Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


పదేండ్లుగా దేశంలో ఎదురులేని అధికారాన్ని, మెజారిటీ రాష్ట్రాలలో పాలన సాగిస్తున్న బిజెపి అధికార కక్కుర్తి ఎలా ఉందో కేంద్ర పాలిత ప్రాంతమైన చండీఘర్‌ మేయర్‌ ఎన్నిక రుజువు చేసింది. లోక్‌సభ ఎన్నికల ముందు దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బిజెపి చెంప చెళ్లుమనే తీర్పు ఇచ్చింది. మరోసారి ఎన్నిక జరపాల్సిన అవసరం లేదని జనవరి 30న జరిగిన అక్రమాన్ని సరిదిద్ది ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్ధి కులదీప్‌ కుమార్‌ గెలిచినట్లు ప్రకటించింది. రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించిన బిజెపి నేత అనిల్‌ మాసి మీద చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ నేత్రత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్‌ ఇచ్చిన తీర్పు నిజంగా బిజెపికి చెప్పుకోలేని చోట తగిలిన దెబ్బగా మారింది. జనవరి 30న జరిగిన ఎన్నికలో ఆప్‌ అభ్యర్ధికి పడిన ఎనిమిది ఓట్లు చెల్లనివిగా పరిగణించి బిజెపి అభ్యర్ధి గెలిచినట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. ఎనిమిది ఓట్లను చెల్లకుండా చూసేందుకు అనిల్‌ మాసి కావాలనే ప్రయత్నించినట్లు కోర్టు పేర్కొన్నది. సోమవారం నాడు కోర్టులో సాక్ష్యం చెప్పిన ఈ పెద్దమనిషి ఎనిమిది బాలట్‌ పత్రాలు చెడిపోయినట్లు ప్రకటించారు.రికార్డుల్లో అలాంటిదేమీ లేదని కోర్టులో తప్పుడు ప్రకటన చేసినట్లు సుప్రీం కోర్టు పేర్కొన్నది. కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది.అనిల్‌ మాసి ఎనిమిది బాలట్‌ పత్రాలపై టిక్కులు పెట్టినట్లు సిసిటీవీలో రికార్డైంది. సంతలో పశువులను కొన్నట్లు మేయర్‌ ఎన్నిక జరిగిందని కోర్టు పేర్కొన్నది. అంతకు ముందు పంజాబ్‌-హర్యానా హైకోర్టులో ఎన్నికను సవాలు చేయగా ఫలితాన్ని నిలిపివేసేందుకు తిరస్కరించింది. సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించిన తేదీకి ఒక రోజు ముందు ఆదివారం నాడు గతంలో ఎన్నికైనట్లు ప్రకటించిన మనోజ్‌ సోంకర్‌ మేయర్‌ పదవికి రాజీనామా చేశారు. అదే రోజు రాత్రి ఆమ్‌ ఆద్మీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లను ఢిల్లీలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తాడే పార్టీలో చేర్చుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ పని తీరును చూసి ఉత్తేజం పొందామని, తమ వార్డుల అభివృద్ది కోసం బిజెపిలో చేరినట్లు వారు ప్రకటించారు. 2026లో తిరిగి కార్పొరేషన్‌ ఎన్నికలు జరుగుతాయి.


పది లక్షలకు పైగా జనాభా, ఆరులక్షల 30వేల మంది ఓటర్లున్న చండీఘర్‌లో 35 కౌన్సిలర్ల స్థానాలు ఉన్నాయి. వీరు గాక వివిధ రంగాలకు చెందిన పది మందిని ఓటింగ్‌ హక్కులేని కౌన్సిలర్లుగా నియమిస్తారు. వారిలో ఒకరు మేయర్‌ ఎన్నికలో రిటర్నింగ్‌ అధికారిగా ఉంటారు. అనిల్‌ మాసి బిజెపి మైనారిటీ మోర్చానేతగా ఎప్పటి నుంచో ఉన్నారు.2021 డిసెంబరు 24న 35 స్థానాలకు కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగాయి. ఏడాదికి ఒక సారి మేయర్‌ ఎన్నిక జరుగుతుంది. ఐదేండ్ల పదవీ కాలంలో తొలి, నాలుగవ సంవత్సరం మేయర్‌ పదవిని మహిళలకు రిజర్వు చేశారు. తొలిసారిగా పోటీ చేసిన ఆమ్‌ ఆద్మీ 14 సీట్లతో పెద్దపార్టీగా ఉంది.బిజెపికి పన్నెండు, కాంగ్రెస్‌కు ఎనిమిది, అకాలీదళ్‌కు ఒకటి చొప్పున వచ్చాయి. తొలి మేయర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, అకాలీదళ్‌ పాల్గొనలేదు.ఒక కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ ఫిరాయించి బిజెపిలో చేరాడు. ఎంపీ ఓటుతో కలిపి బిజెపికి 14 రాగా, ఆమ్‌ ఆద్మీకి 14 రాగా ఆమ్‌ ఆద్మీకి వచ్చిన ఒక ఓటు మీద టిక్కు పెట్టి అది చెల్లదంటూ బిజెపి గెలిచినట్లు ప్రకటించారు. బిజెపికి వచ్చిన ఓట్లలో ఒకటి చినిగినప్పటికీ దాన్ని ఆమోదించారు. ఆ ఎన్నికను సవాలు చేస్తూ అప్పుడు కూడా కోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోయింది.ఈఎన్నికల్లో పార్టీల వారీగా కాంగ్రెస్‌కు 29.79, బిజెపికి 29.30, ఆమ్‌ ఆద్మీకి 27.08శాతం చొప్పున ఓట్లు వచ్చాయి.తాజాగా జరిగిన మేయర్‌ ఎన్నికలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చింది. దీంతో బిజెపి ఓటమి ఖాయంగా మారటంతో రిటర్నింగ్‌ అధికారి అక్రమానికి తెరతీశారు. అనిల్‌ మాసి 2015 నుంచి బిజెపిలో చురుకుగా పని చేస్తున్నారు.2022లో కౌన్సిలర్‌గా నామినేట్‌ అయ్యారు. అంతకు ముందు మైనారిటీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఇతగాడు వివాదాలకు కొత్త కాదు. ఒక కమిటీ సమావేశంలో విశ్వాసానికి వ్యతిరేకంగా మాట్లాటమే గాక నోరుపారవేసుకోవటంతో రెండు సంవత్సరాల పాటు చర్చ్‌ కార్యకలాపాల్లో పొల్గొనకుండా చర్చ్‌ ఆఫ్‌ నార్త్‌ ఇండియా(సిఎన్‌ఐ) 2018లో ఆంక్షలు విధించింది. రెండు సంవత్సరాల తరువాత వాటిని ఎత్తివేశారు. ఎక్కడా కుదురుగా పని చేయని అనిల్‌ రాజకీయాల్లో పూర్తిగా నిమగమయ్యారు.


తమ వారు ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడరని, సాదా సీదాగా గడుపుతారని బిజెపి చెప్పుకోవటం తెలిసిందే.అక్రమంగా గెలిచిన మహిళా బిజెపి మేయర్‌ సర్వజిత్‌ కౌర్‌ కూడా అలాంటి కబుర్లే చెప్పారు. తరువాత ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సంపాదించిన రికార్డుల్లో ఉన్న వివరాల ప్రకారం ఆమె ఏడాది పదవీ కాలం చివరిలో పది రోజుల ముందుగా రు.1,50,306 విలువగల ఆపిల్‌ ఐ ఫోన్‌, రు.75వేల విలువ గల ఆపిల్‌ మాక్‌బుక్‌ను స్వంతానికి కొనుగోలు చేశారు. అక్కడి నిబంధనల ప్రకారం ఎంత మొత్తం అనేదానితో నిమిత్తం లేకుండా మేయర్లుగా ఉన్నవారు ఫోన్‌, లాప్‌టాప్‌ కొనుక్కోవచ్చు. అదే కౌన్సిలర్లకు గరిష్ట పరిమితి నలభై వేలు మాత్రమే ఉంది. పదవీ కాలం చివరిలో కొనుగోలు గురించి అడగ్గా మేయర్‌ భర్త జగతార్‌ జగ్గా సమాధానమిస్తూ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది, ఒక వేళ తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు అని అందరూ అడుగుతారు, అందుకని తామూ తీసుకున్నామని చెప్పారు.గతంలో కొందరు మేయర్‌గానూ, కౌన్సిలర్‌గా రెండు ఫోన్లు తీసుకున్నవారున్నారని, తన భార్య ఒకటే తీసుకున్నట్లు సమర్దించుకున్నారు.అంతకు ముందు కౌన్సిలర్‌గా ఉన్న అతను కూడా 2017లో ఒక ఐఫోన్‌ తీసుకున్నారు. 2016 ఎన్నికల్లో బిజెపి మెజారిటీ కౌన్సిలర్లు ఉన్నారు. అప్పుడు మేయర్లుగా పని చేసిన వారందరూ ఇలా ప్రజల సొమ్ముతో ఖరీదైన సెల్‌ ఫోన్లు కొన్నారు. పదవి నుంచి దిగిపోయే ముందు ఏడాదికి 20శాతం చొప్పున వెలలో తగ్గించి మిగతా సొమ్మును కార్పొరేషన్‌కు చెల్లించాల్సి ఉంది.