Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


తెలంగాణాలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మాదే అంటూ మూడు ప్రధాన పార్టీలు ఓటర్ల ముందుకు ఎన్నికల ప్రణాళికలు, ఓట్లు దండుకునే ప్రచారం, పధకాలతో ముందుకు వచ్చాయి. అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ నాడెట్లుండె-నేడెట్లుండే రేపు ఎలా ఉండబోతుందో చూడండి అంటూ రంగుల కలను జనం ముందు ఉంచింది. అధికారంలో లేని కాంగ్రెస్‌ పార్టీ తాను ప్రకటించిన ప్రణాళికను ఎలా అమలు జరుపుతుంది ? దానికి తగిన నిధులు అందుబాటులో ఉన్నాయా ? ఏమి చూసుకొని జనాన్ని వాగ్దానాల జడివానలో తడుపుతున్నది అన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి, కేంద్రంలో ఏలుబడి సాగిస్తున్న బిజెపి ఇతర రాష్ట్రాలలో, కేంద్రంలో అమలు జరపని పధకాలను ఇక్కడ ఎందుకు జనానికి చెబుతున్నది, ఎలా అమలు చేస్తుంది ? రాష్ట్ర అధికారపక్షం బిఆర్‌ఎస్‌ గత పది సంవత్సరాలుగా అమలు జరపని వాటిని రానున్న రోజుల్లో అమలు జరుపుతామంటే నమ్మేదెలా అన్న ప్రశ్న సహజంగానే వస్తున్నది. బిఆర్‌ఎస్‌ చెబుతున్నట్లు నిజంగానే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మారుస్తున్నదా ? దాని పని తీరు ఎట్లుండె అన్నది బడ్జెట్లలో చూస్తే అర్ధం అవుతుంది. అందుకే దాని పని తీరును ఒక్కసారి అవలోకించాల్సిందిగా మనవి.


ఒక పెద్ద మనిషి పదేండ్ల తరువాత బంధువుల ఇంటికి వచ్చాడు. అప్పుడు ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడిని చూశా ఇప్పుమో నడుస్తూ గంతులేస్తున్నడు, ఎంతగా ఎదిగిండో కదా అన్నడట.పిల్లవాడు పుట్టిన తరువాత పెరగకుండా ఎట్లుంటడు ? ఎలా పెరిగిండు, కడుపు నిండా తింటున్నడా, మంచిగా ఆడుకుంటున్నడా, ఆరోగ్యంగా ఉన్నడా లేడా బడికిపోతున్నడా లేదా అన్నది ముఖ్యం. రాష్ట్రమైనా అంతే పదేండ్లనాడు ఉన్న మాదిరే ఇప్పుడు ఎట్లుంటది, మార్పులు వస్తాయి. అవి ఎలా ఉన్నాయన్నదే ముఖ్యం. రాష్ట్రం, దేశం ఏదైనా అంతే ! దిగువ చూపుతున్న వివరాలలో గత సంవత్సరాల కేటాయింపులు 2023-24 బడ్జెట్‌ ప్రతిపాదనలుగా గమనించాలి. అంకెలు రు. కోట్లు అని గమనించాలి. ఓ.మా రుణం అంటే ఓపెన్‌ మార్కెట్‌ రుణం.
అంశం×××× 2014-15 ××× 2022-23 ×× 2023-24
జిడిపి ×××× 5,05,849 ××× 12,93,000 ×× 14,00,000
అప్పులు ×× 75,577 ××× 4.50,000 ×× 5,00,000
ప్ర.రుణచెల్లింపు× 587 ××× 8,336 ×× 9,341
వడ్డీ,అసలు ×× 6,291 ××× 18.912 ×× 22,400
ఓ.మా.రుణం ×× 8,211 ××× 44, 970 ×× 40,615
లిక్కర్‌ రాబడి×× 10,883 ××× 31,077 ×× 35,000
కే.పన్నువాటా ×× 8,185 ××× 19,668 ×× 21,470
కాపిటల్‌ ఖర్చు×× 8,372 ××× 26,934 ×× 37,525
మూలధన పెట్టుబడి అన్నది రాష్ట్రం, దేశానికైనా కీలకమైనది.2014-15లో ఖర్చు బడ్జెట్‌ మొత్తం ఖర్చు రు.62,306 కోట్లు కాగా దీనిలో మూలధన పెట్టుబడి రు.11,633 కోట్లు, 18.6శాతం ఉంది. 2022-23లో సవరించిన అంచనా ప్రకారం ఖర్చు బడ్జెట్‌ రు.2,26,010 కోట్లు కాగా దీనిలో మూలధన పెట్టుబడి రు.26,934 కోట్లు,11.9శాతానికి దిగజారింది.2023-24 సంవత్సర ఖర్చు బడ్జెట్‌ రు.2,77,690 కోట్లు కాగా మూలధన పెట్టుబడి రు.37,525 కోట్లుగా ప్రతిపాదించారు.దీన్ని మొత్తం ఖర్చు చేస్తే 13.5శాతం అవుతుంది. బడ్జెట్‌ వివరాలను చూసినపుడు 2021-22లో రు.28,874 కోట్లు వాస్తవ ఖర్చు ఉంది. మరుసటి ఏడాది రు.29,728 కోట్లు ప్రతిపాదించి రు.26,934 కోట్లకు సవరించారు. వాస్తవ ఖర్చు ఇంకా తగ్గవచ్చు. అందువలన వర్తమాన బడ్జెట్‌లో ఎంత కోతపెడతారో తెలియదు. మొత్తం తెలంగాణా వచ్చినపుడు 18.6శాతంగా ఉన్న ఖర్చు క్రమంగా దిగజారటం ఆందోళన కలిగించే అంశం.


పెంచకపోయినా తొలి ఏడాది మూలధన పెట్టుబడి శాతం ఎంత ఉందో దాన్నయినా కొనసాగించాలి కదా ? తెలంగాణా ఏర్పడిన తొలి ఏడాది 2014-15లో రాష్ట్ర జిడిపిలో అప్పులు16.06శాతం ఉన్నాయి.పదిహేనవ ఆర్థిక సంఘం నిబంధనల(ఎఫ్‌ఆర్‌బిఎం) ప్రకారం అప్పులు 29.5శాతం ఉండవచ్చు. కాగ్‌ నివేదిక 2020-21 ప్రకారం ఆ సంవత్సరంలో అప్పులు 28.1శాతానికి పెరిగాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న రుణాలు. ఇవిగాక ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రత్యేక అవసరాల కోసం ఏర్పాటు చేసిస సంస్థలకు హామీగా ఇప్పించిన రుణాలను కూడా పరిగణనలోకి తీసుకొంటే 38.1శాతంగా ఉన్నాయి. బంగారు బదులు అప్పుల తెలంగాణాగా మార్చారు. పరిమితికి మించి రుణాలు తీసుకున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల వలన రుణ అర్హత పరిమితి తగ్గింది. పేరుకు పోయిన అప్పుల మొత్తం పెరుగుతున్నట్లు అంకెలు చెబుతున్నాయి. అయితే రాష్ట్ర జిడిపి ఏటేటా పెరుగుతున్నందున దానితో పోల్చుకున్నపుడు తగ్గుదల కనిపిస్తుంది. ప్రభుత్వం ఈ అంకెలనే తనకు అనుకూలంగా చూపుతుంది. కొత్తగా తీసుకొనే రుణాల మీద కోత విధించటం కూడా తగ్గుదలకు ఒక కారణం.2023-24 బడ్జెట్‌ అంచనాల ప్రకారం రుణభారం జిడిపిలో 23.8శాతంగా ఉంటుందని చూపారు. రానున్న రెండు సంవత్సరాల్లో 2025,26 ఆర్థిక సంవత్సరాల్లో ఆ మొత్తం 25శాతానికి పెరుగుతుందని కూడా పేర్కొన్నారు అంతకు ముందు సంవత్సరం 24.3శాతం ఉంది. ముందే చెప్పుకున్నట్లు వీటికి ప్రభుత్వం హామీగా ఉన్న రుణాల మొత్తం 2022-23లో రు.1,29,244 కోట్లు, ఇది జిడిపిలో 11.3శాతం, దీన్ని కూడా కలుపుకుంటే అప్పుల మొత్తం 35.6శాతం ఉంది.


కొన్ని సంక్షేమ పధకాలను చూపి వాటిని తెలంగాణా నమూనాగా ప్రచారం చేస్తున్నారు, అభివృద్ధిలో ముందుందని అంటున్నారు.ఇది వాస్తవమా ? రైతు బంధు, వృద్ధాప్య పెన్షన్ల వంటి కొన్ని సంక్షేమ పధకాలు అందరికీ తెలిసినవే.ఆరు కీలక రంగాలలో తెలంగాణా దేశంలో ఎక్కడుందో తెలుపుతూ పిఆర్‌ఎస్‌ అనే స్వచ్చంద సంస్థ విశ్లేషణలను అందించింది.2022-23లో తెలంగాణాతో సహా అన్ని రాష్ట్రాల బడ్జెట్‌ కేటాయింపులను పోల్చి చూపింది.ఎంతో పురోగమించింది, మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాం, అందుకే టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ పార్టీగా అవతరించాం అని చెప్పుకోవటంలో వాస్తవం ఎంతో చూద్దాం. బిఇ అంటే బడ్జెట్‌ అంచనా, ఆర్‌ఇ అంటే సవరించిన బడ్జెట్‌ అంచనా.ఆయా రంగాలకు మొత్తం ఖర్చులో తెలంగాణా కేటాయింపు శాతం, చివరి కాలంలో అన్ని రాష్ట్రాల సగటు శాతాలు దిగువ విధంగా ఉన్నాయి.ఆర్‌డి అంటే గ్రామీణాభివృద్ధి.ప.అ అంటే పట్టణ అభివృద్ధి,
రంగం×××2021-22××22-23బిఇ××22-23ఆర్‌ఇ××23-24బిఇ××అ.రా 22-23బిఇ
విద్య ××× 8.7 ×× 7.3 ×× 8.0 ×× 7.6 ××14.8
వైద్యం××× 4.2 ×× 5.0 ×× 5.5 ×× 5.0 ×× 6.3
ఆర్‌డి ××× 4.5 ×× 3.9 ×× 4.3 ×× 3.6 ×× 5.7
ప.అ ××× 1.6 ×× 3.0 ×× 3.2 ×× 2.8 ×× 3.5
పోలీస్‌ ××× 4.6 ×× 4.0 ×× 4.4 ×× 3.6 ×× 4.3
రోడ్లు ××× 1.4 ×× 3.2 ×× 3.3 ×× 3.7 ×× 4.5
పైన పేర్కొన్న వివరాలను చూసినపుడు ఆయా రంగాలలో మూడు సంవత్సరాలలో ధనిక రాష్ట్రంగా చెప్పుకొనే తెలంగాణా దేశ సగటు కంటే తక్కువే ఖర్చు చేస్తున్నది. కెజి నుంచి పిజి వరకు ఉచితం అని చెబుతున్న పాలకులు విద్యలో సగం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కార్పొరేట్లకు ఈ రంగాన్ని అప్పగించటమే అన్నది స్పష్టం. ప్రభుత్వ విద్యా సంస్థలలో తగిన సౌకర్యాలు, సిబ్బంది, చదువుకొనే వాతావరణం ఉంటే తలిదండ్రులు ప్రైవేటు సంస్థలవైపు చూడరు.


ఇక వైద్యం, తల్లీ పిల్లల ఆరోగ్యం, పోషకాహారం గురించి చూద్దాం.2015-16 సంవత్సరాలలో నాలుగవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, 2019-21లో ఐదవ సర్వే జరిగింది.ఈ రెండు సర్వేల వివరాలను చూసినపుడు దేశం మొత్తం మీద రక్తహీనత సమస్య పెరిగింది.శరీరంలో తగినంత రక్తం లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నది తెలిసిందే.రక్తహీనత పెరుగుదల బడుగు, బలహీన వర్గాలలోనే ఎక్కువగా ఉంది.తాము తిన్నా తినకపోయినా పిల్లలకు పెట్టేందుకు చూసే తలితండ్రులు తమ బిడ్డలను ఆరోగ్యంగా పెంచలేకపోవటానికి ప్రధాన కారణం వారికి తగినంత కుటుంబ ఆదాయం లేక పోషకాహారం తీసుకోకపోవటమే అని వేరే చెప్పనవసరం లేదు.వివరాలు దిగువ చూడవచ్చు.1.ఆరు నెలల నుంచి ఆరేండ్ల లోపు పిల్లలు, 2.గర్భిణులు కాని మహిళలు 15 నుంచి 49 ఏండ్లు , 3. గర్భిణులు 15 నుంచి 49 ఏండ్లు,4.మహిళందరు 15-49 ఏండ్లు, 5.యువతులు 15-19 ఏండ్లు, 6.యువకులు 15-19 ఏండ్లు.దేశం 4 అంటే నాలుగవ సర్వే, దేశం 5 అంటే ఐదవ సర్వే శాతాలు.
ఏరియా ×× 1 × 2 × 3 × 4 × 5 × 6
దేశం 4 ××58.6 ×52.3 ×50.4×53.1 ×54.1× 29.2
దేశం 5 ××67.1 ×57.2 ×52.2×57.0 ×59.1× 31.2
తెలంగాణా4××60.7 ×56.9 ×48.2×56.6 ×57.9× 19.2
తెలంగాణా5××70.0 ×57.8 ×53.2×57.6 ×64.7× 25.1
పై పట్టిక చూసినపుడు పసిపిల్లలో రక్తహీనత చాలా ఎక్కువగా ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు ఇంత అనారోగ్యంగా ఉంటే ఎలా ! ఒకే వయసు ఉన్న యువతీ యువకుల్లో రక్తహీనత తేడాలు ఎంతగా ఉన్నాయో చూస్తే ఆడపిల్లల పట్ల వివక్ష, నిర్లక్ష్యం కనిపిస్తుంది. దేశంలోని యువకుల్లో రెండు సర్వేల మధ్య తేడా రెండుశాతం కాగా తెలంగాణాలో ఆరుశాతానికి పెరగటాన్ని గమనించవచ్చు. తల్లీ, పిల్లల ఆరోగ్యం, పోషణ అంశంలో దేశం మొత్తం మీద చూపుతున్న నిర్లక్ష్యం కంటే తెలంగాణాలో ఎక్కువగా ఉన్నట్లు అంకెలు చెబుతున్నాయి.అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నామని చెప్పుకుంటున్న పాలకులు కీలక రంగాలకు తగిన కేటాయింపులు జరపక, తల్లీ బిడ్డల ఆరోగ్యాన్ని పట్టించుకోక తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నట్లు ? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిస్థితి దిగజారిందా మెరుగుపడిందా ? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణా వివక్షకు గురైందని చెప్పిన పాలకులు దేశ సగటు కంటే తక్కువ కేటాయింపులు ఎందుకు చేసినట్లు ?


రాష్ట్ర ప్రభుత్వం రెండులక్షల రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం చేస్తామని 2016-17బడ్జెట్‌లోనే చెప్పింది. ఒక లక్ష హైదరాబాద్‌, మరోలక్ష ఇతర చోట్ల అని పేర్కొన్నది.దాని ఆచరణ ఎలా ఉందంటే 2021-22 బడ్జెట్‌లో ఇండ్ల నిర్మాణానికి రు.11,151 కోట్లు కేటాయించి ఖర్చు చేసిందెంతో తెలుసా కేవలం రు.299 కోట్లు మాత్రమే.2022-23లో రు.12,172 కోట్లు కేటాయించి రు.8,112కోట్లకు తగ్గించి సవరణ బడ్జెట్‌లో చూపారు. ఆచరణలో ఇంకా తగ్గవచ్చు.కానీ 2023-24లో రు.12,140 కోట్లుగా ప్రతిపాదించి అంతకు ముందు కంటే 50శాతం పెంచినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎన్నికల ముందు కొంత మేర నిధులు కేటాయించి నామ మాత్రంగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేశామనిపించి వాటినే గొప్పగా ప్రచారం చేస్తున్నారు.అదే విధంగా అదే ఏడాది పట్టణాభివృద్ధికి రు.10,555 కోట్లు ప్రకటించి 75శాతం కోత పెట్టి రు.2,665 కోట్లు ఖర్చు చేశారు.సగానికిపైగా జనాభా పట్టణాల్లో నివసిస్తున్న పూర్వరంగంలో ఎంత నిర్లక్ష్యం చేసిందీ వేరే చెప్పనవసరం లేదు. అదే బడ్జెట్‌లో సాంఘిక సంక్షేమం-పోషకాహారానికి రు.18,997 కోట్లు కేటాయించి 35శాతం,రోడ్లు, వంతెనలకు రు.5,187 కోట్లు ప్రకటించి 55శాతం, వ్యవసాయం, అనుబంధ రంగాల ప్రతిపాదనల్లో 27శాతం కోత పెట్టారు.ఇలా కోతలను దాచి వర్తమాన బడ్జెట్‌లో పెంచినట్లు మాటల్లో కోతలు కోస్తున్నారు.