Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


” బాల్టిస్థాన్‌, మనదేశంలో ఉన్న ఈ ప్రాంతం పేరు ఎప్పుడైనా విన్నామా అసలు ? ఇప్పుడు మన ప్రధాని మోడీ గారి వల్ల ఈ ప్రాంతం మన స్వంతం కాబోతోంది. దీనికి ప్రతి భారతీయుడు మద్దతు తెలపాలి ” అంటూ ఒక పోస్టును ” వాట్సాప్‌ పండితులు ” ప్రచారం చేస్తున్నారు. అసలు ఇలాంటి వార్తను ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా అసలు విన్నారా, చదివారా, చూశారా ? కేవలం వాట్సాప్‌ పండితులకే ఇలాంటివి ఎలా తెలుస్తాయి. ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నారు. బాల్టిస్థాన్‌ మనదేశంలో అంతర్భాగం, ప్రస్తుతం పాకిస్థాన్‌ ఆక్రమణలో ఉంది. ఎప్పటికైనా మనకు రావాల్సిందే అన్నది వాస్తవం. ఒక నోటీసు ఇవ్వగానే అన్యాక్రాంతమైన ప్రాంతం వెంటనే వస్తుందా? మోడీ నోటీసు ఇవ్వటం ఏమిటి ? అద్డెకున్నవారినే అంతతేలికగా ఖాళీ చేయించలేమే అలాంటిది ఏడు దశాబ్దాలుగా పాక్‌ ఆక్రమణలో ఉన్నదాని స్వాధీనం వెంటనే జరుగుతుందా ? ఉత్తర-దక్షిణ కొరియాలను విలీనం చేయాలని రెండవ ప్రపంచ యుద్దం తరువాత నిర్ణయించినా ఇంతవరకు జరగలేదు. వియత్నాం విలీనం కోసం రెండవ ప్రపంచ యుద్దం తరువాత 1975వరకు ఆక్రమణదారులు, వారితో చేతులు కలిపిన వారి మీద పోరాడి లక్షల మంది ప్రాణాలను ఫణంగా పెట్టిన తరువాతే సాధ్యమైంది.తైవాన్‌ దీవి చైనాలో అంతర్భాగమే అని ఐరాస గుర్తించి తీర్మానించినా ఇంతవరకు చైనా స్వాధీనం చేసుకోలేకపోయింది. ఆక్రమిత కాశ్మీరు గురించి ఐరాసలో ఎలాంటి విలీన తీర్మానం చేయలేదు. శాంతియుత పద్దతుల్లో భారత్‌-పాక్‌ పరిష్కారం చేసుకోవాలి. అసలు గిల్గిట్‌ – బాల్టిస్థాన్‌ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోంది ?


పాకిస్థాన్‌ ఆక్రమణలో ఉన్న గిల్గిట్‌-బాల్టిస్థాన్‌తో సహా కాశ్మీరు ప్రాంతం మొత్తం, లడక్‌లో భాగంగా ప్రస్తుతం చైనా ఏలుబడిలో ఉన్న ఆక్సారుచిన్‌ ప్రాంతం కూడా మనదే అన్నది స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మనదేశం ప్రకటిస్తున్నది. మనదేశ పటాల్లో అదే చూపుతున్నది.మన కాశ్మీరు రాష్ట్ర అసెంబ్లీలో పాక్‌ ఆక్రమిత ప్రాంతానికి 24 సీట్లు కేటాయించటం తప్ప చైనా ఆధీనంలోని ప్రాంతానికి గతంలో కూడా ఎలాంటి సీట్లు కేటాయించలేదు. ఇప్పుడు లడక్‌ కేంద్ర పాలిత ప్రాంతం, ప్రస్తుతం దానికి అసెంబ్లీ ఏర్పాటు లేదు. గిల్గిట్‌-బాల్టిస్తాన్‌ కూడా కాశ్మీరులో భాగమే అయినప్పటికీ అది మినహా మిగిలిన ఆక్రమిత ప్రాంతం పట్ల పాకిస్తాన్‌ వేర్వేరు వైఖరులను తీసుకున్నది. గిల్గిట్‌ ప్రాంత వాసులు తమతో విలీనం కావాలని కోరుకున్నందున అది తమ ప్రాంతమే అని ప్రకటించుకుంది. తమ ఆక్రమణలోని మిగతా ప్రాంతాన్ని ” విముక్త (ఆజాద్‌) కాశ్మీరు” అని ప్రకటించి ప్రత్యేక పాలిత ప్రాంతంగా ఉంచింది. ఎప్పటికైనా మొత్తం కాశ్మీరు స్వతంత్ర దేశంగా ఏర్పాటు కానుందని చెబుతున్నది. పాక్‌ పార్లమెంటులో దానికి ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించలేదు. ఆ ప్రాంతానికి విడిగా ఎన్నికలు జరుపుతూ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నది. చైనాతో కుదిరిన ఒప్పందం మేరకు 1963లో గిల్గిట్‌లోని షాక్స్‌గమ్‌ ప్రాంతాన్ని చైనాకు అప్పగించింది. దాని గుండా చైనా కారకోరం రహదారి నిర్మించటంతో ఆ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత వెల్లడైంది.అనేక తర్జన భర్జనల తరువాత పాకిస్తాన్‌ గిల్గిట్‌-బాల్టిస్తాన్‌ ప్రాంతాన్ని 2020లో పాక్‌ ఐదవ తాత్కాలిక రాష్ట్రంగా ప్రకటించుకుంది. ఆక్రమిత కాశ్మీరులోని పౌరులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగా గిల్గిట్‌ వాసులు విలీనాన్ని కోరుకున్నట్లు పాక్‌ చెబుతున్నది. ఆక్రమిత కాశ్మీరులో మాదిరి గిల్గిట్‌లో కూడా ఎన్నికలు జరుపుతున్నది.


ఆక్రమిత కాశ్మీరును తిరిగి మన దేశంలో విలీనం చేసేందుకు పదేండ్లలో చేసిందేమీ లేకపోగా తన గొప్పతనాన్ని ప్రదర్శించుకొనేందుకు నరేంద్రమోడీ పదే పదే పాకిస్తాన్ను రెచ్చగొడుతున్నారనే అభిప్రాయం ఉంది.దానిలో భాగంగానే 2016 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మానవహక్కులు లేవంటూ ఆక్రమిత కాశ్మీరు, గిల్గిట్‌ అంశాన్ని మోడీ ప్రస్తావించారు. 1948 నుంచి గిల్గిట్‌ను వేరుగా ఉంచిన పాకిస్థాన్‌ 2019లో ఆర్టికల్‌ 370, కాశ్మీరు రాష్ట్రాన్ని రద్దు చేసిన తరువాత 2020లో తన ఐదవ రాష్ట్రంగా తాత్కాలిక గుర్తింపుగా ప్రకటించింది. అయితే అంత మాత్రాన ఒరిగేదేమీలేదు. కాశ్మీరు సమస్య తేలేవరకు అది తాత్కాలిక రాష్ట్రంగా మాత్రమే ఉంటుంది. దేశంలో అంతర్భాగం కాదు. పాక్‌ సుప్రీం కోర్టు పరిధి దానికి వర్తించదు. ఒక వేళ ఆ ప్రాంతం తమ దేశంలో భాగమే అని గనుక ప్రకటిస్తే ఐరాసలో కాశ్మీరు ఒక ప్రత్యేక దేశమంటున్న పాక్‌ వాదన వీగిపోతుంది. దాన్నుంచి ఖాళీ చేయాల్సి ఉంటుంది.అందుకే పార్లమెంటులో ఆక్రమిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం కూడా కల్పించటం లేదు. తమ రక్షిత ప్రాంతాలుగానే చెబుతున్నది. అనేక అంశాల గురించి తప్పుడు ప్రచారం చేయటంలో గత పది సంవత్సరాలలో విపరీతంగా పెరిగింది. తప్పుడు వార్తలలో మన దేశం ముందున్నదని ఇటీవలనే ప్రపంచ ఆర్థికవేదిక సమావేశాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. గిల్గిట్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించటాన్ని భద్రతా మండలిలో వీటో చేస్తామని, అది భారత్‌లో భాగంగా ఉండాలని తాను కోరుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ చెప్పాడంటూ ఒక వీడియోను 2022లో వైరల్‌ చేశారు. అసలు ఈ అంశం భద్రతా మండలి చర్చలోనే లేదు. తమ ఆర్థిక రంగం గురించి పుతిన్‌ రష్యన్‌ భాషలో మాట్లాడిన వీడియోకు గిల్గిట్‌ గురించి చెప్పినట్లు ఆంగ్లంలో సబ్‌టైటిల్స్‌ను జోడించి నరేంద్రమోడీ గొప్పతనాన్ని పెంచేందుకు చూశారు. అన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు అదే వీడియోను చూపుతూ పశ్చిమ దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షల పర్యవసానాల గురించి పుతిన్‌ చర్చించినట్లు పేర్కొన్నాయి.


బిజెపి నేతలు ఇదిగో రేపో ఎల్లుండో ఆక్రమిత కాశ్మీరును తిరిగి వెనక్కు తీసుకువస్తాం అన్నట్లుగా పదే పదే చెబుతుంటారు. తాము మాత్రమే స్వాధీనం చేసుకోగలమని చెప్పుకుంటారు. ఎవరు అధికారంలో ఉన్నా మనదేశం ఎన్నడూ కాశ్మీరు గురించి రాజీపడలేదు. జమ్మూ-కాశ్మీరు ఎప్పుడు విలీనమైందో పాక్‌ ఆక్రమిత కాశ్మీరు-గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ కూడా మన అంతర్భాగాలే అని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని 1994లో పివి నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉండగా లోక్‌సభలో తీర్మానం ఆమోదించారు. పాకిస్థాన్‌ వెంటనే ఖాళీ చేయాలని, భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే తగిన విధంగా స్పందిస్తామని కూడా పేర్కొన్నారు. అందువలన నరేంద్రమోడీ చెప్పిన తరువాతే గిల్గిట్‌ అనేది ఒకటుందని మనకు తెలిసిందని చెప్పటం అతిశయోక్తి, తప్పుడు ప్రచారం తప్ప మరొకటి కాదు.2001లో నాటి ప్రధాని అతల్‌ బిహారీ వాజ్‌పాయి కూడా ఒక సందర్భంలో చెప్పారు.2019లో ఆర్టికల్‌ 370తో పాటు కాశ్మీరు రాష్ట్రాన్ని రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చినపుడు కూడా దీని గురించి కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. గిల్గిట్‌ ప్రాంతంలోని షాక్స్‌గమ్‌ లోయ ప్రాంతాన్ని పాకిస్థాన్‌ గతంలో చైనాకు అప్పగించిందని పైనే చెప్పుకున్నాము.దాని ద్వారానే కారకోరం రహదారిని చైనా నిర్మించింది. పాకిస్తాన్‌-చైనా భూ భాగాన్ని కలిపే ఏకైక మార్గమిది.చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవాకు ఇది కీలకం.


స్వాతంత్య్రానికి పూర్వం జమ్మూ-కాశ్మీరు సంస్థానంలో ఉత్తర ప్రాంతాలు అని పిలిచిన వాటిలో గిల్గిట్‌ ఏజన్సీ, బాల్టిస్థాన్‌ జిల్లాగా ఉండేవి.పాకిస్థాన్‌ ఆక్రమించిన కాశ్మీరుకు ఇది విస్తీర్ణంలో ఆరురెట్లు ఎక్కువ.ఈ ప్రాంతంలో జనాభా ప్రస్తుతం18 లక్షలకు పైగా ఉంది.2009లో గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ అని పేరు పెట్టారు. ఇది స్వయం పాలిత ప్రాంతం. గిల్గిట్‌ పట్టణం రాజధాని. కాశ్మీరులో అంతర్భాగమే అయినప్పటికీ తాము కాశ్మీరీలకంటే భిన్నమైన వారమని ఆ ప్రాంతవాసులు భావిస్తారు.కాశ్మీరులో సాగిన డోగ్రా (రాజరిక) పాలన మీద వారు తిరుగుబాటు చేశారు. తాము అటు భారత్‌లోనూ ఇటు పాకిస్థాన్లో కూడా విలీనానికి అంగీకరించం అని చెప్పారు. తరువాత మారిన పరిస్థితిలో అది పాక్‌ ఆక్రమణకు గురైంది. విముక్త కాశ్మీరుగా(మనం ఆక్రమిత ప్రాంతం అంటున్నాం) పాకిస్థాన్‌ ప్రకటించిన ప్రాంతాలకు, గిల్గిట్‌ ప్రాంతాలకు వేర్వేరు పాలనా యంత్రాంగాలను ఏర్పాటు చేశారు.1994 నుంచి గిల్గిట్‌లో పార్టీ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహిస్తున్నారు.


గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ ప్రాంతం గురించి జై శ్రీరామ్‌ పేరుతో పెట్టిన ఊరూ పేరులేని పోస్టులు వాట్సాప్‌లో తిరుగుతున్నాయి. వీటిని ఎవరు వ్యాపిస్తున్నారో అందరికీ తెలుసు. తప్పుడు సమాచారంతో జనాల బుర్రలను ఖరాబు చేస్తున్నారు. ఇలాంటి వాటిని ఎవరు పంపినా గుడ్డిగా ఇతరులకు పంచటం గాకుండా వాటి విశ్వసనీయత గురించి పంపిన వారిని ప్రశ్నిస్తే అసలు సంగతి తేలుతుంది. దానిలో ” నిన్న గిల్గిట్‌ బాల్టిస్ధాన్ను ఖాళీ చేయమని మోడీ పాకిస్ధాన్‌కు నోటీసు ఇచ్చే వరకు మనలో చాలా మందికి అది మన(భారత్‌) భూభాగం అనే తెలియదు ” అని కూడా సెలవిచ్చారు. మోడీ ప్రతిష్టను పెంచేందుకు భక్తులు చేస్తున్న తప్పుడు ప్రచారాల్లో ఇదొకటి. ఇక్కడ ఆ పోస్టు మొత్తంలో నిన్న అంటే ఏ తేదీ, ఏ నెల, ఏ సంవత్సరంలో అలాంటి నోటీసు పంపారో రాసి ఉంటే దాని బండారం బయటపడేది. గోడమీద రాసే అప్పు రేపు అన్నట్లుగా దీన్ని వాట్సాప్‌లో కొత్తగా చదివేవారికి అంతకు ముందు రోజే నోటీసు ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. అది నిజమా కాదా అని సరిచూసుకొనే ఆసక్తి మన జనాలకు ఉండదు అనే ధీమాతో ఇలాంటి ప్రచారాన్ని చేస్తున్నారు. అదే నరేంద్రమోడీ గిల్గిట్‌ గురించి పాకిస్థాన్‌కు నోటీసు ఇస్తే మరి ఆక్సారుచిన్‌ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని చైనాకు ఎందుకు నోటీసు ఇవ్వలేదు ? మొత్తం ఆక్రమిత కాశ్మీరులో గిల్గిట్‌ కూడా ఒకటి, గిల్గిట్‌ను మాత్రమే ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చిన నరేంద్రమోడీ మిగతా కాశ్మీరు ప్రాంతం గురించి ఎందుకు ఇవ్వలేదు ? అందుకే ఇది తప్పుడు ప్రచారం అన్నది స్పష్టం. ఎవరైనా ఆధారాలు ఉంటే చూపవచ్చు. కొస మెరుపు ఏమంటే 2016లో నరేంద్రమోడీ ఎర్ర కోటలో గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ ప్రస్తావనతో చేసిన ప్రసంగ అంశం మీద ఆంగ్ల మీడియాలో పెట్టిన శీర్షికల్లో ఒక దానికి ” రెడ్‌ ఫోర్టు నోటీసు – విల్‌ మోడీస్‌ న్యూ పాకిస్థాన్‌ పాలసీ గో బియాండ్‌ రిహొటరిక్‌ ? ”(స్క్రోల్‌ ఆగస్టు 29,2016) అని పెట్టారు. దీని అర్ధం పాకిస్థాన్‌కు ప్రధాని నోటీసు ఇచ్చారనా ? కానే కాదు, వట్టి మాటలేనా చేతలేమైనా ఉంటాయా అని అర్ధం. ” ఎర్రకోట ప్రకటన- పాకిస్థాన్‌ నూతన విధానంతో మోడీ వాక్పటిమ కంటే ముందుకు పోతారా ” అన్నది తెలుగు అర్ధం.