Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఆరునెలల్లో వారు వీరవుతారు అన్న సామెత తెలిసిందే, అంతేనా అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేసినట్లు అనే లోకోక్తి కూడా తెలిసిందే.లోక్‌సభ ఎన్నికలలో ప్రకటిస్తున్న అభ్యర్థులను చూసిన తరువాత బిజెపి ఈ సామెతలను రుజువు చేస్తున్నదని వేరే చెప్పనవసరం లేదు. కాంగ్రెస్‌ దశాబ్దాల కాలంలో వారసత్వ రాజకీయాలకు అలవాటు పడితే బిజెపి ఒక దశాబ్దిలోనే ఎంతో వేగంగా కాంగ్రెస్‌ను అధిగమించుతోందా అనిపిస్తోంది.మహిళా రెజలర్లను వేధించిన తమ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ మీద బేటీ బచావో-బేటీ పఢావో (ఆడపిల్లల్ని రక్షించండి-ఆడపిల్లల్ని చదివించండి) అనే నినాదమిచ్చిన బిజెపి ఎలాంటి చర్య తీసుకోలేదు. తిరిగి అతగాడిని నిలిపితే పరువుపోతుందని భయపడి కొడుకు కరణ్‌కు సీటు ఇచ్చింది. ఎందుకు అంటే కైసర్‌గంజ్‌ నియోజకవర్గం, పరిసరాలలో బ్రిజ్‌ భూషణ్‌ కుటుంబాన్ని ఎదిరించి బిజెపిలో మరొకరు పోటీకి ముందుకు వచ్చే అవకాశం లేదు.భార్య గతంలో జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌గా పని చేశారు. ఒక కొడుకు ఇప్పుడు ఎంఎల్‌ఏ.బాబరీ మసీదు కూల్చివేతలో పాల్గొన్న ”యోధుడు ”,రౌడీ, గూండా చట్టాల కింద అనేక కేసులు, కండబలంతో పెద్ద ఎత్తున సంపదలను కూడబెట్టుకున్న నేపధ్యంలో బిజెపి ఆ కుటుంబాన్ని వదులుకుంటుందా ! మహిళల వలువలను వలిస్తేనేం ” దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ విలువలను ” కాపాడేందుకు ఇలాంటి జనాలు కావాలి కదా !బ్రిజ్‌ భూషణ్‌ తన బలాన్ని ప్రదర్శించుకొనేందుకు కుమారుడు నామినేషన్‌ వేసే సందర్భంగా ఏడు వందల కార్లు, పదివేల మందితో ప్రదర్శన చేయించినట్లు, ఆ సందర్భంగా తాను కనిపిస్తే రచ్చ అవుతుందని వాటికి దూరంగా తెరవెనుక ఉండి నడిపించినట్లు వార్తలు వచ్చాయి.


దేశంలో ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పేవారు కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడరు. రాజకీయాలను శాసించే కుటుంబాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఒకసారి అధికారం, దానితో ఎలా సంపాదించుకోవచ్చో అనుభవంలోకి వచ్చిన తరువాత ఎంత సేపూ అధికార యావ, వారసులను రంగంలోకి తేవటం తెలిసిందే. దీనికి ఎన్‌డిఏ, ఇండియా కూటమిలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఏవీ అతీతం కాదు. ఏడున్నర దశాబ్దాల తరువాత కుటుంబ రాజకీయాలు సాధారణ స్థితికి వచ్చాయి, జనం కూడా ఆమోదం తెలుపుతున్నారు. ఎందుకు అనే ప్రశ్న వేయకుండా అసలు ప్రశ్నించటమే తప్పు అనేట్లు, గొర్రెదాటు వైఖరిని జనాల బుర్రలోకి ఎక్కించటంలో మతం, పురాణాలు, కులం, ప్రాంతాలు, అవకాశవాద రాజకీయాలు ఇలా తిలాపాపం తలాపిడికెడు అన్నట్లుగా ఎవరి పాత్రను అవి పోషించాయి. జరిగిందాంట్లో తమ తప్పేమీ లేదని సమర్ధించుకుంటాయి. స్వాతంత్య్ర ఉద్యమ నేపధ్యం ఉంది గనుక కాంగ్రెస్‌లో మోతీలాల్‌ నెహ్రూ, కుమారుడు జవహర్‌లాల్‌ నెహ్రూ, కుమార్తె ఇందిరా గాంధీ, కుమారుడు రాజీవ్‌ గాంధీ, కుమారుడు, కుమార్తె రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలను చూపి వారసత్వ రాజకీయాలు అంటూ విమర్శించేందుకు బిజెపికి మంచి అవకాశం దొరికింది. ఆ పార్టీ లేదా దాని పూర్వీకులకు దేశభక్తి, స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన పూర్వ చరిత్ర లేదు.జనసంఘం స్థాపకులలో ఒకరు విజయరాజె సింధియా, తరువాత అది పేరు మార్చుకొన్న బిజెపిలో ఆమె కుమార్తె రాజస్తాన్‌ మాజీ సిఎం వసుంధర రాజే ఇటీవల మరోసారి ఆ పదవికి పోటీ పడ్డారు. ఆమె కుమారుడు దుష్యంత్‌ సింగ్‌(ఎంపీ), ఇప్పుడు నాలుగవసారి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం స్థాపకుడు ఎన్‌టి రామారావు, కుమార్తె పురందరేశ ్వరి, కుమారులు హరికృష్ట, బాలకృష్ట, అల్లుళ్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు, కుమారుడు లోకేష్‌.ఈ కుటుంబానికి చెందిన వారు అన్నతెలుగుదేశం పార్టీని పెట్టారు. తెలుగుదేశం,కాంగ్రెస్‌, వైసిపి, బిజెపిలో చేరారు. బాలకృష్ణ మరొక అల్లుడు శ్రీ భరత్‌ విశాఖ లోక్‌సభ తెదే అభ్యర్ధి, గతంలో భరత్‌ తాత ఎంవివిఎస్‌ మూర్తి తెలుగుదేశం ఎంపీగా చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంతానం జగన్‌మోహనరెడ్డి, వైఎస్‌ షర్మిల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మహారాష్ట్రలో శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియ సూలే బారామతి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తుండగా ఎన్‌సిపి నుంచి ఫిరాయించి బిజెపితో చేతులు కలిపిన అజిత్‌ పవార్‌ భార్య సునేత్ర ఇప్పుడు అక్కడ బిజెపి కూటమి తరఫున పోటీలో ఉన్నారు. ఇలా వివిధ రాష్ట్రాలలో కుటుంబాల నేపధ్య ప్రాతినిధ్యం పెరుగుతోంది.ఎక్కడైనా సీటు రాకపోతే, ఉన్న పార్టీలో గెలిచే అవకాశాలు లేకున్నా వేరే పార్టీలో చేరిపోతున్నారు.చత్రపతి శివాజీ వారసులమని చెప్పుకుంటూ తమను గెలిపించాలని కొల్లాపూర్‌లో ఒకరు కాంగ్రెస్‌ తరఫున మరొకరు బిజెపి తరఫున పోటీ చేస్తున్నారు. జనాన్ని మోసం చేయటం గాకపోతే శివాజీ వారసత్వానికి ఈ ఎన్నికలకు సంబంధం ఏమిటి ?


కాశ్మీరును స్వతంత్ర దేశంగా ఉంచాలని నాటి రాజు హరిసింగ్‌ చూస్తే దానికి వ్యతిరేకంగా భారత్‌లో విలీనం కోసం ఉద్యమించిన నేత షేక్‌ అబ్దుల్లా, కుమారుడు ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ ఫరూక్‌ అబ్దుల్లా. నేషనల్‌ కాన్ఫరెన్సు పార్టీ నేతలుగా ఉన్నారు. ఆ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించి తరువాత దాన్నుంచి విడివడి కాంగ్రెస్‌, జనతాదళ్‌లో పని చేసి స్వంత పార్టీ పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీని ఏర్పాచేసిన ముప్తీ మహమ్మద్‌ సయీద్‌ రెండుసార్లు సిఎంగా పని చేశారు. ఆయన కుమార్తె మెహబూబా ముప్తి ముఖ్యమంత్రి పదవి కోసం బిజెపితో చేతులు కలిపారు.ఈ రెండు పార్టీల నేతల కుటుంబ సభ్యులు, బంధువులు అనేక మంది ముఖ్యమైన పదవులను అనుభవించారు. కర్ణాటకలో అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న జెడిఎస్‌ నేత కుమారస్వామి గురించి తెలిసిందే. సిఎం పదవి కోసం బిజెపి, కాంగ్రెస్‌ రెండింటితో చేతులు కలిపారు. తండ్రి దేవెగౌడ జెడిఎస్‌కు జాతీయ నేత,ఒక కుమారుడు కుమారస్వామి, మరోకుమారుడు రేవన్న ఎంఎల్‌ఏ, ఇప్పుడు అత్యాచారం, కిడ్నాప్‌ కేసులో అరెస్టయ్యారు. రేవన్న కుమారుడు ప్రజ్వల్‌ ఎంపీ,మహిళలపై అత్యాచార వీడియోలు, కేసుల కారణంగా దేశం విడిచి పారిపోయినట్లు వార్తలు. ఈ పెద్దమనిషిని గెలిపించాలని నరేంద్రమోడీ కర్ణాటకలో ప్రచారం తెలిసిందే. కర్ణాటకలో యెడియూరప్ప కుటుంబ రాజకీయాలు, పదవి కోసం అవకాశం వాదం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌లో సమాజవాదీ, ఆర్‌జెడి నేతలు, హర్యానాలో దేవీలాల్‌, ఉత్తర ప్రదేశ్‌ మాజీ ప్రధాని చరణ్‌ సింగ్‌ కుటుంబ సభ్యుల పదవుల గురించి తెలిసిందే.


ఇక బిజెపి వారసత్వ రాజకీయాల గురించి చూస్తే లోక్‌సభ, రాజ్యసభల్లో ఉన్న 388 మంది ఎంపీల్లో 45 మంది కుటుంబ నేపధ్యం ఉన్నవారే. బిజెపి ఇటీవలి సంవత్సరాలలోనే వివిధ రాష్ట్రాలలో అధికారానికి వచ్చింది కనుక రాజకీయ వారసులు పుట్టుకు వచ్చారు. రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతారు. అసలు బిజెపి మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌లో రాజరిక లక్షణాలు ఉంటాయి. ఒకసారి ఆ సంస్థకు అధిపతిగా నియమితులైన వారు జీవితాంతం కొనసాగుతారు. దానికి ఎన్నికలు ఉండవు. తాజా ఎన్నికల్లో ఏప్రిల్‌ పదవ తేదీనాటికి ప్రకటించిన అభ్యర్ధుల జాబితా ప్రకారం 250 మంది కాంగ్రెస్‌ వారిలో 65 అంటే ప్రతి నలుగురిలో ఒకరు, 424 బిజెపి జాబితాలో 87, ప్రతి ఐదుగురిలో ఒకరు రాజకీయ కుటుంబాల వారసులే ఉన్నారని హిందూస్తాన్‌ టైమ్స్‌ విశ్లేషించింది. కేవలం ఒక పార్టీలో ఉంటూ వారసత్వంగా పదవుల్లోకి రావటాన్నే వారసత్వం అనటానికి లేదు. వీరంతా కేవలం బిజెపి నేతల రాజకీయ వారసులే కాదు, వివిధ పార్టీలో పదవులు అనుభవించిన వారి వారసులు కూడా ఉన్నారు. ఉదాహరణకు బిజెపి అభ్యర్ధిగా ఉన్న మాజీ సిఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఆయన తండ్రి అమరనాధరెడ్డి కాంగ్రెస్‌లో పదవులు అనుభవించిన వారే. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు నీరజ్‌ మరొకరు. మాజీ ప్రధాని లాల్‌ బహుదూర్‌ శాస్త్రి కుమారులు, మనవలు డొల్లుపుచ్చకాయల్లా ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఒక మనవడు సిద్దార్దనాద్‌ సింగ్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ బిజెపి ఎన్నికల పర్యవేక్షకుడిగా ఉన్నారు. తండ్రి అమిత్‌ షా కేంద్ర మంత్రిగా ఉన్న కారణం తప్ప అసలు క్రికెట్‌ ఆడకుండానే బిసిసిఐ కార్యదర్శిగా జరు షా ఎన్నికకాలేదా అని ఆమ్‌ ఆద్మీ నేత సంజరు సింగ్‌ ప్రశ్నించారు. దేశంలో కుటుంబవారసత్వ రాజకీయాలంటే నెహ్రూ కుటుంబాన్నే ముందు చెబుతారు.ఇప్పుడు అనేక కుటుంబాలు రంగంలోకి వచ్చాయి.ఐదు సంవత్సరాల క్రితం ప్రింట్‌ అనే పత్రిక అలాంటి 34 కుటుంబాలను గుర్తించింది.ఇరవై రాష్ట్రాలలో వీరు ఉన్నట్లు పేర్కొన్నది. కనీసం ముగ్గురు కుటుంబ సభ్యులు రాజకీయాల్లో వున్నవారిని పరిగణనలోకి తీసుకుంది. ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటాయి.


కుటుంబ రాజకీయాలకు తాము వ్యతిరేకమని, తమ నేత తమ కుటుంబ సభ్యులను ఎవరినైనా రాజకీయాల్లోకి తీసుకు వచ్చారా చూడండని బిజెపి నేతలు అడ్డుసవాళ్లు విసురుతారు.దేశం కోసం-ధర్మం కోసం కట్టుకున్న భార్యను భారతీయ సంప్రదాయం ప్రకారం వదలి పెట్టకూడదు.రాజ్యాంగం ప్రకారం విడాకులు ఇవ్వకుండా, పట్టించుకోకుండా భార్యను వదలి పెట్టటం చట్ట విరుద్దం.నరేంద్రమోడీకి తనదంటూ కుటుంబం లేకపోవచ్చు గానీ, కుటుంబవారసులను రంగంలోకి తెస్తుంటే ఎందుకు అనుమతిస్తున్నట్లు ? అభ్యర్ధుల జాబితాల్లో నేర చరిత్ర ఉన్నవారు, కోటీశ్వరులు రోజు రోజుకూ పెరుగుతున్నారు. అలాంటి వారు లేకపోతే నరేంద్రమోడీ ఉండరు అన్నది దిగమింగలేని నిజం కనుక. గతంలో బిజెపి నేతలు ఇతర పార్టీల వారినే కుటుంబ వారసత్వం, రాజకీయాల గురించి వేలెత్తి చూపేవారు. ఇప్పుడు బిజెపిలోనే అది ప్రారంభమైంది. కర్ణాటకలో ఎడియూరప్ప తన కుమారుడిని రానున్న రోజుల్లో సిఎం చేసేందుకు చూస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీకి దిగి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కెఎస్‌ ఈశ్వరప్ప ధ్వజమెత్తారు. ఏ హిందూత్వ పేరుతో బిజెపి రాజకీయం చేస్తున్నదో దాన్నే ముందుకు తెచ్చి పార్టీలో హిందూత్వకోసం పని చేస్తున్న నేతలను ఎడియూరప్ప పక్కన పెడుతున్నారని కూడా విమర్శించారు. బిజెపిలో ఇది ఆరంభం మాత్రమే !