
సత్య
ఆధునిక భారత నిర్మాతలలో పెద్దలు ఎవరంటే బహుశా వేదాల్లోంచి తీసిన బిజెపి వేద గణిత స్కేలు ప్రకారం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎత్తుగా కనిపించి వుంటారు. అందుకే ఆయనకు పెద్ద పీట వేసిందేమో ! గతేడాది అంబేద్కర్ 125వ జయంతి, జవహర్లాల్ నెహ్రూ 125వ జయంతి, వల్లభాయ్ పటేల్ 75వ వర్ధంతి లేదా 140వ జయంతి గతేడాది వచ్చింది. సహజంగానే అంబేద్కర్ 125 జయంతి ని ఒక ప్రత్యేకత సంతరించే విధంగా జరుపుతారని భావిస్తారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరిపి ఆ తంగాన్ని ముగించారు. కానీ గతేడాది అక్టోబరు-డిసెంబరు మాసాలలో నరేంద్రమోడీ ప్రభుత్వ తీరు తెన్నులపై సమాచార హక్కు కార్యకర్త శాయి వినోద్‌కు ఎక్కడో తేడా కనిపించింది. రంగంలోకి దిగి సమాచారాన్ని సంపాదించారు.
సర్దార్ పటేల్ 140 జయంతి(అక్టోబరు 31) సందర్బంగా కేంద్ర ప్రభుత్వ డిఎవిపి సర్దార్ పటేల్‌పై ఎనిమిది కోట్ల రూపాయల విలువగల ప్రకటనలు 1,525 విడుదల చేయగా అంబేద్కర్‌పై కోటీ 59లక్షలతో 156, నెహ్రూపై 5.33లక్షలతో నాలుగు ప్రకటనలు విడుదల చేసినట్లు తేలింది. నవంబరు 14ను బాలల దినోత్సవంగా కూడా ఎప్పటి నుంచో జరుపుతున్నారు. గతేడాది విచిత్రమేమంటే ఆ సందర్బంగా నెహ్రూ చిత్రం లేకుండా రాష్ట్రపతి, ప్రధాని బొమ్మలతో కూడిన ప్రకటనను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ అవార్డుల బహుకరణ పేరుతో విడుదల చేసింది.

వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లుగా బిజెపి పరిస్ధితి తయారైంది. వాస్తవానికి వల్లభాయ్ పటేల్‌ను దేశం ఎప్పుడో మర్చిపోయింది. కానీ ఆయనను తిరిగి జనజీవన స్రవంతిలోకి తేవటానికి బిజెపి చేయనియత్నం లేదు.కారణం ఆయన కాంగ్రెస్‌లో మిత, మతవాదులకు దగ్గరగా వుండటమే. అయితే గదేడాది కేంద్ర ప్రభుత్వ ప్రకటనలతో పాటు అనేక కార్యక్రమాలతో పటేల్‌ను ప్రముఖంగా ప్రచారంలోకి తెచ్చింది బిజెపి, ఇంత జరిగాక గతేడాది డిసెంబరులో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో పట్టణ ప్రాంతాలలో ఏదో గెలిచినా గ్రామీణ ప్రాంతాలలో బిజెపి బొక్కబోర్లా పడింది. పటేల్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు బిజెపి జిమ్మిక్కులకు మోసపోకపోగా దిమ్మదిరిగే దెబ్బ కొట్టారు. మొత్తం 31 జిల్లా పరిషత్‌లకు గాను 23 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్, ఇతర ప్రముఖ రాష్ట్రమంత్రులు ప్రాతినిధ్యం వహించే గ్రామీణ ప్రాంతాలన్నింటా కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. ఓటమి తప్పదని ముందే మీడియా పేర్కొన్నప్పటికీ నరేంద్రమోడీ-అమిత్ షా మంత్రదండాలు అక్కడేమీ పారలేదు. గుజరాత్ అధికారాన్ని సోపానంగా చేసుకొని ఢిల్లీ పీఠమెక్కిన నరేంద్రమోడీ దేశంలోని అన్ని రాష్ట్రాలను ఆగబగా కబళించాలని చూస్తున్నారు. అయితే గుజరాతే 2017లో బిజెపి చేజారనుందనే వార్తలు ఆ పార్టీ నేతలకు నిదురపట్టనివ్వటం లేదు.
