Tags

,

అమ్మా ! అమ్మా !! ఈ బొమ్మ ఎంతో బాగుంది కదూ

ఏం బాబూ పెద్ద వాడివైనా నీ కింకా బొమ్మల పిచ్చి పోలేదా పద పద !

కాదమ్మా నా చిన్నపుడు ఇలాంటి బొమ్మలు రాలేదు , దీనిపై సుత్తీ కొడవలి బొమ్మలున్నాయి, ఎందుకలా వేశారు.
అవి చైనా మేడ్‌, అవి కమ్యూనిస్టు చిహ్నాలు అని చెబుతుండగానే తీసుకోండి సార్‌ పెద్ద ఖరీదేం కాదు అని షాపతను అంటూ వుండగానే బిలబిల మంటూ మిలిటరీ వచ్చి అక్కడున్న బొమ్మలను స్వాధీనం చేసుకొని షాపువాడిని బలవంతంగా జీవులో ఎక్కించుకు చక్కా పోయారు. వారికి ఏం జరిగిందో అర్ధం కాలేదు, ఆ బొమ్మలను ఎందుకు తీసుకుపోయారో, వాటిలో ఏమైనా వజ్రాలు, గట్రా పెట్టి స్మగ్లింగ్‌ చేస్తున్నారా అని పరిపరి విధాలా అనుకుంటుండగానే పోలీసులు మైకులో హెచ్చరికలు ప్రారంభించారు. సుత్తీ కొడవలి చిహ్నం వున్న బొమ్మలను అమ్మినా, వాటిని ఎవరైనా కొన్నా వారిని అరెస్టు చేస్తామన్నది వాటి సారాంశం.

ఇదేదో కథలా అనిపిస్తున్నా నిజం. ఇండోనేషియాలోని యోగ్యకర్తా అనే పట్టణంలో మిలిటరీ సుత్తీ, కొడవలి చిహ్నాలు వున్న చైనా తయారీ బొమ్మలను స్వాధీనం చేసుకున్నట్లు జకర్తా గ్లోబ్‌ అనే పత్రిక శుక్రవారం నాడు ఒక వార్తను ప్రచురించింది. ఆ చిహ్నాలు చూసిన పిల్లలు కమ్యూనిస్టు ఆశయాల గురించి తెలుసుకుంటారని, వాటిని అమ్మటం, కొనటం ద్వారా పిల్లల్లో కమ్యూనిస్టు బీజాలు వేసినట్లు అవుతుందని అధికారులు భావించి అలాంటి బొమ్మలను నిషేధించినట్లు తెలిపింది. లెఫ్టినెంట్‌ కల్నల్‌ కవలెరీ తుమాది దీని గురించి చెబుతూ ఈ బొమ్మలను అమ్ముతున్నవారిలో ఎక్కువ మందికి ఆ బొమ్మల వెనుక వున్న అర్ధం తెలియదని, అయితే కొంత కాలానికి మన పిల్లలు ఆ చిహ్నాలకు ఆకర్షితులు అవుతారని అదే జరిగితే తరువాత వారి మెదళ్లలో ఆ భావాలు కూడా ప్రవేశిస్తాయని ఆ మిలిటరీ అధికారి వ్యాఖ్యానించాడు. బొమ్మలకు ఆర్డర్లు ఇచ్చే వ్యాపారులు దీని గురించి ఎరిగి వుండాలని చెప్పాడు.

1965-66 సంవత్సరాలలో ఇండోనేషియాలో దాదాపు ఐదు లక్షల మంది కమ్యూనిస్టులు, అభిమానులను జనరల్‌ సుహార్తో నాయకత్వంలోని మిలిటరీ తిరుగుబాటుదారులు నిర్ధాక్షిణ్యంగా హత్యచేసిన విషయం తెలిసినదే. ఆ వుదంతం జరిగి యాభై సంవత్సరాలు నిండిన సందర్భంగా దానిపై చర్చ, అందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలన్న డిమాండ్‌ ముందుకు వచ్చిన పూర్వరంగంలో ఇండోనేషియా మిలిటరీ ఈ చర్య తీసుకోవటం ద్వారా అది ఎంత భయపడుతున్నదో అర్ధం అవుతోంది. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న వుబుద్‌ రైటర్స్‌ మరియు రీడర్స్‌ ఫెస్టివల్‌(పుస్తక ప్రదర్శన) సందర్భంగా గతనెలలో 15 కార్యక్రమాలను జరగకుండా అధికారులు అడ్డుకున్నారు. నిఘా సిబ్బందిని దింపి ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఆరాతీశారు. కమ్యూనిస్టుల ఊచకోత గురించి సమాచారాన్ని ప్రచురించిన జావాలోని ఒక విశ్వవిద్యాలయ పత్రిక కాపీలను మొత్తం స్వాధీనం చేసుకొని వాటిని పాఠకులకు అందకుండా నాశనం చేశారు. సుహార్తో కాలం నాటి వాతావరణాన్ని గుర్తుకు తెచ్చేలా మిలిటరీ, పోలీసులు కమ్యూనిస్టుల ఊచకోత గురించి చర్చ జరగకుండా సమాచారాన్ని జనానికి అందకుండా అప్రకటిత నిషేధాన్ని అమలు జరుపుతున్నారు.