదం అన్నారు.2014లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీకి ఓటు వేయని వారిని పాకిస్తాన్ పంపాలని సెలవిచ్చినందుకు బహుమతిగా నాడు సహాయ కేంద్ర మంత్రి పదవి, తరువాత మరింతగా రెచ్చిపోయినందుకు 2019లో కాబినెట్ మంత్రిగా, మరోసారి ఇప్పుడు కొనసాగించారు మోడీ. బీహార్‌లో మిత్ర పక్షాలుగా ఉన్న ఎల్‌జెపి, జెడియు నేతలు ఈ పెద్దమనిషి వ్యాఖ్యలను విమర్శించటం తప్ప గట్టిగా వ్యతిరేకించిన దాఖలాలు లేవు. మోడీ రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత సంఘపరివార్ ఏర్పాటు చేసిన సంస్థలలో ఇలాంటి విద్వేష ప్రసంగీకులకు కొదవ లేదు. విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా వారిలో ఒకరు. ” మనం అధికులుగా ఉన్న ప్రాంతాలలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ముస్లింలను భయపెట్టాలి ” అన్నారు. నోటిదూల, నోటి తుత్తర లేదా విద్వేష గళాల పీఠాధిపతుల్లో గిరిరాజ్ సింగ్‌ను ఒకరిగా చెప్పవచ్చు.ప్రపంచ జనాభా దినం సందర్భంగా 2019 జూలై 11న మంత్రి హౌదాలో ఒక ట్వీట్ ( ప్రస్తుతం ఎక్స్) చేశారు. ” ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి ఓటింగ్ హక్కు రద్దు చేయాలన్నది నా వైఖరి ” అని పేర్కొన్నారు. ఇది ముస్లింలను ఉద్దేశించే చేసినప్పటికీ ఇతర మతాలలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి కూడా వర్తిస్తుంది కనుక వారు కూడా ఇలాంటి వ్యక్తులు, వారి పార్టీ గురించి ఆలోచించుకోవాలి.
బిజెపి నేతలు హిందూ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా తమకు ముస్లింల ఓట్లు అవసరం లేదని బహిరంగంగానే ప్రకటిస్తారు. తనకు మియా(అసోంలోని ముస్లింలకు మరోపేరు)ల ఓట్లు అవసరం లేదని సాక్షాత్తూ ఆ రాష్ట్ర సిఎం హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. తాను వారి ప్రాంతాలలో అసలు ప్రచారానికే వెళ్లనని కూడా చెప్పారు. మియాల్లో బాల్య వివాహాలు అంతరించేవరకు వారి ఓట్లను తాను కోరనని, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని కూడా చెప్పారు. ముస్లిం సామాజిక తరగతి ఉద్దారకుడిగా ఫోజు పెడుతూ వారి మీద విద్వేషాన్ని రెచ్చగొట్టటం తప్ప ఇది మరొకటి కాదు. దేశంలో బాల్యవివాహాల సామాజిక రుగ్మత ఉంది. దాన్ని రూపుమాపాలంటే జనాల ఆర్థిక, విద్యా స్థాయిని మెరుగుపరచాలి. అసలు వాస్తవం ఏమంటే దేశంలో జరుగుతున్న బాల్య వివాహాల్లో 84శాతం హిందువుల్లోనే ఉన్నట్లు ఇండియా స్పెండ్ అనే మీడియా సంస్థ జనాభా లెక్కలను విశ్లేషించి చెప్పింది. ముస్లింలలో పదకొండుశాతం, ఇతరులు మిగతా మతాల్లో ఉన్నారు. అదే హిమంత బిశ్వశర్మ బాల్య వివాహాలు చేసే హిందువుల ఓట్లు, అంటరానితనం పాటించేవారి ఓట్లు తమకు అవసరం లేదని చెప్పగలరా ? బిజెపి నేతల నాలికలకు నరం లేదు. ఎప్పుడు ఏది కావాలంటే అప్పుడు అది మాట్లాడతారు. తనకు ఓట్లు వేయని కారణంగా ముస్లింల కోసం తాను పనిచేయనని రాజ్యాంగ విరుద్దమైన మాటలను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వల్లిస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో బిజెపి సీనియర్ నేత కెఎస్ ఈశ్వరప్ప తమకు ముస్లింల ఓట్లు ఒక్కటి కూడా అవసరం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆవు చేలో మేస్తుంటే దూడగట్టున ఉంటుందా ? అధినేత నరేంద్రమోడీ స్వయంగా ఇటీవలి ఎన్నికల్లో ముస్లిం విద్వేషాన్ని ఎలా రెచ్చగొట్టారో తెలిసిందే. మోడీ ముందు హిమంత బిశ్వశర్మలూ, గిరిరాజ్ సింగ్‌లూ మరుగుజ్జులే. తన ఉపన్యాసాలు, వ్యాఖ్యలు అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశం అవుతాయని, భారత ప్రతిష్ట మురికి గంగలో కలుస్తుందని తెలిసి కూడా మోడీ వెనక్కు తగ్గలేదు.ఏది ఎటుపోతేనేం ! కావాల్సింది ఓట్లు, అధికారం ! రామరాజ్యం కోరుకొనే శక్తులకు ఓటు వేస్తారా లేక ఓట్ జీహాదీలకు వేస్తారా అంటూ మోడీ ఓటర్లను అడగటం తెలిసిందే.కాంగ్రెస్ అధికారానికి వస్తే చొరబాటుదార్లకు, ఎక్కువ మంది పిల్లలున్న వారికి సంపదలు పంచుతారని, పుస్తెలను కూడా లాక్కుంటారని పరోక్షంగా ముస్లింలను ఉద్దేశించి మాట్లాడిందీ తెలిసిందే. దేశాన్ని ఆక్రమించుకొనేందుకు ముస్లింలకు కాంగ్రెస్ సహాయం చేస్తోందని కూడా ఆరోపించారు. మోడీ దిగజారి మాట్లాడినట్లు, అది కూడా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని మాట్లాడటం అవాంఛనీయమని బిజెపి నేత అలోక్ వత్స తమతో వ్యాఖ్యానించినట్లు వాయిస్ ఆఫ్ అమెరికా పేర్కొన్నది. సంవత్సరాల తరబడి గుడ్డిగా మోడీకి మద్దతు ఇచ్చిన వారు కూడా ఆయన వ్యాఖ్యలను ఆమోదించరని, ప్రధాని స్థాయికి తగని మాటలని వత్స అన్నట్లు పేర్కొన్నది. ఇలాంటి నేత అనుచర గణం ప్రసన్నం చేసుకొనేందుకు మరింత రెచ్చిపోతుంది తప్ప వెనక్కు తగ్గదు.
