Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


అంటే అన్నారని తెగ గుంజుకుంటారు గానీ మన దేశంలో తెలివి తేటలు ఎక్కువగా ఉన్న కొందరు పడక కుర్చీల్లో కూర్చొని అభివృద్ధిప్రజాస్వామ్యం, నియంతృత్వాలకు ముడిపెట్టి భలే సొల్లు కబుర్లు చెబుతారు. అదే నిజమైతే నిజాం సంస్థానం, బ్రిటీష్‌ పాలనలోని ఇండియా అభివృద్ధిలో ఎక్కడో ఉండి ఉండాలి. అంతెందుకు మన పక్కనే ఉన్న పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, ఆఫ్ఘనిస్తాన్‌ వంటివి మన కళ్ల ముందే అమెరికాను మించిపోయి ఉండాలి. ఎందుకు ఇదంతా అంటే..... చైనా 2024 అక్టోబరు ఒకటి నుంచి ఏడు వరకు 75 సంవత్సరాల కమ్యూనిస్టు పాలన ఉత్సవాలు జరుపుకున్నది. మనదేశం రెండు 75 సంవత్సరాల స్వాతంత్య్ర ఉత్సవాన్ని రెండు సంవత్సరాల ముందే జరుపుకుంది. రెండు దేశాల మధ్య ఇష్టం ఉన్నా లేకున్నా పోలిక తెస్తున్న సంగతి తెలిసిందే. ఈ పూర్వరంగంలో చైనా మాదిరి మనదేశం ఎందుకు అభివృద్ధి చెందలేదంటే మనది ప్రజాస్వామ్యంవారిది కమ్యూనిస్టు నియంతృత్వం అని తడుముకోకుండా ఠకీమని చెబుతారు.
బిజినెస్‌ టుడే పత్రిక కమ్యూనిస్టులది కాదు, 2024 ఆగస్టు 25న గత రెండు దశాబ్దాల్లో భారత్‌చైనా ఆర్థిక వ్యవస్థలు ఎలా పనిచేసిందీ వివరిస్తూ ఒక విశ్లేషణ చేసింది.దానిలో ఉన్న కొన్ని వివరాల సారం ఇలా ఉంది. 1980లో చైనా తలసరి జిడిపి 307 డాలర్లు కాగా దాదాపు దానికి రెండు రెట్లు ఎక్కువగా 582 డాలర్లు భారత్‌లో ఉంది. 2024లో అది తారుమారై(పిపిపి పద్దతిలో) 25,01510,123 డాలర్లుగా ఉంది. ఐఎంఎఫ్‌ సమాచారం మేరకు ప్రస్తుత ధరల ప్రకారం 2024లో చైనా జిడిపి విలువ 18.53లక్షల కోట్ల డాలర్లు. 1980లో 303 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది ఈ కాలంలో 61 రెట్లు పెరిగింది. భారత్‌ 186 బిలియన్‌ డాలర్ల నుంచి 21రెట్లు మాత్రమే పెరిగి 3.93లక్షల కోట్ల డాలర్లకు చేరింది. మోడీ ఏలుబడి పదేండ్లలో 2.04లక్షల కోట్ల నుంచి 3.93లక్షల కోట్ల డాలర్లకు పెరగ్గా చైనాలో 10.5 నుంచి 18.53లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది.ప్రస్తుతం చైనా రుణభారం జిడిపిలో 88.6శాతం కాగా భారత్‌కు 82.5శాతం.1995లో చైనా రుణం 21.6శాతం కాగా భారత్‌కు 71శాతం ఉంది.యుపిఏ పాలనా కాలంలో రుణం 84.9 నుంచి 67.1శాతానికి తగ్గితే మోడీ ఏలుబడిలో అది 82.5శాతానికి పెరిగింది. ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా 2023లో మూడున్నరలక్షల కోట్ల డాలర్లు లేదా 14శాతం ఉంది. అదే భారత్‌ వాటా కేవలం 0.78లక్షల కోట్ల డాలర్లు మాత్రమే అని మెకెన్సీ నివేదిక పేర్కొన్నది.


‘‘ ప్రపంచాధిపత్యం గురించి మరచిపోండి, భారత్‌ సమీప భవిష్యత్‌లో చైనాను అందుకోలేదు ’’ అనే శీర్షికతో 2023 ఆగస్టు 18వ తేదీన హాంకాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు అనే పత్రిక ఒక విశ్లేషణ ప్రకటించింది.దాన్లో ఉటంకించిన, వెల్లడిరచిన అభిప్రాయాల సారం ఇలా ఉంది. భారత్‌ గురించి సానుకూలంగా చెబుతున్న అంచనా ప్రకారం చైనా (57లక్షల కోట్ల డాలర్లు) తరువాత అమెరికా(51.5లక్షల కోట్ల డాలర్లు )ను వెనక్కు నెట్టి భారత్‌ (52.5లక్షల కోట్ల డాలర్లు) రెండవ స్థానం సంపాదించటానికి 50 సంవత్సరాలు పడుతుంది.భారత్‌ ప్రపంచాధిపత్యం గురించి నరేంద్రమోడీ 75వ స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో చెప్పారు. కానీ గత తొమ్మిది సంవత్సరాలుగా ఆయన చెప్పిన పథకాలు కాగితాల మీదే ఉన్నాయి. భారత జిడిపి వాస్తవ వృద్ధి రేటు 2040వరకు ఏటా 8శాతం, తరువాత 5శాతం వంతున వృద్ధి చెందితే ఇదే కాలంలో అమెరికా వృద్ధి రేటు రెండుశాతమే ఉంటే అమెరికాను అధిగమించటానికి 2073వరకు భారత్‌ ఆగాలని కొలంబియా విశ్వవిద్యాలయ ఆర్థికవేత్త అరవింద్‌ పనగారియా చెప్పారు. ఇవన్నీ రానున్న 50 ఏండ్లలో ఇలా లేదా అలా జరిగితే అన్న షరతుల మీద చెప్పినవే.2000 సంవత్సరంలో ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో భారత వాటా ఒకశాతం కాగా చైనా 7శాతంతో ఉంది. అదే 2022 నాటికి 331శాతాలతో ఉన్నాయి. ప్రపంచ ఎగుమతుల్లో రెండు15శాతాలతో ఉన్నాయి.


‘‘ భారత్‌ నూతన చైనా కాదు(ఇంకా) ’’ అనే శీర్షికతో అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ 2024 మే ఎనిమిదవ తేదీన ఒక విశ్లేషణ రాసింది.దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న భారత ఆర్థిక వ్యవస్థపైకి లేస్తుందా అన్న ప్రశ్నతో ప్రారంభించి అనేక మంది ఆమెరికా కార్పొరేట్స్‌ ఆ విధంగా ఆలోచిస్తున్నారని అయితే ఇది అరగ్లాసు నిండిన కథ మాత్రమే అని వ్యాఖ్యానించింది.ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు, ఇతర సంస్థలు, కొందరు ఆర్థికవేత్తలు పేర్కొన్న పురోగతి అంకెలు, అంచనాలను పేర్కొంటూ ఇదంతా నిండిన అరగ్లాసు గురించిన పొగడ్తలుగా పేర్కొంటూ ఇతర దేశాలతో పోల్చితే పనితీరు చాలా తక్కువగా ఉన్నట్లు వ్యాఖ్యానించింది.భారత తలసరి జిడిపి అమెరికాతో పోలిస్తే 30వంతు, చైనాతో 12వ వంతు, ఇప్పుడున్న వృద్ధిరేటు ప్రకారం అమెరికా తలసరి జిడిపిలో నాలుగోవంతుకు చేరాలంటే భారత్‌కు 75 సంవత్సరాలు పడుతుందని ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్త ఇందర్‌మిత్‌ గిల్‌ అంచనా వేశారు. ఇది జరుగుతుందనే గ్యారంటీ కూడా లేదు.ఇండోనేషియా తలసరి జిడిపి 5,270 డాలర్లను చేరుకోవటానికే భారత్‌కు దశాబ్దాలు పడుతుంది.


ఫారిన్‌ పాలసీ అనే పత్రికలో అమెరికా హార్వర్డ్‌ కెనడీ స్కూలు ప్రొఫెసర్‌ గ్రాహం అలిసన్‌ 2023 జూన్‌ 24వ తేదీన ‘‘ భారత్‌ తదుపరి అగ్రరాజ్యంగా మారేందుకు చైనాను అధిగమిస్తుందా ’’ అనే శీర్షికతో ఒక విశ్లేషణ చేశాడు. అలాంటి అవకాశం లేదని నాలుగు ఇబ్బందికరమైన అంశాలు చెబుతున్నాయని పేర్కొన్నాడు. ఏప్రిల్‌ నెలలో (2023) ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా చైనాను భారత్‌ వెనక్కు నెట్టేసినపుడు పరిశీలకులు ఆశ్చర్యపోయారు. ప్రపంచ అగ్రరాజ్యంగా కూడా మారుతుందా అన్నారు.జనాభాతో పాటు గత రెండు సంవత్సరాలుగా చైనా వృద్ధి రేటు 5.5శాతం ఉంటే భారత్‌లో 6.1శాతం ఉంది, ఈ అంకెలు ఎంతో ఆశాభావాన్ని కలిగిస్తున్నాయి. భారత్‌ వేగంగా అభివృద్ది చెందుతుందని చెబుతున్నదానిని బుర్రలకు ఎక్కించుకొనే ముందు ఇబ్బందికరమైన నాలుగు వాస్తవాలు ఉన్నాయని తెలుసుకోవాలి.


మొదటిది,1990 దశకంలో భారత్‌లో పెరుగుతున్న యువజనాభాతో ఆర్థిక సరళీకరణ విధానం ఒక ‘‘ ఆర్థిక అద్బుతాన్ని’’ సృష్టిస్తుందని విశ్లేషకులు పెద్దగా చెప్పారు. అమెరికాలో భారత్‌ను ఎంతో ఆలోచనాత్మకంగా విశ్లేషించే జర్నలిస్టుల్లో ఒకరైన ఫరీద్‌ జకారియా ఇటీవల వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రికలో రాసిన వ్యాసంలో 2006లో తాను కూడా అలాంటి భావానికి లోనైనట్లు ప్రస్తావించాడు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న స్వేచ్చామార్కెట్‌ ప్రజాస్వామ్యంగా భారత్‌ను అప్పుడు దవోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక వర్ణించింది, త్వరలో భారత ఆర్థిక వ్యవస్థ చైనాను దాటిపోతుందని నాటి భారత వాణిజ్య మంత్రి చెప్పారు.భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందినప్పటికీ అద్భుతం జరగలేదని జకారియా చెప్పాడు. రెండవది, గత రెండు సంవత్సరాలలో అసాధారణ వృద్ధితో భారత్‌ ప్రపంచ ఐదు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో క్లబ్‌లో చేరినప్పటికీ చైనాతో పోల్చితే చాలా చిన్నది. మూడవది, సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, గణిత శాస్త్ర విద్యార్థులు భారత్‌ కంటే చైనాలో రెండు రెట్లు ఎక్కువ ఉన్నారు.పరిశోధనఅభివృద్ధికి జిడిపిలో భారత్‌ 0.7శాతం ఖర్చు చేస్తుండగా చైనాలో రెండుశాతం ఉంది. ప్రపంచంలోని ఇరవై పెద్ద టెక్‌ కంపెనీలలో నాలుగు చైనాలో ఉన్నాయి.భారత్‌లో ఒక్కటి కూడా లేదు. ఐదవ తరం మౌలిక సదుపాయాల్లో సగం ఒక్క చైనాయే ఉత్పత్తి చేస్తోంది. భారత్‌లో ఒక్కశాతమే ఉంది.కృత్రిమ మేథ ప్రపంచ పేటెంట్లలో చైనా 65శాతం కలిగి ఉండగా భారత్‌ వాటా మూడుశాతమే. నాలుగవది, ఒక దేశ సత్తాను విశ్లేషించేటపుడు జనాభా ఎందరని కాదు, కార్మికశక్తి నాణ్యత ఎంత అన్నది ముఖ్యం.చైనా కార్మికశక్తి ఉత్పాదకత ఎక్కువ. దుర్భరదారిద్య్రాన్ని చైనా పూర్తిగా నిర్మూలించింది.1980లో ప్రపంచ బ్యాంకు ప్రమాణాల ప్రకారం 90శాతం మంది చైనీయులు దారిద్య్రంలో ఉన్నారు.నేడు దాదాపు లేరు.భారత్‌లో పదిశాతం మందికి పైగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు.చైనాలో రెండున్నరశాతం పోషకాహారలేమితో ఉంటే భారత్‌లో 16.3శాతం ఉన్నారు. పిల్లలో పోషకాహారలేమి ఎక్కువగా ఉన్న దేశాలలో భారత్‌ ఒకటని ఐరాస నివేదిక చెప్పింది. 195051లో మన ఆహారధాన్యాల ఉత్పత్తి 51మిలియన్‌ టన్నులు కాగా ఇప్పుడు 329 మి.టన్నులకు పెరిగింది, అదే చైనాలో 113 నుంచి 695 మిలియన్‌ టన్నులకు పెరిగింది. రెండుదేశాల జనాభా ఒక్కటే, ఎక్కడ జనాల కడుపు నిండుతున్నట్లు ?


ఈ విధంగా కమ్యూనిస్టులు కానివారు చైనా 75 ఏండ్ల ప్రస్తాన ప్రాధాన్యతను తమదైన అవగాహనతో చెప్పారు. చైనాను దెబ్బతీయాలని కమ్యూనిస్టు వ్యతిరేకులు బహిరంగంగానే చెబుతున్నారు. కానీ కొంత మందికి అతిశయోక్తిగా కనిపించవచ్చుగానీ దెబ్బతీస్తే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకే ముప్పు అని అనేక మంది హెచ్చరిస్తున్నారు. ఏడున్నర దశాబ్దాల క్రితం కమ్యూనిస్టులు అధికారానికి వచ్చినపుడు ప్రపంచ ఆర్థిక రంగంలో చైనా వాటా కేవలం నాలుగు కాగా, నేడు 19శాతం ఉంది.1990దశకం వరకు పేద, వర్ధమాన దేశాలన్నీ పశ్చిమ ధనికదేశాల మీద ఆధారపడ్డాయి.గడచిన పదిహేనేండ్లుగా పరిస్థితి మారుతోంది.చైనా ప్రభావం పెరుగుతోంది. అది స్వయంగా ప్రారంభించిన బెల్డ్‌ అండ్‌ రోడ్‌ చొరవ (బిఆర్‌ఐ), ఆసియన్‌ మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంక్‌(ఎఐఐబి), న్యూడెవలప్‌మెంట్‌ బాంకు వంటి సంస్థలు కూడా పేద దేశాలకు సాయపడుతున్నాయి.అయితే కొన్ని చైనా ఎగుమతులు, ప్రాజక్టులకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ క్రమంలో నూతన అవకాశాలను వెతుక్కుంటున్నాయి. రెండు ప్రపంచ యుద్ధాలతో సామ్రాజ్యవాదులు ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోయినా చైనాను దెబ్బతీస్తే అది వర్దమానదేశాల మీద ప్రభావం చూపుతుంది.


ఎవరు అవునన్నా కాదన్నా, ఎంతగా గింజుకున్నా చైనాను కాదనలేని స్థితి.యావత్‌ ప్రపంచం హరిత ఇంథన దిశగా మారుతున్నది. దానికి చోదకశక్తిగా డ్రాగన్‌ ఉంది. మూడు నూతన వస్తువులుఎలక్ట్రిక్‌ వాహనాలు, లిథియమ్‌అయాన్‌ బ్యాటరీలు, సోలార్‌ సెల్స్‌` రంగాలలో మిగతాదేశాలన్నీ ఇప్పటికైతే దాని వెనుక నడవాల్సిందే. చిన్నవీ పెద్దవీ చైనా మౌలికవసతుల ప్రాజెక్టులు 190దేశాలు, ప్రాంతాలలో కొనసాగుతున్నాయి. నిమిషానికి ఎనిమిది కోట్ల యువాన్ల (కోటీ 14లక్షల డాలర్లు) మేర వాణిజ్య కార్యకలాపాల్లో చైనా ఉంది. గంటకు 11.2 కోట్లు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నది. రోజుకు 3,377 కోట్ల యువాన్ల మేర విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నది.


ఇక గడచిన ఏడు దశాబ్దాల్లో చూస్తే చైనా పేద, వెనుకబడిన దేశంగా ఉన్నంత కాలం అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు అది ముప్పుగా కనిపించలేదు. చివరకు కమ్యూనిస్టుల పాలనలో ఉన్నదే అసలైన చైనా అనటమే కాదు, రెండు చైనాలు లేవంటూ ప్రకటించటమే కాదు, భద్రతా మండలిలో తమ సరసన శాశ్వత సభ్యదేశంగా ఉండేందుకు అంగీకరించాయి. అది ఎప్పుడైతే పుంజుకొని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందో అప్పటి నుంచి ‘‘ ముప్పు ’’ గా పరిగణిస్తూ కుట్ర సిద్దాంతాలను జనాల మెదళ్లలో నాటుతున్నారు. నిజానికి చైనా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే ఇంకా ఎంతో వెనుకబడి ఉంది. సాధారణ తలసరి జిడిపి 2023లో అమెరికాలో 76వేల డాలర్లుంటే చైనాలో 12,720 మాత్రమే. వివిధ రంగాలలో దాని వృద్ధి వేగాన్ని చూసి తమ గుత్తాధిపత్యానికి గండిపడుతుందని అవి భయపడుతున్నాయి. తాము రూపొందించిన ఆట నిబంధనలే అమల్లో ఉండాలి, ఎప్పుడు ఎలా మారిస్తే వాటిని ప్రపంచమంతా అంగీకరించాలి, దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే తమకు ముప్పువచ్చినట్లు చెబుతారు. అది ఒక్క చైనా విషయంలోనే అనుకుంటే పొరపాటు. మనదేశం ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నప్పటికీ అలీన విధానంతో స్వతంత్ర వైఖరిని అనుసరించటం అమెరికా కూటమికి గిట్టని కారణంగా వ్యతిరేకించిన రోజులను గుర్తుకు తెచ్చుకోవాలి. పంజాబ్‌, కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలలో ఉగ్రవాదులను రెచ్చగొట్టింది కూడా దానిలో భాగమే. ఇప్పుడు నరేంద్రమోడీ వారి వైపే మొగ్గుతున్నా పూర్తిగా తమ చంకనెక్కలేదని రుసరుసలాడుతున్నాయి.తామిచ్చిన మద్దతుతో ఉక్రెయిన్‌ జెలెనెస్కీ ఏ విధంగా రష్యాకు వ్యతిరేకంగా ఒక పావుగా మారాడో చైనాకు వ్యతిరేకంగా మనదేశం కూడా అలాంటి పాత్రనే పోషించి ఘర్షణకు దిగాలని అవి కోరుకుంటున్నాయి. దానికి మన దేశంలో ఉన్న కార్పొరేట్‌ శక్తులు అంగీకరించటం లేదు. దానికి కారణం వాటికి చైనా మీద ప్రేమ కాదు, చౌకగా వస్తువులను దిగుమతి చేసుకొని లబ్ది పొందాలనుకోవటమే !