Tags
Gaza Deaths, Israel Attack 2023, Israel genocide, Israel-Hamas war, Joe Biden, UNSC Failures, US Veto
ఎం కోటేశ్వరరావు
శుక్రవారం నాడు అనుకున్నట్లే జరిగింది. వర్తమాన మానవాళి చరిత్రలో మరోదారుణ మారణకాండ, గాజాలో మొత్తం పాలస్తీనియన్లనే లేకుండా చేసే దుర్మార్గానికి పూనుకున్న ఇజ్రాయెల్‌కు మీకు అండగా నేనున్నా ముందుకుపోండి, సర్వనాశనం చేయండి అంటూ అమెరికా నిస్సిగ్గుగా ముందుకు వచ్చింది. పొద్దున లేస్తే ప్రపంచానికి మానవహక్కుల గురించి సుభాషితాలు చెప్పే అమెరికన్లు గాజాలో తక్షణమే మానవహననాన్ని నిలిపివేయాలని కోరిన భద్రతా మండలి తీర్మానాన్ని అడ్డుకున్నారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆటోనియో గుటెరస్ తనకున్న ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి ఆర్టికల్ 99 ప్రకారం చేసిన వినతినీ పెడచెవిన పెట్టింది. కాల్పులను విరమించాలంటూ అరబ్ దేశాల బృందం తరఫున యుఏయి ప్రతిపాదించిన తీర్మానాన్ని అమెరికా వీటో అధికారంతో తోసిపుచ్చింది.పదిహేను మంది సభ్యులుండే మండలిలో మిగిలిన 14 మందిలో పదమూడు మంది మద్దతు ప్రకటించారు. అమెరికా అడుగులకు మడుగులొత్తే బ్రిటన్ ఓటింగ్‌కు దూరంగా ఉండి నేనూ మీ వైపే ఉన్నానంటూ ఇజ్రాయెల్‌కు మద్దతు పలికింది. దారుణాన్ని నివారించేందుకు సమయం ఆసన్నమైందంటూ చరిత్ర, ప్రపంచ నేత్రాలు చూస్తున్నట్లు అంతకు ముందు గుటెరస్ అన్నాడు. గాజాలో 339 విద్యా సంస్థలు, 26 ఆసుపత్రులు, 56 ఆరోగ్యకేంద్రాలు, 88 మసీదులు, మూడు చర్చ్‌లను కూల్చివేశారు. అరవైశాతం గృహాలను నాశనం చేశారు, 85శాతం జనాభాను ఇళ్ల నుంచి తరమివేశారు, వేలాది మంది ప్రాణాలు తీశారని చెప్పాడు. ఎక్కడా రక్షణ లేదన్నాడు. శనివారం ఉదయానికి అందిన సమాచారం ప్రకారం మరణాల సంఖ్య 17,487కు పెరిగింది. తీర్మానాన్ని అడ్డుకోవద్దంటూ చివరి ప్రయత్నంగా సౌదీ విదేశాంగ మంత్రి ఫర్హాన్ అమెరికా విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్‌న్ను కోరినప్పటికీ వినిపించుకోలేదు. గాజాలో జాతి నిర్మూలన లక్ష్యంగా ఇజ్రాయెల్ ఉందనే వాస్తవం తెలియదని నటించేందుకు మనం ఇక్కడున్నామా అని ఐరాసలో పాలస్తీనా శాశ్వత ప్రతినిధి రియాద్ మన్సూర్ సభ్యులను అడిగాడు. దాడులను విరమిస్తే మరో యుద్ధానికి విత్తులు చల్లినట్లే అవుతుందని అంతకు ముందు అమెరికా ప్రతినిధి రాబర్ట్ ఉడ్ చెప్పాడు. రెండు దేశాలు ఏర్పడాలని అసలు హమస్ కోరుకోవటం లేదని ఆరోపించాడు. ఆర్టికల్ 99ని ప్రయోగించటం ద్వారా గుటెరస్ పక్షపాతంగా వున్నట్లు తేలిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. వందకు పైగా దేశాలు యుఏయి తీర్మాన సహప్రతిపాదకులుగా ఉన్నాయి. వారిలో ఒకటైన చైనా ప్రతినిధి ఝాంగ్ జున్ మాట్లాడుతూ మాటలకందని మానవ విషాదమిది, ఒక్క క్షణం ఆలస్యం చేసినా మరిన్ని మరణాలు సంభవిస్తాయి, ప్రస్తుత తరుణంలో కాల్పుల విరమణ తప్ప మరొక మార్గం లేదన్నాడు.
గాజాలో జరుగుతున్న దారణాలను జరుపుతున్నది ఇజ్రాయెల్ అయితే దాని వెనుక సూత్రధారి అసలైన యుద్ధ నేరస్తురాలు అమెరికా అన్నది స్పష్టం. గాజాలో జరుగుతున్న అత్యాచారాలకు ఇజ్రాయెల్ బాధ్యురాలు కాగా దానికి ఆయుధాలు అందిస్తున్నది, దౌత్యపరమైన రక్షణ కవచాన్ని కల్పిస్తూ యుద్ధ నేరాల్లో అమెరికా భాగస్వామి అవుతున్నదని, రెండు దేశాలూ కలసి పాలస్తీనియన్లను శిక్షిస్తున్నాయని మానవహక్కుల నిఘా సంస్థ ప్రకటించింది. భద్రతా మండలిలో అమెరికా వీటో తరువాత ఈ ప్రకటన వెలువడింది. గాజా పౌరుల మీద దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ టాంకులకు అవసరమైన 45వేల ప్రాణాంతక మందుగుండ్లను విక్రయించేందుకు అనుమతించాలని జో బైడెన్ యంత్రాంగం పార్లమెంటును కోరింది. ఒక జర్నలిస్టుతో సహా అనేక మంది పురుషులను డ్రాయర్లతో తిప్పుతూ వారంతా హమస్ తీవ్రవాదులంటూ తీసిన చిత్రాలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా మానవతాపూర్వక, వైద్య సాయం అందించే బృందాలను అనుమతించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇజ్రాయెల్‌ను కోరింది. గాజాలో ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన తరువాత తొలిసారిగా శుక్రవారం నాడు ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం మీద రాకెట్ల దాడి జరిగింది. అమెరికా అందించిన మారణాయుధాలతో ఇజ్రాయెల్ జరిపిన రెండు వైమానికదాడుల్లో డజన్లకొద్దీ పౌరులు మరణించినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొన్నది. రెండు చోట్లా ఇటీవలే అమెరికా సరఫరా చేసిన బోయింగ్ తయారీ ఆయుధాల కిట్లు కనిపించాయి. మరోవైపు పౌరుల ప్రాణాలను కాపాడాలంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఇజ్రాయెల్‌కు సుభాషితాలు వినిపించారు.డెబ్బయి శాతం పిల్లలు, మహిళలతో సహా 17వేల మంది మరణించిన తరువాత ఈ కబుర్లు చెప్పారు. మేం చెప్పేది చెబుతాం మీపని మీరు కానివ్వండి అన్నట్లుగా అమెరికా నేతల తీరుతెన్నులు ఉన్నాయి. ఇజ్రాయెల్-హమస్ చర్యల్లో ఉన్న యుద్ధ నేరాలను విచారించటం తమ ప్రాధాన్యత అని అంతర్జాతీయ నేర కోర్టు ప్రధాన ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ చెప్పాడు. అయితే ఈ కోర్టు అధికారాన్ని అమెరికా గుర్తించటం లేదు. ఇజ్రాయెల్ మీద విచారణ తూతూ మంత్రంగా ఉందని పాలస్తీనా అధికారులు, బాధితులు, న్యాయనిపుణులు విమర్శించారు. ముందుగా ఇజ్రాయెల్‌ను సందర్శించిన తరువాత పశ్చిమ గట్టు ప్రాంతంలో కరీమ్ ఖాన్ విచారణ జరిపాడు. కేవలం పదినిమిషాల్లో బాధితులు చెప్పదలచుకున్నదానిని ముగించాలని కోరటంతో వచ్చిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు గంటసేపు విన్నారు. ఆ గంటలో ఆలకించిన తీరు చూసిన తరువాత ద్వంద్వ ప్రమాణాలు పాటించినట్లు, కేవలం హమస్ చేసిందాన్ని గురించి విచారించటానికే వచ్చినట్లుంది తప్ప ఇజ్రాయెల్ రెండు నెలలుగా చేస్తున్న తీవ్ర దాడులు పెద్దగా పట్టినట్లు లేదని బాధితులు విమర్శించారు. ఆసుపత్రులు, శరణార్ధి శిబిరాలు, ఐరాస కేంద్రాల మీద దాడులతో సహా తాము చేస్తున్నవన్నీ చట్టబద్దమే అని ఇజ్రాయెల్ బుకాయిస్తున్నది. వాటిని హమస్ మానవ కవచాలుగా మార్చుకున్నందున దాడులు చేయకతప్పదని అంటున్నది.
ఇజ్రాయెల్ చెబుతున్న కథలన్నింటినీ నిజమే అని అమెరికా సమర్ధిస్తున్నది. ఇజ్రాయెల్ చేస్తున్నది కార్పెట్ బాంబింగ్(ఒక్క అంగుళాన్ని కూడా వదల కుండా నాశనం చేయటం) కాదని, అది వేరే అని అధ్యక్షుడు జో బైడెన్ చెబుతున్నాడు. ఆసుపత్రుల మీద దాడులు చేసినపుడు ఇజ్రాయెల్ వైద్యులు,అంబులెన్సులను కూడా తమతో పాటు తీసుకువచ్చిందని తమకు సమాచారం ఉందన్నాడు. అయినా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నాం గదా అన్నాడు. తాము దాడులు చేస్తున్న ప్రాంతాల నుంచి వెళ్లిపోవాలని జనానికి చెబుతున్నందున ఇజ్రాయెల్ వారి మీద దాడులు చేస్తున్నట్లు ఎలా అవుతుందని అమెరికా భద్రతా సలహాదారు జేక్ సులివాన్ వాదిస్తున్నాడు. ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని పౌరులకు పరిమితహాని కలిగే విధంగా ఒక సార్వభౌమత్వదేశం ముందుకు పోవద్దని ఎలా చెబుతారని ఎదురు ప్రశ్నించాడు. యుద్ధంలో రెండు పక్షాలూ చట్టాలను ఉల్లంఘిస్తాయి అని అమెరికా గూఢచార శాఖలో మానవ హక్కుల డైరెక్టర్‌గా పనిచేసిన అలైస్ బోర్నీ చెప్పింది. ఒకవైపు పౌరుల మరణాలు పెరుగుతుండగా మరోవైపు దాడులు కొనసాగుతున్నకొద్దీ అమెరికా మద్దతు తగ్గిపోతుందేమోనని ఇజ్రాయెల్ ఆందోళన చెందుతున్నట్లు మాజీ భద్రతా సలహాదారు హులాటా చెప్పాడు. మా మద్దతు ఇక ఉండదు అని అమెరికా చెప్పే తరుణం రావచ్చు అన్నాడు. అమెరికా ఎన్నికలు దగ్గరపడే కొద్దీ సహజంగానే బైడెన్ మీద వత్తిడి పెరుగుతుంది.
శరణార్ధి శిబిరాల్లో ఖాళీలేకపోవటంతో రహదారులు, ఖాళీ ప్రదేశాల్లో పాలస్తీనియన్లు ఉంటున్నారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం జనాన్ని ఖాళీ చేయించినపుడు మరోచోట వారికి తగినన్ని ఏర్పాట్లు చేయాలని గాజాలో ఎక్కడా అలాంటి ఆనవాళ్లు లేవని ఐరాస బాలల నిధి ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ చెప్పటం మానవతాపూర్వక సాయం అందిస్తున్నట్లు పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రచారం బండారాన్ని వెల్లడించింది. ఇరవై మూడులక్షల మంది పౌరుల్లో 19లక్షల మంది నెలవులు తప్పారు, పదిలక్షల మంది ఐరాస శిబిరాల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. భవిష్యత్‌లో తమ మీద దాడులు జరగకుండా గాజా ప్రాంతాన్ని మిలిటరీ రహితంగా ఉంచాలన్న ఇజ్రాయెల్ ప్రతిపాదనను అమెరికా కూడా వ్యతిరేకించింది. అది పాలస్తీనా ప్రాంతంగా ఉండాల్సిందేనని పేర్కొన్నది.గాజా ఎలా ఉండాలన్నది అక్కడి పౌరులు నిర్ణయించాలని టర్కీ పేర్కొన్నది. ఇజ్రాయెల్ మారణకాండ ప్రారంభమైనప్పటి నుంచి ఎమెన్‌లోని హౌతీ సాయుధశక్తులు అడపాతడపా ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్, దానికి మద్దతు ఇస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాల నౌకల మీద దాడులు చేస్తున్నాయి. లక్షల మంది సాయుధులతో పాటు దాని దగ్గర నౌకా దళం నుంచి ప్రయోగించే ఖండాంతర క్షిపణులు, సాయుధ డ్రోన్లు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడులను ఆపివేయించేందుకు అమెరికా మీద వత్తిడి తేవటమే ఈ దాడుల లక్ష్యం.
ఇప్పటి వరకు అమెరికా పాటించిన సంయమనాన్ని ముందు కూడా కొనసాగించాలని తాజాగా సౌదీ అరేబియా కోరింది. ఈ దాడుల వెనుక ఇరాన్ హస్తం ఉందని అమెరికా ఆరోపిస్తూ కవ్విస్తున్నది.ఇటీవలి కాలంలో ఇరాన్‌తో సయోధ్య కుదుర్చుకున్న సౌదీ ఇజ్రాయెల్ దాడులను ఆటవిక చర్యలంటూ ఖండిస్తున్న సంగతి తెలిసిందే. అంతకు ముందే అమెరికా కుట్రలో భాగంగా ఇదే సౌదీ తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు హౌతీ తిరుగుబాటుదార్లను అణచేందుకు విఫల యత్నం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారితో నేరుగా చర్చలు జరుపుతూ శాంతి క్రమం ముందుకు పోవాలని కోరుకుంటున్నది. ఎమెన్ పౌరులు,అరబ్బు. ఇస్లామిక్ దేశాల్లో స్వేచ్చను కోరుకొనే జనాల ఆకాంక్షల మేరకు పాలస్తీనియన్లకు మద్దతుగానే తాము దాడులు చేస్తున్నట్లు ఎమెన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న శక్తులు ప్రకటించాయి. దాడులను విరమించే వరకు కొనసాగిస్తామని కూడా స్పష్టం చేశాయి. వారు ప్రయోగిస్తున్న క్షిపణులు సౌదీ గగనతలం నుంచే వెళుతున్నందున అమెరికా ప్రతిదాడులకు పూనుకుంటే మధ్యలో సౌదీ ఇరుక్కుపోయే అవకాశం ఉంది. అందువలన వివాదం మరింత ముదరకుండా చూసుకొనేందుకే సంయమనం పాటించాలని కోరిందన్నది స్పష్టం.ఎర్ర సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు తిష్టవేసి ఆ ప్రాంత దేశాల మీద బెదిరింపులకు దిగిన అంశం ఎరిగినదే. హమస్ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవటం లేదంటూ ఇజ్రాయెలీలు నెతన్యాహు ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్నారు.
