ఎం కోటేశ్వరరావు
భగవంతుడు ఉన్నట్లు తాము చెప్పలేమని సగం మంది అమెరికన్లు భావిస్తున్నారని ఇటీవలి జనరల్ సోషల్ సర్వే చికాగో విశ్వవిద్యాలయం వెల్లడించింది.1972 నుంచి ఈ సంస్థ అమెరికా సామాజిక ధోరణుల మీద జరుగుతున్న సర్వేల ప్రకారం ప్రస్తుతం సగం మంది అమెరికన్లు మాత్రమే దేవుడి ఉనికి గురించి గట్టి విశ్వాసంతో ఉన్నారట. 1993లో మూడింట రెండు వంతులు, 2008లో 60 శాతం నుంచి ఇప్పుడు 50శాతానికి తగ్గారు.జనాభాలో అసలు చర్చ్‌కు వెళ్లని వారు 34శాతం ఉన్నారని, గడచిన ఐదు దశాబ్దాల్లో ఇది అధికమని తేలింది. మరణం తరువాత జీవితం ఉంటుందనే నమ్మకం మాత్రం ఎక్కువ మందిలో ఉంది. తాము క్రైస్తవులమని చెప్పుకున్న వారు 1990 దశకంలో 90శాతం ఉండగా ఇప్పుడు మూడింట రెండువంతులకు తగ్గారు. పిఆర్‌ఆర్‌ఐ సర్వే ప్రకారం 2008లో తమకెలాంటి మత అనుబంధం లేదని చెప్పిన వారు 16శాతం కాగా 2022లో 27శాతానికి పెరిగారు. ఏసు క్రీస్తును రక్షకుడు, ప్రభువు అని గట్టిగానమ్మే ఇవాంజెలికల్ ప్రొటెస్టెంట్స్ ఇదే కాలంలో 23 నుంచి 13.6శాతానికి తగ్గారు.1965-81 కాలంలో పుట్టిన జనరేషన్ ఎక్స్‌లో 25శాతం,1982-2004 మధ్య పుట్టిన మిలీనియల్స్‌లో 29శాతం 1996-2010 మధ్య జన్మించిన జడ్ తరంలో 34శాతం మంది ఏ చర్చ్‌కు అనుబంధంగా లేరు.” మతం నుంచి స్వేచ్చ ఫౌండేషన్ ” సహ అధ్యక్షుడు డాన్ బార్కర్ ప్రపంచంలో మతం గురించి మారుతున్న వైఖరి మీద స్పందిస్తూ అమెరికాలో బలమైన మతవిశ్వాసాలు ఉన్నవారు తగ్గటాన్ని హర్షిస్తూ, ఇతర ఐరోపా దేశాలతో అమెరికా పోటీ పడుతున్నదన్నాడు.
ఒక దేశంలో మెజారిటీ మతం మరొక చోట మైనారిటీగా ఉండవచ్చు. మన దేశంలో హిందూ అని పిలుస్తున్న మతంలో వివిధ శాఖలు ఉన్నట్లుగానే క్రైస్తవం, ఇస్లాం, ఇతర మతాల్లో కూడా ఉన్నాయి. తమ దేశంలోని 75వేల మసీదుల్లో 50వేలను మూసివేసినట్లు ఇరాన్ మౌలానా మహమ్మద్ అబోలఘాసిమ్ దౌలబీ జూన్ ఒకటిన చెప్పాడు. మసీదులకు వచ్చేవారు గణనీయంగా తగ్గటమే దీనికి కారణం అన్నాడు. ఇతగాడు ప్రభుత్వం-మత సంస్థల సమన్వయకర్తలలో ఒకడు. దీని గురించి హిందూత్వకు పక్కాగా మద్దతు పలికే, ముస్లింల మీద విద్వేషాన్ని వెదజల్లుతుందనే విమర్శ ఉన్న ఓపి ఇండియా వెబ్‌పోర్టల్ రాసింది. ఇస్లామిక్ విశ్వాసాలతో ఛాందసవాదుల హవా నడుస్తున్న చోట ఇలాంటి పరిణామం మన దేశాన్ని హిందూ ఛాందసవాదం, మనువాద హిందూత్వం వైపు తీసుకుపోవాలని చూస్తున్న శక్తులకు ఆందోళన కలిగిస్తున్నట్లు చెప్పవచ్చు. హిజాబ్ వ్యతిరేక ఆందోళనకు దిగిన ఇరాన్ మహిళలకు ప్రపంచమంతా జేజేలు పలికింది. అదే తీరున మన దేశంలో కూడా మతఛాందసులు, మతోన్మాదుల అజెండా మేరకు సమాజాన్ని నడిపితే ఇక్కడ కూడా వ్యతిరేకత వెల్లడైతే హిందూత్వ అజెండా కుప్పకూలుతుందన్న భయం ఆశక్తులకు కలగటం సహజం. ఇరాన్ మతశక్తులు పౌరుల జీవితాల మీద మతాన్ని రుద్దటాన్ని అక్కడి సమాజం తిరస్కరించటం నానాటికీ పెరుగుతోంది. శిక్షించటాన్ని సహించటం లేదు. ” సమాజంలోని బలమైన మత భావనలు అంతరిస్తున్నాయి. మతం ఇచ్చేదాన్ని జనం చూస్తారు, మతం పేరుతో జనాలను అవమానించటం, మత బోధనలు, భావనల పేరుతో మతపరమైన కల్పనలతో సహా అనేక కారణాలు, ఇంకా మతం పేరుతో పౌరులకు గౌరవ ప్రదమైన జీవితాన్ని నిరాకరించటం, వారిని దారిద్య్రంలో నెట్టటం వంటి అంశాలను బట్టి ఆ మతంలో చేరాలా లేక దాన్ని వదలి వెళ్లాలా అని నిర్ణయించుకుంటారు.” అని కూడా మౌలానా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. హిజాబ్‌ను సరిగా ధరించలేదనే కారణంతో నైతిక పోలీసులు గతేడాది సెప్టెంబరులో మహసా అమిని అనే యువతిని దారుణంగా కొట్టి చంపటంతో పెద్ద ఎత్తున ఇరాన్‌లో నిరసనలు చెలరేగిన సంగతి తెలిసిందే. ప్రార్ధనలకు వచ్చేవారు లేక 60శాతం మసీదులను మూసినట్లు వార్తలు వచ్చాయి.
లవ్ జీహాద్, లాండ్ జీహాద్‌కు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా పురోలా పట్టణంలో ఉన్న ముస్లింలందరూ వెళ్లిపోవాలంటూ హిందూత్వ పేరుతో ఉన్న శక్తులు జూన్ 15వ తేదీ గడువు నిర్ణయించి బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే. హిందువుల్లో ఒక కులం వారు మరొక కులం వారిని వివాహం చేసుకోకూడదంటూ ఉత్తరాది రాష్ట్రాలలో తీర్పులు చెప్పే పంచాయత్‌లను చూస్తున్నాము. ఇది వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవటం తప్ప వేరు కాదు. ఇదే పని ఇతర మతఛాందసులు చేసినా అదే అవుతుంది. రెచ్చిపోతున్న మతశక్తులను చూస్తే మన దేశం కూడా ఈ రోజుగాకపోతే రేపు మరో ఇరాన్ అవుతుంది. ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు తమ దేశంలో బౌద్ధం అంతరించటానికి కారకులౌతున్నారంటూ శ్రీలంకలోని బౌద్ధ మత ఛాందసులు రెచ్చిపోతున్నారు.రెచ్చగొట్టి దాడులకు పాల్పడేందుకు చూస్తున్నారు.
మతంతో నిమిత్తం లేని వారు అమెరికాలో పెరుగుతున్న కారణంగా ప్రతి ఏటా అనేక చర్చ్‌లు మూతపడుతున్నట్లు వార్తలు.చర్చి ప్రాంగణాలను కొనుగోలు చేసే వారికి భలే మంచి చౌకబేరం అన్నట్లుగా ఉంది. 2019లో నాలుగున్నరవేల ప్రొటెస్టెంట్ చర్చ్‌లు మూతపడితే, గతేడాది మూడువేల కొత్త చర్చ్‌లు ప్రారంభమైనట్లు వార్తలు.మొత్తం మీద జనాలు చర్చ్‌లకు రాకపోవటం తాత్కాలికమా లేక అదే ధోరణి ముందుకూడా కొనసాగుతుందా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గడచిన మూడు సంవత్సరాల ధోరణులను చూసినపుడు మూసివేతలకే ఎక్కువ అవకాశాలున్నట్లు కొందరు భావిస్తున్నారు. కరోనా తరువాత చర్చ్‌లకు వస్తున్నవారిని చూస్తే అంతకు ముందువచ్చే వారిలో 85శాతమే ఉన్నట్లు ప్రొటెస్టెంట్ పాస్టర్లు నివేదించారట. కరోనాకు ముందు ఏడాదికి కనీసం ఒకసారి చర్చ్‌కు వచ్చినవారు 75శాతం ఉంటే గతేడాది 67కు తగ్గారు. కుర్రకారు హైస్కూలు చదువులో ఉండగా కనీసం ఒక ఏడాది పాటు చర్చ్‌కు ప్రతివారం వచ్చేవారని 2017 వివరాలు వెల్లడించగా ఇప్పడు ప్రతి పదిమందిలో ఏడుగురు రావటం లేదని లైఫ్‌వే పరిశోధనలో తేలింది. మతంతో సంబంధం లేకుండా పిల్లల్ని పెంచుతున్నవారు పెరగటం దీనికి ఒక కారణం అంటున్నారు. పూ సంస్థ విశ్లేషకులు చెప్పినదాని ప్రకారం 1972లో 92శాతం మంది అమెరికన్లు క్రైస్తవులుగా చెప్పుకోగా 2070 నాటికి 50శాతం లోపుకు పడిపోవచ్చట. ఇప్పుడున్న వారిలో తాతలు ప్రతివారం చర్చ్‌కు వెళ్లి ఉంటారని, వారి పిల్లలు తమకు దేవుడు అంటే విశ్వాసం అని చెప్పారు తప్ప ప్రతివారం విధిగా చర్చ్‌కు వెళ్ల లేదని, మిలీయన్ మనవల దగ్గరకు వచ్చే సరికి చర్చికి వెళ్లే సంబంధాలు గానీ మతంతో గానీ అనుభవం తక్కువని కొందరు విశ్లేషకులు చెప్పారు. కాథలిక్ చర్చ్‌లో సెక్స్ కుంభకోణాల కారణంగా జనాలు చర్చ్‌లకు దూరంగా ఉంటున్నారని, దానికి కరోనా కూడా తోడైందని కూడా తేలింది.
కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్,ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఇలాంటి పరిణామం ముందే జరిగిందని, అమెరికాలో మెల్లగా జరుగుతోందని చెబుతున్నారు. దీనికి సోషలిస్టు దేశాలతో అమెరికా జరిపిన ప్రచ్చన్న యుద్ధం కారణమని ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు. క్రైస్తవ అమెరికా-దేవుడు లేని కమ్యూనిజం మధ్య పోరు జరుగుతోందని, మతం లేని వారు అసలు అమెరికన్లే కాదని రెచ్చగొట్టారు.(ఇప్పుడు మన దేశంలో ఎవరైనా బిజెపి, సంఘపరివార్, హిందూత్వ సంస్థలను లేదా మతంలోని అవలక్షణాలను, మూఢవిశ్వాసాలను ఎవరైనా విమర్శిస్తే లేదా వారితో ఏకీభవించకపోతే మీరు హిందువులే కాదంటూ రెచ్చగొడుతున్న తీరు చూస్తున్నదే). మూడు దశాబ్దాల క్రితం ప్రచ్చన్న పోరులో గెలిచినట్లు అమెరికా ప్రకటించిన తరువాత వారి దగ్గర కమ్యూనిజం గురించి చెప్పటానికేమీ లేదు. అందువలన యువతలో ఒక్క మతం గురించే కాదు, సోషలిజం, పెట్టుబడిదారీ విధానం గురించి కూడా మధనం ప్రారంభమైంది. చివరకు అది ఇప్పుడు సోషలిస్టు వైఫల్యం గురించిగాక తాము ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థ దివాలాకోరు తనం గురించి మాట్లాడేందుకు దారి తీసింది. అమెరికా చర్చ్ ఆస్తుల లావాదేవీల్లో అగ్రగామి సంస్థగా ఉన్న ఎడి ఎడ్వైజర్స్ ఎండి బ్రెయిన్ డోల్‌హైడ్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో విక్రయాలు పెరిగినట్లు చెప్పాడు. కొన్నింటిని గృహాలుగా, కొన్నింటిని సంరక్షణ కేంద్రాలుగా మార్చగా కొన్ని చర్చ్‌లు విస్తరణలో భాగంగా కొనుగోలు చేసినట్లు చెప్పాడు.
వయస్సులో దేవుడు, మతం గురించి పెద్దగా పట్టించుకోని అనేక మంది ముసలితనం వచ్చేసరికి పక్కా భక్తులుగా, చాదస్తులుగా కూడా మారుతున్నవారిని చూస్తున్నాం. ఇది ఒక్క మన దేశంలోనే కాదు దాదాపు అన్ని దేశాల్లో ఇలాంటి వైఖరే ఉంది. చిత్రం ఏమిటంటే ప్రస్తుతం ఐరోపా దేశాల్లో కుర్రకారుకంటే వృద్ధులే ఎక్కువగా ఉన్నారు. కానీ అక్కడ యువతరంతో పాటు వృద్ధుల్లో కూడా మతం మీద గట్టిగా ఉన్న భావన తగ్గుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. ఎందుకు ఇలా జరుగుతోందని అక్కడి పరిశోధకులు కుస్తీపడుతున్నారు.మన దేశంలో ప్రస్తుతం కుర్రకారులో తాతగారి నాన్నగారి అశాస్త్రీయ, మతభావనలు, అంతరించిన ఆచారాల పునరుద్దరణ జరగాలనే తిరోగమన ధోరణులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
యువత మతానికి దూరం జరిగితే అమెరికా సమాజం ఎటుపోనుంది అనే అందోళన అనేక మందిలో తలెత్తుతోంది.వారిలో మతాన్ని మత్తు మందుగా మార్చి దోపిడీకి మార్గం సుగమం చేయాలనే వారు తప్పకుండా ఉంటారు. మతం స్థానంలో ఆత్మ స్వరూపత్వం(స్పిరిట్యువాలిటీ) పెరుగుతున్నదని కొందరు విశ్లేషకులు చెప్పగా మరికొందరు దాన్ని పూర్వపక్షం చేస్తూ ఎక్కువ మంది లౌకికవాదం వైపు మళ్లుతున్నారని కొన్ని సర్వేల గణాంకాలను చూపుతున్నారు. త్రమ బిడ్డలను చర్చి ప్రార్ధనలు, మత సేవలకు తీసుకురావటానికి చేస్తున్న పెనుగులాటలో తలిదండ్రులు ఓడిపోతున్నారు. అమెరికాలో వ్యక్తివాద సంస్కృతి నానాటికీ పెరుగుతున్నకారణంగా మతానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నారు.మతం అధికారాన్ని సమర్ధిస్తుంది- వ్యక్తివాద సంస్కృతి ప్రతిఘటిస్తుంది. మత పెత్తనం లేదా ప్రాధాన్యతను కూడా తగ్గిస్తుంది. ఐరోపా దేశాలలో వివాహం అన్నది విధి కాదు.ఎక్కువ మంది యువత వివాహ బంధంతో నిమిత్తం లేకుండానే పిల్లలను కూడా కంటున్నారు. ఇది అమెరికాకూ విస్తరించింది.అమెరికాలో 1981లో 18శాతం మంది మహిళలు వివాహంతో నిమిత్తం లేకుండా పిల్లల్ని కనగా 2021లో 40శాతానికి పెరిగింది. ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ (ఓఇసిడి) దేశాలలో 42శాతం మంది పిల్లలు వివాహాలతో నిమిత్తం లేకుండానే పుడుతున్నారు. ఈ కూటమిలోని చిలిలో 75శాతం మంది,కోస్టారికాలో 73 మెక్సికోలో 70శాతం మంది ఉండగా జపాన్, దక్షిణ కొరియా, టర్కీలలో రెండు-మూడు శాతం మధ్య ఉన్నారు. అమెరికాలోని ఆఫ్రో-అమెరికన్లలో చాలా ఎక్కువ మంది పుడుతున్నారు.
తమ జీవితాల్లో మతం అత్యంత ప్రాముఖ్యత కలిగినదని భావిస్తున్న వారు కేవలం పదహారుశాతం మందేనని తాజాగా ఒక సర్వేలో తేలింది. పదేండ్ల క్రితం ఇరవై శాతం ఉన్నారు.దేవుడి మీద నమ్మకం లేదంటూనే జ్యోతిషం, క్షుద్రవిద్యల పట్ల సగం మంది అమెరికా మిలీనియల్స్ నమ్మకాలు పెంచుకుంటున్నారని, అదే చైనాలో కేవలం ఎనిమిది శాతమే అని తేలింది. అమెరికాలో ఇలాంటి మానసిక సేవల పరిశ్రమ లావాదేవీల విలువ రెండు వందల కోట్ల డాలర్లకు పెరిగింది. దేవుడి వ్యాపారం దేశమంతటా మంచి వాణిజ్యమని ఒకనాడు బిజెపిలో పని చేసి, కేంద్రంలో ఆర్థిక మంత్రికి సలహాదారు, రచయితగా ఉన్న మోహన్ గురుస్వామి 2021 ఏప్రిల్ 24న డక్కన్ క్రానికల్ పత్రికలో ఒక విశ్లేషణ రాశారు. సారం ఇలా ఉంది. రాజకీయాల్లోనే కాదు మతం ఆర్థిక రంగంలో కూడా రోజు రోజుకూ ప్రాధాన్యత పెంచుకుంటోంది. మధ్య ప్రాచ్య దేశాల్లో ముస్లిం యువతకు ఉపాధి అవకాశాలు పెరగటంతో పెద్ద ఎత్తున డబ్బు దేశానికి చేరింది.దాంతో అనేక మసీదుల నిర్మాణం జరిగింది. బ్రిటిష్ వారి కాలంలో చర్చ్‌లకు ప్రాధాన్యత ఉన్నందున మంచి ప్రదేశాల్లో అవి వచ్చాయి.మిషనరీల నిధులు ఇప్పటికీ వస్తున్నాయి. మహా చర్చ్‌లు కాకున్నా చిన్న చిన్న వాటిని పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు. మసీదులు, చర్చ్‌ల నిర్మాణాల మీద నియంత్రణ ఉంది. దానికి స్పందనగా వెలిసిన గుళ్ల విస్తరణ మీద ఎలాంటి అదుపు లేదు. ఇటీవల తెలంగాణాను సందర్శించినపుడు చిన్న చిన్న గ్రామాల్లో కూడా రెండు మూడు గుళ్లు కనిపించాయి. ఇది హిందువులకు భిన్నమైన దేవుళ్లను ఎంచుకొనే స్వేచ్చ ఉండి కాదు, భిన్న కులాలు, గోత్రాలకు చెందిన వారు నిర్మించినవీ, పక్క పక్కనే ఉన్నాయి, ఒకరితో ఒకరు పోటీ పడి నిర్మించుతున్నారు. ఈ అంశంలో చీరలు, నగలు, మిఠాయి దుకాణాలకు వాటికీ పెద్ద తేడా లేదు. అనుమతుల్లేకుండానే అక్రమ ఇసుక తవ్వకం, అనుమతి లేని మద్యం అమ్మకాల మాదిరి ఆదాయవనరులుగా మార్చుకుంటున్నారు.
దేశంలో టూరిజం ద్వారా జిడిపిలో 9.6శాతం వస్తోంది. దీనిలో స్వదేశీ వాటా 88శాతం ఉంది. 2019లో విదేశీ యాత్రీకులు తొమ్మిది కోట్ల మంది రాగా స్వదేశీ 140 కోట్లు ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో విదేశీ, స్వదేశీ టూరిస్టులు ఎక్కువ మంది తిరుపతి, మధురై వంటి మతపరమైన కేంద్రాలను సందర్శించారు. మత పరమైన టూరిజం ఇప్పుడు పెద్ద వ్యాపారం, దీన్ని చూసి మనం ఆందోళన చెందాలా ? పూ సంస్థ ప్రపంచ వైఖరుల గురించి చేసిన సర్వేలో గడచిన నాలుగైదు సంవత్సరాలలో 25శాతానికి పైగా భారతీయులు మరింత మతపరమైన వారిగా మారారు.2007-15 సంవత్సరాల మధ్య మతపరమైన టూరిజం మీద పెడుతున్న ఖర్చు రెట్టింపైంది. వేగంగా పెరుగుతున్న ఈ వాణిజ్య ధోరణులను చూస్తుంటే ఆకాశమే హద్దుగా కనిపిస్తోంది. పెరుగుతున్న మత ధోరణుల పర్యవసానాలను కూడా చూడాలి. గుడ్డి విశ్వాసాలు, మూఢభక్తి, జగడాల మారి మత ధోరణులు పెరుగుతున్నాయి. గుళ్ల నిర్మాణం లాభసాటిగా ఉండటంతో అవాంఛనీయ శక్తులు బహిరంగ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. ఒకసారి నిర్మించి దేవుడు, దేవతలను ప్రతిష్టించిన తరువాత వాటిని తొలగించలేరు, ట్రాపిక్ సమస్యలను సృష్టిస్తున్నాయి.” మోహన గురుస్వామి పరిశీలనే కాదు, ఈ రోజు ఎక్కడ చూసినా పూజలు, భక్తి వేలం వెర్రిగా మారటాన్ని ఎవరైనా చూడవచ్చు. ఇది విద్యావంతులలో మరీ ఎక్కువగా ఉంది.
