Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ అనే పంజాబ్‌ వేర్పాటువాద, ఉగ్రవాది హత్య ప్రస్తుతం భారత్‌-కెనడా మధ్య సంబంధాలు దిగజారటానికి దారి తీసింది. నిజ్జర్‌ హత్యలో భారత్‌ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌ సెప్టెంబరు 18న పార్లమెంటులో చేసిన ఆరోపణను మనదేశం తిరస్కరించింది. దానికి ఎలాంటి ఆధారాలు లేవంది. అప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు అక్కడ విద్యాభ్యాసం, ఉపాధికోసం వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఈ వివాదం తమ చైనా వ్యతిరేక ఎత్తుగడలు, సమీకరణలకు ఎక్కడ దెబ్బతగులుతుందో అన్న భయం అమెరికా కూటమి దేశాల్లో వెల్లడి అవుతోంది. భౌగోళిక రాజకీయాల మీద చూపే ప్రభావమే కాదు, భారత్‌కు ఆగ్రహం కలిగిస్తే దాని మార్కెట్‌లో ప్రవేశించేందుకు అవకాశాలు తగ్గుతాయన్న ఆందోళన కూడా వాటిలో ఉంది. చైనా మీద ఆధారపడకుండా భారత్‌ను ప్రత్యామ్నాయ వస్తు ఎగుమతి దేశంగా మార్చేందుకు సాయం చేస్తామని, వాణిజ్య సంబంధాలు మెరుగుపరచుకుంటామని చేస్తున్న ప్రకటనలు తెలిసినవే. చేసిన ఆరోపణను కెనడా వెనక్కు తీసుకోవాలని మనదేశం డిమాండ్‌ చేస్తోంది. ఉగ్రవాదులకు కెనడా సురక్షిత స్వర్గంగా ఉందని వర్ణించింది. మూడునెలల పరిశోధన తరువాత భారత హస్తం ఉందని నిర్ధారించుకున్నామని కెనడా అంటోంది. ఈ ఆరోపణను ఉపసంహరించుకుంటే తప్ప మనదేశం వెనక్కు తగ్గదు, అదే జరిగితే కెనడా అభాసుపాలవుతుంది కనుక వెనక్కు తగ్గే అవకాశాలు తక్కువ. ఇది చినికి చినికి గాలివానగా మారితే జరిగే పర్యవసానాల గురించి ఆందోళన చెందుతున్న జి 7 కూటమిలో పెద్దన్న అమెరికా, ఇతర దేశాలు ఇప్పటి వరకు ఆచితూచి వ్యవహరించాయి.


ఈ ఏడాది జూన్‌ 18న కెనడా వాంకోవర్‌ సమీపంలోని సురే అనే చోట ఒక గురుద్వారా వెలుపల హత్యకు గురైన నిజ్జర్‌ 1977లో పంజాబ్‌లోని జలంధర్‌ సమీపంలోని ఒక గ్రామంలో జన్మించాడు.పంజాబ్‌లో తీవ్రవాదులపై 1995లో చర్యలను ముమ్మరం చేయటంతో 1997లో నిజ్జర్‌ నకిలీ పాస్‌పోర్టుతో కెనడా పారిపోయాడు. అక్కడ తప్పుడు సమాచారం వెల్లడికావటంతో కేసులు, వివాదాల తరువాత 2007లో కెనడా పౌరసత్వం ఇచ్చారు. ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌ అనే ఉగ్రవాద సంస్థతో అతనికి సంబంధాలు ఉన్నాయని, ఒక వేర్పాటువాది, నేరగాడు అని అతన్ని అరెస్టు చేసి అప్పగించాలని గతంలో మనదేశం కెనడాను కోరింది. దాన్ని అది ఖాతరు చేయలేదు. స్వేచ్చగా తిరగనిస్తున్నది. అతడు ఒక మానవహక్కుల కార్యకర్త, శాంతియుత పద్దతుల్లో సిక్కు దేశం ఏర్పాటుకు మద్దతు ఇచ్చినట్లు అతని మద్దతుదార్లు వాదిస్తారు. తమ దేశంలో భావ ప్రకటన స్వేచ్చ ఉందని అందువలన అతను మాట్లాడేదానితో తమకు సంబంధం లేదని కెనడా వాదించింది. అతను 2019లో సురే గురుద్వారా నేతగా మారాడు.2020లో ఖలిస్తాన్‌ ప్రజాభిప్రాయ సేకరణలో, వేర్పాటువాదాన్ని సమర్ధిస్తూ పేరు తెచ్చుకున్నాడు. అతని హత్యకేసులో ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.


నిజ్జర్‌కు ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌ అనే మిలిటెంట్‌ గ్రూపుతో సంబంధాలు ఉన్నాయని భారత్‌ చేసిన వినతి మేరకు 2014లో ఇంటర్‌ పోల్‌ అరెస్టు వారంటు జారీ చేసింది. అతడు 2013-14లో పాకిస్తాన్‌ వెళ్లాడని అక్కడ పాక్‌ ఐఎస్‌ఐ చేర్చుకున్న బబ్బర్‌ ఖాల్సా అనే సంస్థకు చెందిన జగతార్‌ సింగ్‌ తారాను కలిశాడని మన ప్రభుత్వం పేర్కొన్నది. అతని మీద నిఘా పెట్టాలని 2015లో కేంద్ర ప్రభుత్వం కోరింది. తరువాత రెండోసారి కూడా రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది.తన మీద భారత ప్రభుత్వం చేసిన ఆరోపణలు వాస్తవం కాదని, రాజకీయపరమైనవని నిజ్జర్‌ 2016లో కెనడా ప్రధానికి లేఖ రాశాడు. అతగాడు అనేక హత్యలకు కారకుడని, తమకు కావాల్సిన ముఖ్యులలో ఒకడని 2018లో కేంద్రం కెనడాకు తెలిపింది. పంజాబ్‌ను విముక్తి చేసి ఖలిస్తాన్‌ ఏర్పాటు చేయాలన్న ప్రచారానికి నిజ్జర్‌ మద్దతు తెలిపాడు.2020లో మన ప్రభుత్వం అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆ ఏడాది మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతుల ఉద్యమం వెనుక అతడు ఉన్నాడని ఆరోపించి కేసులు కూడా దాఖలు చేసింది. పంజాబ్‌లోని ఒక హిందూ పూజారిని హత్య చేసేందుకు కుట్ర పన్ని లక్ష రూపాయల బహుమతి ప్రకటించాడని 2022లో ఎన్‌ఐఏ పేర్కొన్నది.


కెనడా రాజకీయాల్లో సిక్కులు ఒక ప్రభావిత శక్తిగా ఉన్నారు. పంజాబ్‌ తరువాత ప్రపంచంలో సిక్కు సామాజిక తరగతి ఎక్కువగా ఉన్నది కెనడాలోనే, అక్కడ జనాభాలో 2.1శాతం ఉన్నారు. ముప్పై మందితో కూడిన జస్టిన్‌ ట్రుడేవ్‌ మంత్రివర్గంలో నలుగురు సిక్కులు మంత్రులుగా ఉన్నారు. ఈ కారణంగా నిజ్జర్‌ మరణానికి బాధ్యులను తేల్చాలన్న డిమాండ్‌ సహజంగానే అక్కడ ముందుకు వచ్చింది. అందువలన మరొకదారి లేని పరిస్థితిలో అంతర్జాతీయ కర్తవ్యం సంగతి తరువాత ముందు తన ప్రభుత్వం గురించి చూసుకోవాలని హత్య గురించి ట్రుడేవ్‌ పార్లమెంటులో మాట్లాడాల్సి వచ్చింది. జూన్‌ మొదటి వారంలో మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ విలేకర్లతో మాట్లాడుతూ ఖలిస్తాన్‌ వేర్పాటువాదులకు కెనడా మద్దతు ఇవ్వటం రెండు దేశాల సంబంధాలకు మంచిది కాదని విమర్శించారు. ఆ తరువాత నిజ్జర్‌ హత్య జరిగింది. ఢిల్లీలో జరిగిన జి 20 కూటమి సమావేశాలకు జస్టిన్‌ ట్రుడేవ్‌ వచ్చినప్పటికీ ఇతర దేశాధినేతలతో మాదిరి ఫ్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక చర్చలు జరపలేదు. అంతే కాదు కెనడాలో ఉగ్రవాదులు భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని ఇటీవలి కాలంలో జరిగిన ఉదంతాల గురించి మోడీ కెనడా దృష్టికి తేగా, ప్రతిగా కెనడా కూడా మనదేశం మీద ఆరోపణలు చేసిందని వెల్లడైంది. తిరుగు ప్రయాణంలో ట్రుడేవ్‌ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడగా ప్రత్యామ్నాయంగా విమానం ఏర్పాటు చేస్తామని మన దేశం ప్రతిపాదించినా రెండు రోజులు వేచి ఉండి తన విమానంలోనే వెళ్లిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవని ఈ ఉదంతం వెల్లడించింది. ఆ తరువాతే పార్లమెంటులో మన దేశం మీద ఆరోపణ చేశాడు. ఈ అంశాన్ని తాము భారత్‌కు ఎంతో ముందుగానే తెలిపామని ట్రడేవ్‌ చెబుతుండగా ఎలాంటి సమాచారం లేదని మన అధికారులు అంటున్నారు.


ఈ వివాదంలో పశ్చిమ దేశాల వైఖరిని చూస్తే మన దేశాన్ని ఖండించ లేదుగానీ విచారణ జరగాలి అని మాట్లాడుతున్నాయి. మీడియాలో వచ్చిన వార్తలను బట్టి కెనడా ప్రధాని బహిరంగంగా మన దేశం మీద ఆరోపణ చేయటానికి ముందే ” ఐదు కళ్ల గూఢచార యంత్రాంగం ” లో భాగస్వాములుగా ఉన్న అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ అధికారులకు కెనడా నిజ్జర్‌ హత్యలో మన దేశ ప్రమేయం గురించి వెల్లడించటమే గాక ఒక సంయుక్త ప్రకటనలో ఖండించాలని ప్రతిపాదించగా మిగిలిన దేశాలు నష్టదాయకమంటూ తిరస్కరించినట్లు వెల్లడైంది. తమకు ముందుగానే చెప్పినట్లు కెనడాలోని అమెరికా రాయబారి డేవిడ్‌ కోహెన్‌ నిర్ధారించాడు. విదేశాల్లో హత్యలను సహించరాదని, తాము కెనడాను కేవలం సంప్రదించటం లేదని దర్యాప్తులో భాగస్వాములవుతున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ చెప్పాడు. భారత్‌కూడా దర్యాప్తులో భాగస్వామి కావాలని అమెరికా కోరింది. ఆరోపణలు ఆందోళనకరమైనవని, తాను భారత దేశం వద్ద ఈ అంశాన్ని లేవనెత్తినట్లు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రిణి పెనీ వాంగ్‌ చెప్పింది. ఆరోపణలు తీవ్రమైనవని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లవర్లీ, వస్తున్న వార్తులు నిజమే అయితే తీవ్ర ఆందోళన కలిగించే అంశమని తమ భాగస్వాములతో సన్నిహితంగా పర్యవేక్షిస్తున్నట్లు న్యూజిలాండ్‌ విదేశాంగ మంత్రి నానియా మహుతా అన్న వ్యాఖ్యలు కెనడాకు అనుకూలంగా చేసినట్లు స్పష్టమౌతున్నాయి.


పంజాబ్‌, కాశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలలో వేర్పాటు, తీవ్రవాద దుశ్చర్యలకు పాల్పడిన అనేక మందికి అమెరికా, కెనడా, ఐరోపా ధనిక దేశాలు ఆశ్రయం ఇచ్చిన సంగతి తెలిసిందే. పక్కనే ఉన్న శ్రీలంకలో ఉగ్రవాదులు సైతం పశ్చిమ దేశాల్లోనే స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. పాకిస్తాన్‌ ఉగ్రవాదుల అడ్డా, శిక్షణా కేంద్రం అన్నది వేరే చెప్పనవసరం లేదు. ఇదంతా అమెరికా, ఇతర ఐరోపా దేశాల కుట్రలో భాగంగానే జరిగింది. కెనడా ప్రధాని ఏమి చెప్పినప్పటికీ ఖలిస్తాన్‌ త్రీవ్రవాదుల అడ్డాగా ఆ దేశం మారింది. ప్రపంచంలో ఇతర దేశాల మీద దాడులు చేసేందుకు ఉగ్రవాదుల ఏరివేత అని సాకులు చెప్పే పశ్చిమ దేశాలు తమ సంరక్షణలో ఉన్నవారి గురించి పల్లెత్తు మాట మాట్లాడవు. ఇప్పుడు పశ్చిమ దేశాల ఆందోళన అంతా కెనడాలో ఆశ్రయం పొంది మన దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న తీవ్రవాదుల ఏరివేత, అదుపు గురించి కాదు. కెనడా – భారత్‌ మధ్య వివాదం ముదిరితే చైనాకు వ్యతిరేకంగా భారత్‌ను నిలపాలన్న తమ ఎత్తుగడ ఎక్కడ విఫలమౌతుందో అన్న భయమే ఎక్కువ కనిపిస్తోంది. పశ్చిమ దేశాల నుంచి వెలువడుతున్న అన్ని వ్యాఖ్యానాల్లో బహిరంగంగానే దీని గురించి ప్రస్తావిస్తున్నారు. పశ్చిమ దేశాల ఇండో-పసిఫిక్‌ ఎత్తుగడలో కెనడా కూడా ఒక ప్రధాన భాగస్వామే. మన దేశంలో నిరంకుశ పోకడలు, మానవహక్కులకు భంగం కలుగుతున్నదంటూ అమెరికాలోని అనేక సంస్థలు ఒకవైపు నిరంతరం ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద వత్తిడి పెంచుతున్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్లినపుడు 75 మంది ఎంపీలు మోడీ ప్రసంగాన్ని బహిష్కరించారు. అధ్యక్షుడు జో బైడెన్‌ వారి ప్రచారాన్ని అనుమతించి చోద్యం చూశాడు. మౌనంగా ఉన్నాడు. చైనాకు వ్యతిరేకంగా మన దేశాన్ని నిలబెట్టాలన్న ఎత్తుగడలో భాగమే అది. అదే ఎంపీలు చైనా గురించి చేసిన ఆరోపణల మీద అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఎలా స్పందిస్తున్నదీ చూస్తున్నాము.


పశ్చిమ దేశాలు కట్టగట్టుకొని మౌనం పాటిస్తున్నాయని, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నట్లు భారత్‌-కెనడా వివాదం గురించి చైనా మీడియా స్పందించింది. తమ వ్యూహాత్మక భాగస్వామిగా భారత్‌ను తీసుకుపోవాలని చూస్తున్నాయి గనుక కెనడా మిత్ర దేశాలు మౌనంగా ఉన్నాయి తప్ప తమ మిత్రులు కాకుంటే వెంటనే ఖండనలకు దిగేవని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. తమ ప్రయోజనాలు లేకపోతే పశ్చిమ దేశాలు నీతి సూత్రాలు, నిబంధనలు వల్లించి ఉండేవని, భారత మానవహక్కుల సమస్యల గురించి కళ్లు మూసుకున్నట్లు పేర్కొన్నది. మనదేశం చైనాను ఎలా చూస్తున్నదో చైనా కూడా మనలను అలాగే చూస్తుంది, మరోవైపు కెనడాతో దాని సంబంధాలు సజావుగా లేవు. ఇప్పుడు తలెత్తిన వివాదాన్ని వారెలా చూస్తున్నారన్నది సహజంగానే ఆసక్తి కలిగిస్తుంది. చైనా అధికారికంగా మాట్లాడకపోయినప్పటికీ అధికారిక పత్రికల్లో వస్తున్న వ్యాఖ్యల ద్వారా వైఖరిని అర్ధం చేసుకోవచ్చు. ఈ వివాదంతో తమ వ్యూహం నుంచి భారత్‌ ఎక్కడ వైదొలుగుతుందో అన్న భయం పశ్చిమ దేశాల్లో ఉంటే, పశ్చిమ దేశాలు – భారత్‌ మధ్య దూరం పెరగాలని సహజంగానే చైనా కోరుకుంటుంది. కెనడా ఒక దేశంగా ఉన్నప్పటికీ అది అమెరికాలో 51వ రాష్ట్రం మాదిరి ఉంటుందని చైనా భావిస్తున్నది. అందుకే భారత్‌ పట్ల అమెరికా మోసకారి తనం, ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నదని, వివాదం మరింత ముదిరితే గందరగోళానికి గురికానుందని చైనా గ్లోబల్‌ టైమ్స్‌లో ప్రచురితమైన విశ్లేషణలు చెబుతున్నాయి. పశ్చిమ దేశాల వలసవాద వైఖరి భారత్‌ను సమాన స్థాయిలో చూస్తూ సహకరించేందుకు ముందుకు రావటం అసాధ్యమని బీజింగ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అన్నాడు. అమెరికా అడుగులకు మడుగులొత్తుతూ ప్రవర్తించే కెనడా గతంలో చైనా మీద కాలు దువ్విందని ఇప్పుడు అమెరికా ప్రేరేపణతో భారత్‌ను రెచ్చగొడుతున్నదని చైనా వెబ్‌సైట్‌ ఒక విశ్లేషణలో రాసింది. మరికొందరు విశ్లేషకులు భారత్‌ పెద్ద ఇబ్బందుల్లో పడిందని పేర్కొన్నారు.


అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్‌ కిర్బీ మాట్లాడుతూ తమకు భారత్‌ ఎంతో కీలకమైన దేశంగానే ఉంటుందని, అది ఒక్క దక్షిణాసియా ప్రాంతానికే కాదు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతానికి కూడా అని చెప్పాడు. అమెరికాకు ఇది కలవరం కలిగించేదే, దానికి విశాల ప్రయోజనాలు ఉన్నాయి, ట్రుడేవ్‌ ఆరోపణలు గనుక నిజమే అయితే నరేంద్రమోడీ సర్కార్‌ ప్రజాస్వామ్యానికి కట్టుబడి లేదన్నది అర్ధం, ఇదే విధానాన్ని పుతిన్‌ కూడా అనుసరించాడు అని కెనడాలోని టొరొంటో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ రాబర్ట్‌ బోత్‌వెల్‌ అన్నాడు. తన శత్రువులను రష్యాలోపల, వెలుపల బ్రిటన్‌తో సహా ఇతర దేశాల్లో పుతిన్‌ చంపించాడని అన్నాడు. కరవ మంటే కప్పకు కోపం- విడవ మంటే పాముకు ఆగ్రహం అన్నట్లుగా ప్రస్తుతం పశ్చిమ దేశాల పరిస్థితి ఉంది.చివరకు ఈ వివాదాన్ని ఎలా ముగిస్తారో చూడాల్సి ఉంది.