ఎం కోటేశ్వరరావు
అక్టోబరు నెల మధ్య నుంచి జరుగుతున్న పరిణామాలతో భారత్‌కెనడా సంబంధాలు తీవ్ర వత్తిడికి గురవుతున్నాయి. అమెరికా, దాన్ని అనుసరించే దేశాలన్నీ మన మీద కత్తిగట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇదే సమయంలో కెనడా పాలకపక్షంలో కొందరు ఎంపీలు ప్రధాని జస్టిన్ ట్రుడెవ్ 2024 అక్టోబరు 28లోగా పదవి నుంచి తప్పు కోవాలని, మరోసారి ఎన్నికల గోదాలో దిగవద్దని 153 మంది పాలక పార్టీ ఎంపీల్లో 24 మంది డిమాండ్ చేసినట్లు కెనడా బ్రాడ్‌కాస్ట్ కార్పొరేషన్ వార్తను ప్రసారం చేసింది. ఇది ఏ రూపం తీసుకుంటుందో తెలియదు. అంతకు ముందు పరస్పరం కొందరు దౌత్యవేత్తల బహిష్కరణ మిగిలిన సిబ్బందిపై నిఘావంటి ప్రకటనలతో ఇరుదేశాల మధ్య దౌత్య యుద్దం, ప్రచారదాడి జరుగుతోంది. ఇది రాసిన సమయానికి 270కిపైగా భారత విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న సర్వీసులకు బాంబు బెదిరింపులు రావటం ఆందోళన కలిగించే పరిణామం. గురువారం ఒక్కరోజే 95 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. గతంలో ఇలాంటి పరిస్థితిని మనం ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఏ విమానం ఎక్కితే బాంబు ఉన్నట్లు సమాచారం వస్తుందో తెలియని డోలాయమానంలోకి ప్రయాణీకులను నెట్టి భయాన్ని సృష్టించమే ఈ ఉదంతాల వెనుక ఉన్న శక్తుల ఎత్తుగడగా కనిపిస్తోంది. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా నడిపితే, ఏదైనా విమానంలో నిజంగా బాంబుపెడితే జరిగే ఘోరాన్ని తలచుకోవాలంటేనే వణుకుపుడుతోంది. దేశం 1980 దశకం నాటి ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే పరిస్థితులకు వెళుతోందా అనే సందేహాలు వెల్లడవుతున్నాయి. ఉగ్రవాదాన్ని శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూడకూడదు. అలా పరిగణిస్తే దాన్ని నివారించే బాధ్యత, పోలీసు, ఇతర భద్రతా వ్యవస్థలపై పడుతుంది. అలాంటి సంస్థలు ప్రపంచ వ్యాపితంగా అనుసరించిన దగ్గరి దారి ఏమంటే జనం మీద దాడికి దిగటం. కిరాయికి లేదా ప్రత్యేక ముఠాలను రూపొందించి ఉగ్రవాదులు, ఇతర దేశవ్యతిరేకులను మట్టుబెట్టించటం. ఇది ఒక విధంగా అధికారిక ఉగ్రదళం వంటిదే. ఉగ్రవాదులు తలెత్తకుండా ఉండాలంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి, అవాంఛనీయ చర్యలకు పాల్పడినపుడు అవసరమైతే ఆయుధ ప్రయోగం చేయవచ్చు.మన కళ్ల ముందే పాలస్తీనా దేశాన్ని విభజించి యూదుల మాతృభూమి పేరుతో ఇజ్రాయెల్ ఏర్పాటు జరిగింది.ఉనికిలో ఉన్న పాలస్తీనా అదృశ్యమైంది. దాని పునరుద్దరణకు ఏడు దశాబ్దాలుగా పోరాటం సాగుతున్నది.యావత్ పాలస్తీనియన్లు దానిలో పాల్గొంటున్నారు.వారిని కూడా ఉగ్రవాదులుగా అమెరికా చిత్రిస్తున్నది. ప్రపంచంలో వేర్వేరు కారణాలతో అనేక చోట్ల ఆందోళనలు సాగుతున్నాయి. ఈ పూర్వరంగంలో ఖలిస్తాన్ ఏర్పాటు అన్న భావనను మెజారిటీ సిక్కులు వ్యతిరేకిస్తున్నారు. వ్యక్తిగత స్థాయిలో సమర్ధించిన వారందరూ ఉగ్రవాదులు కాదు, దానికోసం ఆయుధాలు చేపట్టి, అవాంఛనీయ చర్యలకు పాల్పడిన వారు మాత్రమే తీవ్రవాదులు.
మనదేశంలో నాగాలాండ్, మిజోరాం, కాశ్మీరు, పంజాబ్ వేర్పాటు వాదం తలెత్తింది. ఆయుధాలు రంగంలోకి వచ్చాయి. వాటన్నింటికీ అమెరికా, కెనడా,బ్రిటన్, వంటి పశ్చిమదేశాలు మద్దతు ఇస్తున్నాయి, ఆ శక్తులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఒక్క మనదేశమే కాదు శ్రీలంక వేర్పాటు వాదుల వెనుక, అనేక దేశాల్లో రకరకాల పేర్లతో ఉన్న శక్తులకు మద్దతు ఇస్తున్నదీ ఈ దేశాలే. దాని వెనుక తమను వ్యతిరేకించేదేశాలను అస్తిరపరచటం లేదా విచ్చిన్నం చేసే సామ్రాజ్యవాదులు ఎత్తుగడ ఉంది, దానికి ఉగ్రవాదం ఒక ఆయుధం. కొన్ని సందర్భాలలో ఉగ్రవాద చర్యలు నిలిచిపోయాయంటే దాని అర్ధం తెరవెనుక పశ్చిమదేశాలకు అనుకూలమైన పరిణామాలు జరిగినట్లే లెక్క. తిరిగి ప్రారంభమయ్యాయంటే పూర్తిగా తమకు లొంగలేదని అవి కథనడిపిస్తున్నట్లే. లేకుంటే ఆకస్మికంగా గత పదిరోజులుగా మాత్రమే మన విమానాలకు బాంబుల బెదిరింపులు ఎందుకు వస్తున్నాయి ? అవి ఐరోపా ఖండ దేశాల నుంచే ఎలా వస్తున్నట్లు . ప్రపంచ ఉగ్రవాదుల అణచివేతకు తాయత్తు కట్టుకొని బరిలోకి దిగామని చెబుతున్న అమెరికా, కెనడా వంటి దేశాలు ఖలిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఎందుకు కల్పిస్తున్నట్లు, వారికి పౌరసత్వం ఎందుకు ఇస్తున్నాయి. పంజాబీలందరూ ఖలీస్తానీవాదులు కాదు, ఉగ్రవాదులూ కాదు. మనదేశాన్ని లొంగతీసుకోవాలని కోరుకొనే పశ్చిమదేశాలకు మేకపిల్లతోడేలు కథ మాదిరి ఏదో ఒకసాకుతో ఉగ్రశక్తులను రెచ్చగొట్టేందుకు అవకాశాలున్నాయనేది కెనడా ఉదంతం వెల్లడిస్తోంది.
అమెరికాకెనడా రెండు దేశాల్లోనూ పౌరసత్వం ఉన్న మనదేశానికి చెందిన గురుపత్వంత్ సింగ్ పన్ను అనే ఖలిస్తానీ ఉగ్రవాదిని హత్య చేసేందుకు చేసిన కుట్రలో మన గూఢచారి వికాస్ యాదవ్ ఉన్నట్లు అమెరికా కోర్టు ప్రకటించించింది. దాంతో యాదవ్ మీద అరెస్టు వారంట్ జారీచేసి ఎఫ్‌బిఐ జాబితాలో అత్యంత కీలక వాంఛనీయ వ్యక్తిగా బహిరంగంగా ప్రకటించారు. ఇలా మన పౌరుడి గురించి ప్రకటించటం ఇదే మొదటిసారి. అమెరికా మనకు అత్యంత కీలక భాగస్వామిగా ఉన్నదని నరేంద్రమోడీ గతంలో అనేకసార్లు గొప్పగా చెప్పారు. తమ అవసరాల రీత్యా డోనాల్డ్ ట్రంప్ పలు సందర్భాలలో నరేంద్రమోడీని పొగడ్తల వర్షంతో ముంచెతారు. చెట్టపట్టాలు వేసుకు తిరిగాడు, భారత దేశ పిత అంటూ కితాబులిచ్చాడు. జో బైడెన్ తక్కువ తిన్నాడా ‘‘ మోడీజీ మీరు నాకు పెద్ద సమస్య తెచ్చిపెట్టారు. నా కంటే మా దేశంలో మీ పలుకుబడి ఎక్కువగా ఉంది. మీతో కలసి భోంచేసేందుకు దేశమంతటి నుంచి ఎందరో ఎదురు చూస్తున్నారు. ఉన్న సీట్లన్నీ అయిపోయాయి. నేనేదో మిమ్మల్ని ఆటపట్టిస్తున్నా అనుకోవద్దు, ఇది నిజం, కావాలంటే నా బృందాన్ని అడగండి, రోజూఎన్నో ఫోన్లు వస్తున్నాయి నాకు.’’ గతేడాది మే నెలలో చైనాకు వ్యతిరేకంగా జరిగిన క్వాడ్(చతుష్టయ) సమావేశానికి ముందు మోడీని మునగ చెట్టు ఎక్కిస్తూ జోబైడెన్ పలుకులివి. వీటితో అనేక మంది అమెరికా అధినేతలనే మనకాళ్ల వద్దకు తెచ్చిన మొనగాడిగా నరేంద్రమోడీని పొగిడారు. రాముడు సీతను కోరినట్లుగా ఇప్పుడు దర్యాప్తుకు సహకరించి ఎలాంటి నేరం చేయలేదని నిరూపించుకోండి అంటూ నరేంద్రమోడీని అగ్నిపరీక్షకు పూనుకోవాలంటున్నా పశ్చిమదేశాలు.మరో ఖలిస్తానీ ఉగ్రవాది హరదీప్ నిజ్జర్‌ను 2023లో కెనడాలో హత్య చేశారు. దానిలో కూడా భారత అధికారుల హస్తం ఉందని కెనడా ఆరోపిస్తోంది. నిర్దిష్ట చట్టబద్ద ఆధారాలు లేవంటూనే తమ దగ్గర ‘‘ ఐదు కళ్ల ’’ నిఘా సమాచారం ఉందని చెబుతోంది. దాన్ని నిర్వహిస్తున్న దేశాలు కూడా దర్యాప్తుకు సహకరించాలని అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ గతేడాది కాలంగా వత్తిడి తెస్తున్నాయి. అమెరికా ఎలా కావాలంటే అలా నివేదికలు తయారు చేస్తే మిగిలిన దేశాలన్నీ సంతకాలు చేస్తాయన్నది తెలిసిందే. నిజానికి వాటి వద్ద ఎలాంటి సమాచారమూ లేదని వార్తలు.
ఇటీవలి కాలంలో విదేశాల్లో మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు, మరికొందరు వ్యక్తులు హత్యలకు గురవుతున్నారు. మనకు వ్యతిరేకంగా ఎవడైనా పని చేస్తూ వారికి ఇదే గతి, చూడండి మన తడాఖా, ఎలా లేపేస్తున్నామో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్న సంగతి, ఆ ఘనతను ఎవరికి ఆపాదిస్తున్నదీ తెలిసిందే.మన సీనియర్ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు నెలకు ఇద్దరు ముగ్గురు చొప్పున ఖలిస్తానీ ఉగ్రవాదులను లేపేసేందుకు యాదవ్ అనే అతన్ని కేంద్ర కాబినెట్ సచివాలయం కింద నేరుగా కిరాయికి పని చేసేందుకు ‘‘రా’’ నియమించిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు యాదవ్ ప్రభుత్వానికి పనిచేయటం లేదని విదేశాంగశాఖ ప్రకటించటం ద్వారా నియామకం వాస్తవమే అని అంగీకరించినట్లయింది. ఇప్పుడు వచ్చిన ఆరోపణలపై మన ప్రభుత్వమే విచారణ జరుపుతుందా లేక అమెరికా దర్యాప్తు సంస్థలకు అతన్ని అప్పగిస్తుందా అన్నది తెలియదు. ఏది జరిగినా పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉండేది ఊహించలేము. విదేశాలలో ఉన్న తమ వ్యతిరేకశక్తులను మట్టుపెట్టేందుకు సిఐఏ,మొసాద్, ఐఎస్‌ఐల కిందపనిచేసే హంతక దళాలను ఆయా ప్రభుత్వాలు నియమించటం, వాటి దుర్మార్గాల గురించి మనకు తెలిసిందే. అయితే గతంలో ఎన్నడూ మన ప్రభుత్వం వినియోగించిన దాఖలాలు లేవు.ఇదొక ప్రమాదకరమైన క్రీడ.
కెనడాను మనం ఎంతగా కౌగిలించుకున్నా గతంలో ఎన్నడూ అది మిత్రదేశంగా చూడలేదు. దాన్ని కాదని మనల్ని ఎన్నడూ అమెరికా విశ్వాసంలోకి తీసుకోలేదు.ప్రస్తుతం కెనడా ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రుడేవ్ తండ్రి కూడా గతంలో ప్రధానిగా పనిచేశాడు. రెండు దేశాల మధ్య తాజా వివాదానికి 2018లో జరిగిన ఉదంతం నాంది అని చెప్పవచ్చు. కెనడాలో ఏడు లక్షల 70వేల మంది సిక్కులు ఉన్నారు. జనాభాలో వారి 2.1శాతమే అయినప్పటికీ అక్కడి రాజకీయాల్లో ఎంతో పలుకుబడి కలిగిన వారు. 2018లో ప్రధాని ట్రుడేవ్ మనదేశానికి రానున్న సందర్భంగా అతగాడి కార్యాలయం మనదేశానికి చెందిన వారితో సహా 423 మంది పేర్లతో ఒక అతిధుల జాబితాను రూపొందించి వారిని ఆహ్వానించాలని ఆదేశించింది. వారిలో జస్పాల్ సింగ్ అత్వాల్ అనే నేరగాడు ఒకడు.1986లో పంజాబ్ మంత్రిగా ఉన్న అకాలీ నేత మల్కాయిత్ సింగ్ సిద్దు మీద కెనడాలో హత్యాయత్నం జరిగింది. శిక్షపడిన వారిలో అత్వాల్ ఒకడు.ట్రుడేవ్ సతీమణి సోఫీతో ముంబైలో ఫొటోకూడా దిగాడు. దాంతో వివాదం చెలరేగి తదుపరి ఢల్లీి కార్యక్రమానికి ఆహ్వానాన్ని రద్దు చేశారు.2023 జూన్ 18 కెనడా నగరం వాంకోవర్ శివారు సురే గురుద్వారా దగ్గర హరదీప్ సింగ్ నిజ్జర్ అనే కెనడా పౌరుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. మన గూఢచారులే ఆ పని చేసినట్లు అప్పటి నుంచి కెనడా ఆరోపిస్తోంది.తరువాత మనదేశంలో వాణిజ్య చర్చలను వాయిదా వేసుకున్నట్లు ప్రకటించింది. గతేడాది సెప్టెంబరు నుంచి మనపౌరులకు వీసాల నిలిపివేత, దౌత్యవేత్తల బహిష్కరణ వంటి పనులు చేస్తున్నది.మనదేశం కూడా ప్రతి చర్యలు తీసుకుంది.తాజాగా అది మరింత ముదిరింది.
తాజా పరిణామాలపై మీడియాలో అనేక భాష్యాలు వెలువడుతున్నాయి. వాటిలో ఒకటేమంటే అమిత్ షా,అజిత్ దోవల్‌ను కెనడా లక్ష్యం చేసుకున్నదట.దీని అర్ధం నరేంద్రమోడీని, అన్నింటికంటే మించి దేశాన్ని సహిస్తున్నట్లా ? అమెరికా, కెనడా వాటిని అనుసరించే ధనికదేశాలన్నీ మొత్తంగా మన దేశాన్నే లక్ష్యంగా చేసుకున్నాయి.దానిలో భాగంగా పెద్ద గేమ్ ఆడుతున్నాయి. కెనడా కేంద్రంగా పనిచేస్తున్న భారత వ్యతిరేక ఖలిస్తానీ శక్తుల కార్యకలాపాలు తీవ్ర ఆందోళనకరమేగాక దేశ భద్రత మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని సిపిఐ(ఎం) వ్యాఖ్యానించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంటుందని ప్రకటించింది.ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకొని లారెన్స్ విష్ణోయ్ ముఠా పాత్రతో సహా అన్ని అంశాల మీద ప్రభుత్వం వ్యవహరించాలని కోరింది. మనదేశం పశ్చిమదేశాలతో ప్రస్తుతం ముద్దులాటదెబ్బలాటలాడుతున్నదని చెప్పవచ్చు. ఉక్రెయిన్ వివాదంలో పశ్చిమదేశాలకు లొంగటం లేదు, చైనా విషయంలో కొన్ని సార్లు అనుకూలంగా మరికొన్ని సార్లు వాటి వాంఛలకు భిన్నంగా వెళుతున్నది. మొత్తంగా చూసినపుడు తమకు తాన తందాన అనటం లేదనే ఉక్రోషం పశ్చిమదేశాల్లో నానాటికీ పెరిగిపోతోంది. ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికైనా కళ్లు తెరిచి గతంలో మాదిరి అలీన విధానాన్ని అనుసరించి దేశస్వతంత్ర వైఖరిని ప్రదర్శించాలి.
