Tags
#Anti China, BJP, China, CHINA TRADE, Narendra Modi Failures, Reliance vs Amazon, Trade, Walmart
ఎం కోటేశ్వరరావు
ప్రపంచంలో ఎక్కువగా రిటెయిల్‌గా వస్తువులను అమ్మే సంస్థ అమెరికాకు చెందిన వాల్‌మార్ట్. చైనా మీద ఆధారపడకుండా రానున్న రోజుల్లో భారత్ నుంచి పెద్ద మొత్తంలో సరకులను కొనుగోలు చేసేందుకు నిర్ణయించిందన్న వార్తను ప్రపంచ మీడియా ప్రముఖంగా పాఠకులు, వీక్షకుల ముందుకు తెచ్చింది. వస్తు ఎగుమతులు తగ్గుతున్న పూర్వరంగంలో బిజెకి ఇది వచ్చే ఎన్నికల్లో పెద్ద ప్రచార అస్త్రం అవుతుంది. వస్తువులు ఎక్కువగా అమ్ముడుపోతే మన దగ్గర ఉపాధి పెరుగుతుందని భావించేవారు ఒకరైతే చైనా దెబ్బతింటుందని సంతోషించేవారు రెండవ రకం. త్వరలో మనం చైనాను దాటిపోతాం అని అనేక మంది ఆశిస్తున్నట్లు జరగాలని కోరుకుందాం , నిజంగా జరుగుతుందా ? అవకాశాలేమిటి, అవరోధాలేమిటి అన్నది ప్రతి ఒక్కరూ చూడాలి. మన దేశం నుంచి బొమ్మలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, సైకిళ్లు, ఔషధాలు, ఎండు ధాన్యాలు,కొన్ని రకాల ఆహారం వంటివి ఇప్పటికే అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి.ఏటా మూడు బిలియన్ డాలర్ల వస్తు కొనుగోలును 2027 నాటికి పదికి పెంచుతామని వాల్‌మార్ట్ చెప్పింది. 2018లో వాల్‌మార్ట్ దిగుమతుల్లో చైనా వాటా 80శాతం ఉండగా ఈ ఏడాది జనవరి-ఆగస్టు నాటికి 60శాతానికి తగ్గింది.వాల్‌మార్ట్ దిగుమతులు ఒక్క మన దేశం నుంచి మాత్రమే కాదు, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి కూడా పెరుగుతున్నాయి. మన నుంచి కొనుగోళ్లు ఎంత పెరిగినా చైనాను అధిగమించే అవకాశం ఇప్పట్లో లేదు.
ఇటీవలి కాలంలో చైనా ఎగుమతుల్లో వచ్చిన మార్పును చూస్తే శ్రమ ఎక్కువగా ఉండే ఉత్పత్తులకు బదులు యంత్రాలు, పూర్తిగా తయారు కాని వస్తువులు, ఎలక్ట్రిక్ వాహనాలు విడి భాగాల ఎగుమతులు పెరుగుతున్నాయి. వాల్‌మార్ట్ దిగుమతి చేసుకొనే వాటిలో అసలు ఇవి లేవు. ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతులు 2018లో 26.1 కోట్ల డాలర్లుగా ఉన్నవి ఈ ఏడాది జనవరి-ఆగస్టునాటికి 2,582 కోట్ల డాలర్లకు పెరిగాయి.రానున్న సంవత్సరాల్లో ఆధునిక వస్తువులను ఎగుమతి చేసేందుకు చైనా పూనుకుంది.దానిలో భాగంగా కార్మికశక్తి ఎక్కువగా అవసరం ఉన్నవాటిని తగ్గించుకొంటున్నది. కొన్ని సంస్థలు వేరే దేశాలకు వెళుతున్నాయి.ఆ ఖాళీని మన దేశం పూర్తి చేయాలని ధనికదేశాలు కోరుకుంటున్నాయి. ఎందుకంటే వారికి కావాల్సింది చౌకగా వస్తువులు అందించేవారు తప్ప ఎవరన్నది వారికి నిమిత్తం లేదు. మా దేశంలో తక్కువ వేతనాలకుపని చేసే జనాలు పుష్కలంగా ఉన్నారని మన పాలకులు అనేక విదేశీ కంపెనీలకు ఆశ చూపుతున్నది తెలిసిందే. చైనా చౌకగా అందిస్తే తప్పులేదు గాని మనం చేస్తే ఎందుకు అభ్యంతరం అని కొందరు వాదిస్తారు.నిజానికి వాల్‌మార్ట్ మన దేశానికి 2002లోనే వచ్చింది.దానితో పాటు భాగస్వామిగా ఉన్న ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే, ఇతర సంస్థల ద్వారా ఒక లక్ష మందికి శాశ్వత, తాత్కాలిక ఉపాధి కల్పిస్తున్నది. దీనికి పోటీదారుగా ఉన్న అమెజాన్ మన దేశం నుంచి 2025నాటికి 25 బిలియన్ డాలర్ల వస్తువులను దిగుమతి చేసుకోనున్నట్లు ప్రకటించింది. ఇతర దేశాలతో పోల్చుకుంటే చైనాలో వేతనాల ఖర్చు పెరుగుతున్నందున అక్కడి నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటే పోటీలో తట్టుకోవటం కష్టం గనుక అవి మన దేశం వైపు మొగ్గుతున్నాయని ఎస్‌అండ్ పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజన్స్ పరిశోధక విశ్లేషకుడు క్రిస్ రోజర్స్ చెప్పాడు.చైనాలో కనీసవేతనాలు నెలకు 1,420 యువాన్ల నుంచి 2,690(డాలర్లలో 198.2 నుంచి 376.08) వరకు ఉన్నాయి.ఇదే భారత్‌లో రు. తొమ్మిది నుంచి పదిహేను వేల ( 108.04 నుంచి 180.06 డాలర్లు) వరకు ఉన్నాయి.(ఒక డాలరుకు 7.1528 చైనా యువాన్లు కాగా మన కరెన్సీ రు.83.3050)
కొందరు తనకు పోటీగా మన దేశం ఎదగకుండా చైనా అడ్డుకుంటున్నది అన్న ఆరోపణ చేస్తున్నారు. ఎవరైనా అలా అడ్డుకోగలరా ? వర్తమాన ప్రపంచంలో తొలి బాధితురాలు చైనాయే. అక్కడ కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత అసలు ఐరాసలో గుర్తించలేదు. పశ్చిమ దేశాల నుంచి పెట్టుబడులు లేదా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందనివ్వకుండా అడ్డుకున్నారు. ఇప్పడూ చిప్స్ పరిజ్ఞానం, వాటిని చైనాకు అందనివ్వకూడదని బహిరంగంగా ఆంక్షలే విధించారు గదా ! చైనా నుంచి ఐదవతరం టెలికాం పరికరాలు దిగుమతి చేసుకుంటే వాటి ద్వారా మన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని మనమే వద్దంటున్నాం, అదెంతవరకు వాస్తవమో తెలియదు, ఐరోపా, అమెరికా చెప్పింది కనుక చేస్తున్నాం. పెట్టుబడులనూ మన దేశం అడ్డుకుంటున్నది. మనకు అవసరమైన కీలక దిగుమతుల మీద చైనా ఎలాంటి ఆంక్షలు విధించలేదు గనుకనే నరేంద్రమోడీ ఏలుబడిలో గత దిగుమతుల రికార్డులను బద్దలు కొట్టాం. మన ఎగుమతుల మీద ఆంక్షలు విధించలేదు, ఇక మనల్ని అడ్డుకొనేది ఎక్కడ ? చైనా నేడు అమెరికాను అధిగమించే ఆర్థిక శక్తిగా మారేదారిలో ఉంది. మనదేశం ఆ రైలును అందుకోలేదు.ఎందుకని ? దానికి కూడా చైనానే నిందిస్తే నవ్విపోతారు. చైనా ప్రకటించిన విధానాలు ఒక భరోసాను ఇచ్చినందునే నిర్దిష్ట వ్యవధి వరకు సంపాదించుకొని వెళ్ల వచ్చన్న ధైర్యంతో అన్ని ధనిక దేశాల నుంచి పెట్టుబడులు వరదలా వచ్చాయి. మన దగ్గర అలాంటి విధానాలు లేవు. మన కార్పొరేట్ శక్తులు స్వంతంగా మరింతగా ఎదిగేందుకు, సాధ్యం కానపుడు బహుళజాతి సంస్థలతో చేతులు కలిపి లాభాలు పెంచుకొనేందుకు చూస్తున్నాయి. తమకు లబ్దిచేకూర్చవు అనుకుంటే మనదేశంలోకి ఇతర సంస్థల, పెట్టుబడుల ప్రవేశాన్ని అడ్డుకొంటున్నాయి.మనదేశ భద్రతకు ముప్పు అని నిషేధించిన సంస్థలలో చైనాకు చెందిన షి ఇన్ ఒకటి. దాంతో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకోగానే కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను పక్కన పెట్టి అనుమతి ఇచ్చింది. రిలయన్స్ కోసం అమెజాన్ సంస్థ పెట్టుబడులకు ఆటంకం కలిగిస్తున్నది.
త్వరలో మన దేశం చైనాను అధిగమించనుందని కొందరి అంచనా. గోల్డ్‌మాన్ శాచస్ సంస్థ 2011అంచనా ప్రకారం చైనాలో తదుపరి ఇరవై సంవత్సరాలలో ఏటా 4.8శాతం కార్మిక ఉత్పాదకత పెరుగుదల ఉంటుంది, వాస్తవం ఏమిటి ? సిఇఐసి సమాచారం మేరకు 2013-2022 పది సంవత్సరాల సగటు 6.64శాతంగా ఉంది. అదే విధంగా 2026 నాటికి చైనా జిడిపి అమెరికాను దాటుతుందని, 2050 నాటికి అమెరికా కంటే 50శాతం అధికంగా కలిగి ఉంటుందని అదే ఏడాది గోల్డ్‌మాన్ శాచస్ చెప్పింది. ఇప్పుడు 2035వరకు చైనా అధిగమించే అవకాశం లేదని, తరువాత పెరుగుదల కూడా 2060 నాటికి 14శాతం కంటే అదనంగా ఉండదని 2022 అంచనాలో అదే సంస్థ చెప్పింది. జోశ్యాలను బట్టి నిర్ధారణలకు రాకూడదు. చైనా 1978లో సంస్కరణల్లో భాగంగా తన మార్కెట్‌ను తెరిచింది. అంతకు ముందునుంచి ఉన్నప్పటికీ నూతన ఆర్థిక విధానాల పేరుతో మనదేశం 1990లో మనదేశం మరింత బాగా గేట్లు తెరిచింది. అనేక మంది గణించిన విధానం, వాస్తవాన్ని చూస్తే 1990లో చైనా కంటే మన దేశం ధనికమైంది. ఐఎంఎఫ్ తాజా సమాచారం ప్రకారం చూస్తే పది అగ్రశ్రేణి దేశాల మొత్తం, తలసరి జిడిపి దిగువ విధంగా ఉన్నాయి. మొత్తం జిడిపి బిలియన్ డాలర్లు, తలసరి వేల డాలర్లుగా గమనించాలి.
దేశం××××× జిడిపి ×× తలసరి
అమెరికా×× 26,854 ×× 80.03
చైనా×××× 19,374 ×× 13.72
జపాన్××× 4,410 ×× 35.39
జర్మనీ×××× 4,309 ×× 51.38
భారత్×××× 3,740 ×× 2.6
బ్రిటన్×××× 3,160 ×× 46.31
ఫ్రాన్స్×××× 2,924 ×× 44.41
ఇటలీ×××× 2,170 ×× 36.81
కెనడా×××× 2,090 ×× 52.72
బ్రెజిల్×××× 2,080 ×× 9.67
వస్తువులను చౌకగా ఎగుమతులు చేసేందుకు చైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తున్నదని, కార్మికులకు వేతనాలను పెంచకుండా వస్తువులను చౌకగా ఎగుమతులు చేస్తోందని ఆరోపిస్తుంటారు. నిరంకుశంగా ఉంటారు, కార్మిక సంఘాలు ఉండవు, సమ్మెలు జరగవని, అదే కమ్యూనిస్టులు మన దేశంలో ప్రతి చోటా సంఘం, సమ్మెలు చేస్తుంటారన్న ప్రచారమూ తెలిసిందే. అది వాస్తవమా ? ఒక వ్యతిరేక ప్రచారమే.2011వ సంవత్సరంలో వివిధ కార్మిక సంఘాలు తమ సభ్యత్వ సంఖ్యలను ప్రకటించుకున్నాయి.దాని ప్రకారం కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టియుసిలో 1,90,92,217, ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంఘమైన బిఎంఎస్‌లో 1,19,32,322, హెచ్‌ఎంఎస్‌లో 45,84,201, ఇక కమ్యూనిస్టులు పని చేసే సిఐటియు, ఏఐటియుసి, యుటియుసి, ఇతర పార్టీలు పని చేసే సంఘాల మొత్తంలో కోటీ 50లక్షల మంది ఉన్నారు. కమ్యూనిస్టులను వ్యతిరేకించే మూడు సంఘాల్లో మూడున్నర కోట్ల మంది ఉన్నారు. కంట్రీఎకానమీ డాట్‌కామ్ అనే పోర్టల్ 2000 నుంచి 2022 వరకు చైనా-భారత్ దేశాల్లోని కనీసవేతనాల గురించి ఒక పోలికను గ్రాఫ్ రూపంలో ఉంచింది. దాని ప్రకారం ప్రతి పది సంవత్సరాలకు అవి ఎలా ఉన్నదీ దిగువ చూడవచ్చు. వేతన మొత్తాలను యూరోలలో పేర్కొన్నారు.
దేశం ×× 2000 ××2010×× 2020 ×× 2023
చైనా ×× 49.5 ×× 88 ×× 228.9 ×× 268.2
భారత్ ×× 26.8 ×× 38.8 ×× 57.7 ×× 55.7
గ్లోబల్ డాట్ పేరోల్ డాట్ ఓఆర్‌జి అనే పోర్టల్‌లో 2016,17 సంవత్సరాల నాటి సమాచారం గురించి ” చైనా, భారత్, వియత్నాం దేశాలలో కనీసవేతన చర్చ ” అనే శీర్షిక కింద ఇచ్చిన సమాచారం ప్రకారం నెల వారీ డాలర్లలో ఉన్న కనిష్ట -గరిష్ట వివరాలు ఇలా ఉన్నాయి.
దేశం××××× కనిష్ట ××× గరిష్ట
చైనా ××× 192.91×× 332.66
భారత్ ××× 73.78×× 223.25
వియత్నాం×××106.83×× 155.80
చైనాలో ఉన్నది నిరంకుశ ప్రభుత్వమైతే వేతనాలు అలా ఎందుకు పెంచినట్లు ? మనం ప్రజాస్వామిక వ్యవస్థలో ఉంటే ఇరవై ఏండ్లనాడు చైనాతో పోల్చితే సగంగా ఉన్న వేతనం 2023నాటికి ఐదోవంతుకు ఎందుకు తగ్గినట్లు ? రెండు చోట్లా ఉన్నది పెట్టుబడిదారీ వ్యవస్థలే అయితే వేతన పెంపుదలలో ఇంత వ్యత్యాసం ఎందుకు ? మన దేశంలో ఇంతతక్కువగా ఉన్నప్పటికీ మనదేశానికి పెట్టుబడులు ఎందుకు రావటం లేదు? చైనా ఎగుమతుల వెనుక శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం ఒక ప్రధాన అంశం. గ్లోబల్ ఎకానమీ డాట్ కామ్ వెల్లడించిన 2022 రాంకుల ప్రకారం 176 దేశాల్లో చైనా 61.07శాతంతో 39వ స్థానంలో ఉంది. మనదేశం 23.97శాతంతో 165వ స్థానంలో ఉంది. మనకు తోడుగా ఎగువన 164వదిగా పాకిస్థాన్ ఉంది.మిగిలిన ఇరుగుపొరుగు దేశాలన్నీ మన కంటే ఎగువనే ఉన్నాయి. చైనా నాసిరకం వస్తువులను ప్రపంచానికి అంటకడుతుందని కొంత మంది ఇప్పటికీ ప్రచారం చేస్తారు.దిగుమతి చేసుకొనేవారు అంత అమాయకంగా ఉన్నారని వారు భావిస్తున్నారా ? సాంకేతిక పరిజ్ఞానంలో మనం ఎక్కడున్నామో మన ఎగుమతులే చెబుతాయి. గడచిన పాతిక సంవత్సరాలలో చైనా చేసిన పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతుల్లో 21శాతం ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడినవే ఉండగా మన ఎగుమతుల్లో వాటి వాటా 6.4శాతమే.
చైనాను అధిగమించేందుకు మన దేశం పెద్ద అంగ వేసే స్థితిలో ఉందా ? అసలు ఏ దేశమైనా గంతులు వేస్తూ వృద్ధి చెందిందా ? 2007లో చైనాలో ఉన్న మాదిరి ఆర్థిక స్థితిలో నేడు భారత్ ఉంది. ఆ మేరకు 2023లో భారత జిడిపి 3.7లక్షల కోట్ల డాలర్లు దాటుతుందని రేటింగ్ సంస్థ మూడీస్ చెప్పింది. నాడు చైనా తలసరి జిడిపి 2,694 డాలర్లుంటే భారత్‌లో 2,601 డాలర్లు ఉంది.2003 నుంచి 2011 వరకు చైనా జిడిపిలో పెట్టుబడులు సగటున 40శాతం కాగా భారత్‌లో 33శాతం ఉన్నాయి.2012 నుంచి 2021 మధ్య కాలంలో ఈ తేడా 43-29 శాతం అంటే భారత్‌లో పెట్టుబడులు తగ్గాయి. చైనాలో కార్మికభాగస్వామ్య రేటు 2007లో 73శాతం ఉండగా ప్రస్తుతం 67 శాతం దగ్గర ఉంది. మనదేశంలో 2022లో 50శాతానికి అటూఇటూగా ఉంది. ఇదే మహిళల విషయానికి వస్తే చైనాలో 66 నుంచి 61శాతానికి తగ్గగా మన దేశంలో 30 నుంచి 24శాతానికి పడిపోయింది. 1990 వరకు తలసరి ఆదాయం చైనాలో 318, భారత్‌లో 368 డాలర్లు కాగా 2022లో ప్రపంచంలో 72వ స్థానంలో ఉన్న చైనాలో 12,598 డాలర్లు ఉండగా 120వదిగా ఉన్న మన దేశంలో 2,389 డాలర్లు మాత్రమే. 1990ని ఎందుకు ప్రామాణికంగా తీసుకోవాలంటే అదే ఏడాది మన దేశం సంస్కరణలకు తెరతీసింది, చైనా 1978 నుంచి అమలు జరుపుతున్నది. అందువలన గడచిన మూడు దశాబ్దాల్లో చైనా మాదిరి ఎందుకు మన దేశంలో పెరగలేదు అన్నది ప్రశ్న.పైసామే పరమాత్మ అంటారు కదా ! లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు. కార్మికుల కష్టార్జితాన్ని దోచిపెడతామని చెబుతుంటే విదేశీ కంపెనీలన్నీ వాలతాయి.వాల్‌మార్ట్ మన వస్తువుల కోసం వస్తున్నదంటే మన మీద ప్రేమ కాదు, దాని లాభాల కోసమే !
