Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


సరిహద్దు భద్రతా దళాల నుంచి 30వేల బాష్పవాయు గోళాలను రప్పించారు.
వాటిని ప్రయోగించేందుకు డ్రోన్లను సన్నద్దం చేశారు.
ఒళ్లు మంటలు పుట్టేందుకు రసాయనాలు కలిపిన నీటిని చిమ్మే ఫిరంగుల దుమ్ముదులిపారు.
చెవులు చిల్లులు పడే శబ్దాలు చేసి వినికిడి శక్తిని పోగొట్టే సోనిక్‌ ఆయుధాలను సిద్దం చేశారు.
ఎవరైనా గుర్రాల మీద వస్తే అవి జారి పడే విధంగా గ్రీజు వంటి వాటిని వెదజల్లేందుకు డ్రమ్ములతో సిద్దంగా ఉన్నారు.
రోడ్ల మీద పెద్ద గోతులు తవ్వారు. ఎక్కడబడితే అక్కడ ఇనుప మేకులు కొట్టారు.
ముళ్ల కంచెలు, వాటిని దాటుకొని వస్తే నిరోధించటానికి పెద్ద కంటెయినర్లలో మట్టి, రాళ్లు, ఇటుకలతో నింపారు.
సిమెంటు దిమ్మెల వరుసలు ఏర్పాటు చేశారు. రోడ్ల పక్కనే నిర్బంధ శిబిరాలను తయారు చేశారు.
ఇవన్నీ ఎందుకనుకుంటున్నారు ?
సరిహద్దుల్లో పాకిస్థాన్‌ లేదా చైనా, మరొక దేశం దాడి చేస్తుందనో వాటిని ఎదుర్కొందామనో కాదు.
వివిధ రాష్ట్రాల నుంచి రాజధాని ఢిల్లీకి వచ్చే రోడ్ల మీద ఈ ఏర్పాట్లు ? ఎందుకనుకుంటున్నారు ?


తమ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలను అడిగేందుకు వస్తున్న అన్నదాతలను అడ్డుకొనేందుకు !
ఇన్ని ఏర్పాట్లు చేసిన పోలీసుల బాస్‌ ఏం చెప్పారో తెలుసా ? ఒక వేళ వీటన్నింటినీ దాటుకొని రైతులు గనుక వస్తే మీరేమీ వెనుకా ముందు చూడనవసరం లేదు, ఆత్మరక్షణ గురించి ఆలోచించవద్దు అన్నారు. దీని అర్ధం వేరే చెప్పాలా ? ప్రస్తుతం అనేక ఐరోపా దేశాల్లో వేలాది మంది రైతులు రాజధానులు, ఇతర ప్రధాన పట్టణాలకు ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ వాహనాల మీద ఎలాంటి ఆటంకాలు లేకుండా వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. పోలీసులు కాపలాకాసేందుకు ఉన్నారు తప్ప అడ్డుకున్నది గానీ చేయి చేసుకున్న ఉదంతంగానీ ఒక్కటంటే ఒక్కచోట కూడా జరగలేదు. కానీ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు అని చెప్పుకుంటున్న చోట రైతులను శత్రువులుగా చూస్తున్న అపర ప్రజాస్వామిక పాలకుల తీరిది.


ఇంతకూ రైతులు చేసిన పాపం ఏమిటి ?
2011లోనే నరేంద్రమోడీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల కమిటీ చేసిన సిఫార్సులో ఒకటైన కనీస మద్దతుధరలకు చట్టబద్దత కల్పించమని కోరటం. క్షమాపణలు చెప్పి మరీ మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకంటూ కనీస మద్దతు ధరలకు చట్టబద్దతతో పాటు ఇతర సమస్యలను పరిశీలించేందుకు 2022 జూలైలో నరేంద్రమోడీ సర్కార్‌ ఏర్పాటు చేసిన కమిటీ ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నది, ఎప్పుడు నివేదిక ఇస్తారు, స్వామినాధన్‌ కమిటీ చేసిస సిఫార్సులతో సహా ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారు అని నిలదీయటమే అన్నదాతల అపరాధం. ఇప్పటికే పంజాబ్‌-హర్యానా సరిహద్దులో రైతుల వీపులు పగలగొట్టారు, జర్నలిస్టులతో సహా అనేక మంది గాయపడ్డారు. గురువారం నాడు చర్చల ప్రహసనం చోటు చేసుకుంది. ఆదివారం నాడు మరోసారి మాట్లాడతామని చెప్పారు. ఈలోగా కుట్ర సిద్దాంతాలు. వాట్సాప్‌ యూనివర్సిటీలో నరేంద్రమోడీ సర్కార్‌ను కూలదోసేందుకు అంటూ ఊదరగొట్టటం ప్రారంభించారు.హర్యానాలోని అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ నిలిపివేశారు. ఢిల్లీలో 144వ సెక్షన్‌ విధించారు. సభలు, ప్రదర్శనలకు అనుమతి లేదు.


2020-21లో సాగిన చారిత్రాత్మక రైతు ఉద్యమం తరువాత 2022 జూలై 18న కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పి ఇతర అంశాల గురించి పరిశీలనకు ఒక కమిటీని వేసింది. ఇప్పటి వరకు అదేమి చేస్తున్నదో తెలియటం లేదు గనుక మరోసారి రైతులు ఢిల్లీ చలో పిలుపు ఇచ్చారు. సాధారణంగా సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని అనేక మంది అనుకున్నారు. అదేమిటో తెలియదు గానీ మరోసారి రైతులు ఆందోళన చేస్తే అణచి వేసేందుకు పోలీసులకు కొత్త పద్దతులను నేర్పించారు.దేశ రాజధాని వద్ద చేసిన ఏర్పాట్లు బహుశా చైనా సరిహద్దులో కూడా చేసి ఉండరేమో అని కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌ వ్యాఖ్యానించారు. ” ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అంశం కూడా,దీనికి పరిష్కారం కనుగొనాలంటే వ్యవధి అవసరం. ” మరోసారి ప్రారంభమైన రైతు ఉద్యమం ముందుకు తెచ్చిన డిమాండ్ల మీద కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా ఫిబ్రవరి పదమూడున చెప్పిన మాట. గురువారం రాత్రి రైతు ప్రతినిధులతో జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాలు లేకుండా ముగిశాయి. ఆదివారం సాయంత్రం మరోసారి చర్చలు జరుపుతామని కేంద్ర మంత్రి ప్రకటించారు. స్వామినాధన్‌కు భారత రత్న అవార్డు ఇచ్చిన పెద్దలు ఆయన చేసిన సిఫార్సుల అమలు మాత్రం కుదరదంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంఎస్‌పి కమిటీలో సభ్యులుగా ఎలాంటి వారిని నియమించిందో తెలిస్తే జరిగేదేమిటో ఊహించుకోవచ్చు.


రైతుల నిరసన రాజకీయపరమైదని, హింసాకాండ వ్యాప్తి చేస్తారేమో అనే ఆందోళన కలుగుతోందని, అందుకే తాము భాగస్వాములం కావటం లేదని ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన ఎంఎస్‌పి కమిటీ సభ్యుడు ప్రమోద్‌ చౌదరి ఆరోపించారు.ఈ పెద్ద మనిషి ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన భారతీయ కిసాన్‌ సంఫ్‌ు నేత గనుక ఇంతకంటే ఏం మాట్లాడతారు ! మరో కమిటీ సభ్యుడి పేరు వినోద్‌ ఆనంద్‌. ఆందోళన చేస్తున్న వారిని గూండా రైతులని వర్ణించిన ఘనుడు.వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ (ప్రపంచ సహకార ఆర్థికవేదిక ) కార్యనిర్వాహక అధ్యక్షుడు. అసలు ఈ సంస్థ గురించి రైతులు ఎప్పుడైనా విన్నారా ? ” దేశ ఆర్థిక పురోగతికి, రైతుల సంక్షేమానికి కనీస మద్దతుధరలకు చట్టబద్దత కల్పించటమే ఏకైక పరిష్కారం అయితే ఆ పని చేసేందుకు చేయాల్సిందంతా చేస్తాము. ఎంఎస్‌పికి గతంలో ఎప్పుడు చట్టబద్దత ఉంది. దాని గురించి ప్రధాని ఎన్నడూ చెప్పలేదు.వీరంతా గూండా రైతులు, రాజకీయంగా ఉత్తేజం పొందిన కొద్ది మంది…ఒక రాష్ట్రానికి చెందిన వారు తమ రాజకీయ ప్రత్యర్ధుల మీదకు రైతులను ఈ విధంగా ఉపయోగిస్తున్నారు.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత గురించి ఎన్నడూ చెప్పలేదు. 2075వరకు పనికి వచ్చే విధంగా ఉండే వ్యవసాయ విధానాలను మనం రూపొందించుకోవాల్సి ఉంది, తద్వారా ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. కనీస మద్దతు ధర ఒక సంక్లిష్టమైన అంశం.వారు(రైతులు) ముందుకు వచ్చి మాతో కూర్చొని చర్చించాలి.వారి ప్రశ్నలన్నింటికీ నేను సమాధానం చెప్పలేకపోతే కమిటీ నుంచి రాజీనామా చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇదంతా ఒక నాటకం, పక్కదారి పట్టించేందుకు, దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు చేస్తున్న వ్యవహారం ” అని వినోద్‌ ఆనంద్‌ అన్నట్లు ఎఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొన్నది.


ఉత్తరాది రాష్ట్రాల శ్వాస నిలిపివేసేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారని, తమ రాష్ట్రంలో భయ వాతావరణం ఏర్పడిందని హర్యానా ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొన్నది. పరిష్కారం తేలేవరకు ఆందోళన కానసాగుతుందని రైతు సంఘాలు వెల్లడించాయి. నరేంద్రమోడీ సర్కార్‌ను దించేందుకే రైతులు మరోసారి వీధుల్లోకి వచ్చారని ఆరోపిస్తున్నారు. అంటే మోడీ సర్కార్‌ మీద తిరుగుబాటు చేస్తున్నట్లు చిత్రించటమే. అదే రైతుల అజెండా అయితే నిరాయుధులుగా ఎందుకు వస్తారు.తాము ప్రయాణిస్తున్న ట్రాక్టర్లలో గతంలోగానీ ఇప్పుడు గానీ ఆహార పదార్దాలు తప్ప ఎలాంటి మారణాయుధాలు లేవే. ఢిల్లీ చలో అన్న నినాదంతో గతంలో సాగిన ఉద్యమానికి ఇచ్చిన పిలుపుకు మూడు సంవత్సరాలు నిండిన సందర్భంగా 2023 నవంబరు 26 నుంచి 28వరకు చండీఘర్‌లో నిరసన తెలపాలని పంజాబ్‌ రైతులు పిలుపు నిచ్చారు. దాని కొనసాగింపే తాజా ఢిల్లీ చలో నిరసన. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు ? మంత్రి మాటలను బట్టి ఏదో విధంగా కాలయాపన చేసి ఆందోళనను అణచివేసేందుకు లేదా మరో విధంగా ముగించేందుకు కేంద్రం చూస్తున్నట్లు కనిపిస్తోంది. నవంబరులోనే కేంద్రం ఎందుకు చర్చలు జరపలేదు ?

పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లోని రైతులే ఎందుకు ఆందోళన చేస్తున్నారంటూ కొందరు ఉద్యమాన్ని తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నారు. నిద్రపోతున్నవారిని లేపగలం గానీ నటిస్తున్నవారిని లేపటం కష్టం. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేదు. పండిన పంటలో స్థానిక వినియోగం పోను మిగిలిన దాన్ని మార్కెట్‌ మిగులుగా పరిగణిస్తారు.2005లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఒక నివేదిక ప్రకారం దేశవ్యాపిత సగటు 55.46శాతం మార్కెట్‌ మిగులు ఉంది. ఇది ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో పంజాబ్‌ 94.43,హర్యానా 90,11,రాజస్థాన్‌లో 90శాతం ఉంది. ఉత్తర ప్రదేశ్‌ మొత్తంగా చూసినపుడు 49.18శాతమే ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలు పంజాబ్‌, హర్యానా మాదిరిగా ఉంటాయి. స్వల్ప మార్పులు తప్ప ఇప్పటికీ అదే పరిస్థితి. అందుకే మార్కెటింగ్‌, గిట్టుబాటు ధర సమస్య వచ్చినపుడల్లా ఈ ప్రాంతాల రైతులే వెంటనే స్పందించటం ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. అందుకే గతంలోనూ, ఇప్పుడూ ఈ ప్రాంతాల వారే ముందుకు వస్తున్నారు. ఆ సమస్య పెద్దగా లేని రాష్ట్రాల రైతుల్లో పెద్దగా స్పందన ఉండదు. హిమచల్‌ ప్రదేశ్‌, కాశ్మీరులో ఆపిల్‌ రైతులు, కొబ్బరి ధర పడిపోతే కేరళ, ఇతర కొన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతాల రైతులే స్పందిస్తారు. వర్జీనియా పొగాకు ధర పడిపోతే ఆంధ్రప్రదేశ్‌లో దాన్ని సాగు చేసే ప్రాంతాల్లో రైతులే రోడ్ల మీదకు వస్తారు, మిగతా రైతులు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తే అర్ధం లేదు.


ఇంతకీ రైతులు కోరుతున్నదేమిటి ? స్వామినాధన్‌ కమిటీ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలి. రైతుల రుణాలను పూర్తిగా రద్దు చేయాలి.రైతులు, వ్యవసాయ కార్మికులకు పెన్షన్‌ పధకాన్ని వర్తింప చేయాలి.విద్యుత్‌ సవరణ బిల్లు 2020ని రద్దు చేయాలి.భూసేకరణ చట్టం 2013ను తిరిగి తేవాలి. దాని ప్రకారం భూసేకరణకు రైతుల ఆమోదం తీసుకోవాలి, జిల్లా కలెక్టర్‌ నిర్ణయించిన ధరకు నాలుగు రెట్ల పరిహారం ఇవ్వాలి.ఉత్తర ప్రదేశ్‌ లఖింపూర్‌ ఖేరీలో హత్యకు గురైన రైతులకు న్యాయం జరగాలి.దోషులను శిక్షించాలి. గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం ఏడాదికి రెండువందల రోజులు పని కల్పించాలి, వ్యవసాయానికి అనుబంధం చేయాలి.2021 ఉద్యమం సందర్భంగా మరణించిన కుటుంబాల వారికి పరిహారంతో పాటు కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం కల్పించాలి. ఇవి కేవలం పంజాబ్‌, హర్యానా రైతుల డిమాండ్లేనా, మిగతా ప్రాంతాల రైతులు కోరటం లేదా ? ఆందోళనను పక్కదారి పట్టించి నిందలు వేస్తున్నవారిని ఎక్కడికక్కడ రైతాంగం నిలదీసే రోజులు రానున్నాయి.