ధర్మకర్తృత్వం-దాతల బండారం-2
ఎం కోటేశ్వరరావు
మార్క్ జుకెర్‌బర్గ్, వారెన్ బఫెట్, బిల్‌గేట్స్ వంటి వారు చేస్తున్న దాన ధర్మాలు ఎవరికీ వుపయోగపడవా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిస్సందేహంగా కొందరికి వుపయోగపడతాయి. ఫలానావారి తాతగారి ముత్తాత జ్ఞాపకార్ధం ఫలానా వారి కుమారుడు, వారి మనవడు అయిన ఫలానా వారు చేసిన ధర్మం అన్న అక్షరాలతో నిండి వుండే చొక్కాలు వేసుకొని సంచార ప్రచార వాహనాల మాదిరి తిరిగేవారు మనకు తరచూ కనిపిస్తుంటారు. దానిలో దానం కంటే ప్రచారమే ఎక్కువగా కనిపిస్తుంది. గోచీ కూడా లేని వారికి అది ఇవ్వటమే పెద్ద లోకోపకారం కదా !.ఇక్కడ సమస్య దానం అంటే ఒక చేత్తో ఇచ్చి మరోచేత్తో పుచ్చుకోవటమా ?
ప్రపంచంలో అమెరికాయే ధనిక దేశం, దానిలో వారెన్‌బఫెట్, బిల్‌గేట్స్ పెద్ద ధనికులు. వారు 2010లో తాము ఎంత దానం చేస్తున్నదీ ప్రకటిస్తూ ప్రతి ధనికుడూ తమ సంపదలో సగం దాన ధర్మాలకు వినియోగించాలని పిలుపునిచ్చారు.తమ వంటి బిలియనీర్లు 187 మందితో ఇప్పటివరకు ఎంతో కొంత దానం చేయిస్తామని వాగ్దానం చేయించారు. రెండో కంటికి తెలియకుండా దానం చేసిన వారు గొప్పవారని ఇప్పటివరకు చెప్పుకుంటున్నాం. ఎవరెంతదానం చేస్తున్నారో లోకానికి తెలిస్తే మిగతావారు కూడా వుత్సాహపడి తాము కూడా ముందుకు వస్తారు కనుక దాన ధర్మాలకు ప్రచారం కావాలని కొత్త సూత్రీకరణ చేశారు.అందుకే కాబోలు చేసిన దానం కన్నా దాని ప్రచారానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు చాలా మంది. అంతేకాదు ఎంత డబ్బు దానం కింద వచ్చిందో తెలిస్తే అది ఎక్కడకు వెళుతుందో, అందరూ ఒకదానికే కాకుండా దేనికి ఎంత ఖర్చుచేయాలో కూడా తెలుసుకోవచ్చని కూడా చెబుతున్నారు. దాతృత్వ నిపుణులు( ఫిలాంత్రపీ ఎక్స్‌పర్ట్ ) అనే సంస్ద సిఇవో మెలైనీ వులే కార్పొరేట్ దానాల గురించి చెబుతూ వ్యక్తిగతమైన ప్రయోజనమో లేక వారి వారసుల జేబులు నింపటమో గాక మొత్తం మానవాళి ఆరోగ్యం, జీవనానికి ఇలాంటి దానాలను ఖర్చు చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలంటారు. దేన్నీ కాదనలేం మరి.
అమెరికాలో 501(సి)(3) అనే ఒక చట్ట సెక్షన్ ప్రకారం ఎవరైనా దానం చేసిన వాటి మీద వారికి ఎలాంటి హక్కు వుండదు. దానం చేసిన వారి పాత్ర అంతటితో ముగుస్తుంది.వాటిని స్వీకరించిన సంస్ధకు దానిపై సర్వహక్కులు వుంటాయి. కానీ జుకెర్‌బర్గ్ వంటి బిలియనీర్లు చేసే దానాలు అలాంటివి కావు. వాటికి బదులుగా పరిమిత జవాబుదారీ కంపెనీ(లిమిటెడ్ లయబులిటీ కంపెనీ(ఎల్‌ఎల్‌సి)ని ఏర్పాటు చేసి దానికి బదలాయిస్తారు. ప్రయివేటు ట్రస్టులంటే బాగా అర్ధం అవుతుంది.జుకర్ బెర్గ్‌కు ముందు దానాలు చేసినవారందరూ ఇలాంటి దారులే ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను కట్టకుండా బహిరంగంగా తమ ఆస్తులను వీటిలో దాచుకుంటారు. పబ్లిక్ ట్రస్టులంటే నియంత్రణలు ఎక్కువ వుంటాయి. ఈ ఎల్‌ఎల్‌సీలకు అలాంటి బాదర బందీ వుండదు. లాభాలు వస్తాయనుకుంటే వేటిలో అయినా ఈ ట్రస్టులలోని సొమ్మును ఎప్పుడు కావాలంటే అక్కడ పెట్టుబడులుగా పెట్టవచ్చు, రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇవ్వవచ్చు. దీని గురించి న్యూయార్క్ నగరంలోని న్యూ స్కూల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎరికి కోల్ ఎరియన్స్ ఏమంటారంటే ‘ మరో మాటలో చెప్పాలంటే దాతృత్వ పెట్టుబడులను సొమ్ము చేసుకోవలనుకోటంలో వారెంతో(జుకర్‌బెర్గ్ వంటివారు) పారదర్శకంగా వున్నారు, వారిలో ఎక్కువ మంది ఇలా చేస్తూనే మరోవైపున వారు ఎవరికైతే సేవ చేయాలనుకుంటున్నారో వారికి మరిన్ని సమస్యలు తెచ్చే వర్తమాన పెట్టుబడిదారీ వ్యవస్ధను కూడా ముందుకు తీసుకుపోతున్నారు. ఇది, ఎల్లవేళలా దాతృత్వ విరుద్ధ స్వభావం ఇలానే వుంటుంది. ఒకవైపు అసమానతలను సృష్టించే విధానాలను కొనసాగిస్తూనే మరోవైపు ఎవరైనా దారిద్య్రం, అ సమానత, పర్యావరణ, కార్మిక హక్కులను దుర్వినియోగాన్ని అరిక్టగలరా ? ఈ సమస్యలను పరిష్కరించటానికి సామాజిక దృక్పధంతో వుంటేవాటికి ట్రస్టులు నిధులు సమకూర్చవచ్చు, కార్మికవర్గం నిర్వహించే వాటికి పెట్టుబడి మిగులును సాయంగా అందించగలరా అన్న ప్రశ్న తలెత్తున్నది’ అని ఆమె అన్నారు.
ఈ వారంలో నే ఇలాంటివారందరినీ ఒక దగ్గరకు చేర్చుతున్న బిల్‌గేట్స్ తదితరులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. దాని పేరు ఇంధన విజయ కూటమి (బ్రేక్‌త్రూ ఎనర్జీ కోయలిషన్). అంటే నాణ్యమైన లేదా క్లీన్ ఎనర్జీపై పరిశోధన చేసేందుకు వారు ‘దాన ధర్మాలు’ చేస్తారు. ఇదొక కొత్త తరం ధార్మికత, వీరొక ప్రత్యేక ధార్మికులు. గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం అంటే ఇదే. ఖర్చేమీ వుండదు, పుణ్యానికి పుణ్యం. నాణ్యమైన ఇంధనంతో పర్యావరణాన్ని కాపాడేందుకు తామీ ధర్మం చేస్తున్నామని చెప్పు కోవచ్చు. పనిలో పనిగా అందుకు ఇచ్చే సొమ్ముపై పన్ను రాయితీలు, ధర్మపరులుగా మరికొన్ని రాయితీలు పొందవచ్చు. ఒక్కొక్క రంగంలో ఎవరికి వారు ప్రత్యేకంగా పరిశోధన జరిపితే ఖర్చు తడిచి మోపెడంత అవుతుంది. అలాగాక ‘సహకార కూటమి పద్దతి’లో చేస్తే తలా కాస్త, అది కూడా పన్నురాయితీలతో తమకు ఎలాంటి భారం పడకుండా తమకు అవసరమైన పరిశోధన చేయించుకుంటారు. దాని వలన వచ్చిన ఫలితాలను పొందేది ఎవరంటే తిరిగి ఈ కార్పొరేట్లే. పగలంతా సంపాదించిన దానిని ముఠాకార్మికులు రాత్రికి కలసి పంచుకున్నట్లుగా ప్రాజెక్టులలో భాగస్వామ్యం ద్వారా పరిశోధన ఫలాలను అందరూ కలసి పంచుకుంటారు. పేరుకు పేరు సొమ్ముకు సొమ్ము. వీరు చేసే దానాలను స్వీకరించేందుకు వీరందరూ కలసి తమ చెప్పుచేతల్లో వుండే ట్రస్టులను ఏర్పాటు చేస్తారు. అందులో తమ వారినే వుద్యోగులుగా నియమిస్తారు. వారికి జీతాలను ఆ ట్రస్టుల నుంచే ఇస్తారు. కన్సల్టెంట్స్‌గా కూడా తమవారినే పెట్టుకుంటారు. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు రూపకల్పన చేయిస్తారు. మన వంటి పేద దేశాలు వాటిని కావాలని వెళితే మనకు ఆ పధకాలు ఇవ్వటే కాదు, అందుకు అవసరమైన అప్పులను కూడా వేరే ఏజన్సీ ద్వారా ఇప్పిస్తారు. అప్పు డబ్బు రూపంలో ఇస్తే దారి మధ్యలో ఎవరైనా కొట్టివేయకుండా మాకు తెలిసిన కంపెనీలలో వున్న యంత్రాలను కొనుగోలు చేయండి, వాటిని బిగించాలన్నా, సరిగా పనిచేయాలన్నా వాటి ఇంజనీర్లు మాత్రమే వుండాలి, ఇలా షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా సవాలక్ష నక్షత్రాలను వుంచి మనకు ఇస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రైవేటు ఆసుపత్రులు, వైద్యులు, పరీక్షా కేంద్రాలు, మందులు, మెడికల్ షాపులు, రోగులు అన్నమాట. అవసరమా లేదా అని ప్రశ్నించకుండా వైద్యులు రాసిన పరీక్షలన్నీ చేయించుకోవాలి, అదీ వారు పేర్కొన్న పరీక్షా కేంద్రాలలోనే మిగతా చోట్లకు వెళితే రిపోర్టులు సరిగా రావంటారు. వారు రాసిన మందులే కొనాలి. మిగతా మందులు సరిగా పనిచేయవు మీ ఇష్టం అంటారు. వారు చెప్పిన షాపులోనే కొనాలి, అవి అక్కడ తప్ప మరొక చోట దొరకవంటారు. కౌపీన సంరక్షణార్ధం చివరకు ఒక సన్యాసి సంసార జంఝాటంలో చిక్కుకున్నట్లుగా దాతృత్వం గురించి చెబుతానంటూ ఈ విషయాలన్నీ ఏమిటి అనుకుంటున్నారా ? కార్పొరేట్ దానాలకు అదే కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకు వున్న సంబంధాన్ని ఈ లావాదేవీలలో మనం చూడటం కష్టం, ఎలాగంటే ఎక్కడో స్విచ్ వేస్తే మరెక్కడో లైటు వెలుగుతుంది. ఇది చదివిన తరువాత కూడా సంబంధం లేని విషయాలుగా మీకు అనిపిస్తే చెప్పటంలో లోపం నాదే. మన దేశాన్ని బ్రిటీష్‌వారు దోచుకుంటున్నారు, వారిని తరిమివేస్తే తప్ప మనకు మంచి జరగదు అని మన జనాన్ని ఒప్పించటానికి ఎన్ని వందల సంవత్సరాలు పట్టింది, ఎన్ని విధాలుగా చెప్పాల్సి వచ్చిందో తెలుసు కదా !
