మహారాష్ట్రలో శని ఆలయ ఆంక్షలు
ఈ దేవాలయానికి తొలిసారిగా ఒక మహిళను అధ్యక్షురాలిగా నియమించటం విశేషం.
ఎం కోటేశ్వరరావు
శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై విధించిన నిషేధం రాజ్యాంగ విరుద్ధమని దేశ అత్యున్నత న్యాయస్ధానం వ్యాఖ్యానించింది. దానిపై తమ వాదనలను వినిపించేందుకు ఆ దేవస్థాన యాజమాన్యం సిద్దం అవుతోంది. దానిపై విచారణ జరిగి అంతిమ తీర్పు ఎలా వస్తుందో తెలియదు. కానీ మహిళలపట్ల వివక్షకు వ్యతిరేకంగా కోర్టులో దాఖలు చేసిన కేసు దరఖాస్తును వుపసంహరించుకోవాలని లేకుంటే చంపివేస్తామని న్యాయవాదులకు వందలాది బెదిరింపులు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా వుండగా మహారాష్ట్రలోని శని శింగనాపూర్లోని శని దేవాలయంలోని దేవత వేదికపైకి తమను అనుమతించాలంటూ ఒక స్వచ్ఛంద సంస్ధ భూమాత బ్రిగేడ్ నాయకత్వంలో దాదాపు 400 మంది మహిళలు రిపబ్లిక్ దినోత్సవం రోజున దేవాలయ ప్రవేశం చేస్తామని ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని సనాతన సంస్థ, హిందూ జనజాగృతి సమితి వాటి అనుబంధ మహిళా విభాగం రాణ రాగిణి శాఖ రెండువేల మంది మహిళలతో అడ్డుకుంటామని ప్రకటించి అక్కడ శాంతి భద్రతల పరిస్ధితులను సృష్టించేందుకు పూనుకున్నాయి. ఈ దేవాలయానికి తొలిసారిగా ఒక మహిళను దేవస్థాన అధ్యక్షురాలిగా నియమించటం విశేషం. ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాన్ని వుల్లంఘించటాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించనని ఆమె ప్రకటించారు.

దేవస్థాన అధ్యక్షురాలు
మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటున్నవారు చెబుతున్న కధనం ప్రకారం శని ప్రభువు వుగ్ర దేవత. దేవత నుంచి వెలువడే ప్రకంపనలు మహిళలకు హాని చేస్తాయి, అందువలన దేవత మండపం దగ్గరకు వారి ప్రవేశాన్ని నిరోధిస్తున్నారు తప్ప దేవాలయ ప్రాంగణంలో ప్రవేశానికి నిషేధం లేదని, లింగ వివక్ష సమస్యతో కాదని వాదిస్తున్నారు. పురుషులను కూడా మండపం ఎక్కటానికి అనుమతించటం లేదని దూరం నుంచే పూజలను అనుమతిస్తున్నామని, ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాన్ని వుల్లంఘించటమంటే భక్తుల మనోభావాలను గాయపరచటమే అని వాదిస్తున్నారు. ఆధ్యాయాత్మిక కారణాలను చూడకుండా కేవలం ప్రచారం ఎత్తుగడగా కొందరు మహిళలను ప్రోత్సహిస్తున్నారని హిందూ జనజాగృతి సమితి ప్రతినిధి సునీల్ ఘన్వాట్ ఆరోపించారు.
నవంబరు నెలలో ఒక మహిళ శని దేవాలయ మండపంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా దేవాలయ ట్రస్టీలు శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. దీనిపై రాష్ట్రంలోని పలు మహిళా సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఆ చర్యకు నిరసనగా డిసెంబరులో పూనా కేంద్రంగా పనిచేసే భూమాత రానరాగిణి బ్రిగేడ్ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ నాయకత్వంలో మరో ముగ్గురు మహిళలు ప్రవేశించేందుకు పూనుకోగా ఆలయ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. తాము వచ్చే వారం సతారా నుంచి బయలు దేరి రిపబ్లిక్ డే నాటికి దేవాలయం వద్దకు చేరుకుంటామని తృప్తి చెప్పారు.అందరికీ సమాన హక్కులు ఇచ్చిన రాజ్యాంగం అమలులోకి వచ్చినందున ఆ రోజును ఎంచుకున్నట్లు చెప్పారు. వివిధ మహిళా సంఘాలు, బృందాలతో సమావేశాలు జరిపి ప్రచారం, చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె చెప్పారు.
