ఎం కోటేశ్వరరావు
2023 అక్టోబరు ఏడు నుంచి పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో యూదు దురహంకారులు జరుపుతున్న మారణకాండ, దానికి పాలస్థీనియన్ల ప్రతిఘటనకు ఆరు నెలలు దాటింది. అమెరికా, ఇతర పశ్చిమదేశాల దన్ను చూసుకొని గాజాలో సాగిస్తున్న హత్యలు, విధ్వంస కాండ ఎప్పుడు, ఎలా ముగుస్తుందో తెలియదు.ఈ దారుణాన్ని నివారించలేని పనికిమాలిన సంస్థగా ఐరాస పేరుతెచ్చుకుంది.ఎన్ని కబుర్లు చెప్పినా ఆచరణకు వచ్చేసరికి న్యాయం వైపు ఎవరు నిలిచారో, అన్యాయం, అక్రమాలను ఎవరు సమర్ధిస్తున్నారో లోకానికి వెల్లడైంది.ఇజ్రాయెల్ జరుపుతున్న మారణకాండకు మద్దతు ఇస్తున్న జర్మనీపై అత్యవసరంగా ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ కోర్టులో వామపక్ష నేత డేనియల్ ఓర్టేగా అధ్యక్షుడిగా ఉన్న లాటిన్ అమెరికాలోని నికరాగువా దాఖలు చేసిన పిటీషన్‌పై హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. మారణకాండకు మద్దతు ఇవ్వటమేగాక పాలస్థీనా నిర్వాసితులకు సాయం చేస్తున్న ఐరాస సంస్థకు జర్మనీ నిధులను నిలిపివేసిందని కూడా నికరాగువా పేర్కొన్నది. తక్షణమే గాజాలో దాడులను విరమించాలని, యుద్ధం, నేరాలకు జవాబుదారీ ఎవరో తేల్చాలని తాజాగా ఐరాస మానవహక్కుల మండలిలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెడితే ఓటింగ్ నుంచి మనదేశం, మరోపన్నెండు తప్పుకున్నాయి.చైనాతో సహా 28 దేశాలు అనుకూలంగా, అమెరికాతో పాటు మరో ఆరు వ్యతిరేకంగా ఓటు వేశాయి. విశ్వగురువులం కదా ! మనం ఎటున్నట్లు ? మానవహక్కుల రక్షణకా భక్షణకా ? బేటీపడావో బేటీ బచావో అని చెప్పిన పెద్దలకు గాజాలో మరణిస్తున్నవారిలో 70శాతం మంది పిల్లలు, మహిళలు ఉన్న సంగతి తెలియదా ? ఈ దారుణాలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ను నిలదీసేందుకు ఎందుకు నోరు రావటం లేదు ? ముస్లిం వ్యతిరేకత తప్ప ఎవరిని సంతుష్టీకరించేందుకు ఈ వైఖరి ?
గాజాలో జరుగుతున్నదేమిటి ? తమ మాతృదేశ పునరుద్దరణ జరగాలన్న పాలస్థీనియన్ల అణచివేత తప్ప మరొకటి కాదు. ఎవరు చేస్తున్నారు ? సామ్రాజ్యవాదుల మద్దతుతో వారి చేతిలో పావుగా ఉన్న ఇజ్రాయెల్, అంటే సామ్రాజ్యవాదులే దాడి కారకులు.చరిత్రలో వారు చేసిన దాడులన్నీ దారుణాలుగా నమోదయ్యాయి. అందుకు అత్యంత దుర్మార్గ ఉదాహరణ 1968 మార్చి 15వ తేదీన వియత్నాంలోని మై లాయి ఊచకోత. విలియం కాలే అనే అధికారి ఉత్తరువుల మేరకు ఎర్నెస్ట్ మెదీనా అనే అమెరికన్ కెప్టెన్ కదులుతున్న ప్రతిదాన్నీ అంతం చేయమని ఆదేశాలు జారీ చేస్తే అమెరికా సైనికులు ఐదు వందల మందిని చంపివేశారు. ఇప్పుడు గాజాలో జరుగుతున్నదానికి దానికి తేడా ఏమైనా ఉందా ? ఆసుపత్రులు, స్కూళ్లు, నిర్వాసితుల కేంద్రాలు, సహాయ శిబిరాలు, అన్నదానం చేస్తున్నవారు ఎవరు కనిపించినా హతమార్చాలని నెతన్యాహు ఆదేశాలు జారీ చేస్తే ఇజ్రాయెల్ సైనికులు అమలు చేస్తున్నారు. గత ఆరునెలల్లో 33,482(ఏప్రిల్ 10వ తేదీ నాటికి) మందిని చంపివేశారు. మరో విధంగా చెప్పాలంటే గాజాలోని ప్రతి 70 మందికి ఒకరిని, రోజుకు 180మందిని చంపారు. వీరుగాక 75,815 మందిని, రోజుకు 400 మందిని, ప్రతి 30 మందిలో ఒకరిని గాయపరిచారు. విధ్వంసమైన భవనాల గురించి చెప్పనవసరం లేదు. ఇరవై రెండు లక్షల మంది జనాభాలో 19లక్షల మంది నిరాశ్రయులు కావటం లేదా నెలవులు తప్పారంటే ప్రభావితం కాని కుటుంబం లేదంటే అతిశయోక్తి కాదు. ఇంతటి దుర్మార్గానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా అన్ని రకాల ఆయుధాలను అందించటమే కాదు, ఎర్ర సముద్రంలోకి తన యుద్ధ నావలను దింపి బాసటగా నిలుస్తున్నది. ఆ ప్రాంత దేశాలు జోక్యం చేసుకోకుండా బెదిరిస్తున్నది.
సామ్రాజ్యవాదుల వర్తమాన రక్త చరిత్రలో విస్మరించరాని దుర్మార్గమిది. కొందరు సైనికులు చేసిన దారుణం కాదిది, వ్యవస్థాపూర్వకమైనది. ఎవరికి ఏది నేర్పితే దాన్నే పాటిస్తారు.ఇజ్రాయెల్ రక్షణ దళాల్లో ప్రతి యువకుడు కొంతకాలం విధిగా పని చేయాలి. ఆదేశించిన దుర్మార్గాలను అమలు చేయాలి.తిరస్కరిస్తే ఏం చేస్తారు ? ప్రజాస్వామిక హక్కని వదలి వేయరు. విదేశాల్లో ఉన్న ఒక యువ ఇజ్రాయెలీ కమ్యూనిస్టు ఈ దళాల్లో చేరేందుకు తిరస్కరించాడు. గాజా మారణకాండను నిరసిస్తూ జరిగిన ప్రదర్శనల్లో పాల్గొని అరెస్టయ్యాడనే కారణాన్ని చూపి అతని పౌరసత్వాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం రద్దు చేసింది. దేశంలోకి రావటాన్ని నిషేధించింది.రాజ్య అణచివేత, మిలటరీ విధానాలను నిరసించాలని, అణచివేతను వ్యతిరేకించాలని సోదర ఇజ్రాయెలీలకు అతను రాసిన లేఖలో పేర్కొన్నాడు. మధ్య ప్రాచ్య సోషలిస్టు ఫెడరేషన్‌లో భాగంగా ఇజ్రాయెల్-పాలస్తీనా సోషలిస్టు ఫెడరేషన్ ఏర్పాటు జరిగినపుడే ఈ ప్రాంతంలోని జనాలందరూ సుఖంగా ఉంటారని పేర్కొన్నాడు. గాజాలో మారణకాండను విమర్శించినందుకు ఇజ్రాయెల్ పార్లమెంటులోని కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు ఒఫెర్ కాసిఫ్‌ను 2023 అక్టోబర్ 18న 45 రోజుల పాటు సస్పెండ్ చేస్తూ పార్లమెంటరీ నైతిక నియమాల కమిటీ తీర్మానించింది. అయినప్పటికీ ఖాతరు చేయని ఒఫెర్ అంతర్జాతీయ కోర్టులో దక్షిణాఫ్రికా దాఖలు చేసిన కేసును సమర్దిస్తూ ఒక పిటీషన్‌పై సంతకం చేశాడనే సాకు చూపి ఏకంగా పార్లమెంటు సభ్యత్వాన్నే రద్దు చేసేందుకు పూనుకున్నారు.దానిలో భాగంగా 85 మంది ఎంపీలతో తీర్మానాన్ని ప్రతిపాదించారు.దాన్ని పార్లమెంటరీ కమిటీ జనవరి 30న 14-2 ఓట్ల మెజారిటీతో ఆమోదించింది. దక్షిణాఫ్రికా చర్య కుట్ర అని ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా సాయుధపోరాటాన్ని సమర్ధించటమేనని వర్ణించింది. ఫిబ్రవరి 19న పార్లమెంటులో ఓటింగ్ జరగ్గా అది వీగిపోయింది. నూట ఇరవై మంది సభ్యులకు గాను పదకొండు మంది వ్యతిరేకంగా, 24 మంది ఓటింగ్‌కు దూరంగా ఉండగా 85 మంది అనుకూలంగా ఓటు వేశారు. ఒక సభ్యుడిని తొలగించాలంటే 90 మంది మద్దతు అవసరం. దేశంలో ఎవరూ వ్యతిరేకంగా ఉండకూడదనే దుర్మార్గం తప్ప దీని వెనుక మరొకటి లేదు.పార్లమెంటులోని ఇతర వామపక్ష వాదులకూ ఇదే జరుగుతుందని హెచ్చరించటమే.
ఆరునెలల మారణకాండ తరువాత వెనక్కు తిరిగి చూసుకుంటే గాజా సర్వనాశనమైంది. అక్కడ బతికి ఉన్నవారు తిరిగి సాధారణ జీవితాలను ప్రారంభించే అవకాశం ఉంటుందా ? ఇంకా ఎందరిని బలితీసుకుంటారనే ప్రశ్నలకు ఇప్పటికైతే సమాధానాలు లేవు. రంజాన్ మాసం తరువాత మరింత పెద్ద ఎత్తున దాడులు జరిపేందుకు ఇజ్రాయెల్ సన్నాహాలు జరుపుతున్నట్లు వార్తలు. అది ఒక్క గాజాకే పరిమితం అవుతుందా లేక మొత్తం మధ్య ప్రాచ్య దేశాలకు విస్తరిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. గాజాలో మరణించిన వారందరూ హమస్ సాయుధులే అన్నట్లుగా ప్రపంచాన్ని నమ్మించేందుకు ఇజ్రాయెల్ చూస్తున్నది. ఒప్పందం ప్రకారం కొందరు బందీలను విడిపించుకోవటం తప్ప హమస్ వద్ద ఉన్న ఇతర బందీల జాడను కూడా తెలుసుకోలేకపోయింది. చీమ చిటుక్కుమన్నా కనుగొనే నిఘా వ్యవస్థను ఏమార్చి హమస్ సాయుధులు సరిహద్దులోని ఇజ్రాయెల్ ప్రాంతంపై ఎలా దాడి చేశారన్నది ఇప్పటికీ వీడని రహస్యంగానే ఉండిపోయింది. దాడులు, హత్యాకాండతో పాలస్థీనియన్లను లొంగదీసుకోలేమని గ్రహించిన ఇజ్రాయెల్ వారిని రోగాలు, ఆకలితో మాడ్చి చంపేందుకు పూనుకున్నట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. గాజా మారణకాండను ఎలా ఆపాలన్నదాని కంటే అది కొనసాగితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో జో బైడెన్ భవితవ్యం ఎలా ఉండనున్నదో అంటూ అనేక మంది విశ్లేషణల్లో నిమగమయ్యారంటే వారి చర్మం ఎంత మందంగా తయారైందో అర్ధం చేసుకోవచ్చు. కొందరైతే హమస్ చేసిన దుర్మార్గాలంటూ ఇంకా చిలవలు పలవలుగా వర్ణిస్తూ గాజాలో జరుపుతున్నదారుణాలను తక్కువ చేసి చూపేందుకు చూస్తున్నారు.
గత ఆరునెలల్లో జరిగిన పరిణామాల్లో ఎమెన్‌పై అమెరికా నేరుగా యుద్ధానికి దిగటం ఒక ముఖ్యాంశం.ఇది కూడా ఇజ్రాయెల్ సంబంధిత పరిణామాల్లోనే జరుగుతోంది. ఉగ్రవాదంపై పోరు ముసుగులో గతంలో సౌదీ అరేబియా ద్వారా దాడులు చేయించింది. అమెరికాలో తయారైన విమానాలతో అక్కడి నుంచే వచ్చిన బాంబులతో జరిపించిన దాడిలో వేలాది మంది యెమెనీలు మరణించారు. ఇరాన్‌తో సయోధ్య కుదరటంతో సౌదీ నిలిపివేసింది.ఇప్పుడు నేరుగా అమెరికా ఆ పని చేస్తున్నది. ఎమెన్ అంతర్యుద్ధంలో రాజధానితో సహా ఉత్తర ఎమెన్‌పై పైచేయి సాధించిన హౌతీలు లేదా అన్సరల్లా సాయుధులు గాజా మారణకాండకు నిరసనగా ఎర్ర సముద్రం ద్వారా ఇజ్రాయెల్ వైపు వెళ్లే నౌకల మీద దాడులను జరుపుతున్నారు. దానికి ప్రతిగా నౌకల రక్షణ పేరుతో అమెరికా రంగంలోకి దిగి ప్రతిదాడులు చేస్తున్నది.సూయజ్ కాలువ ద్వారా ఎర్ర సముద్రంలో ప్రవేశించి హిందూ మహాసముద్రంలోకి రాకపోకలు సాగించే నౌకల రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. అవి ఆఫ్రికా ఖండంలోని గుడ్‌హౌప్ ఆగ్రంను చుట్టి వస్తున్నాయి. దాంతో ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఎర్ర సముద్రం నుండి ఏడెన్ జలసంధి ద్వారా అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలోకి నౌకలు ప్రవేశించే కీలక ప్రాంతం బాబ్ అల్ మాండెబ్. ఈ కారణంగా ఎమెన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని సామ్రాజ్యవాదులు ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఆసియలోని ఎమెన్‌కు ఎదురుగా ఆఫ్రికా ఖండంలోని జిబౌటీ ఉంది. ఈ కారణంగానే ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అన్నట్లుగా అక్కడ అనేక దేశాలు తమ మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి.
గాజా మారణకాండ నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు సామ్రాజ్యవాదం మార్గాలను వెతుకుతున్నది. మధ్యప్రాచ్యం, పశ్చిమాసియాకు వివాదాన్ని విస్తరించేందుకు అమెరికా చూస్తున్నది.ఇరాన్ను ఒంటరిపాటు చేసేందుకు దీర్ఘకాలంగా అనుసరిస్తున్న ఎత్తుగడలకు ఎదురుదెబ్బ తగిలింది.చైనా చొరవతో ఉప్పు నిప్పుగా ఉన్న సౌదీ అరేబియా-ఇరాన్ సాధారణ సంబంధాలను నెలకొల్పుకున్నాయి. సౌదీ-ఇజ్రాయెల్ మధ్య సయోధ్య కుదర్చాలని అమెరికా ఎంతగా చూసినా కుదరలేదు. పాలస్థీనా స్వతంత్రదేశం ఏర్పడే వరకు సాధారణ సంబంధాలు కుదరవని సౌదీ స్పష్టం చేసింది. గాజాపై దాడులతో అది మరింత వెనక్కు పోయింది. కీలకమైన మధ్య ప్రాచ్య ప్రాంతాన్ని తన చేతుల్లో ఉంచుకోవాలన్న ప్రయత్నాన్ని అమెరికా కొనసాగిస్తూనే ఉంది.ఐరోపాలో రష్యాకు వ్యతిరేకంగా నాటో కూటమిని ఏర్పాటు చేసినట్లే ఇరాన్ను దెబ్బతీసేందుకు అలాంటి మరోకూటమి ఏర్పాటు చేయాలని, దానిలో ఇజ్రాయెల్‌కు కీలకపాత్ర ఉండేట్లు చూడాలన్నది లక్ష్యం. అమెరికా, ఇజ్రాయెల్‌ను గట్టిగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసి కూడా సౌదీ అరేబియా నేతలు ఇరాన్‌తో సయోధ్య కుదుర్చుకోవటం అమెరికా ఊహించినట్లు కనపడదు. ఇరాన్‌కు మద్దతుగా చైనా, రష్యా నిలవటం మరొక కొత్త పరిణామం. ఉక్రెయిన్ వివాదం, గాజా మారణకాండ దాన్ని మరింత పటిష్టం చేసిందని చెప్పవచ్చు. కొందరైతే ఈ కూటమితో అమెరికా ప్రచ్చన్న యుద్ధం చేస్తున్నదనే వర్ణిస్తున్నారు.
