Tags

, , , , , , , ,


మధులిమాయే


నేను 1937లో రాజకీయ జీవితంలో ప్రవేశించాను. ఆ రోజుల్లో పూనాలో ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు సావర్కర్‌వాదులు( వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ అనుచరులు) ఒక వైపు, మరోవైపు జాతీయవాదులు, సోషలిస్టులు మరియు వామపక్ష రాజకీయ సంస్థలు ఎంతో చురుకుగా ఉండేవి.1938 మే ఒకటవ తేదీన మే దినోత్సవాన్ని పాటించేందుకు మేము ఒక ప్రదర్శన జరిపాము. దాని మీద ఆర్‌ఎస్‌ఎస్‌, సావర్కర్‌వాదులు దాడి చేశారు. ఆ సందర్భంగా సుపరిచితులైన విప్లవవాది సేనాపతి బాపట్‌, మా సోషలిస్టు నేత ఎస్‌ఎం జోషి కూడా గాయపడిన వారిలో ఉన్నారు. హిందూత్వ సంస్థలతో అప్పటి నుంచి మాకు తీవ్రమైన విబేధాలు ఉండేవి. జాతీయవాద సమస్య మీద ఆర్‌ఎస్‌ఎస్‌తో మా తొలి విబేధం ఉంది. భారత దేశంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉండాలని మేము నమ్మాము. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌, సావర్కర్‌ వాదులు హిందూ రాష్ట్ర అనే భావంతో వచ్చారు. మహమ్మదాలీ జిన్నా కూడా అలాంటి లోకపు భావన బాధితుడే. భారత్‌ రెండు – ముస్లిం, హిందూ దేశాలతో ఏర్పడిందని అతను నమ్మారు, సావర్కర్‌ కూడా అదే చెప్పారు.


మా మధ్య రెండో ప్రధాన విబేధం ఏమిటంటే మేము ఒక ప్రజాస్వామిక సర్వసత్తాక రాజ్యం ఉద్భవించాలని కలగన్నాము, ప్రజాస్వామ్యం పశ్చిమదేశాల భావన, భారత్‌కు పనికిరాదని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పింది. ఆ రోజుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు అడాల్ఫ్‌ హిట్లర్‌ను ఎంతగానో పొగిడేవారు. గురూజీ(మాధవ సదాశివ గోల్వాల్కర్‌) ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగానే కాదు సైద్దాంతిక గురువుగా కూడా ఉండేవారు.గురూజీ మరియు నాజీల మధ్య ఆలోచనల్లో అద్భుతమైన సామీప్యతలు ఉన్నాయి. ఆయన ఉత్తమ రచనల్లో ఒకటిగా ఉన్న ” ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్‌డ్‌ ” అనే గ్రంధం అనేక ప్రచురణలు పొందింది. హిందువులు కాని వారిని పౌరులుగా పరిగణించకూడదని స్పష్టంగా దానిలో చెప్పారు.వారి పౌరసత్వహక్కులను రద్దుచేయాలని కోరారు. ఈ ఆలోచనలు కొత్తగా రూపుదిద్దుకున్నవి కాదు. మేము కాలేజీలో ఉన్న రోజుల నుంచి(1930 దశకం మధ్యలో) హిట్లర్‌ భావజాలం వైపు ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు మొగ్గుచూపేవారు. వారి దృష్టి ప్రకారం జర్మనీలో యూదుల పట్ల హిట్లర్‌ ఎలా వ్యవహరించాడో అదే మాదిరి భారత్‌లో ముస్లింలు, క్రైస్తవుల పట్ల వ్యవహరించాలి.నాజీ పార్టీ భావాల పట్ల గురూజీ ఎంతలా సానుకూలంగా ఉన్నారో ” ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్‌డ్‌ ” గ్రంధంలో దిగువ పేరాయే సాక్ష్యం.” తన జాతి, సంస్మృతిని పరిశుద్దంగా ఉంచేందుకు సెమిటిక్‌ జాతులను-యూదులను అంతమొందించి జర్మనీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. జాతి ఔన్నత్యం దాన్ని ఉన్నతిని ఇక్కడ స్పష్టం చేసింది. జాతులు,సంస్కృతుల మధ్య ఉన్న విబేధాలకు కారణాలు తెలుసుకొంటే వాటిని తొలగించటం అసాధ్యం కాదని, ఐక్యంగా ఉంచటానికి సమీకృతం చేసేందుకు ప్రపంచానికి జర్మనీ దారి చూపింది, దాన్నుంచి నేర్చుకొనేందుకు, లబ్దిపొందేందుకు హిందూస్తాన్‌లో మనకు మంచి పాఠం ”


కుల సమస్య మీద గురూజీ మరియు ఆర్‌ఎస్‌ఎస్‌తో మా మూడో ప్రధాన విబేధం. ఒక సోషలిస్టుగా నా వంటి వారికి అది ఒక పెద్ద శత్రువు కాగా కుల వ్యవస్థ సమర్ధకులు వారు. కుల వ్యవస్థ దాని పునాదిగా ఉన్న అసమానతలను నిర్మూలించకుండా భారత్‌లో ఆర్థిక, సామాజిక సమానత్వం సాధ్యం కాదన్నది నా గట్టి వైఖరి. మేము విబేధించిన నాలుగో అంశం భాష. పౌరుల భాషలను ప్రోత్సహించేందుకు మేము అనుకూలం. అన్ని ప్రాంతీయ భాషలు దేశీయమైనవే. కానీ దీని మీద చెప్పిందేమిటి ? అందరికీ ఉమ్మడి భాషగా ప్రస్తుతానికి హిందీని, తరువాత అంతిమంగా జాతీయ భాషగా సంస్కృతాన్ని చేయాలని గురూజీ చెప్పారు. ఐదవది, స్వాతంత్య్రం కోసం తలెత్తిన జాతీయ ఉద్యమం ఫెడరల్‌ రాజ్యం అనే భావనను ఆమోదించింది. ఒక సమాఖ్య దేశంలో కొన్ని నిర్దేశిత విషయాలలో కేంద్రం కొన్ని తప్పనిసరి అధికారాలను కలిగి ఉంటుంది, ఇతర అన్ని అంశాలు రాష్ట్రాలకు చెందినవిగా ఉండాలి. కానీ దేశ విభజన తరువాత కేంద్రాన్ని పటిష్టపరిచేందుకు ఉమ్మడి జాబితాను నిర్దేశించారు. ఈ జాబితా ప్రకారం అనేక అంశాలను ఉమ్మడి జాబితాలో చేర్చారు. వాటి మీద కేంద్రం, రాష్ట్రాలకు సమానమైన అధికారపరిధి ఉంది.ఆ విధంగా సమాఖ్య రాజ్యం ఉనికిలోకి వచ్చింది. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు దాని ప్రధాన సిద్దాంతవేత్త గురు గోల్వాల్కర్‌ ఈ మౌలిక రాజ్యాంగ ఏర్పాటును వ్యతిరేకించారు. రాష్ట్రాల సమాఖ్య భావననే వీరు అపహాస్యం చేశారు. రాష్ట్రాల సమాఖ్యను కోరిన రాజ్యాంగాన్నే రద్దు చేయాలన్నారు. తన ” బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ ” అనే గ్రంధంలో రాజ్యాంగాన్ని సమీక్షించాలని, కొత్త రాజ్యాంగంలో ఏక(యూనిటరీ) రాజ్య ఏర్పాటును లిఖించాలని పేర్కొన్నారు. ఏక లేదా మరో మాటలో చెప్పాలంటే కేంద్రీకృత రాజ్యాన్ని గురూజీ కోరారు.రాష్ట్రాల వ్యవస్థను వదిలించుకోవాలని చెప్పారు.


జాతీయోద్యమం ఎంచుకున్న త్రివర్ణ పతాకం మరొక సమస్య. మనం ఎంచుకున్న జాతీయ పతాక గౌరవం, ఔన్నత్యం కోసం వందలాది మంది భారతీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారు, వేలాది మంది లాఠీ దెబ్బలను తిన్నారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆర్‌ఎస్‌ఎస్‌ త్రివర్ణాన్ని జాతీయ జెండాగా ఎన్నడూ ఆమోదించలేదు. అది ఎల్లవేళలా కాషాయపతాకానికే వందనం చేస్తుంది.స్మృతికందని కాలం నుంచీ అది హిందూ రాజ్య పతాకంగా ఉందని చెబుతుంది.ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల గురూజీకి విశ్వాసం లేదు. ప్రజాస్వామ్య భావన పశ్చిమ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నదనే ధృడ వైఖరిని కలిగి ఉన్నారు. భారతీయ నాగరికత, ఆలోచనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తగినది కాదన్నారు. ఏక నాయకత్వ సూత్రాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ నమ్ముతుంది.ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక మానసిక దృక్పధాన్ని సృష్టిస్తుందని అది పూర్తిగా క్రమశిక్షణతో కూడుకున్నదిగా ఉంటుందని అది ఏం చెబితే దాన్ని జనం అంగీకరిస్తారని గురూజీ కూడా స్వయంగా చెప్పారు. ఈ సంస్థ ఏక వ్యక్తి నాయకత్వ సూత్రం మీదనే పనిచేస్తుంది. సోషలిజం గురూజీ దృష్టిలో పూర్తిగా వెలుపలి భావజాలం, సోషలిజం, ప్రజాస్వామ్యంతో పాటు అన్ని ఇజాలూ విదేశీ ఆలోచనలే, వాటిని తిరస్కరించాలని, భారతీయ సమాజాన్ని భారతీయ సంస్కృతి ఆధారంగా నిర్మించాలని అతను పదే పదే చెప్పారు. మా గురించి చెప్పాలంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం,సోషలిజం పట్ల మాకు విశ్వాసం ఉంది. శాంతియుత పద్దతుల్లో గాంధియన్‌ సూత్రాలకు అనుగుణంగా సోషలిజాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము. మరోవైపు ఒక ప్రత్యేక మూసలో యువ మెదళ్లను తయారు చేయటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక నైపుణ్యాన్ని సంతరించుకుంది. తొలుత అది పిల్లలు, యువత మెదళ్లలోకి ఏమీ ప్రవేశించకుండా ఘనీభవింపచేస్తుంది. ఆ తరువాత వారు ఇతర భావజాలాలకు స్పందించలేని అశక్తులుగా మారిపోతారు.


పేదల పట్ల కనికరం అవసరం లేదని గురూజీ భావించారు. తన బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ గ్రంధంలో దేశంలో జమిందారీ వ్యవస్థ రద్దు పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఆ వ్యవస్థ రద్దు పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేయటమే కాదు, తీవ్రంగా కలత చెందారు. ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని రుద్దినపుడు వీరితో(ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు జనసంఫ్‌ు) మేము ఒక కూటమి కట్టామన్నది ఒక వాస్తవం. ఒక పార్టీగా ప్రతిపక్షాలు ఐక్యంగాకపోతే ఇందిరా గాంధీని ఓడించలేమని లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ నమ్మారు.చౌదరి చరణ్‌ సింగ్‌ కూడా అలాంటి వైఖరినే కలిగి ఉన్నారు గనుక మేము ఒకే పార్టీగా ఐక్యమయ్యాము. మేము జైల్లో ఉండగా ఒక పార్టీని ఏర్పాటు చేయటం, ఎన్నికల్లో పోటీ చేయటం గురించి అబిప్రాయాలు చెప్పమని మమ్మల్ని అడిగారు. మనం తప్పనిసరిగా ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక సందేశాన్ని పంపిన అంశాన్ని గుర్తు చేసుకున్నాను. కోట్లాది మంది జనం ఎన్నికల్లో పాల్గొంటారు. ఎన్నికలు ఒక క్రియాశీల క్రమం. ఎన్నికల వాతావరణం పెరిగే కొద్దీ అత్యవసర పరిస్థితి సంకెళ్లు తెగుతాయి,జనం తమ ప్రజాస్వామిక హక్కును వినియోగించుకుంటారు. అందువలన మనం ఎన్నికల్లో పాల్గొనాలని నేను గట్టిగా చెప్పాను. ఒకే పార్టీ పతాకం కిందకు అందరూ రాకపోతే విజయం సాధించలేమని లోక్‌ నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ ఇతర నేతల వైఖరి ఉన్న కారణంగా సోషలిస్టులంగా మా అంగీకారం తెలిపాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నొక్కి చెప్పదలచాను. రాజకీయ పార్టీలు-జనసంఫ్‌ు, సోషలిస్టు పార్టీ, కాంగ్రెస్‌(ఓ), భారతీయ లోక్‌దళ్‌(బిఎల్‌డి), కాంగ్రెస్‌ ముఠాలలోని కొన్ని అసంతృప్త తరగతుల మధ్య మాత్రమే అవగాహన కుదిరింది.ఆర్‌ఎస్‌ఎస్‌తో ఎలాంటి ఏర్పాటుకు మేము రాలేదు, దాని డిమాండ్లను వేటినీ అంగీకరించలేదు. ఇంకా చెప్పాల్సిందేమంటే జైల్లో ఉన్న మా మధ్య పంపిణీ అయిన మనూభారు పటేల్‌ లేఖ ద్వారా 1976 జూలై 7న మేము తెలుసుకున్నదేమంటే కొత్త పార్టీలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారు కూడా పార్టీ సభ్యులైతే ద్వంద్వ సభ్యత్వ వివాదం తలెత్తవచ్చని చౌదరి చరణ్‌ సింగ్‌ ఒక సమస్యను లేవనెత్తారు. దీని మీద అప్పుడు జనసంఫ్‌ు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఓమ్‌ ప్రకాష్‌ త్యాగి స్పందిస్తూ కొత్త పార్టీ సభ్యత్వాన్ని ఎలా కావాలంటే అలా రూపొందిచుకోవచ్చని స్పందించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నందున రద్దయినట్లేనని, ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యత్వ సమస్య తలెత్తదని కూడా చెప్పారు.


తరువాత ప్రతిపాదిత జనతా పార్టీ నిబంధనావళిని రూపొందించేందుకు ఒక ఉపసంఘాన్ని నియమించారు. జనతా పార్టీ లక్ష్యాలు, విధానాలు, కార్యక్రమాలతో విబేధించే ఏ సంస్థకు చెందిన వారికీ జనతా పార్టీలో సభ్యత్వం ఇవ్వకూడదని ముసాయిదా నిబంధనావళిలో పెట్టారు. దీని అర్ధం ఏమంటే ఎవరూ ఈ నిబంధనను వ్యతిరేకించకూడదన్నది స్పష్టం.అయినప్పటికీ దీనికి వచ్చిన ఒకే ఒక అభ్యంతరం జనసంఫ్‌ుకు చెందిన సుందర్‌ సింగ్‌ భండారీ నుంచి వెలువడటం గమనించాలి. తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు 1976 డిసెంబరులో ఏర్పాటు చేసిన సమావేశానికి జనసంఫ్‌ు, ఆర్‌ఎస్‌ఎస్‌ తరఫున అతల్‌ బిహారీ వాజ్‌పాయి రాసిన లేఖలో ప్రతిపాదిత పార్టీలో ఒక తరగతి నేతలు జనతా పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఆర్‌ఎస్‌ఎస్‌ సమస్యను లేవనెత్తకూడదని అంగీకరించినట్లు పేర్కొన్నారు. అయితే అనేక మంది నేతలు అలాంటి హామీ ఇవ్వలేదని నాకు చెప్పారు. ఎందుకంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీలు విలీనం కావాలని తలపెట్టినపుడు రంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఎక్కడా లేదు గనుక అన్నారు. నేను ఒకటి స్పష్టం చేయదలచాను. ఆ సమయంలో నేను జైల్లో ఉన్నాను. ఒక వేళ ఒక రహస్య అవగాహనకు వచ్చి ఉండి ఉంటే దానిలో నాకు భాగస్వామ్యం లేదు.


నేను ఒకటి విస్పష్టంగా చెప్పగలను. జనతా పార్టీ ఎన్నికల ప్రణాళిక ఏ రీత్యా చూసినా ఆర్‌ఎస్‌ఎస్‌ అంశాలను ప్రతిబింబించలేదు. వాస్తవానికి ప్రణాళికలోని ప్రతి అంశమూ స్పష్టంగా ఉంది. లౌకిక, ప్రజాస్వామిక, గాంధియన్‌ సూత్రాల ప్రాతిపదికగా సోషలిస్టు సమాజం గురించి జనతా పార్టీ ప్రణాళిక ఉంది.దానిలో హిందూ దేశం గురించిన ప్రస్తావన లేదు.మైనారిటీలకు సమానహక్కులకు హామీ ఇవ్వటమే కాదు, వారి హక్కులకు రక్షణ కల్పిస్తామని కూడా చెప్పింది. కుల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పిందా ? ఇతరుల సేవకు శూద్రులు తమ జీవితాలను అర్పించాలని చెప్పిందా ? దానికి విరుద్దంగా వెనుకబడిన తరగతుల పురోగమనానికి వాగ్దానం చేయటమే కాదు పూర్తి అవకాశాలు కల్పిస్తామని చెప్పింది, వారికోసం ప్రత్యేక విధానాలు తీసుకొస్తామని పేర్కొన్నది. వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 25-33శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పింది. గురూజీ కేంద్రీకరణ జరపాలని గట్టిగా చెప్పగా వికేంద్రీకరిస్తామని జనతా పార్టీ అంగీకరించింది. రాష్ట్రాలను రద్దు చేయాలని, అసెంబ్లీలను, మంత్రివర్గాలను కూడా రద్దు చేయాలని అతను కోరగా మరింత వికేంద్రీకరణ జరగాలని జనతా పార్టీ నొక్కివక్కాణించింది. మరో విధంగా చెప్పాలంటే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని లాక్కోవాలన్న వాంఛ జనతా పార్టీకి లేదు.


పార్టీ ఎన్నికల ప్రణాళికలోని అంశాలను స్వచ్చందంగా అంగీకరించలేదన్నది నిజం. ఇది నా అభ్యంతరం, అంతే కాదు రాతపూర్వకంగా ఒకసారి కుష్‌భాహు థాకరేకు ఫిర్యాదు చేశాను. చర్చల సందర్భంగా మీవారు(ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఫ్‌ు) వెంటనే అంగీకరించినా హృదయపూర్వకంగా పూర్తిగా వ్యతిరేకించారని నేను చెప్పాను. అందుకే మీ ఉద్దేశ్యాలను అనుమానించాల్సి వస్తోంది.ఈ లేఖను నేను ఎంతో కాలం క్రితమే రాశాను, ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి నాకు ఎప్పుడూ సందేహమే.నిరంకుశత్వాన్ని వ్యతిరేకించేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలన్న లోక్‌ నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ వాంఛ, ఎలాంటి రాజీలు లేకుండా పార్టీ ఎన్నికల ప్రణాళిక ఉండటం వలన మన ఐక్యతకు నేను ఆమోదం తెలిపాను. అదే సమయంలో నేను ఒకటి చెప్పదలచుకున్నాను. ప్రారంభం నుంచి నాకు ఒక స్పష్టత ఉంది ఐక్య, విశ్వసనీయమైన జనతా పార్టీ ఆవిర్భవించాలంటే రెండు పనులు చేయాల్సి ఉంటుందని నా మనసులో ఉంది. ఒకటి, ఆర్‌ఎస్‌ఎస్‌ తన భావజాలాన్ని మార్చుకోవాలి మరియు లౌకిక,ప్రజాస్వామిక రాజ్య భావనను అంగీకరించాలి.రెండవది, సంఘపరివార్‌లో భాగంగా ఉన్న వివిధ సంస్థలు భారతీయ మజ్దూర్‌ సంఫ్‌ు, విద్యార్ధి పరిషత్‌ వంటివి తమను తాము రద్దు చేసుకొని లౌకిక భావజాలం ఉన్న కార్మిక సంఘాల్లో, జనతా పార్టీ విద్యార్థి విభాగంలో విలీనం కావాలి. జనతా పార్టీ కార్మిక విభాగం, విద్యార్థి విభాగాల వ్యవహారాలను పర్యవేక్షించమని పార్టీ నాకు విధి అప్పగించిన నాటి నుంచీ నేను దీని గురించి స్పష్టతతో ఉన్నాను. ఈ రెండు సంస్థలూ ప్రత్యేక ఉనికిని రద్దు చేసుకోవాలని నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. హిందువులను మాత్రమే సంఘటితపరచాలనే మీ భావజాలాన్ని వదలి వేసుకోవాలని, మీ సంస్థలో అన్ని మతాల వారికీ చోటు కల్పించాలని,జనతా పార్టీలో ఉన్న భిన్నమైన తరగతుల ప్రాతిపదికన ఉన్న సంస్థలలో విలీనం కావాలని నేను ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులకు చెప్పాను. అది వెంటనే జరిగేది కాదని, అనేక ఇబ్బందులు ఉన్నాయని, కానీ కొద్ది కొద్దిగా మారాలని కోరుకుంటున్నట్లు వారి స్పందన ఉంది. వారు అలా తప్పించుకొనే జవాబులను కొనసాగించారు.


వారి ప్రవర్తన చూసిన తరువాత వారిలో మార్పు ఉద్దేశ్యం లేదన్న నిర్దారణకు వచ్చాను.ప్రత్యేకించి 1977జూన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత వారు నాలుగు రాష్ట్రాల్లో, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారానికి రాగలిగారు. అప్పటి నుంచి కొత్తగా వచ్చిన ప్రతిష్టతో మారాల్సిన అవసరం లేదని వారు ఆలోచించటం ప్రారంభించారు.ఇప్పటికే వారు నాలుగు రాష్ట్రాలను కైవశం చేసుకున్నారు. క్రమంగా ఇతర రాష్ట్రాలను, చివరకు కేంద్రాన్ని కూడా పట్టుకొనేందుకు చూస్తారు. జనతా పార్టీలోని ఇతర రాజకీయ నేతలు పెద్ద వారు, వారు ఎంతో కాలం జీవించలేరు. పార్టీలో ఉన్న ఉన్నత స్థానాలకు ఎదిగేట్లు ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘేతర నేతలను చేయలేరు. అయినప్పటికీ నేను ప్రయత్నించాను. ఒక సందర్భంగా అన్ని కార్మిక సంఘాలనేతల సమావేశం ఏర్పాటు చేశాను. జనతా పార్టీలోని అన్ని పక్షాల ప్రతినిధులు వచ్చారు, భారతీయ మజ్దూర్‌ సంఫ్‌ు సమావేశాన్ని బహిష్కరించింది. అంతే కాదు ఎలాంటి కారణం లేకుండానే వారు నన్ను దూషించారు. విద్యార్థి పరిషత్‌, యువమోర్చాలతో అలాంటి ప్రయత్నమే జరిగింది. విలీనం కోసం జరిగిన అన్ని ప్రయత్నాలకూ వారు దూరంగా ఉన్నారు. ఇదంతా ఎందుకు అంటే పార్టీ మీద పెత్తనం చేయాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌ వాంఛ కారణంగానే. ప్రజల ప్రతి జీవనరంగంలోకి ప్రవేశించాలన్నది వారి లక్ష్యం, అంతేకాదు దాన్ని అదుపు చేయాలన్నది కూడా. ఇలాంటి అభిప్రాయాలను గురూజీ తన ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్డ్‌ అనే గ్రంధంలో పదే పదే వక్కాణించారు. నిరంకుశ సంస్థ ఏదీ స్వేచ్చను అనుమతించదు. దాని వేర్లు కళలు, సంగీతం, ఆర్థికం, సాంస్కృతిక రంగం ప్రతిచోటా ఉంటాయి. ప్రతి ఫాసిస్టు సంస్థ సారం ఇదే. వీరు అరుదైన సందర్భాలలో చేసేదానికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. గురూజీ బాటలో ఆలోచనలను వదలి వేస్తామని ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నడూ చెప్పలేదు. జైళ్లలో ఉన్నపుడు వీరు క్షమాభిక్ష కోసం ప్రార్ధించారు. రాజనారాయణ్‌ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇందిరా గాంధీకి అనుకూలంగా వచ్చినపుడు బాలాసాహెబ్‌ దేవరస్‌ ఆమెను అభినందించారు. అందువలన వీరి ఉద్ఘాటనల మీద నాకు నమ్మకం లేదు. నేను వీరిని (జనతా పార్టీలో పూర్వపు జనసంఫ్‌ు నేతలు) ఎప్పుడు నమ్ముతానంటే పార్టీ, కార్యవర్గ కమిటీల నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలను బహిష్కరించినపుడు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాల మీద ఆంక్షలు విధించినపుడు, ప్రత్యేకించి నానాజీ దేశముఖ్‌, సుందర్‌ సింగ్‌ బండారీ వారి అనుచరులను బహిష్కరించినపుడే నమ్ముతాను.


గమనిక : మధు లిమాయే(1922 -1995 ) పూనాలో జన్మించారు. కాంగ్రెస్‌లో, కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ, తరువాత ప్రజా సోషలిస్టు పార్టీ నేతగా వ్యవహరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యత్వంపై వివాదం కారణంగా జనతా పార్టీ నుంచి పూర్వపు జనసంఘనేతలు వేరు పడి బిజెపిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అధికారం కోసం అవసరాలకు అనుగుణంగా ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ఊసరవెల్లి మాదిరి రంగులు మార్చింది తప్ప మౌలిక స్వభావం, లక్ష్యాలలో ఎలాంటి మార్పు లేదు. నాలుగు దశాబ్దాల నాడు (1979) రాసిన ఈ వ్యాసంలో లేవనెత్తిన అంశాలు నేటికీ సంగతమైనవేే గనుక జనతా వార పత్రిక నుంచి సేకరించి అనువదించి అందించాను, : ఎం కోటేశ్వరరావు