Tags
'Praising' Godse, BJP, Hindu Fundamentalism, HINDU MAHASABHA, hindutva, Mahatma Gandhi, Nathuram Godse, NIT Calicut, RSS, Sanatana
ఎం కోటేశ్వరరావు
ఆమె ఒక ప్రతిష్టాత్మక జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్), కాలికట్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ ప్రొఫెసర్, పేరు డాక్టర్ ఏ షాయిజా.” భారత్‌ను రక్షించినందుకు గాడ్సేను చూసి గర్విస్తున్నా ” అని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టి ఇప్పుడు పోలీసు కేసులను ఎదుర్కొంటున్నారు. జనవరి 30వ తేదీన మహాత్ముడి వర్ధంతి. ఆరోజు బిజెపి ఫేస్‌బుక్ ఖాతాలో ఒక న్యాయవాది ” హిందూమహాసభ కార్యకర్త నాధూరామ్ గాడ్సే భారత్‌లో ఎందరికో ఆదర్శం( హీరో )” అని పెట్టాడు. దాని మీద ” భారత్‌ను రక్షించినందుకు గాడ్సేను చూసి గర్వపడుతున్నా ” అని డాక్టర్ షాయిజా స్పందించారు. దాన్ని ఫొటో తీసి కోజికోడ్ లోక్‌సభ కాంగ్రెస్ ఎంపీ ఎంకె రాఘవన్ ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశాడు.” మహాత్మాగాంధీకి వ్యతిరేకంగా పోస్టు పెట్టటం నాకు సిగ్గుగా ఉంది.నిట్‌లో ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న వ్యక్తి గాడ్సేను పొగిడారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి ” అని ఎంపీ స్పందించారు. అది సంచలనం కావటంతో ఆమె తన పోస్టును ఫేస్‌బుక్ నుంచి తొలగించారు. అయినప్పటికీ డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యుఐ, తదితర సంస్థలకు చెందిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కొట్లాటలను ప్రేరేపించేందుకు కావాలనే రెచ్చగొట్టారన్నది నేరారోపణ. ఆమె తన చర్యను సమర్ధించుకున్నారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసింది.” నేను గాంధీని ఎందుకు చంపాను అనే గాడ్సే పుస్తకం చదివాను. గాడ్సే కూడా స్వాతంత్య్ర సమరయోధుడే. తన పుస్తకంలో ఎంతో సమాచారాన్ని వెల్లడించాడు. అది సామాన్యులకు తెలియదు. ఆ పుస్తకంలో గాడ్సే మనల్ని వివేకవంతుల్ని చేశాడు. ఈ పూర్వరంగంలో ఒక లాయర్ ఫేస్‌బుక్ పోస్టు మీద నేను స్పందించాను. జనాలు నా వ్యాఖ్యను వక్రీకరిస్తున్నారని గుర్తించిన తరువాత దాన్ని తొలగించాను” అని షాయిజా చెప్పారు. తన వ్యాఖ్య గాంధీజీ హత్యను ప్రశంసించటం కాదని కూడా ఆమె చెప్పుకున్నారు. ఆమె పోస్టు వైరల్ కాగానే సంజాయిషీ తీసుకోవాలని సంస్థ డైరెక్టర్ రిజిస్ట్రార్‌ను కోరారు.
ఆమె వయస్సు, అనుభవంలోనూ తక్కువ వారేమీ కాదు. గాడ్సే మీద మీడియాలో జరుగుతున్న అనుకూల, వ్యతిరేక చర్చలు తెలియకుండా ఉంటాయని అనుకోలేము. అన్నీ తెలిసే కావాలనే ఆమె స్పందించారన్నది స్పష్టం. దీనికి కొద్ది రోజుల క్రితం ఆమె పని చేస్తున్న సంస్థలోనే ఒక ఉదంతం జరిగింది. అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్ట సందర్భంగా సంఘపరివార్‌కు చెందిన విద్యార్ధులు ఉత్సవాన్ని చేసుకున్నారు. వ్యాషక్ ప్రేమ్‌కుమార్ అనే విద్యార్ధి(దళిత సామాజిక తరగతికి చెందిన వ్యక్తి) నిరసన తెలిపాడు. నిట్ ప్రధాన భవనం ముందు ” ఇండియా రామ రాజ్యం కాదు ” అనే నినాదం రాసి ఉన్న ఒక ప్లకార్డును పట్టుకొని ఒక్కడే ప్రదర్శన చేశాడు. సైన్స్ అండ్ స్పిరిట్యువల్ క్లబ్ పేరుతో రామాలయ ఉత్సవాన్ని నిర్వహించిన వారు ప్రేమకుమార్ మీద దాడి చేశారు. జనవరి 21వ తేదీన ఉత్సవం జరిపిన వారు దేశ చిత్రపటాన్ని కాషాయ రంగులో విల్లు, బాణం ఉన్న రాముడి బొమ్మతో చిత్రించారని, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారని, ఇది భారత మాప్‌ను అగౌరవ పరచటమే అని విద్యార్ధి వ్యవహారాల మండలి(ఎస్‌ఏసి) ఒక ప్రకటనలో పేర్కొన్నది. ప్రేమకుమార్ చేసింది ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించటంగా, విద్యాలయ ప్రాంగణంలో అశాంతిని రేకెత్తించటంగా పరిగణించి ఏడాది పాటు సంస్థ నుంచి వెలివేశారు. జరిగిన ఉదంతాన్ని వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేసిన ఎస్‌ఏసి ప్రతినిధి కైలాష్‌ను కూడా కొట్టారు. నిట్ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి చెందినవన్న సంగతి తెలిసిందే.
ప్రేమ్‌కుమార్, కైలాష్‌పై చేసిన దాడుల వెనుక శివ పాండే అనే విద్యార్ధి ఉన్నట్లు నిట్ విద్యార్ధులు చెప్పారు. అతను సంస్థలో భజరంగ్‌దళ్‌ను ఏర్పాటు చేశాడు, కొంత మంది విద్యార్ధుల మీద దాడులు చేశాడు. ఇన్ని జరిగినప్పటికీ అతని మీద ఎలాంటి క్రమశిక్షణా చర్యలు లేవు. ప్రేమకుమార్‌ను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న సమావేశంలో ఎస్‌ఏఎస్‌కు ఎలాంటి ప్రాతినిధ్యం లేదు.ప్రతినిధులుగా ఉన్న వారిని సమావేశానికి రానివ్వలేదని విద్యార్ధులు విమర్శించారు. అలాంటి వాతావరణం ఉన్న సంస్థలోనే ఫ్రొఫెసర్ షాయిజా పని చేస్తున్నారు.ఈ ఉదంతం జరిగిన తరువాతే ఆమె వివాదాస్ప వ్యాఖ్యలను ఫేస్‌బుక్‌లో చేశారు. ఆమెపై ఎస్‌ఎఫ్‌ఐ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్రొఫెసర్ చర్యను నిరసించిన మిగతా సంస్థల వారు కూడా ఆమెను బోధనా బాధ్యతల్లో కొనసాగనివ్వరాదని డిమాండ్ చేశారు. ఆమె చర్య జాతిపితను అవమానించటమే అని కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు ఖండించారు. డైరెక్టర్‌గా ఉన్న అధికారి ప్రసాద కృష్ణ కాలికట్ నిట్‌ను కాషాయీకరణ చేస్తున్నట్లు గతంలోనే విద్యార్దులు, సిబ్బంది విమర్శించారు.
హిందూ-ముస్లిం ఐక్యతను ప్రబోధించినందుకు మతోన్మాదశక్తులు గాంధీ మహాత్ముడిని తూలనాడుతున్న సంగతి తెలిసిందే.1948 జనవరి 30న నాధూరామ్ గాడ్సే గాంధీని తానెందుకు చంపిందీ కోర్టులో చెప్పిన మాటలను తరువాత పుస్తకంగా వేసి పంచుతున్నవారందరూ గాడ్సే వారసులే.చివరికి గాడ్సేకు గుడి కట్టేందుకూ చూశారంటే ఉన్మాదం ఏ స్థాయికి చేరిందో అర్ధం అవుతుంది. ఒక నాటికి గాంధీ హత్యలో నిజమైన విలువ ఏమిటో తెలుస్తుందని విచారణ సందర్భంగా గాడ్సే చెప్పాడంటే కాలికట్ నిట్ ప్రొఫెసర్ వంటి వారు రాబోయే రోజుల్లో ఇంకా తామర తంపరగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. స్వాతంత్య్ర ఉద్యమానికి సారధ్యం వహించిన మహాత్ముడిని చంపిన ఒక హంతకుడి చర్యలో దేశరక్షణను చూస్తున్న విద్యావంతులను చూసి జాతి గర్వపడాలా గర్హించాలా ? దేశం గాంధీని గుర్తుపెట్టుకున్నంత వరకు గాడ్సేను కూడా మరచిపోకూడదు. ఎందుకంటే మత సామరస్యానికి ప్రతిక గాంధీ అయితే, విద్వేషానికి, సమాజ ఐక్యత విచ్చిన్నానికి చిహ్నం గాడ్సే. గడచిన ఏడున్నరదశాబ్దాల కాలంలో గాడ్సే వారసులు పెరిగారు, గాంధీ వారసులు తగ్గారు. అందుకే చరిత్రను తిరగరాసి అసలైన దేశభక్తుడు గాడ్సే అన్నా నిజమే అని నమ్మేదిశగా మన సమాజం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.హిట్లర్ అసలైన దేశభక్తుడు అని జర్మన్లను నమ్మించిన గోబెల్స్ ప్రచారం కంటే ఎన్నోరెట్లు ఎక్కువగా ఇప్పుడు ప్రమాదకారులను, స్వాతంత్య్ర ఉద్యమంలో విద్రోహం చేసిన వారిని దేశభక్తులుగా చిత్రీకరణ జరుగుతోంది.దేశభక్తి అంటే అర్ధాన్నే మార్చివేస్తున్నారు.
” గాంధీ కారణంగానే ముస్లింలకు ప్రత్యేక దేశంగా పాకిస్థాన్ ఏర్పాటు జరిగింది. కాశ్మీరుపై దురాక్రమణకు పాల్పడిన తరువాత కూడా పాకిస్థాన్‌కు రు.55 కోట్లు ఇవ్వాలని నిరాహారదీక్ష చేయటం, గాంధీజీ సంతుష్టీకరణ విధానం కారణంగానే ముస్లింలు రెచ్చిపోతున్నారు.” ఇవీ మహాత్మా గాంధీ హత్యను సమర్ధించేవారు సాధారణంగా చెబుతున్నకారణాలు ? అందుకే గాడ్సే హత్య చేశాడని, తప్పేమిటని వాదిస్తారు.నిజానికి ఇది ఒక సాకు, వక్రీకరణ మాత్రమే. పాకిస్థాన్ ఏర్పాటుతో నిమిత్తం లేకుండానే గాంధీపై ఎన్నో సంవత్సరాల ముందే సనాతన శక్తులు హత్యాయత్నాలు జరిపాయన్న చరిత్రను మూసిపెడుతున్నారు.నిజానికి హిందూత్వ అజెండాను అమలు జరపాలని చూసిన శక్తులకు గాంధీ వైఖరి ఆటంకంగా మారింది. 1917 నుంచి 1948వరకు గాంధీ పలుసార్లు హత్యాయత్నం జరిగింది.వాటికీ దేశవిభజన,కాశ్మీరుపై దాడికి సంబంధమే లేదు. గాంధీ హత్యను సమర్ధించుకొనేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నది వాస్తవం. రెండు జాతులు, రెండు దేశాలంటూ చెప్పిన వారిలో విడి సావర్కర్ ప్రముఖుడు.1937లో అహమ్మదాబాద్‌లో జరిగిన హిందూమహాసభ సమావేశంలో ఇప్పుడున్న మాదిరి దేశం ఒకటిగా ఉండబోదని చెబుతూ హిందు-ముస్లిం దేశాలుగా ఉంటాయని చెప్పాడు.(మహారాష్ట్ర ప్రాంతీయ హిందూమహాసభ, పూనే ప్రచురించిన స్వాతంత్య్ర వీర సావర్కర్, ఆరవ భాగం పేజీ 296).అంతేకాదు, మరో సందర్భంలో మాట్లాడుతూ రెండు దేశాల సిద్దాంతంతో జిన్నాతో నాకు పేచీ లేదు. హిందువులం స్వతహాగా మనది ఒక జాతి, హిందువులు, ముస్లింలు రెండు దేశాలన్నది చారిత్రక వాస్తవం ” అన్నాడు.
” దేవుడి దయవలన ఏడు సార్లు మరణపు కోరల నుంచి తప్పించుకున్నాను. నేను ఎవరినీ ఎన్నడూ గాయపరచలేదు, నాకు ఎవరూ శత్రువులు లేరని భావిస్తాను. ఎందుకు నాపై ఇన్నిసార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయో నేను అర్ధం చేసుకోలేకపోతున్నాను. నిన్న ప్రయత్నం కూడా విఫలమైంది.నేను అంత తేలికగా మరణించను, నూట ఇరవై అయిదు సంవత్సరాలు వచ్చేదాకా జీవిస్తాను ” అని 1946 జూన్ 30న పూనాలో గాంధీ చెప్పారు. ఈ అంశాన్ని గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ రాసిన ” లెటజ్ కిల్ గాంధీ ” (గాంధీని చంపుదాం ) అనే పుస్తకంలో పేర్కొన్నారు. తొలిసారి బీహార్‌లో భూస్వాములకు వ్యతిరేకంగా 1917 ఏప్రిల్ 15చంపారాన్ సత్యాగ్రహం సందర్భంగా ఇర్విన్ అనే ఆంగ్లేయుడు హత్యకు ప్రయత్నించాడు. ఇంటికి పిలిచి పాలలో విషమిచ్చి చంపేందుకు చూశాడు. సహాయకుడు యజమాని ఆజ్ఞను పాటించినట్లు నటిస్తూనే గాంధీకి గ్లాసు ఇవ్వబోతూ ఒలకపోశాడు. అవి తాగిన పిల్లి మరణించిన తరువాత జరిగిన కుట్ర వెల్లడైంది. ఏడు ప్రయత్నాల్లో మూడు సార్లు హిందూమహాసభకు చెందిన నారాయణ ఆప్టే, నాధూరామ్ గాడ్సే ప్రయత్నించాడు.1948 జనవరి 20న బాంబుతో చంపాలని చూశారు. ఆ ఉదంతంలో మదన్‌లాల్ పహ్వా అనేవాడిని అరెస్టు చేశారు. భారతీయులు జరిపిన తొలి హత్యాయత్నం చారిత్రాత్మక హరిజన యాత్ర సందర్భంగా 1934 జూన్ 25న పూనాలో జరిగింది. టౌన్‌హాల్లో జరిగిన సభకు ముందుగా వచ్చిన కారులో గాంధీజి ఉన్నాడని భావించిన సనాతన ఉన్మాదులు బాంబు పేలుడు జరిపారు. అయితే గాంధీ కారు ఆలస్యంగా రావటంతో ప్రమాదం తప్పింది. అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించటం నచ్చని సనాతనవాదులు నాడు గాంధీని వ్యతిరేకించారు. రెండవ సారి 1944 జూలైలో మహారాష్ట్రలోని పంచాగ్నిలో జరిగింది. ఒక ప్రార్ధనా సమావేశం జరుగుతుండగా నాధూరామ్ గాడ్సే ఒక కత్తి పట్టుకొని గాంధీ వ్యతిరేక నినాదాలు చేస్తూ దూసుకు వచ్చాడు.ప్రమాదాన్ని గ్రహించిన వారు అతన్ని పట్టుకున్నారు. గాడ్సేతో పాటు వచ్చినవారు పారిపోయారు. అతన్ని వదలివేయమని గాంధీ చెప్పాడు.తనతో ఎనిమిది రోజులు గడిపి చర్చలు జరపమని కోరగా గాడ్సే తిరస్కరించాడు. అదే ఏడాది సెప్టెంబరులో జిన్నాతో చర్చలకు గాంధీ సిద్దంగావటాన్ని హిందూమహాసభ, ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకించాయి. అప్పుడు కూడా సేవాగ్రామ్‌లో గాడ్సే ఆయుధంతో వచ్చాడు. ఇతరులతో కలసి గాంధీ సేవాగ్రామ్ నుంచి బొంబాయి వెళ్లకుండా అడ్డుకోవాలని చూశాడు.అప్పుడు కూడా ఆశ్రమవాసులు పట్టుకొని నిరాయుధుడిని చేశారు.తరువాత 1946 జూన్ 29న గాంధీ ప్రయాణిస్తున్న ప్రత్యేక రైలును పడగొట్టి హత్య చేసేందుకు పట్టాలపై పెద్ద బండరాళ్లను ఉంచారు.డ్రైవరు అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది.ఐదవ సారి 1948 జనవరి 20న బిర్లా హౌస్‌లో గాంధీ ప్రార్ధన చేస్తుండగా కొద్ది మీటర్ల దూరంలో బాంబు పేలింది. చివరికి 1948 జనవరి 30న గాంధీని గాడ్సే కాల్చిచంపాడు.అందుకే ఆ రోజును మతసామరస్య దీక్షాదినంగా పాటిస్తున్నారు. మతశక్తులను సమాజం నుంచి వెలివేయటమే మహాత్ముడికి అసలైన నివాళి.
