Tags
పదేళ్లలో వూబకాయులు రెట్టింపు-రక్త హీనత తగ్గినా ఆందోళనకరమే-ఏపి పురుషులలో ఎక్కువ
రెండు తెలుగు రాష్ట్రాలలో వూబకాయ సమస్య వేగంగా పెరుగుతోంది. పది సంవత్సరాల క్రితం పొడువు కంటే ఎక్కువ బరువున్న స్త్రీ ,పురుషుల పట్టణ, గ్రామీణ ప్రాంతాల సగటు 17.7, 17.6 వుండగా ప్రస్తుతం ఏపిలో 33.2, 33.5, తెలంగాణాలో 28.1,24.1 శాతానికి పెరిగింది. రెండు చోట్లా పట్టణాలలో ప్రస్తుతం ఏపిలో 45.6, 44.4 చొప్పున స్రీ, పురుషులలో వూబకాయం శాతాలున్నాయి.అదే తెలంగాణాలో 39.5,31.9గా వున్నాయి.
రక్త హీనత విషయానికి వస్తే రెండు రాష్ట్రాలలోనూ గతంతో పోల్చితే కొంత మెరుగు పడినప్పటికీ ఇంకా అందోళనకర స్ధాయిలోనే వుంది. పిల్లలు, స్త్రీలలో 79.6,62.7 నుంచి ఏపిలో 58.6,60.2కు తెలంగాణాలో 60.7, 56.7తగ్గింది.పట్టణాలలో వూబకాయాలు ఎక్కువుంటే గ్రామాలలో రక్తహీనులు ఎక్కువగా వున్నారు.పురుషులలో పదేళ్లనాడు 17.6శాతం రక్త హీనత వుంటే ప్రస్తుతం ఏపిలో వారిశాతం 26.9కి పెరగ్గా , తెలంగాణాలో 15.4కు తగ్గింది.
జన జీవితంలోని కొన్ని సూచికలు
ఎం కోటేశ్వరరావు
అవిభక్త ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, వుద్రేకాలు తగ్గాయి. తాపీగా కాకపోయినా ఎవరి రాష్ట్రాన్ని వారు బాగు చేసుకోవాలంటే నిజాయితీగా ఆలోచించాల్సిన సమయమిది. రాష్ట్రం బాగు చేసుకోవటం అంటే వేళ్లమీద లెక్కించదగిన కొన్ని పారిశ్రామిక కుటుంబాలు లేదా సంస్ధల ఆస్తులు పెరగటం కాదు. ప్రజల జీవన సూచికలు అభివృద్ధికి కొలబద్దలుగా అంగీకరిస్తే వాటిని బట్టి సమగ్రంగా గాకపోయినా కొంత మేరకు మనం ఎక్కడున్నామో అర్ధం చేసుకోవచ్చు. వాటిలో ఆరోగ్యం, మరికొన్ని సూచికలను ప్రమాణాలుగా ఐక్యరాజ్యసమితి తీసుకుంది. అందువలన అంతకంటే మెరుగైన కొలబద్దలు రూపొందే వరకు వాటితోనే మనం కొలవాల్సి వుంటుంది. కొత్త రాష్ట్రం తెలంగాణా జనంలో ఎన్నో ఆశలు, ఇంకా సజీవంగానే వున్నాయి. మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లేదు, రాదు అని అధికారికంగా చెప్పకపోయినా అక్కడి వారు మాట్లాడటం లేదంటే తెలుగుదేశం పార్టీ, బిజెపి, వారి కనుసన్నలలో మెలిగే మీడియా అంతకంటే ఎక్కువే ప్రయోజనం కలిగిస్తారని చెప్పిన మాటలను మరోసారి ప్రజలు నమ్మారని భావించాలి. ఎందుకంటే అమరావతి రాజధాని శంకుస్ధాపన సభకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ కుండలో పార్లమెంట్ ప్రాంగణంలోని కాస్తంత మట్టి ,మురికి యమునా నది నీళ్లు తేవటమే మహాభాగ్యంగా భావించారు మరి. వారిలో కూడా ఇంకా ఆశలు అలాగే వున్నాయి.
అంధ్రవలస పాలకుల కారణంగా తెలంగాణా ప్రాంత ఆదాయానికి తగిన విధంగా అభివృద్ధి చెందలేదు కనుక ప్రత్యేక రాష్ట్రం కావాలన్నది ప్రధాన నినాదాలలో ఒకటి. ఇంకా అనేకం వున్నాయనుకోండి, సందర్భం వచ్చినపుడు ముందు ముందు పరిశీలించుకుందాం. ఈనెల 19న కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015-16కు సంబంధించి కొన్ని రాష్ట్రాల వివరాలను ప్రకటించింది. వాటిలో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ మరికొన్ని రాష్ట్రాలు వున్నాయి.తొలిసారిగా జిల్లాల వారీ అంచనాలను అందచేశారు.స్ధానిక భాషలోనే సమాచారాన్ని సేకరించారు. ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది మేనెల ఆరవ తేదీ నుంచి ఆగస్టు నాలుగవ తేదీ వరకు, తెలంగాణాలో ఫిబ్రవరి 23 నుంచి మే నెల తొమ్మిదవ తేదీవరకు సర్వే నిర్వహించారు. అందుకని తప్పుడు సమాచారం అందచేయటానికి లేదా అందించటానికి ఆస్కారం లేదు.
పొగ, మద్యపానంలో స్త్రీలతో సహా తెలంగాణా టాప్
మద్యపానం విషయంలో తెలంగాణా రాష్ట్రం అగ్రస్ధానంలో వుంది. అక్కడ స్త్రీలలో సగటున 8.8శాతం మంది తాగుతుండగా గ్రామీణ ప్రాంతాలలో 14.3శాతం, పురుషులలో సగటున 53.9 శాతం వున్నారు. అదే ఏపి విషయానికి వస్తే స్త్రీలు 0.4, పురుషులు 34.9 శాతం వున్నారు. తెలంగాణాలో 2.8శాతం స్త్రీలు, 28.3శాతం పురుషులు పొగతాగుతుండగా ఏపీలో 2.3, 26.8శాతం వున్నారు
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ కలసి వున్నపుడు జరిగిన కార్యక్రమాలు, వాటి పర్యవసానాలే ఈ సర్వేలో వెల్లడైన సమాచారానికి ప్రాతిపదికలు. ఎవరైనా ఏడాది కాలంలో మా ముఖ్యమంత్రి అల్లా వుద్దీన్ అద్బుత దీపం మాదిరి అభివృద్ధి చేశారు, ఆ ఘనత వారికే చెందాలి అని వాదిస్తే అలాంటి వారికి రెండు రాష్ట్రాలకు కలిపి రెండు రెళ్లు నాలుగు దండాలు. ఈ సర్వేకు సంబంధించి జాతీయ స్థాయి సూచికలు ఎలా వున్నాయి, వాటితో రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమిటో పోల్చేందుకు ఇంకా మిగతా వివరాలు వెలువడలేదు. అందువలన దక్షిణాదిలో తమిళనాడుతో పోల్చితే రెండు రాష్ట్రాలలో కీలకమైన అభివృద్ధి సూచికలు ఇలా వున్నాయి. ఇది నిజమైన అభివృద్ధి కాదు అంటే వున్న పరిస్ధితి అనుకుందాం.గ్రామీణ, పట్టణాల మొత్తం,అంకెలు శాతాలలో వున్నాయి. మొత్తం 114 ప్ర శ్నలు వేసి సమాచారాన్ని రాబట్టారు. వాటిలో కొన్ని ముఖ్యాంశాలు ఇలా వున్నాయి. ఎలాంటి వ్యాఖ్యలు లేకుండా ఈ సమాచారాన్ని ఇస్తున్నాం. గతంలో వుమ్మడి రాష్ట్రంగా వున్నపుడు వెల్లడైన సూచికలతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల సూచికలను పోల్చలేము. అందుకే అయితే వుమ్మడి రాష్ట్రంలో వున్న సూచికలతో పోల్చినపుడు రెండు ప్రాంతాలలోని తాజా పరిస్ధితులను బట్టి కొంతమేర అర్ధం చేసుకోవచ్చు. గతంలో కొన్ని వివరాలు సేకరించలేదు కనుక కొన్నింటితో పోల్చుకోలేము కనుక ఆ పరిమితులను గమనంలో వుంచుకోవాలి. గత సర్వే 2005-06లో జరిగింది. వుమ్మడి ఆంధ్రప్రదేశ్ వివరాలు పదేళ్లనాటి సర్వే వివరాలని గమనించాలి. (వు.అ-వుమ్మడి ఆంధ్రప్రదేశ్, ఏపి-ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, టిజి-తెలంగాణా, టిఎన్-తమిళనాడు)
వు.ఆ ఏపి టిజి టిఎన్
1.ఆరేళ్లకు పైబడిన పురుషులలో స్కూళ్లకు వెళ్ళిన వారు 62.0 62.2 77.2
2. పదిహేనేళ్ల లోపు జనాభా 23.7 25.0 23.3
3వెయ్యిమంది పురుషులకు మహిళలు 1020 1007 1033
4.గత ఐదేళ్లలో పుట్టిన వెయ్యిమంది పురుషులకు మహిళలు 914 874 954
5.అయోడిన్ వుప్పు వాడుతున్నవారు 81.6 95.8 82.8
6.మెరుగైన మరుగుదొడ్డి వున్నవారు 53.6 50.2 52.2
7.మంచినీటి సౌకర్యం వున్నవారు 72.7 77.6 90.6
8 వంటకు గ్యాస్, విద్యుత్ వాడుతున్నవారు 62.0 66.8 73.0
9.మహిళా అక్షరాస్యులు 62.9 65.2 79.4
10.పురుష అక్షరాస్యులు 79.4 83.4 89.1
11. పదేళ్లకు పైగా చదువుకున్న మహిళలు 21.9 34.3 43.3 50.9
12. పద్దెనిమిదేళ్లకు ముందే వివాహమైన యువతులు 54.8 32.7 25.7 15.7
13.21ఏళ్లకు ముందే వివాహిత యువకులు 34.0 23.5 23.9 17.0
14.ప్రసవ సమయంలో మరణాలు 35 28 21
15.ఐదేళ్లలోపు పిల్లల మరణాలు 41 32 27
16.ఏదో ఒక కుటుంబనియంత్రణ 67.6 69.5 57.2 53.3
17.మహిళలకు ఆపరేషన్లు 68.3 54.2 49.4
18.ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవానికి అదనపు ఖర్చు రు. 2,138 4,020 2496
20.సిజేరియన్ ఆపరేషన్లు 40.1 58.0 34.1
21.ప్రభుత్వ ఆసుపత్రులలో సిజేరియన్లు 25.5 40.6 26.3
22.ప్రయివేటు ఆసుపత్రులలో సిజేరియన్లు 57.0 74.9 51.3
23.ఎత్తుకు సరిపడా బరువులేని మహిళలు 30.8 17.6 23.1 14.6
24.ఎత్తుకు సరిపడా బరువులేని పురుషులు 24.8 14.8 21.4 12.4
25.అధిక బరువున్న మహిళలు 17.7 33.2 28.1 30.9
26.అధిక బరువున్న పురుషులు 17.6 33.5 24.2 28.2
27.పిల్లలలో రక్త హీనత 79.6 58.6 60.7 50.7
28.మహిళలలో రక్త హీనత 62.7 60.0 56.7 55.1
29.పురుషులలో రక్త హీనత 23.1 26.9 15.4 20.6
30.స్త్రీలలో మద్యపానం 0.4 8.8 0.4
31.పురుషులలో మద్యపానం 34.9 53.9 46.7
32.స్త్రీలలో పొగతాగేవారు 2.3 2.8 2.2
33.పురుషులలో పొగతాగేవారు 26.8 28.3 31.7
34.మహిళలలో స్వంతంగా సెల్ వున్నవారు 36.2 47.8 62.0
35.బ్యాంకు ఖాతా వున్న మహిళలు 66.3 59.7 77.0
