Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ రాజకీయాల్లో మనదేశం రష్యాను దూరం చేసుకొంటున్నదా ? పరిణామాలను చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. గత రెండు సంవత్సరాలుగా రాయితీ ధరలకు, రూపాయి మారకంతో రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు కొనుగోలును మన దేశం ఇప్పుడు దాదాపు నిలిపివేసింది. దానికి బదులు అమెరికా నుంచి భారీ మొత్తంలో అధిక ధరలకు కొనుగోలు చేసేందుకు పూనుకుంది. అంతర్జాతీయ పరిణామాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ విశ్వగురువుగా అగ్రరాజ్యం అమెరికాను సైతం తన కాళ్ల ముందుకు రప్పించుకోగలరు అని భక్తులు చెబుతారు.అయితే దానికి ఎక్కడా రుజువులు కానరావు. దశాబ్దాలుగా భారత్‌కు మిత్రదేశంగా, బ్రహ్మౌస్‌ ఖండాంతర క్షిపణులు, ఎకె-47రైఫిళ్ల తయారీలో భాగస్వామిగా ఉన్న రష్యాను పక్కన పెట్టి ఇప్పుడు నరేంద్రమోడీ అమెరికా ముందు చేతులెత్తేశారు. రష్యా నుంచి చౌకగా వస్తున్న ముడి చమురు బదులు ఎలాంటి రాయితీలు లేని అమెరికా సరకును దిగుమతి చేసుకొనేందుకు నిర్ణయించారు.వచ్చే నెల నుంచి రోజుకు రెండున్నరలక్షల పీపాల ముడి చమురును అమెరికా నుంచి దిగుమతి చేసుకొనేందుకు ఒప్పందాలు చేసుకున్నట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది.అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు రష్యా ప్రభుత్వరంగ నౌకల కంపెనీపై విధించిన ఆంక్షల కారణంగా రష్యా పశ్చిమ ప్రాంతంలోని బాల్టిక్‌ సముద్ర రేవుల ద్వారా చమురు ఎగుమతుల రవాణా ఖర్చు పెరుగుతోంది.ఆరు నుంచి ఎనిమిది శాతం అదనంగా కానుందని అంచనా. తద్వారా రష్యాను దెబ్బతీయాలని చూస్తున్నాయి.దీంతో రష్యా ఎగుమతులకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నది.లేదా కొనుగోలు చేసే దేశాలకు ఆ మేరకు ధర తగ్గించి విక్రయించాల్సి ఉంటుంది. అమెరికా కొత్త ఆంక్షలు, బెదిరింపుల కారణంగా మనదేశానికి బయలుదేరిన కోటి పీపాల పరిమాణం గల సరకుతో బయలుదేరిన రష్యన్‌ టాంకర్లు ఇప్పుడు చైనా, ఇతర దేశాలవైపు వెళుతున్నాయి.


ఉక్రెయిన్‌పై సైనిక చర్య అంశంలో మనదేశం తటస్థంగా ఉన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగానే స్వతంత్ర విదేశాంగ విధానం అనుసరిస్తున్నామని కారణంగా గత రెండు సంవత్సరాలుగా రష్యాపై విధించిన ఆంక్షలను సమర్ధించటం లేదని, ఎక్కడ చౌకగా ఉంటే అక్కడ మనకు ఇష్టమైన దగ్గర చమురుకొనుగోలు చేస్తామని మన ఇంథన, విదేశాంగశాఖ మంత్రులు చెప్పారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆంక్షలు, కొత్త పరిణామాలేవీ లేవు. విదేశాంగ విధానంలో మార్పులు వచ్చినట్లు కూడా ప్రకటించలేదు. కానీ రష్యా నుంచి కొనుగోలు నిలిపివేశారు. మూడు భారీ టాంకర్లు, ఇతర నౌకల ద్వారా 76లక్షల పీపాల చమురు అమెరికా నుంచి బయలుదేరినట్లు కెప్లర్‌ సంస్థ తెలిపింది. రష్యా నుంచి చమురు కొనగూడదని రిలయన్స్‌, ఇతర కంపెనీలు నిర్ణయించాయి. ఇప్పటి వరకు రష్యా నుంచి రాయితీ ధరకు ముడి చమురు కొనుగోలు చేసి చమురు ఉత్పత్తులను ఐరోపా, అమెరికాలకు మనదేశం నుంచి ఎగుమతి చేస్తున్నారు. అమెరికా నుంచి చమురు ఎగుమతులపై 2015వరకు నిషేధం ఉండేది. అనేక దేశాలతో వాణిజ్య లోటు ఉండటం, ఎగుమతులకు అనుమతించాలని అమెరికా చమురు కంపెనీల వత్తిడి కారణంగా ఎత్తివేశారు.అచిర కాలంలోనే అమెరికా నుంచి చమురు దిగుమతి చేసుకొనే దేశాలలో భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంది. ఇటీవలి వరకు అమెరికా దిగుమతి దేశంగా ఉండి ఇప్పుడు ఎగుమతి చేసేదిగా మారింది. గత ఏడాది రోజుకు 40లక్షల పీపాలను ఎగుమతి చేసింది. రాతి పొరల నుంచి చమురు (షేల్‌ అయిల్‌) తీసేందుకు భారీ మొత్తాలలో పెట్టుబడులు పెట్టిన కార్పొరేట్‌ సంస్థలు ఇప్పుడు లాభాలు పిండుకొనేందుకు చూస్తున్నాయి.రానున్న రోజుల్లో ఎగుమతులపై ఎలాంటి నిషేధం విధించబోమని 2015లో అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఒక బిల్లును ఆమోదించాడు. ఆ ఏడాది రోజుకు కేవలం పదిలక్షల పీపాల ఎగుమతి జరగ్గా గతేడాదికి 40లక్షలకు పెరిగాయి.తన పలుకుబడితో అనేక దేశాల మీద వత్తిడి తెచ్చి చమురు ఎగుమతి చేస్తున్నది. ఉక్రెయిన్‌పై రష్యాను రెచ్చగొట్టటం వెనుక ఐరోపా, ఆసియా చమురు మార్కెట్‌లో ప్రవేశించే అమెరికా ఎత్తుగడ ఉన్నట్లు స్పష్టమైంది.అమెరికా వలలో చిక్కిన దేశాలు ఇప్పుడు ఆంక్షల పేరుతో రష్యా నుంచి కొనుగోళ్లను నిలిపివేశాయి.


ప్రపంచ రాజకీయాలనే శాసించే స్థితికి చేరామని చెప్పుకుంటున్న మనదేశం ఎంతో చిన్నదైన ఉత్తర కొరియా పాటి ధైర్యాన్ని ప్రదర్శించలేకపోతున్నది.రష్యాపై విధించిన ఆంక్షలను వ్యతిరేకిస్తున్నామని చెబుతూనే అమలు జరపటం మనదేశ ప్రతిష్టను పెంచుతుందా, తగ్గిస్తుందా ? అణుపరీక్షలను జరుపుతున్న కారణంగా ఐరాస ఉత్తర కొరియా మీద విధించిన ఆంక్షలను ధిక్కరించి రష్యా చమురు ఎగుమతి చేస్తున్నది. దానికి ప్రతిగా ఉత్తర కొరియానుంచి అవసరమైన ఆయుధాలను పొందుతున్నది. ఒపెక్‌ దేశాలతో కుదిరిన ఒప్పందం ప్రకారం జూన్‌ నాటికి రోజుకు 90లక్షల పీపాల చమురు ఉత్పత్తిని తగ్గించాలని రష్యా కోరింది.దానిలో భాగంగా తన ఉత్పత్తిలో కోత పెట్టి 4.71లక్షల పీపాల ఎగుమతులను కూడా తగ్గించనుంది. ఇదంతా అంతర్జాతీయ చమురు ధరలను తగ్గకుండా చూసేందుకు జరుగుతున్నది. ఐదు సంవత్సరాల క్రితం రష్యా రోజుకు 117లక్షల పీపాలను ఉత్పత్తి చేసేది.ప్రస్తుతం 108లక్షలకు తగ్గించింది. సరిహద్దుల్లో ఉన్న చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్‌ దాడులు జరుపుతున్నది. దీని వలన రోజుకు ఆరులక్షల పీపాల చమురు శుద్ది సామర్ధ్యం తగ్గింది. అయితే కొద్ది వారాల్లోనే తిరిగి పూర్వపు స్థితికి చేరుకుంటుందని చెబుతున్నారు. మార్చినెల ఒకటవ తేదీ నుంచి నాటో కూటమి రష్యా ఇంథన ఎగుమతులపై మరిన్ని ఆంక్షలను అమలు జరుపుతున్నది. ఆధునిక పరిజ్ఞానం అందకుండా అమెరికా అడ్డుకుంటున్నప్పటికీ రష్యాలో స్వంత పరిజ్ఞానంతో చమురు డ్రిల్లింగ్‌ భారీఎత్తున జరుగుతున్నది.ఒకవైపు చైనా ఆర్థిక రంగం కుదేలైందని పశ్చిమ దేశాలు ప్రచారం చేస్తుండగా మరోవైపున చైనా పెట్రో సంస్థలు రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించినట్లు వార్తలు వచ్చాయి. 2022 నాటి వినియోగస్థాయికి చేరుకున్నట్లు లాభాలు 8.3శాతం పెరిగినట్లు ప్రకటించారు.చైనా, భారత్‌ రెండూ ఇంథనాన్ని దిగుమతి చేసుకునే దేశాలే.మార్చి 25వ తేదీన చైనాలో పెట్రోలు ధర 1.18 డాలర్లుండగా మనదేశంలో 1.25, పాకిస్థాన్‌లో 1.007డాలర్లు, బంగ్లాదేశ్‌లో 1.112 డాలర్లు ఉంది. అమెరికా వత్తిడి మేరకు మిత్రదేశమైన రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేత పర్యవసానాలు ఎలా ఉండేది అప్పుడే చెప్పలేము.