Tags
2023 Israel–Hamas war, China, emmanuel macron, HAMAS attacks 2003, israel massacre, Joe Biden, Rishi Sunak
ఎం కోటేశ్వరరావు
అక్టోబరు ఏడవ తేదీన హమస్ సాయుధులు జరిపిన దాడులలో 1400 మరదికి పైగా మరణించారు. దానికి ప్రతీకారం పేరుతో ఇప్పటి వరకు ఇజ్రాయెల్ మిలిటరీ, యూదు దురహంకార సాయుధులు పాలస్తీనాలోని గాజా, పశ్చిమగట్టు ప్రాంతాలలో జరుపుతున్న దాడుల్లో మరణాలు, గాయపడిన వారు ఆరు, పద్దెనిమిదివేలు దాటారు. ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారికి సంతాపం తెలిపేందుకు ఎవరూ ఉండటం లేదనే శీర్షికతో అల్ జజీరా పత్రిక వార్త ఇచ్చింది. దానిలో పేర్కొన్నదాని ప్రకారం మంగళవారం నాటికి గాజాలో 2,360 మంది పిల్లలు, 1,119 మంది మహిళలతో సహా 5,791 మంది మరణించారు. గాయపడిన వారు 18వేలు దాటారు. పాలస్తీనాలో ఆక్రమించిన పశ్చిమ గట్టు ప్రాంతంలో ఇజ్రాయెలీ మూకలు మరో 95 మందిని చంపగా 1,650 మంది గాయ పడ్డారు. ఇక హమస్ జరిపిన ఒక రోజు దాడిలో1,405 మంది మరణించగా, 5,431 మంది గాయపడ్డారు.వీరు గాక పాలస్తీనాలో 720 మంది పిల్లలతో సహా1,400 మంది కనిపించటం లేదు. పశ్చిమ గట్టు ప్రాంతంలో 1,215 మందిని ఇజ్రాయెల్ అరెస్టు చేసింది. బందీలుగా ఉన్న ఇద్దరు ఇజ్రాయెలీ వృద్ద మహిళలను మానవతాపూర్వక వైఖరితో హమస్ విడుదల చేసింది. ఇజ్రాయెల్ ప్రతీకార ఏకపక్ష దాడులతో ఇరవై మూడులక్షల మంది గాజా పౌరులు నరకయాతన అనుభవిస్తున్నారు. రక్తదాహం తీరని యూదు దురహంకారులు పశ్చిమ దేశాలు ఇస్తున్న మద్దతుతో మరింతగా దాడులు చేసి జనాన్ని మట్టుపెట్టాలని చూస్తున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని స్థితి.
దాడులు, మారణకాండ నివారణలో ఐక్యరాజ్యసమితి విఫలమైంది. ఇజ్రాయెల్ పూర్తి యుద్ధ సన్నాహాల్లో ఉంది. ఒక్క గాజా మీదనే గాక ఇరుగుపొరుగు అరబ్ దేశాలను రెచ్చగొడుతూ ఉగ్రవాదుల సాకుతో అడపదడపా దాడులు చేస్తున్నది. వాటి తీవ్రతను పెంచేందుకు సరిహద్దుల్లోని తమ గ్రామాల్లో ఉన్న జనాన్ని ఖాళీ చేయిస్తున్నది. దానికి ప్రతిగా లెబనాన్ కూడా తన పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది. ఇజ్రాయెల్-అమెరికా కూటమి దేశాల దుండగాలను నివారించేందుకు, పాలస్తీనియన్ల తరఫున అవసరమైతే రంగంలోకి దిగేందుకు ఇరుగు పొరుగు దేశాలు కూడా సిద్దపడుతున్నాయి. మరోవైపున అమెరికా, ఐరోపాలోని అనేక పట్టణాల్లో లక్షలాది మంది జనం వీధుల్లోకి వచ్చి గాజాపై దాడులను నిరసిస్తున్నారు. యూదుల రక్షణ పేరుతో అరబ్బులపై మారణకాండకు పూనుకోవద్దని కోరుతున్న వారిలో యూదులు అనేక మంది ఈ ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. శనివారం నాడు భద్రతా మండలిలో అమెరికా ప్రతిపాదించిన ఒక తీర్మానంలో ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ చేసుకొనే హక్కు ఉందంటూ సమర్ధనకు పూనుకుంది.దాడుల విరమణకు ఇది సమయం కాదని ప్రకటించింది.గాజాలో జరుపుతున్న కొన్ని దాడులు ఇజ్రాయెల్‌కు ఎదురుదెబ్బకావచ్చని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించాడు.దాడులకు మద్దతు తెలిపేందుకు ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్ మంగళవారం నాడు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ చేరుకున్నాడు. అతని కంటే ఘనుడు అన్నట్లు బైడెన్, రిషి కంటే మరొక అడుగు ముందుకు వేసి అంతర్జాతీయంగా ఒక్కటై హమస్‌ను అణచివేయాలని పిలుపునిచ్చాడు. తాజా పరిణామాలను చర్చించేందుకు గురువారం నాడు ఐరాస సాధారణ అసెంబ్లీ సమావేశం జరగనుంది.
గాజా ప్రాంతంలో చిక్కుకు పోయిన ఇజ్రాయెల్, ఇతర దేశాల పౌరులు రెండువందల మందికి పైగా హమస్ చేతుల్లో బందీలుగా ఉన్నారు. వారందరినీ విడుదల చేసిన తరువాతే కాల్పుల విరమణ గురించి మాట్లాడాలని అమెరికా అధినేత జో బైడెన్ చెప్పాడు. ఏదో విధంగా వారిని విడిపించుకున్న తరువాత ఇప్పటి వరకు వైమానిక దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్ తదుపరి దశ పేరుతో భూతల దాడులకు సిద్దం అవుతున్నది. ఇదంతా హమస్‌ను నాశనం చేసే పేరుతో జరుగుతోంది.మరణించిన వారిలో 70 శాతం మంది పిల్లలు,వృద్దులు, మహిళలే ఉన్నారు. అంటే జనం మీదనే దాడి జరుగుతోందన్నది స్పష్టం. మరింతగా పెరిగితే లెబనాన్‌లోని హిజబుల్ వంటి సాయుధ శక్తులు ప్రతిదాడులకు సిద్దం అవుతున్నాయి. ఇజ్రాయెల్‌కు మద్దతుగా ప్రత్యక్షంగా దాడులకు దిగేందుకు అమెరికా రంగం సిద్దం చేసుకుంటున్నది. దానికిగాను తమ సైనికులపై దాడులు జరిగినట్లు కట్టుకథలను ప్రచారంలో పెట్టింది. అక్టోబరు 19,20 తేదీలలో ఎమెన్ నుంచి తమ మీద, ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులను కూల్చివేసినట్లు ప్రకటించింది. అదంతా రాత్రి సమయంలో సముద్ర జలాల మీద జరిగింది గనుక ఎలాంటి ఆనవాళ్లు ఉండవని అధికారులు చెప్పారు. నిజానికి ఎమెన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ సాయుధుల రాడార్ కేంద్రాలపై అమెరికా నౌకా దళమే ఎర్ర సముద్రం నుంచి క్షిపణులతో దాడి చేసి రెచ్చగొట్టిందని వార్తలు.ఎమెన్ రాజధాని సనా నగరంతో సహా ఉత్తర ప్రాంతం హౌతీల ఆధీనంలో ఉంది. వారి మీద పోరాడుతున్న ఎమెన్ ప్రభుత్వానికి 2015 నుంచి సౌదీ అరేబియా మద్దతు ఇస్తున్నది. ఇటీవల చైనా మధ్యవర్తిత్వంలో ఇరాన్-సౌదీ మధ్య సయోధ్య కుదిరిన నేపధ్యంలో గతంలో మాదిరి హౌతీ దళాలు సౌదీపై క్షిపణులు ప్రయోగించే అవకాశం లేదు. అందువలన అసలు నిజంగా ప్రయోగించారా లేక ఆ పేరుతో అమెరికా నాటకం ఆడుతోందా అన్న అనుమానాలు తలెత్తాయి. అమెరికా గనుక గాజాపై దాడికి జోక్యం చేసుకుంటే తాము దాడులకు దిగుతామని, గీత దాటవద్దని హౌతీ దళాల నేత అబ్దుల్ మాలిక్ అల్ హౌతీ హెచ్చరించాడు.
ఇప్పటికే మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఉన్న పేట్రియాట్ గగనతల క్షిపణి బెటాలియన్‌కు తోడు థాడ్ రక్షణ వ్యవస్థను కూడా పంపనున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇప్పటికే రెండు విమానవాహక యుద్ధ నౌకలు, వాటికి అనుబంధ నౌకలతో పాటు రెండువేల మంది మెరైెన్లను మోహరించింది. శనివారం నాడు కైరోలో జరిగిన శాంతి సమావేశం ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. ఇజ్రాయెల్ హాజరు కాలేదు. కైరోలోని ఒక జూనియర్ అధికారిని అమెరికా పంపింది, అతగాడు నోరువిప్పలేదు.అరబ్ నేతలు గాజాపై దాడులను ఖండించారు.ఐరోపా దేశాల నుంచి వచ్చిన వారు దాడుల నుంచి పౌరులను మినహాయించాలని సూచించారు.హిజబుల్లా మీద దాడులకు పూనుకోవద్దని జో బైడెన్, ఇతర నేతలు ఇజ్రాయెల్‌కు సూచిస్తున్నారని, అదే జరిగితే తాము కూడా యుద్ధంలో ప్రవేశించాల్సి ఉంటుదని కొన్ని అరబ్బు దేశాలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. పూర్తి స్థాయి యుద్ధమే వస్తే ఇజ్రాయెల్ తన దక్షిణ, ఉత్తర భాగంలో దాడులను ఎదుర్కోవాల్సి వస్తుంది, అప్పుడు అమెరికా-ఇరాన్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మధ్యధరా సముద్రంలో అమెరికా మిలిటరీ కేంద్రీకరణ నేపధ్యంలో చైనా ఆరు యుద్ధ నౌకలను ఆ ప్రాంతానికి తరలించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటి గురించి చైనా రక్షణ శాఖ ఒక ప్రకటన చేస్తూ మే నెల నుంచి తమ నౌకలు ఆ ప్రాంతంలో ఉన్నాయని, గత వారంలో ఓమన్ నౌకాదళంతో కలసి సంయుక్త విన్యాసాలు సాగించినట్లు పేర్కొన్నది. అవి పూర్తైన తరువాత అక్టోబరు 18వ తేదీన కువైట్ రేవు షావయాఖ్‌కు తమ నావల్ ఎస్కార్ట్ దళాలు వచ్చినట్లు తెలిపింది. వాటిలో నిర్ణీత లక్ష్యాలను ఛేదించే క్షిపణి నౌక, ఫ్రైగేట్, ఇతర నౌకలు ఉన్నాయి. చైనా-కువైట్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరి ఐదు సంవత్సరాలు అవుతున్నది. పది సంవత్సరాలుగా బిఆర్‌ఐ పధకం కింద పెట్టుబడులు పెట్టింది. చైనా నౌకలు ఎందుకు వచ్చినప్పటికీ ఈ ప్రాంతంలో రాజకీయంగా వాటి ప్రభావం ఉంటుంది. అమెరికా మిలిటరీ శక్తిని చూసి ఆందోళన చెందుతున్న శక్తులకు భరోసా దొరికినట్లు అవుతుంది.
ప్రస్తుతం ఇజ్రాయెల్ పరిమితంగా జరుపుతున్న దాడులు, ఒకవేళ వాటి తీవ్రతను పెంచితే రాగల పరిణామాలు, పర్యవసానాల గురించి అమెరికా మదింపు వేస్తోంది. ఇరాన్ అందచేసిన డ్రోన్లు, ఇతర ఆయుధాలతో హమస్ కంటే పెద్ద శక్తిగా ఉన్న హిజబుల్లా గనుక పోరుకు దిగితే తీవ్ర పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.హమస్ దగ్గర పరిమితమైన ఆయుధాలు మాత్రమే ఉన్నాయి, శిక్షణ పొందిన హిజ్‌బుల్లా దగ్గర స్వల్ప శ్రేణి ఖండాంతర క్షిపణులు, డ్రోన్లు, మానవరహిత ప్రయోగ వ్యవస్థలు ఉన్నాయి. వాటిని రంగంలోకి దింపితే పోరు తీరే మారిపోతుంది.ప్రస్తుతం అది యుద్ధాన్ని కోరుకోవటం లేదని, అమెరికా, ఇజ్రాయెల్ గనుక వారిని ఆవైపుకు నెడితే రంగంలోకి దిగుతుందని పరిశీలకులు అంటున్నారు. బహుశా దానిలో భాగంగానే లెబనాన్ సరిహద్దులో ఉన్న హిజబుల్లా సాయుధులపై ఇజ్రాయెల్ దాడులు చేసి కవ్విస్తున్నది.2019లో అమెరికా మిలిటరీ గూఢచారుల సమాచారం మేరకు హిజబుల్లా వద్ద లక్షా 50వేల రాకెట్లు, ఇజ్రాయెలీ సంస్థ ఒకటి గతేడాది చెప్పినదాని ప్రకారం రెండువేల మానవరహిత ఆయుధ ప్రయోగ వాహనాలు ఉన్నాయి. వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు వెళ్లే ఆయుబ్, షాహేద్ వంటి క్షిపణులు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్ వద్ద అధునాతన వైమానిక దళం ఉన్నప్పటికీ హిజబుల్లా వంటి సంస్థల వద్ద ఉన్న నిఘా, ఇతర పరికరాలతో గురిచూసి విమానాలను కూల్చివేసే అవకాశం ఉంది. ఐరన్ డ్రోమ్, ఐరన్ బీమ్ వంటి రక్షణ వ్యవస్థల గురించి ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో చెబుతున్నప్పటికీ అవి ఎంతవరకు దాడులను నివారించగలవో ఇంతవరకు రుజువు కాలేదు. గడచిన ఏడు దశాబ్దాలుగా పాలస్తీనా యోధులను అణచేందుకు ఇజ్రాయెల్ చేయని ప్రయోగం లేదు. కానీ ఎప్పటికప్పుడు కొత్త శక్తులు, గెరిల్లా పద్దతుల్లో దాడులతో తెగబడుతూనే ఉన్నాయి. ఇప్పుడు హమస్‌ను అణచివేయటం కూడా జరిగేది కాదని చెబుతున్నారు. ఇజ్రాయెల్ తాను చేయదలచుకున్న విధ్వంసాన్ని నెల రోజుల్లోపల పూర్తి చేయాలని తరువాత అమెరికా అనుమతించే అవకాశం ఉండదని, భూతల దాడికి దిగితే ఇజ్రాయెల్ కూడా భారీ సంఖ్యలో సైనికులను కోల్పోతుందని, దాంతో పౌరుల్లో సహనం కూడా నశిస్తుందని ఒక నిపుణుడు చెప్పాడు.2006లో జరిగిన రెండవ లెబనాన్ పోరులో హిజబుల్లా పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ సైనికులను హతమార్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది సామర్ధ్యాన్ని మరింతగా పెంచుకుంది.ప్రస్తుతం లక్ష మంది యోధులున్నట్లు అంచనా. ఇజ్రాయెల్ పరిసరాలన్నీ నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ప్రపంచ శాంతి శక్తులు కోరుతున్నట్లు యూదు దురహంకారులు వెనక్కు తగ్గుతారా అమెరికా, ఐరోపా ధనిక దేశాల అండచూసుకొని మరింతగా మారణకాండకు పాల్పడతారా అన్నది చెప్పలేము.
