Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య మంగళవారం 671వ రోజులో ప్రవేశించింది. పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.మేనెలలో బఖ్‌మట్‌ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత మారింకా అనే మరో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా సోమవారం నాడు ప్రకటించింది. అబ్బే అలాంటిదేమీ లేదు, తమ సైనికులు ఇంకా అక్కడే ఉన్నారని ఉక్రెయిన్‌ మిలిటరీ అధికారి చెప్పాడు. తమ మీదకు వచ్చే క్షిపణులు, యుద్ధ విమానాలను కూల్చివేస్తున్నామని, విజయానికి చేరువలో ఉన్నామని జెలెనెస్కీ ప్రకటిస్తూనే ఉన్నాడు. కానీ తమ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్న మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప అడుగు ముందుకు పడటం లేదు. పశ్చిమదేశాల కారణంగా సంక్షోభం మూడవ సంవత్సరంలో కూడా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.ఈ పోరులో ప్రత్యక్షంగా నిమగమైన రష్యా-ఉక్రెయిన్లే కాదు ప్రపంచ దేశాలన్నీ అనేక విధాలుగా గుణపాఠాలు తీసుకుంటున్నాయి. ఇక ఆయుధ వ్యాపారులు, ఉత్పత్తిదారుల సంగతి చెప్పనవసరం లేదు. వాటిని ఎంత ఎక్కువగా ఆమ్ముకోవాలి, మరింతగా మారణకాండను సృష్టించేవిగా వాటిని ఎలా సానబట్టాలా అని చూస్తున్నాయి. ఉక్రెయిన్‌పై దాడిలో పట్టుకున్న లేదా ధ్వంసం చేసిన రష్యన్‌ టాంకులు, ఆయుధశకలాలను సేకరించి ఉత్పత్తిదారులకు అందచేసి పోటీగా రూపొందించే వాటిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలో పరిశీలించండని కోరుతున్నట్లు బ్రిటీష్‌ మిలిటరీ అధికారి వెల్లడించారు.దొరికిన ప్రత్యర్ధుల ఆయుధాలు, వాహనాలను విశ్లేషించటం ప్రతిపోరులోనూ జరుగుతున్నదే. ఈ పోరులో డ్రోన్లతో దాడులు ఎలా చేయవచ్చో ప్రపంచం నేర్చుకుంటున్నది. ఉక్రెయిన్‌ సరిహద్దులకు ఆవల రష్యా తన వ్యూహాత్మక అంశాలను మరోసారి విశ్లేషించుకొనే విధంగా నాటో కూటమి దేశాల విస్తరణ పురికొల్పుతున్నది. కొత్త ఎత్తుగడలకు పుతిన్‌ తెరతీస్తాడు. అది ఒక్క రష్యాకే కాదు, ఐరోపా రక్షణ అంశాలను కూడా సమీక్షించాల్సిన అవసరాన్ని ముందుకు తెచ్చింది. కానీ అసలైన సమస్య ఎంతకాలం ఉక్రెయిన్‌ తట్టుకొని నిలబడుతుందనే ఆందోళన పశ్చిమ దేశాల్లో రోజురోజుకూ పెరుగుతోంది. రాజీకి సిద్దమేగానీ రష్యా చేతిలోకి వెళ్లిన తమ ప్రాంతాల సంగతేమిటని జెలెనెస్కీ అడుగుతున్నాడు. ఒకటి కావాలంటే మరొకదాన్ని వదులుకోవాల్సి ఉంటుందని పరోక్షంగా అమెరికా సూచిస్తున్నట్లు వార్తలు. ఆ ప్రాంతాల గురించి మరిచిపోండి, పశ్చిమ దేశాలు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఇంతకంటే జరిగే నష్టం మాకు ఉండడు, కావాలంటే రాజీ చర్చలకు నేను సిద్దమే అని పుతిన్‌ చెబుతున్నాడు. ఇటు ఉక్రెయిన్‌ ఓడిపోయి, రష్యా మీద ఆంక్షలను ఎత్తివేసే పరిస్థితి వస్తే తమ పరువేంగాను అని నాటో కూటమి దేశాలు అనుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు. మరోవైపు పాలస్తీనా ప్రాంతమైన గాజాలో పరువు దక్కించుకొని బయటపడటం ఎలా అన్న సమస్య పశ్చిమదేశాలకు తలెత్తింది.మధ్య ప్రాచ్యపరిస్థితిని చూస్తే ఎప్పుడేమౌతుందో తెలియటం లేదు.


వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఫిన్లండ్‌, తరువాత స్వీడెన్‌ నాటోలో ప్రవేశించనున్నాయి. అంటే మరోవైపు నుంచి రష్యా సరిహద్దులకు నాటో మిలిటరీ, ఆయుధాలు చేరనున్నాయి. ఫిన్లండ్‌-రష్యా మధ్య 1,300 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. 2026 నాటికి ఎఫ్‌-35 ఐదవతరం యుద్ధ విమానాలను అది సమకూర్చుకోనుంది. అమెరికాలో ఎన్నికల కారణంగా అక్కడి నుంచి ఉక్రెయిన్‌కు వచ్చే సాయానికి అంతరాయం కలిగితే ఆ ఖర్చును తట్టుకొనేదెలా అని ఐరోపా దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. వలసలను అనుమతించరాదంటూ మితవాద శక్తులు ప్రతి దేశంలోనూ జనాన్ని రెచ్చగొడుతున్నాయి, ఎన్నికల్లో వాటికి మద్దతు పెరుగుతోంది.తాము మిలిటరీ సాయాన్ని నిలిపివేస్తున్నట్లు స్లోవేకియా ప్రకటించింది. అది చిన్నదేశమే అయినప్పటికీ దాని ప్రభావం పెద్ద దేశాలు, జనం మీద పడుతుంది.అమెరికా, ఐరోపా ధనికదేశాలు కోరుకున్న విధంగా రష్యా మీద విధించిన ఆంక్షలు ఫలితాలనివ్వటం లేదు.పోరు ఆగేట్లు లేదు, మడిగట్టుకొని ఎంతకాలం కూర్చుంటాం రష్యాతో వాణిజ్యం చేస్తామని చెబుతున్నాయి. రష్యాను ఒంటరి చేయటంలో పశ్చిమ దేశాలు ఇంకా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాయి గానీ ఫలించటం లేదు. నల్లసముద్రం, బాల్టిక్‌ సముద్రం, ఆర్కిటిక్‌ సముద్రాల మీద పట్టు నిలుపుకోవాలన్నది రష్యా లక్ష్యం, దెబ్బతీయాలన్నది అమెరికా ఎత్తుగడ. అందుకోసం ఐరోపాలోని నాటో కూటమి దేశాల మీద ఆధారపడింది. ఫిన్లండ్‌, స్వీడన్‌లను నాటోలో చేర్చుకోవటం ద్వారా ఆపని చేయాలని చూస్తున్నది. తాము తలచుకుంటే రష్యా సెంట్‌పీటర్స్‌బర్గ్‌కు చేరే, తిరిగి వచ్చే మార్గాలను మూసివేయగలమని నాటో ప్రధాన కార్యదర్శి జనరల్‌ ఆండ్రెస్‌ ఫాగ్‌ రాస్‌ముసెన్‌ అన్నాడు. నార్వే గడ్డమీద నాలుగు మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేసి పట్టుసాధించేందుకు అమెరికా పూనుకుంది.


ఆంక్షలు విధించిన తరువాత 2023లో రష్యా రేవుల ద్వారా సరకు రవాణా 7.8శాతం పెరిగినట్లు సమాచారం తెలుపుతున్నది. బాల్టిక్‌ సముద్రాన్ని నాటో సరస్సుగా పశ్చిమ దేశాలు ప్రకటించినా ఆ ప్రాంత రేవుల ద్వారా కూడా రెండున్నరశాతం సరకు రవాణా పెరిగింది. వీటిలో చైనాకు చమురు కీలక పాత్ర పోషించింది.2019లో తొలి వాణిజ్య రవాణాలో 22లక్షల పీపాల చమురు ఎగుమతి జరగ్గా, 2023లో 104లక్షలకు పెరిగింది. పశ్చిమదేశాల వ్యూహాలను, రష్యాపై విధించిన ఆంక్షలను చూసిన తరువాత సూయజ్‌ కాలువ ద్వారా జరుగుతున్న రవాణాను మరో మార్గానికి మళ్లిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చైనా భావిస్తోంది. రష్యా కూడా ప్రత్యామ్నాయాల గురించి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నది. ఉత్తర ధృవ కేంద్రం ఉన్న ఆర్కిటిక్‌ సముద్ర ప్రాంతరేవుల ద్వారా రవాణాలో మూడో వంతుదూరం, సమయం, ఖర్చు కూడా కలసి వస్తుంది. సూయజ్‌ కాలువ మాదిరి దాటేందుకు సుంకం చెల్లించాల్సిన అవసరంగానీ, వేచి ఉండాల్సిన పరిస్థితిగానీ, సముద్రపు దొంగల బెడదా ఉండదు. అయితే ఊహించని వాతావరణ, మంచు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.పశ్చిమ దేశాలతో తలెత్తే వైరుధ్యాలను గమనంలో ఉంచుకొని రష్యా కూడా వాటిని అధిగమించే చర్యలకు పూనుకుంది.ఆర్కిటిక్‌ సముద్ర మార్గంలో మంచును బద్దలు చేసి ముందుకు పోయే నౌకలను సిద్దం చేస్తున్నది. రానున్న పదమూడు సంవత్సరాల్లో 22 బిలియన్‌ డాలర్లు వెచ్చించి 50 (ఐస్‌ బ్రేకర్స్‌ )మంచులో నడిచే నౌకలను నిర్మిస్తున్నది.ఇలాంటి వాటిని అమెరికా, చైనా కూడా నిర్మిస్తున్నది. అవసరమైన ఏర్పాట్లు జరిగితే రష్యాలోని సైబీరియా, అలాస్కా మీదుగా ఉత్తర చైనాకు సరకురవాణా జరపవచ్చు.ఆ మార్గంలో ఏ దేశాలూ లేవు.ఇరవై నాలుగు వేల ఆర్కిటిక్‌ సముద్ర తీరం ఉన్న రష్యా ఆ ప్రాంతం నుంచి వెలికి తీస్తున్న చమురు, గాస్‌ను ఐరోపాకు ప్రధానంగా ఎగుమతి చేసేది, ఇప్పుడు ఇతర ప్రాంతాలకు పంపుతున్నది. ఈ ప్రాంత వనరులను రష్యా ఎంతగా వెలికితీస్తే అంతగా ప్రపంచంలో దాని ఆర్థిక పలుకుబడి పెరుగుతుంది.బహుశా దీన్ని ఊహించే అమెరికా కూడా అలాస్కా, గ్రీన్‌లాండ్‌ ప్రాంతంలో ఇప్పుడున్న మిలిటరీ కేంద్రాలను మరింతగా పటిష్టపరుస్తున్నది, నార్వేలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. రష్యాను దెబ్బతీసే వ్యూహంలో భాగంగా ఫిన్లండ్‌, నార్వేలతో మిలిటరీ సహకారాన్ని పెంచుకుంటున్నది.ఆర్కిటిక్‌ ప్రాంతంలో తన సరిహద్దుల నుంచి రెండువందల నాటికల్‌ మైళ్లకు (370 కిలోమీటర్లు) ఆవల కూడా తమకు హక్కు ఉందని అమెరికా కొత్తగా వివాదాస్పద ప్రకటనగావించింది. సముద్ర చట్టాల ఐరాస ఒప్పందంలో ఇంతవరకు అది భాగస్వామి కాదు. ఆ ప్రాంతంలో ఉన్న విలువైన ఖనిజాలు ఉండటమే దీనికి కారణం.


పశ్చిమ దేశాల అండచూసుకొని ఉక్రెయిన్‌ ఎన్నిబెదిరింపులకు పాల్పడినప్పటికీ ఇటీవలి కాలంలో నల్లసముద్రం, అజోవ్‌ సముద్రాలలో రష్యా ఓడల రవాణా 17.2శాతం పెరిగింది. నాటో రష్యా మీద విధించిన ఆంక్షలను సభ్యదేశమైనప్పటికీ టర్కీ పాలకులు అమలు చేయటం లేదు, అంతేకాదు ఏజియన్‌ సముద్రం నుంచి నల్లసముద్రంలోకి దారి తీసే రెండు జలసంధులలోకి నాటో యుద్ధ నౌకలను అనుమతించటం లేదు.వాటికి రెండువైపులా టర్కీ ఉంది. నాటో తన బలగాలను విస్తరించుకొనేందుకు నల్లసముద్రంలో అమర్చిన మందుపాతరలను వెలికి తీసే పేరుతో రుమేనియా రూపంలో ముందుకు వస్తున్నదని చెబుతున్నారు. నాటోతో నిమిత్తం లేకుండా రుమేనియాతో పాటు టర్కీ, బల్గేరియా ఒక ఒప్పందం చేసుకొని మందుపాతరలను తొలగించేందుకు పూనుకున్నాయి.అమెరికా, ఐరోపా దేశాల ఎత్తుగడలను పసిగట్టిన వ్లదిమిర్‌ పుతిన్‌ నల్లసముద్ర తటస్థ జలాల మీద కాపలా కాసేందుకు హైపర్‌సోనిక్‌ క్షిపణులతో కూడిన జట్‌ విమానాలను మోహరించాలని అక్టోబరు నెలలో ఆదేశించాడు. సూయజ్‌ కాలువ ద్వారా కంటే తక్కువ దూరం ఉండే జలమార్గం కాస్పియన్‌ సముద్రం నుంచి ఉంది.దాన్ని పూర్తిగా వినియోగించుకొనేందుకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇరాన్‌, పర్షియన్‌ గల్ఫ్‌,మధ్య ఆసియా దేశాలు, పాకిస్థాన్‌, భారత్‌కు ఈ మార్గం నుంచి చేరటం దగ్గర అవుతుంది. ఈ సముద్ర తీరంలో ఉన్న తన నౌకాశ్రయాల నుంచి రవాణాను పెంచేందుకు రష్యా పూనుకుంది. ఇటీవల చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇరాన్‌లో 162కిలోమీటర్ల రైలు మార్గాన్ని రష్యా నిర్మిస్తుంది.పసిఫిక్‌ ప్రాంత దేశాలతో రష్యా సరకు రవాణా 5.7శాతం పెరిగింది.రష్యా దూరప్రాచ్య రేవుల నుంచి ఇది జరిగింది. గతేడాది సెప్టెంబరులో చైనాలోని క్వాంగ్‌ఝౌ నుంచి రష్యా వ్లాడీవోస్టాక్‌ వరకు ఒక నౌకా మార్గాన్ని ప్రారంభించాయి. దీన్ని ఐస్‌ సిల్క్‌ రోడ్‌ అని పిలుస్తున్నారు. యూరేసియా ప్రాంతంతో మరింత సన్నిహితం కావటానికి ఇది తోడ్పడుతుందని భావిస్తున్నారు.వ్లాడీవోస్టాక్‌ నుంచి ఆర్కిటిక్‌ ప్రాంతంలోని వివిధ రేవులకు ఈ మార్గాన్ని చైనా పొడిగించవచ్చని వార్తలు.


ఉక్రెయిన్‌ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో అంతకాలం రష్యా మీద ఆంక్షలు కొనసాగుతాయి. వాటిని తప్పించుకొని గ్రీస్‌ ఓడలు ఇరాన్‌, రష్యా చమురు రవాణా చేయటాన్ని గ్రహించిన అమెరికా యజమానులను బెదిరించింది. దాంతో ఆ తలనొప్పి ఎందుకు అంటూ ఓడలు, టాంకర్లను అమ్ముకొని లాభాలు పొందుతున్నట్లు తేలింది.టాంకర్లకు డిమాండ్‌ పెరిగింది. గడచిన పన్నెండు నెలల్లో నాలుగు వందల కోట్ల డాలర్ల విలువగల 125 చమురు టాంకర్లు, నౌకలను విక్రయించారు. అయితే వాటిని కొన్నవారి పేర్లు వెల్లడికాకుండా జాగ్రత్తపడుతున్నారు. ఎక్కువ భాగం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన వారు కొనుగోలు చేసినట్లు తేలింది. తరువాత చైనా, టర్కీ, భారత్‌ ఉన్నాయి. తమ మనుగడకే ముప్పు తెచ్చిన నాటో కూటమిని ఎదుర్కొనేందుకు రష్యా కూడా దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యూహాలను రూపొందించుకోవటం అనివార్యం.మిలిటరీ రీత్యా ఆయుధనవీకరణ ఒకటైతే ఐరోపాతో దెబ్బతిన్న వాణిజ్యం, ఎగుమతులకు ప్రత్యామ్నాయ ప్రాంతాలను చూసుకోవటం తప్పనిసరి.ఆర్థికంగా చైనా పెద్ద మద్దతుదారుగా ఉంది. మనదేశం దీర్ఘకాలంగా రష్యాతో ఉన్న మిలిటరీ, ఆర్థిక సంబంధాలను కొనసాగించక తప్పని స్థితి.